పునర్యానం-8

పునర్యానం మొదటి అధ్యాయంలో కేవలం మా ఊరికి చెందిన విషయాలు మాత్రమే కాదు, నేను బాహ్య ప్రపంచంలో సౌందర్యాన్ని ఎక్కడెక్కడ చూసి ఉంటే ఆ తావులన్నీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను.

నా అదృష్టవశాత్తు నాకు గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం దొరికి ఉద్యోగ జీవితం తొలి కాలంలోతూర్పు కనుమల్లోనూ, నల్లమలల్లోనూ, అదిలాబాదు అడవుల్లోనూ తిరిగే అవకాశం లభించింది. 1985 లో మా ఊరూ, అడవీ, కొండలూ దూరమయ్యాక నాకు భగవంతుడు 1987 నుంచీ మరెన్నో ఊళ్లూ, అడవులూ, కొండలూ కానుక చేశాడు. ఉద్యోగంలో భాగంగా ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ఆ అడవుల్నీ, కొండల్నీ అట్లా విభ్రాంతితో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవాడిని.

నన్నట్లా అపారంగా సమ్మోహ పరిచిన దృశ్యాల్లో పాడేరు అడవుల్లో వసంతం వచ్చే సమయం కూడా ఒకటి. పాడేరు అడవుల్లో నేను రెండు వసంత కాలాలు ఉన్నాను. మొదటి వసంతకాలం నాకు అంతగా తెలియలేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికే ఫిబ్రవరి గడిచిపోయి మార్చి నెల మొదలవుతోంది. కానీ రెండో వసంత కాలాన్ని చాలా దగ్గరగా చూసాను. మాఘమాసం అంతా ఆ అడవులు కొండలు ఎండిపోయి అట్లాంటి ధూమ వర్ణ కాననంలో చిత్రకారుడు కుంచె విదిలించినట్టు అక్కడక్కడ నాలుగు పసుపు రంగు చుక్కలు కనిపించాయి. చిత్రకారుడు ఆ దిగంతమనే కాన్వాస్ పైన తన చిత్రలేఖనాన్ని ఓపిగ్గా, ఉత్సాహంగా పూర్తిచేస్తూ వచ్చినట్లుగా వసంతం అడవిని అల్లుకోవడం చూశాను. పాడేరు అడవుల్లో గిరిజనులు జరుపుకునే చైత్ర పండగ కూడా ఒక్కరోజు పండగ కాదు. దాన్ని ఇటిం పండగ అంటారు. అది అడవికి ఒక కొసన మొదలై నెల రోజులపాటు ఒక ప్రవాహంలాగా మరొక కొసకి నడిచేది. ఆ అందాన్ని, ఆ సంతోషాన్ని వర్ణించాలనిపించేది గాని, ఎలా చిత్రించాలో నాకు మాటలు దొరకలేదు.

ఏళ్ల తర్వాత ఆ దృశ్యాన్ని ఇలా పట్టుకోడానికి ప్రయత్నించాను. నేను రాసిన కవితల్లో నాకు చాలా ఇష్టమైన వాటిలో ఇది కూడా ఒకటి.


అడవి చిగురించిన కథ అంత సులభం కాదు చెప్పడం.
కవి అంతరంగానికి మన హృదయానర్పిస్తే బోధపడవచ్చునేమో,
బహుశా, ఆ రహస్యం.

ఒకప్పుడా ఆవరణలో బొమ్మల పోటీ జరిగింది, ఎక్కడెక్కడి వర్ణతపస్సులకీ
వెళ్లింది పిలుపు.
అందరి కన్నా ముందు నీటిరంగుల చీనా చిత్రకారుడి వంతు
బూడిదరంగు పరిచిన శిశిరధూమం మధ్య గుర్తుపట్టాడతడొక వేణువనాన్ని
ఆ కొమ్మలకు లేత ఆకుపచ్చతో పసుపు దిద్దాడు,
వేలాడుతున్న పొడవాటి ముదురాకుపచ్చ గీతలు గీసాడు, నేపథ్యానికద్దాడొక
పలచని మంచుతెరని
‘శభాష్‌’ అంది మాఘమాసపు గాలి

జీవితమొ­క ప్రార్ధనగా, కాలమొ­క దీవెనగా వచ్చారప్పుడు అజంతా చిత్రకారులు
గాలిని కుడ్యం చేసి వంపు తిరిగిన లోతుల్ని గుహగా మలిచి
దిద్దారు వెలుగునీడలు, మిగిలిన కాంతి కుమ్మరించారు గోడలమీద.

తెప్పల మీద మహాసాగరాల్ని దాటుతూ వచ్చారక్కడికి షెజానెలు, గాగిన్లు
అరచేతులంత పుష్పదళాలతో, రసం చిప్పిల్లే అరుణ, హరిత ఫలసము­దాయంతో

అప్పుడొచ్చాడు ఆఫ్రికా కాననాల ఆదిమ మంత్రవర్ణ మహాలేఖకుడు.
బండల మీద పచ్చిక పూసాడు, కొండల మీద నీలిమనద్దాడు
ఒక్క రేఖతో కదిలింది వాటి నడుమ తెల్లగీతలకొండవాగు,
ఆదిమ మానవరహస్యాల జాడనిపట్టిస్తూ తేనెటీగలక్కడక్కడ.

చిత్రకారుల వర్ణరాశి మారింది తీగలుగా, పూల పొగలుగా, మరకత పరాగంగా,
న్యాయనిర్ణేతలు తలపంకించలేదు, వెలితి ఏదో మిగిలిందింకా.

ఎక్కణ్ణించి వచ్చిందో అప్పుడొక కోయి­ల, మహిమాన్విత చిత్రకారిణి
దిద్దిందొక రాగాన్ని తన గళమొ­క కుంచెగా, ఆ వెనువెంట సమకూర్చింది
ఫలాలకు ఫలత్వాన్ని, పుష్పాలకు సుగంధాన్ని, అడివికి వసంతాన్ని.

(పునర్యానం, 1.2.15)


Spring in the forest is difficult to describe.
Perhaps you need a poem.

Once, artists competed to paint spring.
The Chinese painter had the first turn.
He saw a bamboo grove in the winter’s ash
Painted lemon yellow on the stalks, then dark green.
On the backdrop, a dew curtain.
‘Good job’! The wind whispered.

Ajanta painters next.
To them, life was a blessing and time a prayer
They carved walls out of the wind and caves out of curves.
Light flooded the frescoes.

Across the ocean, the Cezannes and Gauguins arrived
With apples and flowers.
Matchless yellows and radiant reds.

From the African tropics came a magic painter
He painted grass on rocks and blue on hills
With one stroke, he created a stream.
The ancient world came to life with beehives.

Painters turned their palettes into flowers, pollen, and honey.
But the panel didn’t nod. Something still remained.

And then came the cuckoo, the greatest artist.
Her singing completed the painting
Making sprouts lucent, flowers fragrant, and forests vibrant.

4-8-2023

13 Replies to “పునర్యానం-8”

 1. నమస్తే sir

  కోకిల అల్లిన రాగం…బాగుంది

 2. ప్రకృతి ఆరాధన పరమేశ్వరోపాసనే .
  రవీంద్రుని కలానికి కుంచెకు బలం ఆ అపూర్వ ధ్యానమే.రవికవిని ఆవాహనం చేసుకున్న కవిరవి మీరు .

 3. సర్, “వసంతం అడవిని అల్లుకోవడం” అనే మనోహర దృశ్యాన్ని మాకూ చూపించినందుకు ధన్యవాదాలు.

 4. మేము చూడలేని ప్రపంచం ఎంత సుందరంగా… హృద్యంగా చిత్రించారు! అడవి పాడిన వసంత రాగం లో కరగి పోయాను.

 5. “గాలిని కుడ్యం చేసి వంపు తిరిగిన లోతుల్ని గుహగా మలిచి
  దిద్దారు వెలుగునీడలు” వాహ్!!🙏

 6. ఇలాంటి దృశ్య చిత్రణ, దృశ్య గమనింపు మీకే సాధ్యం గురువు గారూ

Leave a Reply

%d bloggers like this: