పునర్యానం-22

గిరిజన సంక్షేమశాఖలో నాకు ఉద్యోగం రావడం, అది కూడా పార్వతీపురం ఐటిడీఎలోనే ట్రయినింగు అయ్యి, అక్కడే జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా చేరటం నా జీవితాన్ని మలుపు తిప్పటమే కాదు, నాకొక వ్యక్తిత్వాన్ని కూడా ఇచ్చాయి. నేను పుట్టింది గిరిజన గ్రామంలోనే అయినప్పటికీ, చిన్నప్పణ్ణుంచీ వాళ్ళ జీవితాల్ని చూస్తూ ఉన్నప్పటికీ, స్వయంగా వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత భుజానికెత్తుకోవడం నాకొక కొత్త అనుభవం. నిజానికి నాకు మొదటి పోస్టింగు పార్వతీపురంలో కాకుండా పాడేరులో వచ్చి ఉంటే బాగుణ్ణనునుకున్నాను మొదట్లో. కానీ పార్వతీపురం వెళ్ళకపోయి ఉంటే, నేను జీవితవాస్తవాల పట్ల నిరక్షరాస్యుడిగానే మిగిలిపోయి ఉండేవాణ్ణి.

‘నేను కవిని కాలేకపోయిన విప్లవకారుణ్ణి’ అని చేగువేరా తన గురించి చెప్పుకున్నాడని ఎక్కడో చదివాను. ‘నేను కవిని కాలేకపోయిన ప్రభుత్వాధికారిని’ అని నాకు నేను చెప్పుకున్నానుగానీ కొద్ది రోజుల్లోనే నా బాధ్యత ఏ పోరాటానికీ తీసిపోనిదనీ, అసలు పోరాటాలు ఎక్కడో అడవుల్లోనో, యుద్ధభూముల్లోనో మాత్రమే జరుగుతాయనేది చాలా కాలంగా మనకి చెప్తూ వచ్చిన నెరేటివ్ మాత్రమే ననీ నాకు తొందర్లోనే అర్థమయింది.

పోరాటం తుపాకుల్తోనూ, బాంబుల్తోనూ మాత్రమే చేసేది కాదు. అది నువ్వున్నచోటనే, నువ్వు నమ్ముకున్న ఏదో ఒక విలువకోసం, అదెంతపాటిదైనా కానీ, దానికోసం చేసేది కూడా అని బోధపడింది. రావిశాస్త్రి ‘మామిడి చెట్టు’ కథ గుర్తుందా? అందులో ముసలమ్మ తాను కూచునే చెట్టునీడకోసమే పెద్ద యుద్ధం చెయ్యవలసి వచ్చింది. నువ్వు ఏ సిద్ధాంతాలూ చదవనక్కరలేదు, ఏ వ్యూహాలూ పన్ననక్కర్లేదు. నీ అంతరాత్మకు సత్యమనిపించిన ఒక నీతికోసం నిలబడటం మొదలుకాగానే నీ చుట్టూ నాలుగు యోజనాల మేర ఒక కురుక్షేత్రం సిద్ధమైపోతుంది. నీకు తెలీకుండానే నీతో పాటు కలిసి నడుస్తున్న మనుషులు నువ్వు చూస్తూ ఉండగానే కుడి ఎడమలుగా చీలిపోతారు.

అసలు అంతదాకా కూడా పోనక్కర్లేదు. నువ్వు ఏ సామాజిక అసమానతకో ఎదురుతిరగనక్కర్లేదు, ఏ సామాజిక అన్యాయాన్నో ధిక్కరించనక్కర్లేదు. కనీసం నువ్వున్న చోటనే, నీ పరిథిలోనే, ఎవరితోనూ సంఘర్షించనక్కర్లేకుండానే, మరొక మనిషికోసం బతకవచ్చు, అతడికి ప్రాణం పోయవచ్చు. చాలాసార్లు మనం ఈ చిన్నపాటి కష్టం పడటానికి బద్ధకించి చాలా పెద్ద గొంతుతో నోరారా అరుస్తుంటాం.

ఈ క్షణాన నాకొక సంఘటన గుర్తొస్తోంది. నేను పార్వతీపురంలో చేరినప్పుడు విజయనగరం జిల్లా కలెక్టరుగా ఎం. వి. ఎస్. ప్రసాద్ అనే ఆయన ఉండేవారు. ఆయన శంకరన్ గారి శిష్యుడు. అత్యంత నిజాయితీపరుడు. సమర్థుడు. ఆయన అప్పటికి ఇరవై ఏళ్ళ కిందట, అంటే 1969-70 ప్రాంతాల్లో, శ్రీకాకుళం తిరుగుబాటు జరిగినప్పుడు, పార్వతీపురం రెవెన్యూ డివిజినల్ అధికారిగా పనిచేసారు. సీతంపేటలో ప్రారంభించిన జి.డి.ఏ కు అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిగా పనిచేసారు. కాబట్టి కురుపాం, గుమ్మలక్ష్మిపురం, సీతంపేట కొండలన్నీ ఆయనకు కొట్టినపిండి. 1989 లో అనుకుంటాను, ఆయన పాతజ్ఞాపకాల్ని తలుచుకోడానికి, పూర్వపరిచయాల్ని గుర్తుచేసుకోడానికి మళ్ళా ఒకసారి ఆ కొండలెక్కాలని ఉందన్నారు. ఒకరోజు ఆయనతో పాటు మేమంతా బయల్దేరాం. పొడి-చిలకం-సొబ్బ అనే మూడు కొండల మీద ఊళ్ళు చూసుకుంటూ సాయంకాలానికి ధర్మలక్ష్మిపురం దిగాం. మధ్యలో ఒకచోట మేము దారితప్పామన్నారెవరో. కాని కలెక్టరుగారికి ఆ దారి గుర్తే. ఆ ఊళ్ళల్లో ఆయన పూర్వకాలపు గిరిజనుల్ని పేరుపేరునా అడిగి పలకరించారు. సొబ్బ ఆశ్రమపాఠశాలలో ఒక వంటమనిషి ఉండేది. ఆమె వెంపటాపు సత్యం భార్య అని కలెక్టరు గుర్తుపట్టడం ఆశ్చర్యం.

మేము ఆ రాత్రికి తిరిగివస్తూండగా ఎక్కడో దారిలో ఒక గిరిజనుడు తన పిల్లవాడి ఆరోగ్యం బాగాలేదని కలెక్టరుకు విన్నవించుకున్నాడు. కలెక్టరుగారు ఆ తండ్రినీ, పిల్లవాణ్ణీ నా జీపు ఎక్కించారు. పొద్దున్నే విశాఖపట్నం కె. జి. హెచ్ కి పంపిద్దామని చెప్పారు. నేను కలెక్టరుగారితో పాటు కారులో పార్వతీపురం వచ్చి, ఆయన్నుంచి సెలవు తీసుకుని, నా ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున్న ఎనిమిదింటికి గుర్తొచ్చింది, రాత్రి నాతో పాటు ఇద్దరు గిరిజనుల్ని తీసుకొచ్చామని. వెంటనే ఒక్క ఉదుటున ఆఫీసుకు పరుగెత్తి, వాళ్ళెక్కడున్నారని అడిగాను. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు నాకు చెప్పిందేమంటే, కలెక్టరుగారు పొద్దున్నే ఆరింటికే లేచి విజయనగరం బయల్దేరుతూ, మరొక జీపులో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారనీ, మందులకీ, ఇతర ఖర్చులకీ కొంత డబ్బుతో ఐటిడీఎ నుంచి ఒక మనిషిని తోడిచ్చి వాళ్ల కూడా పంపించారని.

ఆ క్షణాన నాకెంత సిగ్గు కలిగిందో చెప్పలేను. నాకు పట్టుమని పాతికేళ్ళు లేవు. కలెక్టరు యాభైల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఎక్కడా ఏ ఉపన్యాసాలూ ఇచ్చినవాడు కాడు, పుస్తకాలు రాసిన వాడు కాడు. కాని మనిషిని ప్రేమించడంటే ఏమిటో ఆయనకు తెలుసని అర్థమయింది. ప్రేమ ఆయనకు బాధ్యతగా మారిపోయింది. పోరాటమంటే అది. నువ్వు తోటిమనిషిని ప్రేమిస్తున్నావా? అయితే ముందు నీ ప్రేమ అపారమైన బాధ్యతగా మారాలి. అందుకు నువ్వు చెయ్యవలసిన సంగ్రామం బయటివాడితో కాదు, ముందు నీతోనే.


ఒక ఊరిని ప్రేమించినవాడొక పోరు వైపు నడవక తప్పదు
పోరంటే కొందరికి తుపాకులు మాత్రమే కనిపిస్తాయి­, బాంబులమోత
వినపడకుండా సంగ్రామాన్ని గుర్తించలేరు వాళ్లు
రహస్యస్ధావరాల్లో నిద్రలేని రాత్రుల్ని గడిపినట్టే పోరాటం
అనుభవానికొస్తుంది వాళ్లకి.

