
సివి కృష్ణారావు గారు చాలా కాలం పాటు మాసాబ్ ట్యాంక్ దగ్గర పి.ఎస్. నగర్ లో ఉండేవారు. అక్కడ ఆయనకి సొంత ఇల్లు ఉండేది. చిన్న ఇల్లు. ఆ ఇంటి ముంగిట ఒక సంపెంగ పొద ఉండేది. ఆ ఇంట్లో నెలనెలా వెన్నెల సమావేశాలు జరిపేవారు. అది సెంటర్ కాబట్టి కవులూ, రచయితలూ ఆ సమావేశాలకి పెద్ద ఎత్తున హాజరయ్యేవారు. మామూలు రోజుల్లో కూడా కవి మిత్రులు ఆయన్ని దాదాపుగా ప్రతిరోజు కలుస్తూనే ఉండేవారు. కాలక్రమంలో ఆయన ఆ ఇల్లు వదిలిపెట్టి చైతన్యపురి వెళ్లిపోయారు. అక్కడ అపార్ట్మెంట్స్ లో ఒక చిన్న ఫ్లాట్లో ఉండేవారు. అక్కడ కూడా ఆయన నెలనెలా వెన్నెల సమావేశాలు నిర్వహించాలని చూసేవారు కాని అది ఊరికి దూరంగా ఉండటం వల్ల పెద్దగా హాజరు ఉండేది కాదు. కవులూ, మిత్రులూ కూడా ఎప్పుడో ఒకసారి తప్ప ఆయన్ని తరచూ కలుస్తూండేవారు కాదు. ఆ ఒంటరితనం ముఖ్యంగా సాహిత్య ప్రపంచం నుంచి దూరమైన ఆ ఒంటరితనం ఆయన్ని చాలా బాధ పెట్టేది. నేను ఒకసారి ఆయన్ని చూడటానికి చైతన్యపురి వెళ్లినప్పుడు ఆయన పునర్యానంలోని ఈ కవిత గుర్తు చేసుకున్నారు.
నువ్వు ఒక ఇంటి నుంచి హఠాత్తుగా వెళ్లి పోవాల్సి వచ్చినప్పుడు నువ్వు ఏమి కోల్పోయావో ఆ క్షణాన నిజంగా నీకు తెలుస్తుందా? ఏదో నీ ఇంటికి దూరమయ్యేవని అనుకుంటావు కానీ నువ్వు పోగొట్టుకున్నది ఒక ఇల్లు కాదనీ, ఒక ప్రపంచాన్నీ అని నీకు నెమ్మదిగా అర్థమవుతుంది.
నేను మా ఊరు వదిలిపెట్టిన తర్వాత చాలా ఏళ్ళకి తిరిగి మళ్లా మా ఊరు వెళ్లి ఉండగలిగే అవకాశం లభించిన తర్వాత, ఒకసారి మళ్ళా ఆ ఇంటికి వెళ్లి, ఆ ఇంటి ఎదుట నిలబడ్డప్పుడు నాకు హఠాత్తుగా తట్టింది: నేను ఇప్పుడు ఆ ఇంటిని మళ్లా పొందగలనేమో గాని ఆ చిన్నప్పటి రోజుల్ని ఎలా తెచ్చుకోగలను అని. మా అమ్మని మా నాన్నని ఎక్కడినుంచి తెచ్చుకోగలను? ఆ చిన్నప్పటి ఆ అమాయకత్వం నా జీవితంలోంచే కాదు మా ఊళ్లోంచి, కాలంలోంచి కూడా అదృశ్యం అయిపోయింది. అరవైల నాటి ఆ రాత్రుల్లో సాయంకాలం రేడియోలో వినిపించే ఆ పాటల్లో అపారమైన నిశ్శబ్దం వినబడేది. ఇప్పుడు ఆ పాటలు మళ్లా ఎక్కడ వినగలను?
మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఒక మనిషినో, వస్తువునో, ప్రదేశాన్నో పోగొట్టుకున్నామని అనుకుంటాం, కానీ, నిజంగా మనం పోగొట్టుకున్నదేదో ప్రతిసారీ మనకి సరికొత్తగా తెలియవస్తూనే ఉంటుంది. అలా తెలిసి వస్తున్నప్పుడల్లా మన విషాదం మరింత చేదెక్కుతూనే ఉంటుంది.
కొన్నాళ్లు జీవిస్తావొకచోట, కొన్ని కలలు కట్టుకుంటావు
కొందర్ని ప్రేమిస్తావు, వరసలు పెట్టి పిలుచుకుంటావు,
విందుకాహ్వానించుకుంటావు,
ఒక పూలమొక్క కూడా నాటుకుంటావు.
నీ పొరుగువాళ్లు వెళ్తున్నారని ఆ ఊరి గ్రామదేవతను
నమ్ముకోడం వెదలుపెడతావు నువ్వుకూడా
నెమ్మదిగా ఒక తోట పెడతావు.
ఇంటిముందు ముగ్గులు పెడతావు
పీటని పల్లకి చేసి బొమ్మలకు పెళ్లి చేస్తావు
ముత్యాలవాన కురుస్తోందని మురిసిపోతావు,
రత్నాల ఎండ వెల్లివిరిసిందని గొడుగుపడతావు.
ఉన్నట్టుండొకనాడు
వదిలిపెట్టేయవలసి వస్తుంది ఆ ఇంటిని, ఆ ఊరిని;
వదులుకున్నదేమిటో నిజంగా తెలుసా నీకు అప్పుడు
(పునర్యానం, 2.1.16)
You live in a place for a while, and you dream
Love a few people and connect with them.
Gifts exchanged, and gatherings follow.
Like your neighbors, you visit the village temple.
You may even grow a garden.
Decorating your yard
You join your friends to play and feast.
The sun shines and the rain drizzles.
Suddenly you’re forced out of your home and place, and
Were you aware of what you lost?
14-08-2023
నిజమే సర్ ఇంటిని, ఉన్న ఊరిని వదులుకుని రావడం అంటే మనదైన ప్రపంచాన్ని వదులుకోవడమే.. అది జ్ఞాపకాల్లో కదిలే కథె అవుతుంది.
అవును మేడం
నేను పుట్టి పెరిగిన మా ఊళ్లో పదహారేండ్లు , కాగజ్ నగర్ లో నలభై ఏళ్లు రెండు వదలిపెట్టి హైదరాబాదు వచ్చాననుకుంటాను కానీ తిరుగాడేది మాత్రం ఆ ఊళ్ల లోనే . అది అనుభవైక వేద్యం.
అవును సార్
నిజమేనండి. బాధపడటం తప్ప ఏమైనా చేయగలనా అనుకుంటా..
నా బాధను మీ కవితలో చూసుకుంటూ..!ధన్యవాదాలు🙏
ధన్యవాదాలు మేడం
‘ఆ పాటల్లో అపారమైన నిశ్శబ్దం వినబడేది. ఇప్పుడు ఆ పాటలు మళ్లా ఎక్కడ వినగలను?’ .. ఓ హైకూ లా నన్ను చుట్టుకుంది
ధన్యవాదాలు సార్