పునర్యానం-24

పార్వతీపురంలో మొదలైన నా ఉద్యోగ ప్రస్థానంలో పార్వతీపురంలోనే మొదటి ఆఘాతం కూడా తాకింది. అదంతా నా ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ లో వివరంగా రాసాను. ఈ కవిత అప్పటి మనః స్థితిని పట్టుకోడానికి ప్రయత్నించింది.

ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితాన్ని పోరాటంగా అభివర్ణించుకోవడం అతిశయోక్తిగా అనిపించవచ్చు. దానికి కారణం పోరాటం అనగానే మనకి పరిచయమైన రంగులు వేరే కావడమే. నిజానికి స్థూల పోరాటాల కన్నా సూక్ష్మపోరాటాలు మరింత శక్తిమంతమైనవి. మహాత్ముడు రాట్నం గురించి రాస్తూ, తన రాట్నపు పోగు అనే సీతని మాంచెష్టర్ అనే దశకంఠుడినుంచి కాపాడుకోడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పినప్పుడు, ఆ ఒక్క వాక్యమే నాకొక రామాయణ మహాకావ్యంలాగా అనిపించింది. ఒక రాట్నం మీద నూలు వడకడం మామూలు పోరాటం కాదనీ, అది రామరావణసంగ్రామంతో సమానమనీ ఆయన చెప్పకనే చెప్పాడు.

పార్వతీపురం నుంచి రాజకీయ కారణాల వల్ల నేను సెలవు పెట్టి వచ్చెయ్యక తప్పని పరిస్థితుల్లో నా మిత్రుడు గోపీచంద్ ని కలిసాను. అప్పట్లో అతడు రాయగడలో జె. కె. పేపరు మిల్లులో కెమిస్టుగా పనిచేస్తుండేవాడు. అతడు నా సమస్య మొత్తం విని గొప్ప మాట ఒకటి చెప్పాడు. అతడు అన్నదేమంటే ‘మనిషి స్వధర్మమే అతణ్ణి ఒంటరి చేస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు, ఏదైనా విలువ కోసం నిలబడుతున్నావా లేదా అన్నది ముఖ్యం. నీకంటూ నిలబడవలసిన విలువ ఒకటి ఉందని తెలియగానే నీ పోరాటం మొదలయినట్టే’ అని.

ఒక సరిహద్దులో సైనికుడు చేసేది కూడా ఉద్యోగమే. కాని అక్కడ అవసరమైతే ప్రాణత్యాగం తప్పదు కాబట్టి దాన్ని మనం వట్టి ఉద్యోగంగా భావించం. అతణ్ణి యోధుడని పిలుస్తాం. అతడు దేశసేవ చేస్తున్నాడని చెప్తాం. అదే మన చుట్టూ ఉండే మామూలు ఉద్యోగుల జీవితాల్లో అటువంటి రిస్క్ ఏమీ కనబడదు కాబట్టి, వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నరంటే మనకు నమ్మబుద్ధి కాదు.

ఈ క్షణాన నాకొక సంఘటన గుర్తొస్తోంది. నేను పాడేరులో పనిచేస్తుండగా, ఒకరోజు పొద్దున్నే ఒకాయన మా ఇంటి తలుపు తట్టాడు. అతడు తనని తాను ఒక లెక్చరరు గా పరిచయం చేసుకున్నాడు. ఆ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలకో, ఇంటర్మీడియేటు పరీక్షలకో తనని ఇన్విజిలేటరుగా వేసారనీ, కాబట్టి ఆ సంగతి నాకు చెప్పడానికి వచ్చాననీ అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. ఆ పరీక్షలకీ నాకూ సంబంధం లేదు. అతడికి ఆ డ్యూటీ వేసింది నేను కాదు. మరి నాకు ఎందుకు చెప్తున్నట్టు? ఆ మాటే అడిగాను గాని అతడేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచారిస్తే తెలిసిదేమంటే, అతడికి ఇన్విజిలేషన్ డ్యూటీ వేస్తే చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తాడట. కాపీరాయుళ్ళ పాలిట సింహస్వప్నంగా ఉంటాడట. అతడి స్ట్రిక్ట్ నెస్ భరించలేక, ఒక రాత్రి కొంతమంది పిల్లలు, అతడు తన ఇంటి ఎదట ఆరుబయట నిద్రపోతుండగా, అతడి కాళ్ళూ చేతులూ కట్టేసి ఊరుబయట ఒక పాడుపడ్డ బావిలో పారేసారట. ఆ రాత్రంతా అతడు ఆ బావిలోనే గడిపాడట. పొద్దున్న తెల్లవారేక ఎలానో అతడి ఆచూకీ పట్టుకున్నారనుకోండి. కాబట్టి, మళ్ళా అటువంటి సంఘటనలు పునరావృతం కాగలవేమోనని, ఊళ్ళో ఉన్న నలుగురు ఆఫీసర్లకీ తెలియడం మంచిదని అతడు మమ్మల్ని కలిసి తనకి డ్యూటీ వేసినట్టు చెప్పడానికి వచ్చాడన్నమాట.

నా దృష్టిలో అతడు చేసేది సరిహద్దుల్లో యుద్ధం చేసే సైనికుడికి ఏ మాత్రం తీసిపోని పోరాటం. అయితే అక్కడ శత్రువు కనిపిస్తాడు. పోరాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ యోధుడు ఎవరితో పోరాడుతున్నాడో కంటికి కనిపించదు. ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టం. అతడి కొలీగ్స్, చుట్టూ ఉన్నవాళ్ళూ, చివరికి బంధుమిత్రులు కూడా అతణ్ణొక పిచ్చివాడిగా జమకడితే ఆశ్చర్యం లేదు.

కాని ఒకసారి ఆ పోరాటస్ఫూర్తి నీ హృదయంలో ప్రవేశించాక నువ్వు అవేవీ పట్టించుకునే స్థితిలో ఉండవు. నువ్వు నీ ఒక్కడికోసమే బతికే పరిస్థితి ఇంకెంతమాత్రం ఉండదు. నిన్ను నమ్ముకున్నవాళ్ళు కొందరు కనిపించడం మొదలుపెడతారు. ఆ తర్వాత నీ జీవితం నీది కాదు, వాళ్లదవుతుంది.


పూసిన పూల పర్వతాల సాక్షిగా తిన్నానొక గాయం
పోరాట పరిక్రమలో ప్రథమ పరిఘాతం, తెలిసిందప్పుడు
నేనింక నా కోసంబతకడం మానుకున్నానని, నన్ను కొన్ని హృదయాలు
నమ్ముకోవడం మొదలయ్యిందని.
నా కోసం కొన్ని ఆశ్రువులు పొంగిపొర్లుతున్నాయని.

పారిపోయానక్కణ్ణుంచి ఒక అర్ధరాత్రి, ప్రవాసిగా
కానీ గుర్తుపట్టుకున్నాను నన్ను నేనో మనిషిగా
వెక్కి వెక్కి ఏడ్చాను, ఆ కొండల కోసం, ఆ పిల్లల కోసం
మళ్లీ మళ్లీ చూడలేని ఆ దారుల కోసం, ఆ లోయల కోసం.

తెలుసుకున్నాను పోరాటమొ­క తమాషా కాదని
ఒక హృదయాన్ని మరికొన్ని హృదయాలకు ముడివెయ్యడమని
ఏ ఒక్క గుండె గాయపడ్డా కీచుమంటూ రోదిస్తాయి­ తక్కినవన్నీనని.

తెలుసుకున్నానిది కూడా:
పోరాటం ఒక ఫలాన్ని పెదవులకందివ్యడంలో లేదని,
అది ఎవరికి వారు వేచి ఉండవలసిన ప్రతీక్ష అని, ఆస్వాదించవలసిన పాత్ర అనీ
ఎవరికి వారు తమని తాము ఆవిష్కరించుకోవలసిందేననీ

(పునర్యానం, 2.3.10)


The mountains and forest bore witness to my first wound.
During my journey of battle, I suffered the foremost blow.
At that moment, I realized I wasn’t alone, and
A few more people started loving me and
A few more tears flowed.

In a midnight flight, I fled that place, turning into an exile
It also revealed the human side of me.
I wept for those hills, and for those children.
I wept for those paths I may never retrace and
Those valleys I may never return to.

Fighting isn’t fun, I’ve learned.
Fighting entails tying one’s heart to a hundred others and
In unison, all hearts would moan even if one suffered.

This is also what I learned:
Fighting is not something you give as a gift.
It is something that people must earn for themselves.
Something they have to taste for themselves, and
Something one must discover for themselves.

25-8-2023

8 Replies to “పునర్యానం-24”

 1. ఆరాటం
  పోరాటమైనప్పుడు
  ఉద్యోగం ఒక ఉద్యమం
  ఉద్యోగపర్వం
  నిప్పులపై నిబ్బరంగా నడిపిస్తుంది
  మనిషిగా నిలబెడుతుంది
  విలువ
  శిరోమణిగా వెలుగుతుంది
  అది బొగ్గుబావి కార్మికుడి తలపై
  సెర్చ్ లైటులానూ తోడ్పడుతుంది

 2. “This is also what I learned:
  Fighting is not something you give as a gift.
  It is something that people must earn for themselves.
  Something they have to taste for themselves, and
  Something one must discover for themselves.“
  Super sir!! 🙏🏽🙏🏽🙏🏽

 3. మీ కవితల context చెప్తున్నట్లే మీ paintings గురించి కూడా చెప్త్తేబాగుంటుంది, సర్!!

 4. సర్..కనిపించని పోరాటం..అది నిజం.
  ప్రతి సగటు ఉద్యోగీ తన సర్వీసు మొత్తంలో ఒక్క సారైనా మీరు చెప్పిన లెక్చరర్ పొందిన భయంతో కూడిన ఆవేదనను పొందుతాడు. తన జీవిక కోసం భరించక తప్పదని తెలుసుకుంటాడు.

  Poem excellent sir

Leave a Reply

%d bloggers like this: