పునర్యానం-13

పెద్దన మనుచరిత్ర కావ్యం మీద ఒకసారి ప్రసంగిస్తూ మా మాస్టారు ఒక మాట చెప్పారు. అదేమంటే ప్రతి కవికీ ఎప్పుడో ఎక్కడో ఒక గాయం కలుగుతుంది, ఆ గాయం నుంచే అతని కవిత్వం స్రవిస్తుంది అని. ఒక sense of loss అన్నమాట. పద్మ మాటల్లో చెప్పాలంటే ఒక loss of innocence కూడా . ఒక విధంగా ఇది రొమాంటిక్ కవుల వైఖరి. కానీ అనాదికాలం నుంచీ మనిషి తన స్వర్గాన్ని కోల్పోవడమే కవిత్వం పుట్టే వేళ అని కూడా మనం చెప్పవచ్చు. Paradise Lost. నీ చిన్ని స్వర్గం ఒకటి, నువ్వు పుట్టినప్పుడు నీ కూడా వెంట తెచ్చుకున్నది, నీ జీవితపు ఏ మలుపులోనో దాన్ని పోగొట్టుకున్నావు లేదా దానికి దూరమయ్యావు లేదా ఆ దారి తప్పిపోయావు. ఇక ఆ తర్వాత కాలమంతా దానికోసం వెతుకులాట మాత్రమే మిగులుతుంది.

నా జీవితంలో కూడా అటువంటి గాయం మా ఊరికి దూరం కావడం. నేను రెండుసార్లు మా ఊరికి దూరమయ్యాను. మొదటిసారి నా చిన్నప్పుడు చదువు కోసం ఆ ఊరు వదిలిపెట్టినప్పుడు. ఆ తర్వాత తిరిగి మళ్లా నా 22వ ఏట, అంటే 1985లో, మా కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలి పెట్టేసి వచ్చేసినప్పుడు.

ఒక ఊరికి దూరం కావడం అనేది మొదట్లో నాకు నా వ్యక్తిగత అనుభవంగా మాత్రమే కనిపించింది. కానీ తర్వాత కాలంలో ప్రపంచ కవిత్వం చదవడం మొదలుపెట్టాక ప్రతి ఒక్క చోట నిర్వాసితులకి కవిత్వమే ఏకైక ఆశ్రయం కావడం గమనించాను. సొంత ఊరికి, దేశానికి దూరమైన ప్రతి ఒక్క హృదయంలోనూ పలికే వేదనకీ, నా కవిత్వానికీ మధ్య నాకు తేడా కనిపించలేదు.

నిజానికి ఈ వేదన రామాయణ వేదన కూడా. అంత దీర్ఘ యానంతర్వాత, సంపూర్ణశత్రుసంహారం తర్వాత చివరికి రాముడు అనుకున్నదేమిటి? కన్నతల్లీ, సొంత ఊరూ స్వర్గం కన్నా గొప్పవనే కదా!

మా ఊరిని వదిలిపెట్టిన ఆ సెన్స్ ఆఫ్ లాస్ తో పునర్యానం రెండవ అధ్యాయం మొదలవుతుంది. అది ఒకవైపు పోగొట్టుకోవడం, రెండో వైపు పొందడం కూడా. ఎందుకంటే ఊరికి దూరమైతేనే కదా నువ్వు తక్కిన ప్రపంచానికి దగ్గర కావడం మొదలు పెడతావు. నీ స్వజనానికి ఎడమయినప్పుడే కదా ఇతరులని సొంత మనుషులుగా దగ్గరికి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుపడతావు.

‘నిర్వికల్పసంగీతం’లో నేను నా కవిత్వమంతా ఎల్లల్లేని homesickness నుంచి పుట్టిందే అని రాసుకున్నాను. ఆ తర్వాత వెలువరించిన ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ కవిత్వంలో తక్కిన ప్రపంచాన్ని నేను ఎట్లా సమీపించానో ఆ క్షణాల్ని పోల్చుకున్నాను. పునర్యానం రెండవ అధ్యాయంలో ఇవి రెండూ కలిసి ఉన్నాయి. ఒక home-sickness అదే సమయంలో world-sickness కూడా.


ఆ ఇల్లు వదిలి ఊరు వదిలి అమ్మానాన్న వచ్చేసిన రోజు
నన్నేదో ప్రగాఢ నిద్ర ఆవహించింది.

ఎడ్లబండిలో వేసుకొచ్చారు నా సామానంతా
వెంట తేలేకపోయారు వాళ్లా జామచెట్టుని, బత్తాయి­ నీడని, నేరేడు కొమ్మని
వదిలిపెట్టినప్పుడు వాళ్లా ఊరు
వదులుకున్నాయి వాళ్లని ఆ కొండలు, ఆ అడవి సంపెంగలు
ఆ ఏరు, ఆ చెరువు, ఆ రామకోవెల, ఆ అమ్మవారి దేవళం.

వాళ్లు వదిలిపెట్టిందొక ఇంటిని కాదు
ముంగిలిని, వదిలిపెట్టారొక పూలపందిరిని, వెదురుకంచె కట్టిన పొదరింటిని
ఇప్పుడా కిటికీల్లేవు, సందులో ఆ నందివర్ధనం లేదు
పెరటిదారుల ప్రవహించే వేసవి సాయంకాలాల గాలుల్లేవు.

ఉన్న ఊరిని వదలిపెట్టిన క్షణం ఒక జీవితం ము­గిసిపోయి­నట్టు
ఒక సంస్కృతి చెరిగిపోయి­నట్టు
నీ కాళ్ల కింద నేలనెవరో లాగేసారు,
ఆకాశం నీ నెత్తిన హఠాత్తుగా కుప్ప కూలింది

ఇప్పుడు ఆ సాయంకాల సంధ్యాకాంతులు నీ కోసం పరుచుకోవు
వైశాఖ అపరాహ్ణాల ఆ కృష్ణమేఘమాలికలిక నీ కోసం తరలిరావు

ఆ ఇంటిని వదిలి ఆ ఊరిని వదిలి ఆ ఎడ్లబండి పొలిమేర దాటినరోజు
అసలా రోజు ఒక్కటొచ్చిందనే తెలియదు
నేనా ముందు రాత్రి ఏ మందు తిన్నానో
ఏ చీకటిగుహకెగిరిపోయానో
ఏ అభిశప్త ఊరుపుల మీద తలవాల్చానో
మేలుకునేటప్పటికి ఆ ఇల్లు లేదు, ఆ వాకిలి లేదు
ఆ కలల శయ్య లేదు, ఆ మంత్రగవాక్షం లేదు.

(పునర్యానం, 2.1.15)


When my parents moved us out of our village,
I felt like I was asleep.

They hauled their luggage in a bullock cart.
Only hills, plants, streams, tanks, and the goddess remained.
There was no way we could carry the windows, the light, the plants, or the scent.
Paradise lost.

It was like leaving life behind.
As if a culture had been wiped out.
Under your feet, somebody pulled off the ground, and
The sky collapsed.

The morning light no longer spreads and
Summer afternoons no longer shower.

The cart left the village unaware of such a day.
It was as if I was sleeping in some cursed lap, eating opium.
It all vanished in a blink: the house, the yard, and
Forever, the magic window.

14-8-2023

4 Replies to “పునర్యానం-13”

  1. “ఎల్లల్లేని homesickness” ఎప్పుడూ కూడా వుంటుందేమో ఆ మంత్రగవాక్షాన్ని కోల్పోయినవాళ్ళకి.

    “ఇప్పుడు ఆ సాయంకాల సంధ్యాకాంతులు నీ కోసం పరుచుకోవు
    వైశాఖ అపరాహ్ణాల ఆ కృష్ణమేఘమాలికలిక నీ కోసం తరలిరావు“

Leave a Reply

%d bloggers like this: