
ఇప్పచెట్ల గురించి చిన్నప్పణ్ణుంచీ వింటూ ఉన్నా మొదటిసారి చూసింది మాత్రం గుమ్మలక్ష్మీపురం అడవుల్లోనే. పూసిన ప్రతి ఇప్పచెట్టూ ఒక మహోద్యమంలాగా ఉంటుంది. అలాగని తురాయిచెట్టులాగా ‘బాండుమేళం’ వినిపించదు. మాఘఫాల్గుణాల్లో తక్కిన అడవి అంతా శిశిరంలో కూరుకుపోయి ఉండగా, పూసిన ఇప్పచెట్టు మాత్రం తానున్నచోటు చుట్టూ యోజనం విస్తీర్ణం ఒక సూక్ష్మ సుగంధలోకాన్ని సృష్టిస్తుంది. ఇక ఆ దారినపోయేవారెవరుగాని, క్షణంపాటేనా అక్కడ ఆగకుండా ముందుకుపోవడం అసాధ్యం. ఇప్పసారా రుచిచూసినవారికైతే ఆ గాలి సోకితేనే చాలు, మాదకత సిద్ధిస్తుంది.
నిండుగా పూసిన ఇప్పచెట్టుమీద కవిత రాయాలని ఎప్పుడనిపించి ఉంటుంది? గుమ్మలక్ష్మీపురం మండలంలో టిక్కబాయి ఆశ్రమపాఠశాల దగ్గర్లో ఒక పెద్ద ఇప్పచెట్టు ఉండేది. అదిప్పటికీ నా కళ్ళముందు కనిపిస్తోంది. మూలిగూడ జంక్షను నుంచి గొరడ వెళ్ళేదారిలో రేగిడి కన్నా ముందు దుడ్డుఖల్లు మలుపు తిరిగే దారిపొడుగునా ఇప్పచెట్లే. ఆ దారుల్లో తిరిగినప్పుడు ఎన్నో తొలివసంతదినాల్లో, దినాంతవేళల్లో ఆ మధూకవృక్షాల మాదకపవనాలు నన్ను చుట్టుముడుతుండేవి.
రామాయణంలో రాముణ్ణి అడవి మరీ ముగ్ధుణ్ణి చేసిన తావులు రెండు. ఒకటి చిత్రకూటం. అప్పుడు రాముడి పక్కన సీత ఉంది. అదొక రమణీయ కాలం. (అయోధ్యాకాండ, 94 వ సర్గ). రెండో తావు కిష్కింధ దగ్గర పంపాతీరం. అక్కడ రాముడు అడుగుపెట్టినప్పుడే వసంతం కూడా అడుగుపెట్టింది. కాని అప్పుడు రాముడి పక్కన సీత లేదు. ఆ వసంతం తనని దహిస్తోందని గుర్తుపడతాడు రాముడు. ఆ వర్ణనతోటే (మొదటి సర్గ) కిష్కింధాకాండ మొదలవుతుంది. భారతీయ సాహిత్యంలోని వసంతఋతు వర్ణనల్లో దాన్ని మించిన వర్ణన నేనిప్పటిదాకా చూడలేదు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, ఈ రెండు తావుల్లోనూ కూడా ఇప్పచెట్టు కనిపిస్తుంది. ఏళ్ళ తరబడి అడవుల్లో తిరిగినవాడూ, ఎన్నో వసంతాల్ని దగ్గరగా చూసినవాడూ మాత్రమే అటువంటి వర్ణన చేయగలుగుతాడు. అందులో రంగులూ, రాగాలూ, విరహవ్యథా సరే- కాని అంతకన్నా కూడా, చిన్న చిన్న కదలికలు-వాటిని పట్టుకోడంలోనే మహాకవి కాంతారపరిజ్ఞానం నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది. ఈ శ్లోకం చూడండి:
పతితైః పతమానైశ్చ పాదపస్థైశ్చ మారుతః
కుసుమైః పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతః (కి.1.13)
(సౌమిత్రీ, నేలన రాలిపడ్డవీ, రాలుతున్నవీ, ఇంకా కొమ్మల్నే అంటిపెట్టుకున్నవీ అయిన పూలతో గాలులు ఎట్లా ఆడుకుంటున్నాయో చూడు)
మాఘమాసంలో విరబూసిన మామిడిచెట్లనీ, ఇప్పచెట్లనీ చూసినవాళ్ళకి మాత్రమే ఈ దృశ్యం ఎంత మనోహరమైదో అర్థమవుతుంది. మూడు కాలాల్నీ పుష్పమయం చేసిన కవిత ఇది. మరీ ముఖ్యంగా ఇప్పచెట్టుకింద నిలబడ్డప్పుడు, రాలినపూలు, రాలుతున్న పూలు, కొమ్మలకి అతుక్కుని ఉన్న పూలూ ఒక్కసారి కనిపిస్తాయి. కింద రాలిపడ్డ పువ్వు చెట్టుకి అతుక్కుంది చూడు అని సీతాకోక చిలుకని ఒక హైకూ కవి వర్ణించాడని మనకి తెలుసు. కాని ఇక్కడ పూలు రాలడం ఆగిపోతే కదా! ‘ పతితైః పతమానైశ్చ, పాదపస్థైశ్చ-‘ ఇది మామూలు దృశ్యం కాదు.
వసంతాన్ని పట్టుకోవడంటే, నీ రంగులపెట్టెలో ఉన్న రంగులన్నీ కుమ్మరించడం కాదు, ఆ చిన్న చిన్న కదలికల్ని పట్టుకోవాలి. ఈ శ్లోకం చూడండి:
విక్షిపన్ వివిధాః శాఖా నగానాం కుసుమోత్కటాః
మారుతశ్చలితస్థానైః షట్పదైరనుగీయతే (కి.1.14)
(పూలతో నిండి ఉన్న కొమ్మలు గాలికి ఊగినప్పుడల్లా ఆ పూలమీద ఉన్న తుమ్మెదలు కూడా లేచి ఆ గాలితో గొంతు కలుపుతున్నాయి)
ఒకసారి ఈ పద్యం చదివాక, ఈ దృశ్యం మనసులోంచి చెరగడం అసాధ్యం. అడవిలో వసంతాన్ని చూసినవెంటనే రాముడు వర్ణించిన దృశ్యమిది. ఆ వసంతం తనని అగ్నిలాగా దహిస్తోందని గుర్తుపట్టిన కొంతసేపటికి ఆయన చెప్పిన మరొక శ్లోకం చూడండి:
రుచిరాణ్యపి పుష్పాణి పాదపానాం అతిశ్రియా
నిష్ఫలాని మహీం యాంతి వనానాం మధుకరోత్కరైః (కి.1.45)
(ఈ పూలు ఎంత అందంగా ఉన్నా, చెట్ల అందాన్ని ఎంతగా ఇనుమడిస్తున్నా, తేనెటీగల్తో కూడి నిష్ప్రయోజనకరంగా నేలరాలుతున్నాయి)
నిష్ప్రయోజనం అనే మాట ఎందుకు వాడాడంటే పక్కన తన ప్రియురాలు లేదు కాబట్టి. ఆ పూలు పూస్తున్న దృశ్యం నిష్ఫలమయినట్టే. ఎందుకంటే, ఆమెనే గనుక పక్కన వుంటే, ‘తనని పిలిచి మరీ ఆ అందాలు చూపించి మహానందపడి ఉండేది’ ( ‘మామాహూయ, ప్రముదితా పరమం ప్రత్యనందత’, కి.1-25)
ఈ రెండు కదలికలూ- గాలికి కొమ్మలు ఊగినప్పుడు పూలమీంచి తుమ్మెదలు కూడా లేవడం, గాలికి పూలు రాలుతున్నప్పుడు తేనెటీగలు కూడా రాలిపడుతుండటం- ఇటువంటి కదలికల్ని చూడగలిగిన కవులు మరీ ఏమంతమంది లేరు. ఎప్పుడో యుగాల తర్వాత కృష్ణదేవరాయలు తప్ప (చూ.ఆముక్త మాల్యద, 5-137)
ఈ కవితలో ‘పువ్వు నుంచి పట్టుకు చేరేలోపే మత్తెక్కి కూలుతున్నాయి మధుపాలు’ అనే వాక్యం రాసినప్పుడు రామాయణ వర్ణన నాకు తెలియదు. కానీ ఆ వర్ణన చదివినప్పుడు, నాకు కూడా ఇటువంటి ఊహ కలిగినందుకు నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను.
ఇక ఎడిసింగ్ అంటే సవర వాళ్ళ ఇళ్ళల్లో గీసే ఒక క్రతు చిత్రం. వాళ్ళ ఇళ్ళల్లో దేవుణ్ణి పెట్టుకునే మూల గోడమీద గీసే ఆ రంగుల చిత్రంలో వాళ్ళ కాస్మోస్ మొత్తం ఉంటుంది. అక్కడికి పితృదేవతల్ని ఆహ్వానిస్తారు, ఆవాహన చేస్తారు. ఈ కవితలో ఊహ ఏమిటంటే, అలా ఒక ఇంటికి పితృదేవతల్ని ఆహ్వానించినప్పుడు వారు దారిలో నిండుగా పూసిన ఇప్పచెట్టుని చూసి అంతకన్నా మించిన నివేదన మరేముంటుంది అని అనుకుని అక్కడే ఆగిపోయారనడం. ఎడిసింగ్ ఎలా ఒక క్రతుచిత్రమో, నిండుగా పూసిన మధూకం కూడా అలాంటి క్రతుచిత్రంలానే ఉందనే భావన కూడా.
అనువాదానికి నాకు చుక్కలు చూపించింది ఈ కవిత. కానీ ఆ ఇప్పచెట్టుని మీకు చూపించకుండా ముందుకు పోడం కూడా నాకిష్టం లేదు.
మాఘమాసపు అడవిలో విప్పారింది ఇప్పచెట్టు
అతల సుతల రసాతలాలన్నీ కదిలిపోయాయి.
తూర్పు కనుమల మెట్లు దిగి నడిచివచ్చారు యక్షులక్కడికి
రాలిన ప్రతి పువ్వొక మధుభాండమని మురిసిపొయ్యారు
నేలన విచ్చిన ప్రతి పువ్వు చుట్టూ తీపిగూడొకటి అల్లింది గాలి
లోయలో యువతికేదో సంకేతమందింది.
పువ్వు నుంచి పట్టుకి చేరేలోపే మత్తెక్కి కూలుతున్నాయి మధుపాలు
పయనమయ్యారా దారిన పూర్వ సవర జాతి పితామహులు
ఏ కొత్తగోడనో ఎవరో సవరపూజారి ఎడిసింగ్ చిత్రిస్తూండచ్చు
నివేదన ఇంతకుమించినదేముంటుందని స్పృహతప్పిపొయ్యారక్కడే.
(పునర్యానం, 1.3.15)
As the Mohua burst into bloom
A buzz swept up and down the seven worlds.
As the Yakshas crossed the Eastern Ghats,
Every flower becomes a honey pot for them.
Around each flower, sweet air crafted a nest, and
The scent filled the village with delight.
Before reaching the next flower,
The bees drooped down drunk.
The village had a seasonal ritual, and
Prayers were offered to forefathers.
When their ancestors came down to the village,
Mohua was in full bloom.
They weren’t expecting more, and
Offering finished.
4-8-2023
“ఆ గాలి సోకితేనే చాలు, మాదకత సిద్ధిస్తుంది.”
అబ్బ… ఏమి పద బంధ సౌరభం!
ఇక రోజంతా … ఇప్ప పూవు తాలూకు తీపి!
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
ఇదో నవలోకం
వనలోకం
.పావనలోకం.
రసప్లావిత హృల్లోకం.
కవి
తుమ్మెదైపోవాలి
ఆస్వాదించావాలంటే
ఇప్పపూలగాలి
మళ్లీ
తెమ్మెరైపోవాలి
అందించాలంటే
ఆ మధూక పుష్పాల సోయి
తీర్చలేనిదీ సాహిత్యఋణం
🙏
ధన్యవాదాలు సార్
నమస్తే సర్
ప్రతీ వాక్యం ఒక మాధూక పుష్పం..సుగంధం
ధన్యవాదాలు మేడం
ప్రతి వ్యాసం ఒక రసగుళిక… ఇప్ప పూల లక్షణం మీ వ్యాసాలకు ఉంది. చదివిన పాఠకునికి ఆ రోజంతా మత్తే.
ధన్యవాదాలు సార్
అమాంతం ఆ ఇప్పపూల చెట్లమధ్య నిలబడినట్టనిపించింది. మా తోటలో ఇంటికి కాస్తంత దూరంలో ఇప్పచెట్టుండేది. ఆ బాల్య ఙ్ఞాపకాలు చుట్టుముట్టాయి.
మీ ఆంగ్లానువాదంలో ‘పువ్వు నించీ పట్టుదాకా’ అనలేదేమి?
ధన్యవాదాలు మేడం.
అవును. అనువాదంలో కొన్ని అందాల్ని వదులుకోక తప్పదు.
Reading this makes me feel so good, sir. Thank you.
Thank you.
స్పృహతప్పలేదంతే !
ధన్యవాదాలు సార్
మీ subject ఇప్పచెట్టు references వున్న రామాయణ శ్లోకాలని పరిచయం చేసి, వాటికి అర్థం చెప్పి, subtle expressions ని తెలియజెప్పి, సవరల గరించి వాళ్ళ rituals గరించి చెప్పి, మీ కవితలో విరగబూసిన మధూకవృక్షాన్ని చూపించడం, those expressions about ancestors stopping at the tree, and మధుపాలు మత్రెక్కి రాలడం super, sir!
ఆ తావుల్లో తిరిగి ఆ దృశ్యాల్ని చూసినట్లుంది.
Thank you for this beautiful post.
ధన్యవాదాలు మాధవీ!
This Punaryanam series is itself a lesson to Translators!
‘They weren’t expecting more, and
Offering finished’
These lines are wonderful. And- for
‘పువ్వు నుంచి పట్టుకి చేరేలోపే మత్తెక్కి కూలుతున్నాయి మధుపాలు’
‘Before reaching the next flower,
The bees drooped down drunk’ is extra ordinary.
It tells we needn’t do an word to word translation, slight change is acceptable sometimes make it simpler and sweeter!
Thanks for this sir!
Thank you so much.
Every poem is a challenge for me when I sit down to translate.
These liberties are possible only when the poet himself undertakes the translation. Otherwise the translators would feel diffident in negotiating with the original text.