పోరంటే అనుక్షణ జీవితానుభవం, అది నీ ప్రాణాల్ని నువ్వెంత ప్రేమిస్తావో
ఎదటివాడి ప్రాణాల్నీ అంతే ఇష్టంగా ప్రేమించడం,
నీ నమ్మకాల కోసం నువ్వు బతికినట్టుగా
నిన్ను నమ్మినవాళ్ల కోసం కూడా బతకడం
పోరంటే నువ్వు పూర్తి మనిషిగా జీవించడం, తుప్పుపట్టకపోవడం
రాజీ నేర్వకపోవడం, మరణించకపోవడం.

పోరాడటమంటే ఒక అందాన్ని కనుగొనడం,
కలిసి బతకడం మనుషులతో, పశువులతో, పక్షులతో, వృక్షాలతో,
పోరంటే ఒప్పించడం, తప్పు పక్క వాడి మీద నెట్టకపోవడం
పోరంటే శత్రువుల్ని నిర్మూలించడం కాదు, ప్రపంచాన్ని
శత్రుత్వ రహితం చెయ్యడం.

పోరాటమంటే నిర్విరామంగా కృషిచెయ్యడం, తపసు చెయ్యడం, యజ్ఞం చెయ్యడం
పోరంటే ఒక నైతిక ఉద్యమాన్ని వదిలిపెట్టకపోవడం
ఒక సత్యాగ్రహానికి సిద్ధం కావడం
పోరంటే ఒక ప్రణాళిక, ఒక వ్యూహం, ఒక కార్యాచరణ
పోరంటే కొన్ని తప్పులు చెయ్యకతప్పకపోవడం, తప్పుల్ని నిస్సిగ్గుగా
ఒప్పుకోవడం
ఒప్పుకున్న తప్పుల్ని పునరావృతం చెయ్యకపోవడం.

పోరాడటమంటే ఒక నిత్య విశ్రాంతి, అది నిన్ను నమ్మిన వాళ్ల దృక్కుల్లో సేదతీరడం
ఒక విజయం వల్ల లభించిన ఆనందాన్ని నలుగురితో పంచుకోవడం,
ఒక పాట పాడుకోవడం, నెగడి చుట్టూ నాట్యం చెయ్యడం
కలిసి భుజించడం, కబుర్లు చెప్పుకుంటూ నిద్రించడం.

పోరంటే ఒక వ్యగ్రత, వ్యాకులత, స్తిమితం లేకపోవడం
అందరూ వినోదిస్తున్నప్పుడు కూడా నీకేవో నేత్రాలు, లేదా పొలాలు
లేదా హామీలు
గుర్తుకు రావడం, నీ సంతోషాలు నిన్ను బాధించడం.

పోరాటమొక ఉగ్రత, నువ్వొక నిప్పుగా జ్వలించడం
సప్తసము­ద్రాలూ దాన్ని చల్లార్చలేకపోవడం.

పోరాటమంటే కోరుకోవడం కాదు, సంతోషంగా వదులుకోవడం,
అన్నిటికన్నా ముందు నీ ఆహాన్ని వదులుకోవడం, ద్వేషాన్ని వదులుకోవడం.

పోరాటమంటే వదులుకోవడం కాదు, సంతోషంగా కోరుకోవడం
కష్టాల్ని కోరుకోవడం, నీ వాళ్ల బరువుని నీ బుజాన వేసుకోవడం.

పోరాటమంటే నీకొక సింహాసనాన్ని సముపార్జించుకోవడం కాదు,
నువ్వొక సేవకుడివి కావడం,
అధికారం కోసం ఆయుధం పట్టడం కాదు
నువ్వున్న కొద్ది మేరా శుభ్రత కోసం నువ్వే చీపురుపట్టుకోవడం.

(పునర్యానం, 2.3.2)


If you love a place, you will invariably fight for it
When I say fight, some people think guns,
Without bombing, they can’t find a war.
Their battles meant sleepless nights and secret camps.

Fighting is something you do every day, you fight every minute,
The act of loving your neighbor as you love yourself.
In fighting, you stand up for them as well as your values.
Fighting requires you to live as a complete human, not rusty,
Not willing to compromise and not consenting to death.

It’s about finding a beauty
Getting along with people, cattle, birds, and plants.
Fighting means persuasion, not blaming.
Combat doesn’t mean eliminating your enemy.
It means making mankind enmity-free

Fighting is ardor, sacrifice, endless work
Fighting means carrying a moral campaign
Getting ready for a satyagraha
Organize an action plan, formulate a strategy, and carry it out-
That’s fighting. You make mistakes, you admit them, you don’t repeat them.

