పునర్యానం-23

పార్వతీపురం గిరిజన ప్రాంతం విజయనగరం జిల్లా ఏర్పడక ముందు శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేది. అక్కడ గిరిజనుల పట్ల జరుగుతూ వచ్చిన దోపిడీ, భూముల అన్యాక్రాంతం, వడ్డీ వ్యాపారం, వెట్టి చాకిరి లాంటి తీవ్రమైన అన్యాయాలకు, అత్యాచారాలకు ప్రతిఘటనగా 1967- 70 మధ్యకాలంలో పెద్ద తిరుగుబాటు చెలరేగింది. ఆ తిరుగుబాటును ప్రభుత్వం అణచివేసింది.

కానీ దాని ఫలితంగా గిరిజన ప్రాంతాల పరిపాలనలోనూ, గిరిజన అభివృద్ధిలోనూ విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టడం జరిగింది. అంతకు ముందు కూడా గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు మీద తీవ్రమైన నిషేధం ఉన్నప్పటికీ అది గిరిజనులకి గిరిజనేతరులకు మధ్య మాత్రమే బదలాయింపు నిషేధంగా ఉండేది. కానీ శ్రీకాకుళం తిరుగుబాటు తర్వాత గిరిజనేతరులకీ, గిరిజనేతరులకీ మధ్య కూడా భూ బదలాయింపు నిషేధం అమల్లోకి వచ్చింది. 1/70 గా పేరుపొందిన ఈ నిషేధం నిజానికి 1959 రెగ్యులేషన్ కు సవరణ. ఈ ప్రత్యేకమైన సవరణ నాకు తెలిసి భారత దేశంలో మరే గిరిజన ప్రాంతంలోనూ అమల్లో లేదు. దీనివల్ల బినామీ బదలాయింపుల మీద చట్టపరమైన నిషేధం సాధ్యమైంది. శ్రీకాకుళం తిరుగుబాటు సాధించిన గొప్ప విజయాల్లో ఇదొకటి.

అలానే 1975 నుంచి గిరిజన ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన గిరిజన ఉప ప్రణాళిక వ్యూహం కూడా నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం తిరుగుబాటుల వల్ల సాధ్యమైన అభివృద్ధినే. అలాగే నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత దేశంలో మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గిరిజన డెవలప్మెంట్ ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి శ్రీకాకుళం గిరిజన ప్రాంతానికి కేంద్రమైన సీతంపేటలో ఏర్పాటు అయింది. తర్వాత రోజుల్లో ఏర్పాటైన ఐటిడిఏలకు ఈ జి.డి.ఎ లే నమూనా. ఇటువంటి దీర్ఘకాలికమైన, చట్టపరమైన సంస్కరణలు చాలా వచ్చాయి.

1987- 88 మధ్యకాలంలో నేను గుమ్మ లక్ష్మీపురం మండలంలో ట్రైనింగ్ కోసం వెళ్లేటప్పటికీ శ్రీకాకుళం తిరుగుబాటు జరిగి 20 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఇంకా అప్పటి నెత్తుటి చారికలు, ఆ వ్యథలు, అప్పటి కథలు నాకు అడుగడుగునా కనిపిస్తూ ఉండేవి, వినిపిస్తూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రభుత్వం మీద తిరగబడి, అరెస్టయి, జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన గిరిజనులు కూడా కనబడుతూ ఉండేవారు. వాళ్ళ మాటల్లోనూ, ప్రపంచం పట్ల వాళ్ళ వైఖరిలోనూ ఎంతో అనుభవం కనబడేది. లంకాజోడు గ్రామానికి చెందిన ఆరిక గుంపస్వామి ఈ క్షణాన నా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాడు.

అయితే ఆ ఉద్యమానికి ఆద్యంతాలతో సహా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవాడూ, ఆ ఉద్యమం సఫలం అయితే సమసమాజం సాధ్యమవుతుందని నిజంగా నమ్మినవాడూ భూషణం గారు. శ్రీకాకుళం తిరుగుబాటు కాలం నాటి గిరిజన జీవితాన్ని, ఆ తర్వాత కూడా గిరిజన ప్రాంతాల్లో సంభవించిన పరిణామాల్ని ఒక సిస్మో గ్రాఫ్ లాగా ఆయన ఎంతో సున్నితంగా రికార్డు చేశాడు.

భూషణం గారు ఒకరోజు నన్ను కలవడానికి నేరుగా మా ఆఫీస్ కి వచ్చారు. ఐటిడిఏ ప్రారంభించి అప్పటికి ఎన్నో ఏళ్ల అయినప్పటికీ ఆయన ఆ కార్యాలయానికి రావడం అదే మొదటిసారి. నాకూ , ఆయనకీ అంతకుముందు ఎటువంటి పరిచయం లేదు. కానీ నేను 1984 లో పాచిపెంట గ్రామంలో కళింగాంధ్ర సాహిత్యం మీద చేసిన ప్రసంగాన్ని ఒక వ్యాసంగా రాస్తే దాన్ని అత్తలూరి నరసింహారావు గారు ‘నాట్యసుధ’ (1986) అనే సావనీరులో అచ్చువేశారు. ఆ వ్యాసం చదివి భూషణం గారు నన్ను చూడ్డానికి వచ్చారంటే నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. నన్ను చూస్తూనే ఆ వ్యాసం గురించి ప్రస్తావించి ఒక ఋషి మాత్రమే అట్లాంటి వ్యాసం రాయగలడు అన్నారు. ఆ ఒక్క ప్రశంసా వాక్యంతో ఆ మానవుడు నా హృదయాన్ని కైవసం చేసుకున్నాడంటే ఆశ్చర్యం కాదు.

ఆ తర్వాత ఎన్నోసార్లు మేం కలుసుకున్నాం. కొన్నిసార్లు మేమిద్దరం పోయి కాళీపట్నం రామారావు గారి దగ్గర కూచునేవాళ్లం. రామారావు మాస్టారు అప్పట్లో గజపతినగరంలో ఉండేవారు. త్రిపుర గారు భూషణం గారిని చూడాలని ఉందంటే ఆయన్నీ, అత్తలూరినీ చినమేరంగి తీసుకువెళ్లాను. ఆరోజు మేము నీలకంఠాపురం దాకా కలిసి ప్రయాణం చేసాము. ఆ ఒక్క కలయికతో త్రిపుర గారూ, భూషణం గారూ ఎన్నో జన్మల నుంచి బంధుత్వం ఉన్నవాళ్ల లాగా చేరువైపోయారు. భూషణంగారు రాసిన ‘సిక్కోలు జీవితాలు’ కి త్రిపుర గారు రాసిన ముందుమాటలో ఆ వైనం అంతా చూడవచ్చు.

భూషణం గారితో నా పరిచయం నా జీవితాంతం నేను గర్వించే ఒక మధుర విషాద జ్ఞాపకం. ఒక్కొక్కసారి మనకి ఒక చరిత్ర మొత్తం తెలియటానికి ఆ చరిత్ర నిర్మించిన వాళ్ళందరినీ చూడనక్కర్లేదు. ఒక్కర్ని చూస్తే చాలు. అట్లా ఒక్క భూషణం గారి స్నేహంతో నాకు పార్వతీపురం చరిత్ర అంతా హృదయస్థమైపోయిందంటే ఆశ్చర్యం లేదు. చరిత్ర, తిరుగుబాట్లు, సాహిత్యం పక్కనపెట్టి చూసినా, భూషణం గారు గొప్ప ప్రేమైక మానవుడు. అటువంటి మనిషిని మనం ఒక్కసారి కలుసుకున్నా మన హృదయాల మీద అతని ముద్ర పచ్చబొట్టు పొడిచినట్టుగా దిగబడిపోతుంది.

ఆయనకి నేనేమీ చేయలేకపోయాను. ఆయన పోయారని తెలిసినప్పుడు ఒక చిన్న స్మరణ రాసి పెట్టుకున్నాను. ఇదిగో మళ్లా ఈ కవిత రాసుకున్నాను. అంతే.


కుసుమించిన ఆ సిందూరకాననాల మట్టి అరుగు మీద
చూసానొక మనిషిని, తానోడిపోయి­నా గెలిచినవాణ్ణి.

ఆ ఓడిపోయి­న మనిషి చుట్టూ ఎంత వైభవోపేతంగా ఉండేది
ముంగాళ్ల మీద తలవాల్చుకుని కడుపులో అల్సర్‌తో
మగత చూపులు చూసే ఆ పూర్వపరాజితుడి
సన్నిధిలో ఎంత జీవం ప్రవహించేది.

అతడోడిపోయాడు, తుపాకులు తమ హామీని నెరవేర్చుకోనందుకు
అతడోడిపోయాడు, వదులుకోనందుకు మనుషులు శయ్యల్ని, పరుపుల్ని,
సువాసనాతైలాల్ని.
అతడోడిపోయాడు, సమం కానందుకు మిట్టపల్లాలు.
ఆగ్రహించనందుకు ఆకాశం, కూలిపడనందుకు ఆ పాతగోడలు.
అతడోడిపోయాడు, మాటలు తమ మాటని నిలబెట్టుకోనందుకు.

అతడోడిపోయాననుకున్నాడు, తల్లికోసం తను పెరోల్‌ మీద జైలు
నుంచి బయటికొచ్చినందుకు.
ఓడిపోయాననుకున్నాడాతడు, తల్లికోసం తనొక ఇల్లు కట్టుకున్నందుకు,
ఆ ఇంటికొక కిటికీ పెట్టుకున్నందుకు.

ఓడిపోయి­నవాడు ఆ అజేయ మానవుడు కాదు,
ఓడిపోయింది నిజంగా మనం, అతణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించనందుకు
ఆదరించవలసినంతగా ఆదరించనందుకు
ఆరాధించవలసినంతగా ఆరాధినంచనందుకు.

(పునర్యానం, 2.3.9)


I met him in the spring when the forest was ablaze,
A person unconquered by defeat.

A man with ulcers, yet an aura surrounded him,
His head was always buried in his knees, a broken man.
Yet he was so vibrant.

As the guns failed to live up to their promises, so he lost.
People couldn’t give up comfort, pleasure, and perfumes, so he lost.
Inequalities could not be equalized, so he lost
As the sky did not rage enough, and the old system had not crumbled, so he lost.
As words failed to live up to their spirit, so he lost.

He felt defeated for coming out of prison for his mother.
In his eyes, a small home he had built for his mother was a defeat.

But, he wasn’t the one who lost.
We lost by not loving him enough, and
By not standing up for him.

24-8-2023

4 Replies to “పునర్యానం-23”

  1. “ఓడిపోయింది నిజంగా మనం,”

    చేసిన వాటిని చేసినందుకు…
    చెయ్యని వాటిని చేయనందుకు…
    క్షమాపణలు.

    అవును, సర్.
    మనం ఏ…దైనా చెయ్యగల
    చేతగానివాళ్ళం కనుక!

  2. గొప్ప సంగతి.. భూషణం మాష్టారు ని ఇప్పుడు తలిచేవారు ఎవ్వరూ లేరు. మీరు గుర్తు చేసుకోవడం నాబోటి వాడికి గుర్తుకు తేవడం.. మధురం.
    80 లలో గద్దర్, వంగపండు, భూషణం మాష్టారు తరచుగా ఆంధ్ర యూనివర్సటీ theater dept. కి వచ్చేవారు. కారణం అత్తిలి కృష్ణారావు మాష్టారు ని కలవడానికి.
    గద్దర్ వస్తే విశాఖ, యునివర్సిటీ ఊగిపోయేవి. వీళ్లూ ముగ్గురు తమ రచనలను చూపించి పాడి వినిపించి ఆయన చెప్పినట్లు సరి చూసుకుని మళ్లీ పాడి ఆయన yes అన్నాక వెళ్ళేవారు. ఇది ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. వీళ్లంతా ఒంటరిగా వచ్చి ఆయన వద్ద గంటలు గంటలు కూర్చుని మంజీర వాయిస్తూ వాళ్ళు రాసినవి మాష్టారు సరిచేసి పాడితే మైమరచి పోయేవారు. జానపద కళారూపాలపై అపార అధారిటీ ఆయన. ఆయన బుద్దావతారం. మెచ్చుకోవడం, తిట్టడం ఏమీ ఉండవు. ఈ ముగ్గురిని చూస్తే ఆయన కూడా పులకించి పోయేవారు. ఆ రాత్రి శాస్త్రి గారి పార్టీలో చూడాలి.. ఆ క్రియేటివిటీ వర్ణించలేను. భూషణం మాష్టారు గురించి చెప్పాలంటే ఆయన్ను తూర్పు సముద్రంతో పోల్చవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటారు. సన్నగా పొడవుగా విశాఖ కొండపై పెరిగిన టేకు వృక్షం ఆయన. ఆయన రాసిన కథలతో కాబోలు అత్తిలి వారు తూర్పు రేఖలు నాటకం రాశారు. నేనూ ఓ పాత్ర వేశాను. అది ఎమర్జెన్సీ లో నిషేధానికి గురి అయ్యింది. భూషణo మాష్టారు తో ఎన్నోసార్లు మాట్లాడాను. ప్రశాంతంగా చిన్న గొంతుతో మాట్లాడేవారు. ఆయన్ను మీరు గుర్తు చేసుకోవడంతో నేనూ గుర్తు చేసుకున్నాను. ఆయన పాడితే విన్నారా.. “నోరెత్తి హోరెత్తి నొగులు సాగరము..”
    ఇప్పుడు భూషణం మాష్టారును ఎవరు తలుస్తారు సార్.. శ్రీకాకుళం అడవులు కొండలు, లోయలు.. సముద్రమూ తప్ప.

    1. ఈ విపులమైన సహృదయ స్పందనకు నా నమోవాకాలు. అత్తిలి కృష్ణారావు గారి గురించి మీరు రాసినవన్నీ నాకు కొత్త విషయాలు. భూషణం గారిని విశాఖ కొండల మీద పెరిగిన టేకు వృక్షంగా పోల్చడం చాలా గొప్పగా ఉంది.

Leave a Reply

%d bloggers like this: