
ఆధునిక తెలుగు కవుల్లో నన్ను అందరికన్నా ముందు ఆకట్టుకున్నది శ్రీ శ్రీ. ఏళ్ళు గడిచినా కూడా ఆయన కవిత్వం, రచనల పట్ల ఆకర్షణ తగ్గలేదు సరికదా, నేను ఎదుగుతూ వస్తున్న కొద్దీ ఆయన కూడా నాకు కొత్తగా కనిపిస్తూనే ఉన్నాడు. గురజాడని నేను అర్థం చేసుకోడం మొదలుపెట్టేసరికి నా రాజమండ్రి జీవితం ముగిసిపోయింది. ఇక కృష్ణశాస్త్రి నా హృదయానికి చేరువగా రావడం ఆ తర్వాత ఎప్పటిదో మాట.
నా రాజమండ్రి రోజుల్లో శ్రీ శ్రీ తర్వాత నన్ను ఒక అయస్కాంతంలాగా దగ్గరకి లాక్కున్నవాడు బైరాగి. నేను రాజమండ్రి వెళ్ళకముందే నూతిలో గొంతుకలు చదివాను. చదివాను అనడం కన్నా పునః పునః వెయ్యి సార్లు పారాయణం చేసి ఉంటానని చెప్పవచ్చు. అందులోలేని ఆయన కవితలు కొన్ని ఆయన హిందీలో వెలువరించిన ‘ఆధునిక తెలుగు కవిత’ అనే సంకలనంలో దొరికాయి. దేవనాగరి లిపిలో ఉన్న ఆ కవితల్ని తెలుగులోకి రాసుకున్నాను. అటువంటి కవితలు ఇంకా ఇంకా దొరికితే బాగుణ్ణని అనుకునేవాణ్ణి. అలాంటి రోజుల్లో ‘ఆగమగీతి’ వెలువడింది. 1983లో. ఆ తర్వాత మూడేళ్ళ పాటు నా రాజమండ్రి జీవితాన్ని ఆ పుస్తకం వెలిగించింది. ఒక మనిషికి ఒక పుస్తకం తోడుగా ఉండటమనేది సాధారణంగా మనం మతగ్రంథాల విషయంలోనే చూస్తాం. కాని అరుదుగా సాహిత్య గ్రంథాలు కూడా అటువంటి చోటు సంపాదించుకోగలవని ఆగమగీతి నా జీవితంలో ప్రవేశించాకే అర్థమయింది.
అప్పటిదాకా శ్రీ శ్రీని మాత్రమే చదివి ఉన్న నాకు, అభ్యుదయ, విప్లవ సాహిత్య ఝంఝూమారుతాలు బలంగా నామీద వీస్తుండగా, వాటితో పూర్తి అంగీకారం కుదరని ఆ రోజుల్లో, నాకు నూతిలో గొంతుకలు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అది తెలుగులో మొదటి మాడర్నిస్టు పొయెం. మనకి ‘ఆధునిక’ (modern) కీ, ‘ఆధునికత’ (modernist) కీ మధ్య ఉండే తేడా తెలియదు. ఆధునిక అంటే, యూరోప్ లో ఎన్లైటెన్ మెంటు యుగాదర్శాల వెలుగులో మానవతావాదం, హేతువు, సైన్సు, యాంత్రీకీకరణ, ప్రజాస్వామ్యం మొదలైన విలువల ఆధారంగా ఒక నవ్యమానవుణ్ణి కలగనే ఆలోచనాధోరణి. యూరోప్ లో పద్ధెనిమిదో శతాబ్దం నాటి స్ఫూర్తి అది. దాని మీద తిరుగుబాటుగా రొమాంటిసిజం, ఆ తర్వాత రోజుల్లో సింబలిజం లాంటి కళా ఉద్యమాలు యూరోప్ లో ప్రభవించాయి. మరొకవైపు పారిశ్రామికీరణ చెందుతున్న ఆధునిక సమాజాన్ని ఎన్ లైటెన్ మెంటు ఆశయాల వెలుగులో చిత్రించడానికి రియలిజం, నాచురలిజం లు కూడా వికసించాయి. కాని పందొమ్మిదో శతాబ్దం మధ్యనాటికే బోదిలేర్, డాస్టవిస్కీ, కిర్క్ కార్డ్, తర్వాత రోజుల్లో నీషే వంటి వారు, ఎన్ లైటెన్ మెంటు స్ఫూర్తి నిజానికి రూపు మార్చుకున్న మతం తప్ప మరొకటి కాదనీ, ‘ఆధునిక’ అనే మాట అంతిమంగా బలవంతులు బలహీనుల్ని అణచివెయ్యడానికే దారితీస్తుందని అనుమానించడం మొదలుపెట్టారు. దాన్ని ఇరవయ్యవశతాబ్ది ప్రారంభంలో ఇలియట్, జాయిస్, కాఫ్కా వంటి రచయితలు మరింత స్పష్టంగా చూపించడం మొదలుపెట్టాక దాన్ని మాడర్నిజం అనడం మొదలుపెట్టారు. తెలుగులో ఆ ఆలోచనా ధోరణిని పూర్తిగా ప్రతిబింబించిన కవి బైరాగి.
నేను రాజమండ్రి వెళ్ళకముందే ‘అభ్యుదయం’, ‘ప్రగతి’ , ‘విప్లవం’ లాంటి పదాల పట్ల నాకు కొంత అపనమ్మకం మొదలయ్యింది. సీతారామశాస్త్రి 1981 లో రాసిన ఒక కవితలో ‘వెతలను చూపించే ప్రగతి’ అనే మాట వాడినప్పుడు నేను చలించిపోయాను. ఆ రోజుల్లో అటువంటి మాట పలకడం ఎంతో సాహసం. జంధ్యాల రవీంద్రనాథ్ నాకు కాలేజిలో సీనియర్. ఆయన ఒక సాయంకాలం కాకినాడలో నాకు మార్క్సిజం గురించి చాలా చెప్పాడు. అప్పుడు నేను విప్లవంతో అనుసంధానంగా రాగల వెతల గురించి మాట్లాడితే, ఆయన నాతో ‘అది రేపటి సమస్య, నువ్వు ఇవాళతో యుద్ధం చెయ్యి, రేపటితో యుద్ధం రేపు చేద్దువుగాని’ అని అన్నాడు. ఆ మాట నన్ను నిరుత్తరుణ్ణి చేసింది. కాని అతని వాదన సరైందని కూడా ఒప్పుకోలేకపోయాను.
అతడి మాటకి జవాబు బైరాగిలో దొరికింది. బైరాగి ఏం చెప్తాడంటే, ముందు నీలో మార్పు రావాలి. నీలో ఉన్న ఆధిపత్య ధోరణులు క్షాళితం కాకుండా నువ్వు ఎంత రక్తం చిందించీ సమసమాజాన్ని తేలేవు అని. కాని ఆ మాట నేను ఇక్కడ రాసినంత స్పష్టంగా చెప్పడు. అసలు ఆయన ఎవరికీ ఏదీ చెప్పడు. అలా ఉద్బోధించడానికి ఆయన కవిత్వం రాయలేదు. ఆయన తనలో తాను చెప్పుకుంటాడు. తనతో తాను వాదించుకుంటాడు. లోకంలో ఆకలి, చీకటి, అణచివేత నిజాలు. వీటిని చూడనట్టుగా తప్పించుకుపోలేం. నిజమే, కాని దానికి ఎదటిమనిషిని బాధ్యుణ్ణి చేసే ముందు, ఎదుటిమనిషిని నిర్మూలించడానికి ఉపక్రమించే ముందు నిన్ను నువ్వు పరిశీలించి చూసుకో అని చెప్తాడు. అటువంటి మాట తెలుగు కవిత్వంలో నేను అప్పటిదాకా విని ఉండలేదు. వినలేదు అంటే వినలేదు అని కాదు, చలంగారి మూజింగ్సు నిండా అటువంటి ఆలోచనలే, మరింత తీక్ష్ణంగా కత్తివాదరలాగా మెరుస్తూ ఉంటాయి. మూజింగ్సు ఆ రోజుల్లో నా మరొక పారాయణ గ్రంథం. కాని కవిత్వం కావడంవల్లనో లేదా చలంగారిలాగా లోకం మీద విరుచుకుపడకుండా, తనలో తనే స్వగతంగా చెప్పుకుంటున్నట్టుగా కవిత్వం రాసినందువల్లనో బైరాగి మరింత ఆత్మీయుడనిపించేవాడు. కాని ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే బైరాగి, చలం ఇద్దరూ నాకు ప్రాణం పోసేరనే చెప్పవలసి ఉంటుంది.
అసలే, నా అన్ని రకాల భౌతిక విజయ ఆకాంక్షలమీదా రాజమండ్రి నీళ్ళు చల్లేసింది. అటువంటి మానసిక స్థితిలో బైరాగి నాకు ఎంత ఊరటగా అనిపించాడో చెప్పలేను. ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పటికే ముక్కలు ముక్కలైపోయిన నన్ను ఆగమగీతి మళ్లా ఒకచోట చేర్చి నన్ను తిరిగి నాకు అందించింది. ఆగమగీతినే లేకపోయుంటే, కవిని కావడం అలా ఉంచి, అసలు నాకు బతకడం మీదనే ఆశలేకుండా పోయేది.
అలా ఆ కవి నన్ను ఒక మనిషిగా మార్చిన వైనం ఈ కవిత.
ఎదురు చూసేవాడిని అనునిత్యం
ఏదో ఒక ఉత్తరం కోసం, ఒక టెలిఫోన్ కాల్‌కోసం
ఒక సంజ్ఞ కోసం,
నావాళ్లెవరో వస్తున్నారన్న సంకేతం కోసం.
రాలేదు, రాలేదు, రాలేదు
ఒక్కరు కూడా, ఒక్క సందేశం కూడా
రాలేదు రాలేదు రాలేదు
పోగొట్టుకున్న ఏ ఒక్క రోజు కూడా
ఎగిరిపోయిన ఏ ఒక్క కొంగ కూడా.
అప్పుడు అడిగిందా కంఠం
నన్ను నిర్దాక్షిణ్యంగా ఒలిచేస్తూ
‘నువ్వు పారిపోయావా బతుకు నించి
బతుకు పారిపోయిందా నీ నుంచే?
ఎంత దయాళువాయన, అప్పుడు
నన్ను నేను చీల్చి చూసుకుని
పైకి తెచ్చుకొన్నానొక పద్మాన్ని.
పంకిల పదాల్తో , చరణాల్తో
పాడానొక పవిత్ర గీతాన్ని
(పునర్యానం, 2.2.7)
Waited endlessly those days
Awaiting a letter or a call, or
A sign to let me know my people were here.
None came, and none came
None and no message.
No lost day could be recovered
No birds returned from the flight.
A merciless voice rang in that gloom.
Looking into my eyes, it asked:
Did you run away from life? Or
Did life run away from you?
It was a poet’s voice. Merciful.
It gave me back to myself.
With dirt on my feet and dust on my words, and
In tears, I began to sing.
16-8-2023
ఆ మాట నన్ను నిరుత్తరుణ్ణి చేసింది.
A mental encounter beyond qualm indeed, Sir !
An example of world class expressionism!
ధన్యవాదాలు రామ్ భాస్కర్
💐 రాలేదు ఒక్కరోజు కూడా
ఎగిరిపోయిన ఏ ఒక్క కొంగ కూడా
బైరాగి మిమ్మల్ని అక్కునచేర్చుకున్నట్టు
మీరు నాకు ఊరట
ధన్యవాదాలు భూపాల్
కవిత్వ స్థాయి గురించి మంచి విపులీకరణ .ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
మీరు చెప్పిన ఏ కవిత్వాన్నీ, ఏ కవినీ చదవలేదు. మీరు చెప్పిన విషయాల్లో మీరు చెప్పినంత అర్థం కాలేదనుకుంటాను. ☹️
అయితే
“పుస్తకం మనిషికి తోడుగా వుండడం, జీవితాన్ని వెలిగించడం”
“అప్పటికే ముక్కలు ముక్కలైపోయిన నన్ను ఆగమగీతి మళ్లా ఒకచోట చేర్చి నన్ను తిరిగి నాకు అందించింది.”
“నన్ను నేను చీల్చి చూసుకుని
పైకి తెచ్చుకొన్నానొక పద్మాన్ని.
పంకిల పదాల్తో , చరణాల్తో
పాడానొక పవిత్ర గీతాన్ని”
ఈ మాటలు అద్భుతాలుగా అనిపిస్తున్నాయి నాకు.
మీకవి అనుభవాలు. Great sir!
ధన్యవాదాలు మాధవీ!
పాడానొక పవిత్ర గీతాన్ని….. 🙏
ధన్యవాదాలు