When fighting, you enjoy being in your beloved’s warm gaze for eternity
It is a victory shared by all of your men and women
Fighting is singing a song, dancing around a fire,
Having a meal together and chatting before bed.

When you fight, you fret, you get disturbed, you become restless.
While the rest of the world is having fun, you are haunted by some looks, fields, and promises
For one to succeed, one must become terrible, burn like fire, and
No ocean can quench it all.

Fighting isn’t about desire; it’s about forgoing.
Giving up your ego and hatred.
When you fight, you do not forego, you desire.
To perform better, you welcome difficulties.

To fight is not to earn a throne for yourself, but to serve others.
You don’t need to grab a weapon, you just need a broom.

23-8-2023

19 Replies to “పునర్యానం-22”

  1. “పోరాడటమంటే ఒక అందాన్ని కనుగొనడం…”

    “జీవితమే సఫలమూ… రాగసుధాభరితమూ
    ప్రేమకథా మధురమూ..”

    సముద్రాల జూనియర్ వారిని
    గుర్తుకు తెచ్చిన…
    ఈ ఒక్క వాక్యం చాలును.

    నేను చదివిన కవితల్లో ఇది శిఖర దర్శనం, సర్.

    ఇదీ సాహిత్యం! ఇది సాహిత్యం.

  2. “అధికారం కోసం ఆయుధం పట్టడం కాదు
    నువ్వున్న కొద్ది మేరా శుభ్రత కోసం నువ్వే చీపురుపట్టుకోవడం”
    🙏🏽🙏🏽🙏🏽

  3. పోరాడటమంటే ఒక అందాన్ని కనుగొనడం,
    కలిసి బతకడం మనుషులతో, పశువులతో, పక్షులతో, వృక్షాలతో,
    పోరంటే ఒప్పించడం, తప్పు పక్క వాడి మీద నెట్టకపోవడం
    పోరంటే శత్రువుల్ని నిర్మూలించడం కాదు, ప్రపంచాన్ని
    శత్రుత్వ రహితం చెయ్యడం.
    ఇంత కంటే జీవితాన్ని చదవాల్సింది
    ఏముంది

  4. ఈ కవిత ఏ ఇణటరు వాళ్లకో డిగ్రీ వాళ్లకో పాఠంగా ఉండాలి. చాలా ఉద్వేగ భరితమైన కవిత

  5. ‘నువ్వు ఏ సిద్ధాంతాలూ చదవనక్కరలేదు, ఏ వ్యూహాలూ పన్ననక్కర్లేదు. నీ అంతరాత్మకు సత్యమనిపించిన ఒక నీతికోసం నిలబడటం మొదలుకాగానే నీ చుట్టూ నాలుగు యోజనాల మేర ఒక కురుక్షేత్రం సిద్ధమైపోతుంది. నీకు తెలీకుండానే నీతో పాటు కలిసి నడుస్తున్న మనుషులు నువ్వు చూస్తూ ఉండగానే కుడి ఎడమలుగా చీలిపోతారు.’
    జీవిత వాస్తవాన్ని చక్కగా చెప్పారు సర్!

  6. ‘నువ్వు తోటిమనిషిని ప్రేమిస్తున్నావా? అయితే ముందు నీ ప్రేమ అపారమైన బాధ్యతగా మారాలి. అందుకు నువ్వు చెయ్యవలసిన సంగ్రామం బయటివాడితో కాదు, ముందు నీతోనే.’ సమాధి స్థితికి చేరిన సాధువు చెప్పిన వాఖ్య

  7. పోరాటం గురించి మీరు చెప్పిన ప్రతిమాటా
    అద్భుత సత్యం సర్.

  8. కాని మనిషిని ప్రేమించడంటే ఏమిటో ఆయనకు తెలుసని అర్థమయింది. ప్రేమ ఆయనకు బాధ్యతగా మారిపోయింది. పోరాటమంటే అది. నువ్వు తోటిమనిషిని ప్రేమిస్తున్నావా? అయితే ముందు నీ ప్రేమ అపారమైన బాధ్యతగా మారాలి. అందుకు నువ్వు చెయ్యవలసిన సంగ్రామం బయటివాడితో కాదు, ముందు నీతోనే.

  9. వ్యాసంలోని ప్రతీ వాక్యం
    కవిత లోని ప్రతీ పంక్తి కోట్ చెయ్యాలని వుంది

    పోరాడటమంటే పోరాడటానికి సిద్ధ పడటమే

  10. ఒక trans లోకి తీసుకెళ్లారు. మళ్లీ మళ్లీ చదివాను. నా కూతురు కి నేను అనువాదం చేసే సమస్య లేకుండా English లో రాసినoదుకు ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: