పునర్యానం -21

ఇస్మాయిల్ గార్ని ఒకసారి అనంతపురం బదిలీ చేస్తే ఆయన ‘బదిలీ’ అని ఒక కవిత రాసారు. ‘బదిలీ అయితే బరబర ఈడ్చిన ట్రంకుపెట్టెలాగా క్షోభించింది మనస్సు’ అని చెప్తూ ‘ఇది జరిపేందుకు చేసింది కాదు’ అని రాసుకున్నారు. నాక్కూడా ట్రంకుపెట్టెలాగా ఏదో ఒక మూలన గమ్ముగా పడిఉంటాలనే ఉంటుంది గాని, ఆ మూల ఎక్కడో ఇన్నేళ్ళయినా నాకు అంతుచిక్కలేదు.

ఎక్కడ ఉండనీ, కొన్నాళ్ళకే మనసు ఆ ప్రదేశం పట్లా, ఆ మనుషుల పట్లా విముఖమైపోతుంది. ఆ లోపం నాలో ఉందో లేక, ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా మారలేని మనుష్య సమాజంలో ఉందో నేనిప్పటికీ తేల్చుకోలేకపోయాను. ఏడాది గడిచేటప్పటికి మనుషుల దగ్గర ఏమీ మిగలదు. వాళ్ళు ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలే మళ్లా మళా చెప్పుకుంటూ ఉంటారు. వేసుకున్న ఛలోక్తులే మళ్లా కొత్తగా వేసుకుంటూ ఉంటారు. దీనికిదే ఒక అవస్థకాగా, ఆ మనుష్య సమాజంలోనో, ఆ ఊళ్ళోనో, ఆ గోష్టుల్లోనో అంతదాకా నువ్వు చూడని ఆత్మవంచన, దివాలాకోరుతనం, ద్వంద్వవైఖరి బయటపడటం మొదలైతే! నీకు ఊపిరాడటం మానేస్తుంది. నీ రోజువారీ జీవితం నరకప్రాయంగా తయారవుతుంది.

మూడేళ్ళకు మించి నేనెక్కడున్నా ఆ స్థలంలో నాకు తలుపులు మూసేసినట్టే ఉంటుంది. ఎంత వేగిరం ఆ చోటు వదిలిపెట్టివెళ్ళిపోదామా అనే తపన మొదలవుతుంది. ఒకప్పుడు తాడికొండ, ఆ తర్వాత కాకినాడ, చివరికి రాజమండ్రిలో కూడా నాకు ఊపిరాడటం మానేసింది. ఆ ఊరు ఒక విధంగా భారతదేశపు మీనియేచర్. జీవితపు అత్యున్నత ఆదర్శాల పక్కనే దుర్భరమైన వాస్తవాలు, అసీమిత సౌందర్యారాధన పక్కనే నికృష్టమైన మానవప్రవర్తన, అత్యంత నిజాయితీపరులు నడిచే ఆ రోడ్లమీదనే వంచకులు, ద్రోహులు, దొంగలు ఘరానాగా నడిచివెళ్ళే దృశ్యాలు- ఆ ఊరు గుర్తొచ్చినప్పుడల్లా నాకు మృచ్ఛకటికం నాటి ఉజ్జయిని కళ్ళముందు కదుల్తుంటుంది.

ఎలాగైతేనేం ఒకనాటికి నేను ఆ ఊరు వదిలిపెట్టేసాను. ఆ ముందు రోజు నాకు మిత్రులు ఇచ్చిన చిన్న వీడ్కోలు సమావేశంలో ‘సెలవు రాజమండ్రీ, సెలవు’ కవిత చదివి వినిపించాను. ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ సంపుటిలో చేర్చిన ఆ కవిత ఇంగ్లిషు అనువాదాన్ని ఇక్కడ ఇంతకు ముందు మీతో పంచుకున్నాను కూడా.

అది 1987 లో రాసిన కవిత. అప్పుడు యవ్వనం. ప్రపంచంలో వైరుధ్యాలు కనిపిస్తే ప్రపంచం మీద విరుచుకుపడే ఉద్వేగం. తిరిగి మళ్ళా 2003 లో పునర్యానంలో రాజమండ్రి అధ్యాయాన్ని ముగిస్తూ ఆ రోజుల్ని తలుచుకునేటప్పటికి నడివయసు మొదలయ్యింది. ఇప్పుడు ఆ కవితలో ఉద్వేగానికి బదులు నిర్లిప్తత చోటు చేసుకోవడం సహజమే కదా.


ఆ పట్టణం మారుమోగేది పాటలతో, నాట్యాలతో, కవితలతో, శిల్పాలతో
వచ్చిపడేవక్కడికి ఫలాలు, పుష్పాలు, వేల కలశాలతో క్షీరధారలు
వచ్చాయక్కడికి ఓడలమీద దిగుమతైన నూతన సుగంధ ద్రవ్యాలు
రసజ్ఞ సందోహాలతో శోభిల్లేవి అక్కడి సభాకల్ప తరువులు.

విసిగిపోయాన్నేను ఆ హంగుదారులతో, ఆమె ఇంటిదగ్గర
పడిగాపులు పడే మనుషులతో
వాళ్లు పుష్పాన్ని వదిలి పుష్పవృంతం కోసం కలహించేకునేవారు
అర్ధాన్ని వదిలి శబ్దం కోసం యుద్ధం చేసుకునేవారు
ఆత్మని వదిలి దేహం వెంట పడేవారు
తరగల్ని వదిలి ఇసుకపర్రల మీద పొర్లాడేవారు.

విము­ఖుణ్డయ్యాన్నేను ఆ సాయంకాలాలకి, ఆ సారలేశ గోష్టులకి
లాలిత్యమేదీ స్ఫురించని ఆ మొరటు మాటలకి,
మధుసము­ద్రాల్ని మరిపించాలని చూసే ఆ బార్‌ – కం – రెస్టారెంట్లకి.

ఆ వినీల కేశరాశిలో పువ్వులెంత మృదులతరాలు,
ఊరించే ఆమె పిలుపుల వెంటపడటానికి చాలినవాడెక్కడ?
తెలుసు ప్రతి ఒక్కరికీ,
ప్రేమిస్తే ఆమెని, నివేదించవలసింది పూర్తి జీవితమని.
దూకావా, ఆ నదీ గర్భంలోకి
నువ్వు తిరిగి రావడం సందేహమని.

వదిలిపెట్టేసానా పట్టణాన్ని, ఆ రంగురంగుల సంగీతాన్ని
కానీ ఇష్టం అదంటే నాకిప్పటికీ.
ఆమె అందెల మోతని
అంత అందంగా వినలేదు నేను మరెన్నటికీ.

(పునర్యానం, 2.2.20)


The town used to be flooded with song and dance, poetry, and paintings
Flowers, fruit, and milk jars used to fill it
There used to be fresh spices imported every day
In those meeting halls, high-end connoisseurs gathered.

I eventually grew tired of all the pomp and pettiness around her.
People around her quarreled over the stalk, leaving the flower behind.
They forgot the meaning and fought over the sound
In pursuit of the body, they left the soul behind
In the sand dunes, they swam away from the river.

Over time, the evenings became dreary, and meetings became dull
The discourse was lacking taste, and
Bar restaurants fooled you to forget honey.

Flowers in her hair, how delicate.
Where was he competent to pursue her?
Everyone knew that to love her means giving up everything.
If you dove in, you weren’t guaranteed to return.

I finally left the town and those colorful songs behind.
I still like the place, though.
The anklets of poetry had no better music anywhere else.

22-8-2023

12 Replies to “పునర్యానం -21”

  1. అంతదాకా నువ్వు చూడని ఆత్మవంచన, దివాలాకోరుతనం, ద్వంద్వవైఖరి బయటపడటం మొదలైతే! నీకు ఊపిరాడటం మానేస్తుంది.

    कमियां सब में होती है; लेकिन नजऱ सिर्फ दूसरों में आती है।

    ఎంత నిజం…!
    జీవితం అనుభవైక వేద్యం…

    గుడ్ మార్నింగ్…సర్.

  2. ఎవరి గుణాలు ఎప్పుడు ఎలా బయటపడ్డాయి తెలియదు కదండీ. అంతకు ముందు ఒక మనిషి గురించి ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉన్నప్పుడు.. అవి ఆ వ్యక్తిలో కనిపించనప్పుడు, అయ్యో.. మనం ఈ కోణం చూడలేకపోయామే అని అనిపిస్తుంది. సహజంగా మనిషి కొన్ని గుణాలు ప్రదర్శనకు పెట్టుకుంటాడు. అసలైన గుణాలు కనిపించనివ్వడు.

  3. రెండో పారగ్రాఫ్ ను ఎన్ని సార్లు చదివినా మళ్లీ చదవాలనిపిస్తుంది
    నేను పడుతున్న యాతనే ఆ పారా నిండా

  4. ఏడాది గడిచేటప్పటికి మనుషుల దగ్గర ఏమీ మిగలదు. వాళ్ళు ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలే మళ్లా మళా చెప్పుకుంటూ ఉంటారు.
    సృజనకారునికి కాలు నిలవదు మనసు నిలవదు.
    నిత్యనూతన సంశోధనాతత్పరులు సంవేదనా తురులు,సమవీక్షణాలక్షణులు కనుకనే ప్రపంచం సాహిత్యమయమై అనంతంగా కొనసాగుతున్నది.
    మనసు తరువు పూస్తే కాస్తే
    రాతోగీతో రాస్తే గీస్తే
    తావిమోత కాస్తా ! కూస్తా!

  5. బదిలీలు నన్నెప్పుడూ బాధపెట్టలేదు .మొదటిది మీరు చెప్పిన కారణం .కాకపోతే ఏ ఊళ్ళోనైనా ఆ మనుషులే వున్నారని ,ఉంటారని తెలిసాక కంచె మన చుట్టూ వేసుకోవాలని అర్థమైంది.
    రెండోది కొత్త లైబ్రరీలు.

Leave a Reply

%d bloggers like this: