పునర్యానం -16

నా పందొమ్మిదో ఏట, అంటే , 1982లో, నేను ఉద్యోగంలో చేరాను. రాజమండ్రిలో టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో టెలిఫోన్ రెవెన్యూ ఎకౌంట్స్ ఆఫీస్ ఉండేది. అందులో ఒక ఆఫీసు అసిస్టెంట్ గా నా ఉద్యోగం. ఒక ఐదారు వందల మంది టెలిఫోన్ సబ్స్క్రైబర్ల తాలూకు అకౌంట్లు చూడటం నా ఉద్యోగ బాధ్యత. టెలిఫోన్ డిపార్ట్మెంట్ పని లో ఒక సౌలభ్యం ఉండేది. అదేమంటే నువ్వు రోజుకి ఇంత పని చేయాలి అనే కొలత ఉండేది. ఆ కొలత ప్రకారం నేను రెండు మూడు రోజుల పని ఒక్కరోజే చేసేస్తే ఆ తర్వాత రెండు మూడు రోజులు ఆఫీసుకు వెళ్లక్కర్లేదు. ఆ సౌలభ్యం వల్ల నాకు చాలా వ్యక్తిగత సమయం చేతికి చిక్కేది. దాంతో నేను ప్రైవేటు గా నా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాక పోటీ పరీక్షలు రాయడానికి కూడా సమయం చిక్కింది.

కానీ అక్కడ నా సమస్త జీవితాన్ని నిజంగా ఆక్రమించింది సాహిత్యమే. కవులు, రచయితలు, గ్రంథాలయాలు, పుస్తక చర్చలు, పత్రికలు వాటి మధ్య ఇరవై నాలుగ్గంటలూ సరిపోయేది కాదు. రాజమండ్రిలో, ఆ రోజుల్లో, నాకు లభించిన సాహిత్య జీవితం లాంటిది తర్వాత మళ్ళా ఎక్కడా నాకు దొరకలేదు.

ఆనాటి సాహిత్య జీవితాన్ని వెలిగించిన వాళ్లలో నేను అందరికన్నా ముందు మల్లంపల్లి శరభయ్య గారిని తలుచుకోవాలి. ఆయన్ని చూస్తే నాకు ఒక సముద్రాన్ని చూసినట్లుగా ఉండేది. సముద్రం మాత్రమే కాదు ఒక మహామీనం కూడా. శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావించిన మీనం. అంటే చెరువులో వేస్తే చెరువంత, సముద్రంలో పెడితే సముద్రమంత పెరిగిపోయే మీనమన్న మాట.

రాజమండ్రి జీవితం నా అన్ని రకాల భౌతిక ఆకాంక్షలు భగ్నం చేసేసింది. తక్కిన అన్ని ఆకాంక్షలు పక్కకి పోయి జీవిస్తే శరభయ్య గారి లాగా జీవించాలి అని ఒకే ఒక ఆకాంక్ష నానాటికి బలంగా పెరగడం మొదలు పెట్టింది. అంటే రచనలు చేయటం, పుస్తకాలు వేసుకోవటం, ప్రసిద్ధి కోసం పాకులాడం కాదు. పూర్వకవుల్ని చదువుకోవటం, మళ్లీమళ్లీ చదువుకోవటం, మరింత లోతుగా చదువుకోవటం- ఆ కవిత్వమే జీవితంగా బతకడం అన్నమాట.

ఆయన చూసినప్పుడు నా బాల్యంలో మా ఊళ్లో నాకు అనుభవానికి వచ్చిన లాంటి స్వర్గ సమానమైన సంతోషమేదో మళ్లా పొడగట్టింది. అక్కడా ఇక్కడా కూడా మహారణ్యమే. అక్కడా ఇక్కడా కూడా సమున్నత గిరి శిఖరాలే. అక్కడలానే ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నన్ను నా స్వదేశానికి తిరిగి తీసుకువెళ్లిపోయే ఓడ రాబోతున్నదని అనిపించేది.

పునర్యానం రెండవ అధ్యాయంలో నా రాజమండ్రి అనుభవాల్ని కవితలుగా మార్చినప్పుడు మాస్టారు గురించి రాసుకున్న ఈ కవిత ఈ నేపథ్యమంతా చెప్తే తప్ప అర్థం కావడం కష్టమే.


ఒక సాయంకాలం నదీ తీరాన కలిసానా మహాసము­ద్రాన్ని
మహాసము­ద్రాల కన్నా పెద్దదైన మహామీనాన్ని.

ఆ సము­ద్రం ఇక్షు సముద్రం, అందులో మరొక క్షీరసముద్రముంది.
సాగరమథన వేళ పైకి రాకుండా లోపల దాచుకున్న మధురభాండమొ­కటుంది
ఆ సము­ద్రం శిరసున పూలకిరీటమొకటుండేది
తుమ్మెదలొక నీడ తరగలా దాన్ని వెన్నంటేవి.

గడిపానెన్ని సాయంకాలాలు, రాత్రులు, దిక్కు తోచనివెన్నో మధ్యాహ్నాలు
పడి లేచే ఆ కెరటాల్నే చూస్తూ, పడుతున్నవేమో అడుగుజాడలని పరిశీలిస్తూ
తమ పాత్రలకందని ఆ మహాసము­ద్రాన్ని సమీపించని రేవులు
తమని ముంచెత్తుందేమోనని దూరంగా తప్పుకుతిరిగేవా వీథులు.

విన్నాన్నేను, కొన్ని పురాతన సంగీతాల్ని, పోల్చుకున్నానందులో
నా అటవీ వాద్యాల సంరంభాన్ని, ఋతువులొక్కటే అక్కడా ఇక్కడా
గిరిశిఖరాల ఆ ఔన్నత్యమొ­క్కటే అక్కడా, ఇక్కడా
పోగొట్టుకున్న నా ఓడ నా కోసం తిరిగివచ్చిన జాడలే అక్కడా ఇక్కడా.

(పునర్యానం, 2.2.4)


An evening on the river bank, I encountered the big sea.
Bigger than a whole ocean, I met a giant fish.

It contains an ocean of sugarcane and an ocean of milk
During the churning of the ocean, it kept the honey pot for itself.
The sea was crowned with flowers, and
The bees swarmed around them.

In those lonely afternoons, evenings, and nights
I watched those waves crashing, fords unable to hold the sea, and
People scared of the vastness.

It reminded me of my village, same seasons, and tall hills.
The ancient sounds of the seashore reminded me of my mountains.
Like my childhood, it promised me a paradise.

16-8-2023

5 Replies to “పునర్యానం -16”

  1. అనువాదం ఏది మూలమోవతెలియనంత బిగువుగా ఉంది . కానీ నేపథ్యం తెలియకుండా కవితను ఊహించుకోవడం కష్టమే . తెలిసి చదివితే మాత్రం కవిత్వపరిమళం దట్టంగా అలుముకుంటుంది.

  2. ‘శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావించిన మీనం’..! కాంచితిని విస్మయమున

Leave a Reply

%d bloggers like this: