పునర్యానం -12

తైత్తిరీయ ఉపనిషత్తు యజుర్వేదానికి సంబంధించింది. ప్రతి ఉపనిషత్తు ఏ వేదానికి అనుబంధంగా ఉంటుందో, ఆ వేదం తాలూకు చింతనని తాను కొనసాగిస్తుంది. యజుర్వేదం ప్రధానంగా యజ్ఞ ప్రధానం. యజ్ఞమంటే సమష్టి కర్మ, సమ్యక్ కర్మ. కాబట్టి తైత్తిరీయం కూడా కర్మ గురించిన చింతననే మరింత సూక్ష్మ స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళింది.

ఆ ఉపనిషత్తులో భృగువల్లి అనే అధ్యాయంలో ఒక కథ ఉంది. వరుణుణ్ణి ఆయన కొడుకు భృగువు బ్రహ్మన్ అంటే ఏమిటని ప్రశ్నిస్తాడు. అదేమిటో తపసు చేసి తెలుసుకొమ్మని చెప్తాడు తండ్రి. కొడుకు తీవ్రంగా తపస్సుచేసి తండ్రి దగ్గరకి వచ్చి నేను అన్నమే ఆ పరమసత్యమని తెలుసుకున్నాను అని చెప్తాడు. తండ్రి ఆ కొడుకు చెప్పినమాటలు విని తలూపకుండా, మళ్ళా తపసు చెయ్యమని చెప్తాడు. ఈ సారి భృగువు మరింత తపస్సు చేసి తండ్రి దగ్గరికి వచ్చి నేను ప్రాణమే సత్యమని తెలుసుకున్నాను అని చెప్తాడు.

పునర్యానం కావ్యంలో మొదటి అధ్యాయమంతా అన్నమే సత్యమని తెలుసుకోవడం తాలూకు అనుభవాలు అని చెప్పాను కదా. ఆ అన్నమయకోశాన్ని నేను పృథివితో సంకేతించాను. ఆ తర్వాత, ఆ సాధకుడు మరింత తపస్సు చేసి ప్రాణమే సత్యమని తెలుసుకోవడం రెండో అధ్యాయం. నేను ఆ అనుభవప్రపంచాన్ని అగ్నితో సంకేతించాను.

ప్రాణమంటే ఏమిటి? అగ్ని అంటే ఏమిటి? సమస్త కార్యకలాపం, కార్యశీల ప్రపంచం, క్రియాశీల జీవితం-వీటిని నేను ప్రాణమయ ప్రపంచానికి సంబంధించినవిగా భావించాను. చదువుకోసం నేను ఇల్లు వదిలి బయట అడుగుపెట్టడంతో మొదలై, నా చదువు, నా ఉద్యోగం, ఆ ఉద్యోగ జీవితంలో తిరిగిన ప్రదేశాలు, చూసిన మనుషుల్తో పాటు, అప్పుడప్పుడే ప్రపంచాన్ని చుట్టబెడుతున్న గ్లోబలైజేషన్ దాకా మొత్తం సామాజిక ప్రపంచాన్ని రెండో అధ్యాయంలో స్పృశించే ప్రయత్నం చేసాను. ఒకవేళ మొత్తం కావ్యమంతా ఈ ప్లేన్ లోనే రాసి ఉంటే అది నెరుడా రాసిన Canto General (1950) కావ్యంలాగా రూపొంది ఉండేది. కాని, నా అన్వేషణలో ప్రాణమయ ప్రపంచమే పరమసత్యమని అనుకునే పరిస్థితి లేదు కద!

ఈ అధ్యాయంలో మొదటి సర్గలో నా తాడికొండ అనుభవాల్ని చిత్రిస్తున్నప్పుడు మా ఆర్ట్ మాష్టారి గురించి రాయకుండా ఎలా ఉంటాను! వారణాసి రామ్మూర్తిగారనే ఆ ఆర్టుమాష్టారు మా స్కూల్లో రెండేళ్ళు కూడా లేరుగాని, ఆ నా పసిమనసు మీద ఆయన ముద్ర ఎంత గాఢంగా పడిందంటే, ఆయన ఆ రోజుల్లో నాకు తల్లీ, తండ్రీ కూడా. 1973-74 తర్వాత ఆయన్ని నేను మళ్ళా చూడలేదు. కాని తర్వాత రోజుల్లో మా తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి చిత్రలేఖనం రూపంలో ఆయనే నన్ను అక్కున చేర్చుకున్నారు.


తెల్లకాగితం పరుచుకుని కూచున్నప్పుడు
తోసుకొచ్చాడాయన దానిమీదకు కొండల్ని,
ఒక కొలనుని, దాని అంచున కొన్ని మెట్లని
తెచ్చాడాయన ఒక మట్టి దారిని, తెల్లగోడల ఒక ఇంటిని
ఒక కంచెని, ఒక తురాయి చెట్టుని.

ఎవరు చెప్పారో ఆయనకి, బెంగపెట్టుకున్న
పసి మనసు కోరేది పరీక్షల్ని కాదని,
ఒక సీతాకోకచిలకనని, రెండు రెక్కలనని
ఎగరదానికొక ఆకుపచ్చ మైదానాన్నని.

తీసుకొచ్చేవాడు ప్రతిరోజూ నా కోసమొక నావని,
ఒక నదిని, రంగులు పూచిన దీవుల్ని
ఎగరేసేవాడు నా నేత్రాలముందొక ఇంద్రచాపాన్ని
ము­సుగుతీసేసి కనిపించేవాడొక అమ్మగా, నాన్నగా.

(పునర్యానం, 2.1.9)

In the classroom, when I laid my notebook open,
He pushed a hill range onto it.
A lake, a path, a hut with white walls, and
A green fence with Gulmohar trees followed.

He knew a homesick child needed two wings.
Not boring lessons, but a wide field and a butterfly.

Every day he brought a boat, a river, coral islands, and
Spread a rainbow for me.
Taking off his persona,
He looked like my mother and father rolled into one.

13-6-2023

7 Replies to “పునర్యానం -12”

 1. పరమాధ్భుతమైన అనుభూతి…ఎంతో అందంగా పదాల్లోకి తెచ్చారు మాష్టారూ.మీకు వందనం.

 2. “ము­సుగుతీసేసి కనిపించేవాడొక అమ్మగా, నాన్నగా.”
  కలగా…కథగా…కల్పన గా…

 3. ము­సుగుతీసేసి కనిపించేవాడొక అమ్మగా, నాన్నగా.
  Ee vaakyam okkasaarigaa udvegaaniki gurichesindi!

  ‘కాని తర్వాత రోజుల్లో మా తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి చిత్రలేఖనం రూపంలో ఆయనే నన్ను అక్కున చేర్చుకున్నారు…’ anna maataki addam pattayi.
  Ee roju o chakkati kavithaanubhavam. Dhanyavaadalu sir!

 4. కవితలో శిల్పం చిత్రకళగా ఒదగటం అద్భుతం
  నీడబొమ్మకూ కన్నుల్లో నిలిచే బొమ్మకూ తారతమ్యం ఉంటుంది. కనులు మూసుకొని దృశ్యాన్ని తలుచుకుంటే కనిపించే అస్పష్ట చిత్రమే మీ కళాకృతి. అది పైనున్న పెయింటింగ్ లో కింద కవితలో కన్పిస్తున్నాయి.అనువాదం ప్రయోగాన్ని, ప్రయోజనాన్ని చక్కగా సూచించారు

Leave a Reply

%d bloggers like this: