పునర్యానం-9

మా పెద్ద చెల్లెలు రమణశ్రీ. చిన్నప్పుడు నేనూ, మా భద్రం అన్నయ్యా ఆమెను మా ఊళ్లో వజ్రమ్మ పంతులమ్మ గారి దగ్గర తీసుకు వెళ్లినప్పుడు ఈమె ‘పాపాజీనా?’ అన్నారు. అలా ఆమె పేరు పాపాజీగా స్థిరపడిపోయింది. పాపాజీ కూడా మా అక్కదారిలోనే రాజమండ్రి లో సదనంలో చదువుకుంది. భాషా ప్రవీణ చేసింది. అయితే అప్పటికి ఆ కోర్స్ ని బి ఎ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అని అనడం మొదలుపెట్టారు. ఆమె వరంగల్లో తెలుగు పండిట్ ట్రైనింగ్ అయింది. ఆ రోజుల్లో గోపగాని రవీందర్ ఆమెకు అక్కడ సహాధ్యాయి. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

అది మా ఇంట్లో మొదటి కులాంతర వివాహం. మా నాన్నగారికి తెలిస్తే అడ్డుపెట్టి ఉండకపోవచ్చు ఏమో కానీ అంగీకరించకపోయి ఉండవచ్చు కూడా. అందుకని మా అక్క మా నాన్నగారికి చెప్పకుండా తనే దగ్గరుండి ఆ పెళ్లి చేయించింది. ఆ పెళ్లి నేను నా జీవితంలో చూసిన వివాహ వేడుకల్లో అత్యంత ఆదర్శవంతమైన వివాహ వేడుక. ఆ రోజు ఆ పెళ్లికి మా చెల్లెలు తరఫున మా అక్కా, మా పెద్దన్నయ్యా, నేనూ, మా రెండో చెల్లెలు బుజ్జీ ఉన్నాం. పెళ్ళికొడుకు తరపున ఒకరిద్దరున్నారు. మా అక్క వాళ్ళ ఇంట్లో హాల్లో రెండు చాపలు పరిచింది. వాటి మీదనే ఆ వైపు పెళ్లి వారూ, ఈ వైపు పెళ్లి వారూ కూడా కూర్చున్నారు. ఆ పిల్లవాడు మా చెల్లెలికి తాళి కట్టాడు. ఇద్దరు ఒకరి తల మీద ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. నేను వైతాళికులు లోంచి నచ్చిన కవిత్వం చదివి వినిపించాను. ఆ కవితలే మంత్రాలు. అంతే! పెళ్లి అయిపోయింది.

తర్వాత మా పెద్దన్నయ్య ఆమెను తీసుకుని వెళ్లి వరంగల్ దగ్గర తిమ్మాపూర్ లో వాళ్లతో కొత్త కాపురం పెట్టించాడు. ఆ తర్వాత మా చెల్లెల్ని చూడటానికి నేను కూడా ఒకసారి ఆ ఊరు వెళ్లాను. అప్పటికి ఆ పిల్లలిద్దరికీ ఉద్యోగాలు లేవు. ఆ రోజుల్లో నేను వాళ్ళని చూసినప్పటి క్షణాలే ఈ కవిత.

ఈ కవిత రాసిన రోజుల నుంచి వాళ్ళిద్దరూ చాలా దూరం ప్రయాణించారు. ఇప్పుడు గోపగాని రవీందర్ మంచిర్యాల జిల్లాలో హైస్కూల్ ఉపాధ్యాయుడు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కవి, విమర్శకుడు. సుద్దాల అశోక్ తేజ కవిత్వం పైన డాక్టరేట్ చేసాడు. నా చెల్లెలు ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దిన తెలుగు పండితురాలు. మా ఇంట్లో మా అక్క తర్వాత తెలుగు బోధించే అదృష్టం ఆమెకే దొరికింది. వాళ్ళ పిల్లవాడు గోపగాని స్నేహసాగర్ ఈ మధ్యనే అమెరికాలో బఫెలో యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టాపుచ్చుకున్నాడు. రానున్న కాలంలో ఆ పిల్లవాడు సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక అంతర్జాతీయ నిపుణుడు కాగలడని నాకనిపిస్తున్నది.

ఇప్పుడు ఈ కవిత చూడండి.


మోదుగ చెట్ల అడవి వెనక నా చెల్లెలి ఊరు
ఎర్రపూల తోవని పట్టుకుని వెళ్లానా ఊరు.

ఒక రోజంతా ఉన్నాను, పలకరించింది చెల్లి
కుశలం అడుగుతున్నాయి మధ్య మధ్య కన్నీళ్లు
ఒక పూట ఆమె పెట్టిన అన్నం తిన్నాను
అమ్మ ఇచ్చిన మిఠాయి­ అప్పగించాను.

ఊరంతా ఫాల్గుణమాసపు తీరిక
గడిపానో మధ్యాహ్నం సోమరిగా, ఎవరిదో
ఒక కుతూహల పరామర్శ, అన్న కోసం ఆ మధ్యాహ్నం
నిద్ర వాయిదా వేసింది చెల్లెలు.

కుండల్లో ఇంకా గింజలున్నాయి­
గడుస్తాయి కొన్ని దినాలని ఒక ఊరట.
మళ్లీ వస్తానన్నాను, పడవు ముందుకి అడుగులు
తిరగలేను వెనక్కి, చూడలేను ఆ మోదుగలు.

(పునర్యానం, 1.3.5)


After crossing Palasa forest my sister’s place
I once followed the trail of red flowers to visit her.

My sister welcomed me. I spent a day there.
As she inquired, tears filled her eyes.
We had lunch together and I gave her sweets
Sent by our mother.

In the village, March was leisurely.
Chatting with a neighbor idled my afternoon.
In order to care for me, my sister skipped a nap.

I checked and rations haven’t run out, and
Hopefully, they’ll have enough.

I took leave from her but couldn’t leave.
Neither could I step back nor see the flowers.

4-8-2023

10 Replies to “పునర్యానం-9”

  1. మోదుగపూలు అనగానే దాశరథిరంగాచార్య వరంగల్లు సంకేతించాయి. పడవు ముందుకు అడుగులు తిరగలేను వెనక్కి చూడలేను ఆ మోదుగలు -చెప్పలేని ఎన్నో భావాల్ని వీపున మోసే వాక్యాలవి. నేపథ్యం తెలిసిన కవితా మాధుర్యం ప్రత్యేకం. అది కవిత్వ పటుత్వాన్ని తెలుపుతుంది.

  2. మేధస్సును జాగృతం చేసేవి మీ అక్షరాలు.
    ఇప్పుడు కొత్త జ్ఞానం ఏమీ అవసరం లేదు.
    అందుకేనేమో ఇప్పుడు మీ అక్షరాలు హృదయంలోనే తిష్ఠ వేస్తున్నాయి.
    నేను ఆ వరంగల్లో ట్రైనింగ్ అయ్యాను
    అదే తిమ్మాపూర్ లో నవోదయలో ఐదేళ్లు అక్కడ ఉద్యోగ జీవితాన్ని పొందాను.
    ఆ మోదుగులు ఇ ప్పటికి హృదయంలో ఇంకా ఎర్రగానే వికసిస్తున్నాయి.
    కవి మిత్రులు గోపగాని రవీందర్ గారికి అభినందనలు.

  3. నాకు కూడా ఆ వరంగల్లు విద్యా కళాశాల నే అన్నం పెట్టింది.

    గమ్యం ఏమిటో తెలియని అయోమయంలో భద్రకాళీ మాత
    తన అమృత హస్తాన్ని అందించి భద్రంగా చదువుల తల్లి ఒడికి చేర్చి
    ఒక మనిషిని చేసింది.

    నేను AHS, Kawal లో పని చేసినప్పుడు గోపగాని రవీందర్ గారు అక్కడ UPS లో తెలుగు పండిట్ గా పనచేస్తున్నారు.ఆ విధంగా వారు నాకు కొద్ది పాటి
    పరిచయం.
    ఒక రోజు రాత్రి మీ చెల్లి ని ఉట్నూర్ కు పంపించడానికి మీరు MGBS వచ్చారు. 5,6, సంవత్సరాల తరువాత (మీరు పాడేరు, శ్రీ శైలం లో పనిచేసి హైదరాబాద్ చేరుకున్నాక) కలిసిన
    నన్ను ఆప్యాయంగా పేరు పెట్టి పలకరించారు.
    మీ జ్ఞాపక శక్తి కి
    నా అంతరాంతలలోనే నమస్కరించుకుని ,మీరు కలిసినందుకు ఎంత పులకరించి పోయానో….
    శుభ విభావరి sir.

  4. ఆదర్శవంతమైన వివాహం అన్నది ఒక కోణమైతే ,మీ అక్కగారి మాటల్లోనే అత్యంత ఆహ్లాదకరమైన వివాహం .పెళ్లికి ఇంతకన్నా ఏం కావాలి ?

Leave a Reply

%d bloggers like this: