
కవిత్వానికీ, యవ్వనానికీ, ప్రణయభావాలకీ చాలా దగ్గర పోలిక ఉంది. అవి ఒక మనిషి జీవితంలో ఒక వయసులో మాత్రమే వచ్చి వాలతాయి. సహజంగా. తోటలోకి వసంతం వచ్చినంత సునాయాసంగా. ఆ తర్వాత నువ్వెంత ప్రయత్నించినా కవిత్వం పలకడం కష్టం.
అలాగని ప్రతి కవికీ కవిత్వం పదిహేనేళ్ళనుంచి పాతికేళ్ళమధ్యనే పలుకుతుందని కాదు. కొందరికి అది మరీ చిన్న వయసులో పలకవచ్చు. రేంబోని పదిహేడేళ్ళకే, జాన్ కీట్స్ ని ఇరవై ఒక్క ఏళ్ళకే కవిత్వం వరించింది. Comte De Lautréamont అనే ఫ్రెంచి రొమాంటిక్ కవి ఇరవై రెండేళ్ళకల్లా అద్భుతమైన కవిత్వం రాసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. శ్రీ శ్రీ తన కవిత్వాన్నీ, తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన కవిత తన 24 వ ఏటనే రాసాడు. 39 ఏళ్ళకే ఆమె భారతియార్ ని అమరుణ్ణి చేసేసింది. అదే గురజాడ అప్పారావుని దాదాపు యాభై ఏళ్ళ వయసు వచ్చేదాకా పలకరించనేలేదు. మిల్టన్ కూడా అంతే. యాభై ఏళ్ళు వచ్చాకే పారడైజ్ లాస్ట్ మొదలుపెట్టాడు.
కవిత్వం కూడా యవ్వనమే కాని, కొంతమందికి అది కౌమారంలో వచ్చే యవ్వనం, మరికొందరికి వార్థక్యంలో వచ్చే యవ్వనం. కాని అది ఒక్కసారే కవిని ఆవహిస్తుంది. అతడి జీవితంలో పాడే గొప్ప పాటలన్నీ ఆ కొద్దికాలంలోనే పాడి వెళ్ళిపోతాడు. ఆ కవితాకాలం గడిచిపోయాక కూడా కవిత్వం రాసే వాళ్ళు చాలామందే ఉంటారు. కాని మనకి తెలిసిపోతుంది, అందులో కవిత్వం తక్కువా, versification ఎక్కువా అని. టాగోర్ లేడా అనవచ్చు. ఎనభైవ ఏట కూడా పాటలు కట్టేడు. అన్నమయ్య లేడా అనవచ్చు. ఏ లెక్కన చూసినా జీవించినంతకాలం ప్రతి ఒక్కరోజూ పాటలు రాస్తే తప్ప అన్ని వేల పాటలు రాసి ఉండలేడని మనకి తెలుస్తూ ఉంటుంది. కాని వాళ్ళు నూటికీ కోటికీ ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. మామూలుగా మాత్రం ఏ కవికైనా తనని కవిత్వం వరించే ఋతువు ఒక్కటే ఉంటుంది.
అందుకనే ఆమె అందరిళ్ళకీ వెళ్ళదని అనుకునేది. కాని ఆమె తనంతటతాను ఎవరి తలుపు తడుతుందో వాణ్ణి మించిన భాగ్యశాలి మరొకరుండరు. అంత ఉన్మత్తుడు కూడా మరొకరుండరు. ఉన్మత్తత ఎందుకంటే, కవిత తన తలుపు తడుతున్నదని తెలిసిన కాలంలో ప్రతి కవీ కవిత్వం పట్ల possesive కాకుండా ఉండటం అసాధ్యం. తన ప్రియురాల్ని గాఢాతిగాఢంగా ప్రేమించిన ప్రేమికుడు కూడా ఆమె పట్ల అంత పొసెసివ్ గా ఉండగలడని అనుకోను. అదొక చిత్రమైన అవస్థ. కవికి కవిత్వం పలకడం మొదలుపెట్టాక తోటి కవుల సాంగత్యం కావాలనిపిస్తుంది. కాని అదే సమయంలో వారి పట్ల అంతులేని అసూయ కూడా జనిస్తుంది. ఫైజ్ ఒక గజల్లో ‘హరీఫ్-ఎ-బహార్’ అనే పదప్రయోగం చేసాడు. అంటే తనకి వసంతం ప్రతిద్వందిగా మారిందని అన్నమాట. వసంతం ప్రతిద్వంది ఏమిటి? అంటే తానూ, వసంతమూ కూడా మరొకరెవరినో ప్రేమిస్తున్నారన్నమాట. ఆమె మీద ప్రేమవల్ల తాను వసంతానికి ప్రతిద్వందిని అయిపోయానని అంటున్నాడు కవి. కవిత్వం కవిని వరించే రోజుల్లో ప్రతి కవికీ తాను ఇష్టపడే తోటి కవి ‘హరీఫ్-ఏ-బహార్’ అయిపోతాడు. తాను ఇష్టపడుతున్న కవిత్వం, లేదా తనని ఇష్టపడుతున్న కవిత్వం మరొకరిని కూడా ఇష్టపడుతోందని తెలియడం నరకప్రాయంగా ఉంటుంది.
ఈ అసూయని ఎలా అర్థం చేసుకోవాలి? ‘పూను స్పర్థను విద్యలందే’ అన్నాడు మహాకవి. కాని ఈ అసూయ తర్కానికి లొంగేది కాదు. ఎవరో నాతో ఒకసారి చెప్పారు, ఎవరో కృష్ణశాస్త్రిని కలవడానికి వెళ్తే ఆయన ఆంధ్రపత్రిక తదేకంగా చూస్తూ ఉన్నాడట. ఏమిటి చదువుతున్నారు అంత దీక్షగా అనడిగితే, ఆ పత్రికలో తన పేరు ఎన్ని సార్లు ఎన్ని పడిందో, విశ్వనాథ సత్యనారాయణ పేరు ఎన్ని సార్లు పడిందో లెక్కేసుకుంటున్నానని చెప్పాడట.
సాహితీవేదిక ‘ఆర్కెష్ట్రా’ కవితాసంకలనం విడుదలకి వేగుంట మోహనప్రసాద్ ని పిలిచాం. ఆయన ఆ పుస్తకం ఆవిష్కరణకి ముందే నా కవితల్ని మెచ్చుకున్నాడు. కాని తన ప్రసంగంలో నా కవితలు కాక, గోపీచంద్ రాసిన ‘నేనొక మహారణ్యాన్ని’ కవిత మీద ప్రశంసల వర్షం కురిపించాడు. చాలాకాలం పాటు ఆయన ప్రసంగం గుర్తొచ్చినప్పుడల్లా నా కవితల్ని సభాముఖంగా ప్రస్తావించలేదన్న ఉడుకుమోత్తనం నా మనసుని ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉండేది.
డా. సుబ్బరామన్ తాడికొండలో నా జూనియర్. అతడు చాలాకాలం తర్వాత నన్ను మళ్ళా రాజమండ్రిలో కలిసాడు. అప్పటికి అతడు కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి కొన్ని కవితలు వినిపించాడు. అది నాకు తెలిసిన కవిత్వాల్లో అత్యుత్తమ స్థాయి కవిత్వం. నాకు తెలిసిన పిల్లవాడు అంత అద్భుతమైన కవిత్వం రాస్తున్నందుకు సంతోషం కలిగినమాట నిజమేగాని, నాకన్నా చిన్నపిల్లవాడికి అటువంటి కవితావాక్కు పట్టుబడినందుకు ఆ రాత్రంతా నేను మరొక పక్క అసూయతో కుమిలిపోతూనే ఉన్నాను.
ఇంతకీ, ఇక్కడ అసూయ అనేది సరైన పదం కాదు. ఆ క్షణాన నాకు కలిగిన ఉక్రోషం అతడి పట్ల కాదు, నేను వలచిన కవితా కన్యపట్ల. ఆమె నన్ను వరించానని చెప్పి, నాకు పంచని అమృతమేదో అతడికి పంచిందన్న వగ. బహుశా ఈ వ్యథ పారశీక, ఉర్దూ కవులకి బాగా తెలుసనుకుంటాను. వారి కవిత్వంలో ప్రేయసి వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, భరించగలరు, కాని మరొకణ్ణి కన్నెత్తిచూసిందంటే మాత్రం, కుమిలి కుమిలి ఏడుస్తారు.
ఏమో! ఎంత అపురూపమైన కాలం అది! పిల్లలమర్రి పినవీరభద్రుడు వాణి నా రాణి అని చెప్పుకున్నాడంటారు. కాని ఈ చినవీరభద్రుడు వాణి నా ఒక్కరికే రాణి కావాలని మారాం చేసేవాడు. అందుకనే పునర్యానం కావ్యం వెనక అట్టమీద ఈ కవితలోని పంక్తుల్నే మళ్ళా రాసిపెట్టుకున్నాను.
కవిత అందరిళ్లకూ వెళ్లదు, ఎవరి ఇంటి తలుపు
తడుతుందో ఆమె అతడిక ఉన్మత్తుడు.
ఉన్మత్తుణ్ణి నేను ముందే, పుష్పపరాగవివశుణ్ణి
నన్నన్వేషించి అయింది కవిత తానున్మత్త.
చెప్పిందామె ఒకనాడు, నిద్రపోతున్న పడవల మధ్య
రావిచెట్టు నీడల మధ్య ‘వెతుకుతున్నానొక సహచరుడి కోసమని’.
నేనే ఆ సహచరుణ్ణి కావాలనుకున్నాను, విప్పిపరిచాను
నా జీవితమామెముందు సంతోషంగా.
మాట్లాడదు కవిత, దొంగ, మరికొందర్ని కూడా మురిపించిందిట్లానే,
అయినా ఆమె కోసం అన్నీ వదులుకున్నాను.
ఒక ముద్దు, కొన్ని గుసగుసలు, లభించినవింతే
నాకామె నించి. చాలవు, ఆమె నా సొంతం కావాలని పడి చచ్చాను.
(పునర్యానం, 2.2.10)
Poetry doesn’t visit every home, but
Blessed is the one whose door she knocks on.
Already mad, wild about flowers and colors, and
In search of me, poetry too got crazy.
Under a Peepal tree, the boats were sleeping.
She told me she was looking for a friend.
Instantly, my heart burst,
Eager to be her companion.
Despite her tricks and luring nature,
I gave up everything for her.
What could I get back? A kiss and a whisper.
Thereon, my yearning for her full presence
Consumed me to the core.
మరిచాను ఊరిని, మరిచాను అమ్మని, మరిచాను అక్కని
మరిచాను పొలాల్ని, మిత్రుల్ని, మానవసందోహాన్ని.
ఉన్మత్త వేషభరంతోనే వదులుగా జారిన
ఆమె కబరీభరం వెంట పరుగుతీసాను.
ఆమె ఎవరిని చూస్తుందో వాడే నా మిత్రుడు, అవును
వాడే నా శత్రువు కూడా.
చదివేవాడొక్కక్కడు ఆ ఒడ్డున తన కొత్త వాక్యాలు కొన్ని
ఆ రాత్రంతా నిద్దర నాకు దూరమని వేరే చెప్పాలా.
కవిత కోసం ప్రేమించాను ఎవరెవరినో, ఊడిగం చేసాను
ఉమ్ము మోసాను, మూసిన తలుపుల ఎదట జాగరణ చేసాను.
నా ఏటి ఒడ్డు కాదు కవిత, నా కొండగాలి కాదు కవిత
సమూహమేదో ఒకటి లేకుండా దరిచేరదు కవిత
(పునర్యానం, 2.2.14)
It was as if my village, my mother, and my sister had all
Disappeared from my mind.
The meadows, the friends, and everyone were forgotten.
I ran after her madly, and
Her hair would drive a Baudelaire crazy.
Yes, he was my friend who she admires, but
He was also my greatest enemy.
On the river bank, poets read their lines aloud, and
I was sleepless the whole night.
I loved and served everyone for the sake of poetry.
Gulping the hurt, I waited endlessly for her.
Alas! A Poem doesn’t wait for you alone.
Without companions, she won’t even greet you.
20-8-2023
Ohhhhhhhhhhhhh!
Life….
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
బాగుందండీ
ధన్యవాదాలు మేడం
Absolutely Brilliant!!!
కవితలు , అనువాదాలు సరే…వీటితో, ఈ కవితల్లోని మాటలతో, అప్పటి మీ జీవితంతో మీ అనుబంధం, యుద్ధం ఆపకుండా చదివిస్తున్నాయి.
కేవలం రాజమండ్రి కవిత్వం లో కరిగిన జీవితాన్ని గురించే మీరొక విపులమైన నవల రాయాలి.
హరీఫ్ e bahaar- Wah! Wah!
ధన్యవాదాలు మానసా!
కవిత్వం ఇతివృత్తంగా కాదు గాని రాజమండ్రి కేంద్రంగా ఒక నవల రాయాలన్న కోరిక అయితే చాలా కాలంగా ఉంది.
it’s it’s lovely that’s all
Thank you
కవిత్వ సుందరి కొందరినే వరిస్తుంది ,
అందిపుచ్చుకున్న వారు అదృష్టవంతులు .
మీ స్పందనకు ధన్యవాదాలు మాస్టారూ!
నాకు తెలిసి నేను నా ఏడవ తరగతి నుండీ ఆమె వలలో చిక్కుకున్నట్టు వున్నాను, ఇంకా ఈ ఉడుకుమోతు తనపు భారాన్ని కూడా మోస్తున్నాను ఇప్పటికీ
నిజమే వారే నా మిత్రులు
నా శత్రువులు
మీతో సహా…..
ఇలా రాసిన మీరు మిత్రులు
నా వాణి ఇలా పలకనందుకు శత్రువులు
ధన్యవాదాలమ్మా!