
నా జన్మకుండలిలో పదవ ఇంటిలో గురుడు, తొమ్మిదవ ఇంట్లో శుక్రుడూ ఉన్నారు. తొమ్మిదవ ఇంటికి శని అధిపతిగా ఉంటూ, ఎనిమిదవ ఇంటి నుంచి పదవ ఇంటిని చూస్తూ ఉన్నాడు. ఈ మూడు గ్రహాల్నీ మూడు ధోరణులకి ప్రతీకలుగా తీసుకుంటే, నా ఇన్నేళ్ళ జీవితమంతా కర్మస్థానాధిపతిగా గురుడికీ, భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడికీ మధ్య ఊగిసలాడుతూనే ఉంది. రెండింటిమీదా శని నియంత్రణ వల్ల, రెండు రంగాల్లోనూ, అంతిమంగా ఒక వైరాగ్యధోరణి, ఒక పరివ్రాజక స్వభావం బలపడుతూ వచ్చాయి.
ఏళ్ళ కిందట నేను టెలిఫోన్స్ ఆఫీసులో పనిచేసినప్పుడు, అక్కడ మా కొలీగ్ ఒకాయన జాతకాలు చూస్తుండేవాడు. ఆయన నా జాతకం చూసి నాతో చాలాసార్లు ఆ గ్రహాల గురించీ, గ్రహగతుల గురించీ ఏవేవో చెప్తుండేవాడు. అవన్నీ గుర్తులేవుగాని, ఒక మాట మాత్రం బాగా గుర్తుండిపోయింది. ‘మీరు గురుడి కన్నా శుక్రుణ్ణి ఎక్కువ నమ్ముకోండి’ అని. జ్యోతిష్యం ప్రధానంగా ప్రతీకాత్మక భాష కాబట్టి, దాని అర్థమేమిటంటే, మీరు ఉద్యోగమూ, బాధ్యతా, కర్మనిర్వహణలమీద కన్నా కవిత్వాన్నీ, కళల్నీ ఎక్కువ నమ్ముకోండి అని. అలాగే ధర్మానికీ, ప్రేమకీ మధ్య సంఘర్షణ తలెత్తితే, ప్రేమపట్ల మొగ్గు చూపించండి అని.
కాని ఇన్నేళ్ళ నా జీవితంలోనే ప్రతి సారీ కర్మాధిపతిగా, ధర్మాధిపతిగా గురుడిదే నా జీవితంలో పైచేయిగా ఉంటూ వచ్చింది. మరొకవైపు కోణాధిపతి గా ఉంటున్న శుక్రుడు భాగ్యస్థానంలో ఉండి చూపించగల అనుగ్రహం కూడా ఏమీ తక్కువ కాదు. చివరికి నాకేమి అర్థమయిందంటే, నేను ఏ పని చేసినా ఎంతో బాధ్యతగా చేస్తూ ఉండడమే కాక, దాన్ని అంతే కళాత్మకంగా నెరవేరుస్తూ వచ్చానని కూడా. కాని అన్ని సార్లు ఈ రెండు లక్షణాలూ పరస్పరపూరకాలుగా ఉండకుండా, చాలా సార్లు పరస్పర విరుద్ధ మార్గాల్లో నన్ను నడిపిస్తో వచ్చాయి కూడా. నడిపించాయి అనడం కన్నా, నా రెండు రెక్కలూ పట్టుకుని చెరో వేపూ లాక్కుపోడానికి ప్రయత్నిస్తూనే వచ్చాయి.
ఇదిగో, నా చేతుల్లో Jacob Epstein (1880-1959) ఆత్మకథ Let There Be Sculpture (1940) ఉంది. ఎప్ స్టీన్ పోలాండ్ కి చెందిన యూదు కుటుంబానికి చెందినవాడు, అతడి తల్లిదండ్రులు అమెరికాకి వలసపోయారు. అతడు కూడా పుట్టడం అమెరికన్ గా పుట్టి తర్వాత రోజుల్లో బ్రిటిష్ పౌరుడిగా జీవించాడు. గొప్ప శిల్పి, చిత్రకారుడు. నూటికి నూరు శాతం కళాకారుడు. బొమ్మలూ, శిల్పాలూ, పువ్వులూ, ప్రేమలూ- అతడి జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసాయి. అతడు తన బాల్యం గురించి రాస్తూ, తనలో ప్రాపంచిక విజయం వైపు నడవగల ప్రతిభ ఒకవైపూ, ప్రపంచపు ప్రమాణాల్ని దాటి బతకాలనుకునే స్వతంత్ర ప్రవృత్తి మరొకవైపూ ఉండేవనీ, వాటి మధ్య ఏదో ఒక దారినే ఎంచుకోవడం చాలా కష్టంగా ఉండిందనీ, చివరికి తన ఇంటినీ, తల్లినీ, తన స్వజనాన్నీ వదిలిపెట్టి యూరోప్ పారిపోతే తప్ప తన దారి తనకి దొరకలేదనీ రాస్తున్నాడు.
నేనట్లా పారిపోలేకపోయాను. ఎప్పటికప్పుడు బాధ్యతలు నన్ను వెనక్కి లాగుతూనే వచ్చాయి. కాని ఆ ‘సుధాసింధు శిశిర గర్భాంతరా’నికి మళ్ళా తిరిగి వెళ్ళిపోవాలన్న కోరిక కూడా అంతే బలంగా ఉంటూ వచ్చింది. బహుశా నా జీవితంలోని ఈ రెండు ప్రవృత్తుల మధ్య సంఘర్షణనీ నేను రాజమండ్రిలో అనుభవించినంత తీవ్రాతితీవ్రంగా మరెన్నడూ అనుభవించి ఉండలేదు.
ఆ రోజుల్లో, ఒక స్థిరమైన ఉద్యోగం దొరకడమే జీవితాశయంగా ఉండవలసిన ఆ రోజుల్లో కవిత్వం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఆ అయిదేళ్ళూ ఆ ఊళ్ళో, ఆ నది ఒడ్డున, ఆ సాహిత్యబృందాల మధ్య, ఆ గ్రంథాలయాల్లో ఆమె ‘చేలాంచముల కొసగాలులు’ తాకీ తాకనట్టుగా నామీద విసిరిపోతున్నప్పుడు నాకు మతిపొయ్యేది. మరేదీ పట్టేది కాదు, రేపెలా అన్న ఊహ ఉండేది కాదు. కాని మరోవైపు నా విద్యార్హతలు మెరుగుపర్చుకోడానికీ, ఏదో ఒక పెద్ద ఉద్యోగం తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాణ్ణి గాని, నా మనసక్కడ ఉండేది కాదు.
బహుశా అయిదు ద్విపదల ఈ కవిత పట్టిచ్చినట్టుగా అప్పటి నా మనః స్థితిని మరేదీ విస్పష్టంగా చెప్పలేదేమో.
కవిత కోసం నేను మనుషుల్ని ప్రేమించాను
ఇళ్ల చుట్టూ వేలాడేను, పడిగాపులు పడ్డాను.
కవిత కోసం నేను రోడ్డు మీద కొచ్చి పడ్డాను
ప్రతి తలుపూ తట్టాను, ధూళినయ్యాను.
కవిత కోసం నేనొక భిక్షాపాత్రిక చేతపట్టాను
కనబడ్డ ప్రతి హృదయం ముందూ ఆగి పిలిచాను.
కవిత కోసం నేనొక సుడిగాలిగా మారేను
అవనిని ఆకాశానికి ముడిపెట్టబొయ్యాను.
కవిత కోసం నేనొకపక్షినయ్యాను, పచ్చికను
చేరిన పశువునయ్యాను, మనిషినయ్యాను.
It was poetry that made me hold on to people and
Their homes tightly.
My search for poetry led me to the streets, and
I followed every step, kissing the dust.
For poetry, I carried a begging bowl, and
Tapped every heart, unashamed.
The love of poetry turned me into a whirlwind, and
I roamed between earth and heaven.
For poetry I was a bird and a beast, and
It was poetry that made me a man.
17-8-2023
“కవిత కోసం నేనొకపక్షినయ్యాను, పచ్చికను
చేరిన పశువునయ్యాను, మనిషినయ్యాను.”
Ambition’s debt is paid!
Feeling Blessed, Sir.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
అయితే నేను మీకు నా జన్మకుండలి పంపాలి గురువుగారు….
తప్పకుండా
గొంతుకి ఏదో అడ్డం పడ్డట్టు అయింది. ఇన్ని ద్వంద్వాలను, వైరుధ్యాలను, బాధ్యతలను నిభాయించుకుంటూ మీరు చేసిన సాహిత్య ప్రయాణం అనితర సాధ్యం అనిపిస్తూ ఉంటుంది. టాలెంట్ ఒక ఎత్తు అయితే Endurance మరొకటి. బహుశా నేను నేర్చుకోవాల్సింది అది.
” ఏ పని చేసినా ఎంతో బాధ్యతగా చేస్తూ ఉండడమే కాక, దాన్ని అంతే కళాత్మకంగా నెరవేరుస్తూ వచ్చానని కూడా”– wow! జీవితాన్ని తరచి చూసుకునేటప్పుడు ఇట్లాంటి మాట ఒక్కటి నా గురించి నేను అనుకోగలిగితే బాగుండు అనిపించేంత మంచి మాట. Truly inspiring.
పునర్యానం చదివినప్పుడే దాని బలమూ, లోతూ, తీవ్రతా కొంత అర్థమయ్యాయి. కానీ ఈ నేపథ్యాలు చూస్తుంటే, దాని విశ్వరూపం కళ్ళకు కడుతోంది. I wish you select as many poems as possible.
Regards.
ధన్యవాదాలు మానసా! మీరు చదువుతున్నారన్న ఊహనే నాకు కొండంత అండ.
అన్ని వాక్యాలూ అద్భుతాలే🙏❤️
సరళ సుందర సహజకవిత.బ్రహ్మచర్యంలో భవతీ / భవానీ భిక్షాందేహీ అని వటువు పాలాశదండం పట్టుకుని భుజాన వేలాడే జోళియతో ప్రతివారి వారి కడకు వెళ్లే దృశ్యం గోచరించింది నాకైతే. ఆ సమయంలో ప్రతివారు తాము ఇయ్యగలిగినవి ఇచ్చి సంతృప్తి పొందుతారు. ఇంకాస్త అందంగా చెప్పాలంటే కొందరు యౌవనాంకుర ముగ్ధలు తమ మనసుల్ని మాత్రమే జోలెలో వేస్తారు. అవి దాతకు, దానగ్రహీతకు మాత్రమే తెలుస్తాయి. అది ఒక మధురోహల కల్లం.
మీ సుందర సంస్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎందుకో దుఃఖం కమ్ముకువస్తోంది sir
బహుశా ఇప్పుడు నేను, ఒకప్పటి నేను, రేపటి నేను ఇదే డోలాయమానంలో కాలం వెళ్లదీసి, వెళ్లదీస్తూ, వెళ్లదీస్తామేమో
ధన్యవాదములు ఈ వ్యాసం అందించినందుకు
ధన్యవాదాలమ్మా