పునర్యానం-7

మనుషులకు ఉన్నట్టే జాతులకు కూడా శైశవాలు ఉంటాయి. కల్లా కపటం లేని ఒక కాలం ఉంటుంది. ప్రతి జాతికీ ఒక సత్యయుగపు జ్ఞాపకం ఉంది. ప్రతి ఇతిహాసకారుడూ ఏమి చేస్తే తన జాతిని తిరిగి ఆ కృతయుగానికి తీసుకుపోగలనా అనే తపించాడు. అటువంటి నిర్మల, నిష్కల్మష కాలాన్ని నా చిన్నప్పుడు మా ఊళ్ళో చూసాను. ఆ తావుల్ని ఎన్ని వీలైతే అన్నిట్ని పునర్యానం మొదటి అధ్యాయంలో కవితలుగా మార్చడానికి ప్రయత్నించాను.

మా ఊరిని తలుచుకోగానే ముందు నాకు ఒక్క వెలుగు గుర్తొస్తుంది. ఆ వెలుతురుతోపాటు నీడలు కూడా గుర్తొస్తాయి. నిజానికి ఆ నీడలే ఆ వెలుగును పట్టిస్తూ ఉంటాయి.

నేను రాజమండ్రిలో పనిచేసిన కాలంలో మా టెలిఫోన్ రెవిన్యూ ఆఫీసు చాలా కాలం పాటు గాంధీపురం లో ఉండేది. మా ఆఫీస్ వెనక వీరేశలింగం గారి తోట ఉండేది. తోట అంటే చెట్లు ఉండేవి కావు, విస్తారమైన ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలం చుట్టూ కొంత ప్రహరీ కూడా ఉండేది. మరో పక్కన ఉమెన్స్ కాలేజీ ఉంది. ఆ తోట పక్క నుంచి గాంధీపురానికీ, దానవాయిపేటకీ మధ్యమనుషుల రాకపోకలు నడుస్తూ ఉండేవి. ఆ మట్టిదారి దానవాయిపేట వైపు వెళ్లే మలుపులో నాలుగైదు చెట్లు, చింత చెట్లో, వేప చెట్లో ఉండేవి. ఆ చెట్ల కింద అపరాహ్ణవేళల్లో వేళల్లో ఒక కుక్కపిల్లనో, మేక పిల్లనో, లేగ దూడనో మాగన్నుగా పడుకుని ఉండేది.

నేను రాజమండ్రిలో ఉన్నంతకాలం రెండు జీవితాలు జీవించేను. ఆఫీసులో ఆ గుమాస్తా ఉద్యోగం చేస్తున్నంతసేపూ నాకు గొగోల్ ఓవర్ కోటు తొడుక్కున్నట్టే ఉండేది. మరొక జీవితం స్వాప్నిక జీవితం. గోదావరి ఒడ్డున తిరుగుతున్నంత సేపూ, నేను కూడా టాగోర్ లాగా ఒక శాలువా కప్పుకుని, పద్మా నది ఒడ్డున తిరుగుతున్నట్టే అనుకునేవాణ్ణి. నేను ఆఫీసులో ఉండే సమయంలో ఆ ఉద్యోగం, ఆ జీవితం మరీ ఊపిరాడనివ్వకుండా ఉక్కపోతగా ఉన్నప్పుడు మా ఆఫీస్ మేడ మీద వెనక్కి వెళ్లి నిలబడేవాణ్ణి. అక్కడి నుంచి దూరంగా ఆ చెట్ల కింద మధ్యాహ్నవేళల్లో విశ్రాంతి తీసుకునే కుక్కపిల్లనో, మేక పిల్లనో కనిపించేది. ఆ నీడలో అలా మాగన్నుగా పడుకుని ఉండే ఆ మూగజీవాన్ని చూస్తో అలా ఎంతసేపు నిలబడిపోయి ఉండేవాణ్ణో చెప్పలేను. కళ్ళు అరమోడ్చుకున్న ఆ లేగ దూడని అలా చూస్తూండడం నాకు చెప్పలేని సాంత్వన కలిగిస్తూ ఉండేది. బహుశా నా చిన్నప్పుడు మా ఊళ్లో నేను చూసిన నీడలూ, నిశ్శబ్దపు తావులూ నాకు అనుభవంలోకి తెచ్చిన వెలుగు ఏదో ఆ వేళల్లో మళ్లా అనుభవానికి వస్తూ ఉండేది అనుకుంటాను.

ఈ కవితలో అప్పటి ఆ నిశ్శబ్దాన్ని, వెలుగుని పట్టుకోడానికి ప్రయత్నించాను.


కొండవాగుని తెల్ల మద్ది కావలించుకున్న ఒంపులో
వెచ్చని చేతుల నీళ్ల గుమ్ము, తల నిండా వెలుతురు దుమ్ము
పాటగాడు పాట మధ్యలో ఊపిరి కోసం ఆగినట్టు
ప్రవాహ మధ్యంలో రసవత్తర విరామం.

పరుచుకున్న ఇసుకతిన్నెల మీద తొలి గ్రీష్మం అడుగుజాడలు
వేల చేతులూపుతూన్న అభినందనల మైదానం అప్పటికది
ఎండాకాలాల పగటినిద్ర, సోమరితనాల జారుడుబండ
మోకాళ్లు ముడుచుకున్న నీటిమునక, ఒక తూనీగ ఆకతాయి­ వేడుక

అలలు అలలుగా మా చుట్టూ ఏరు చేస్తున్న అల్లరి
గాలిదేవతలెవరో అక్కడ వస్త్రాలు విడుస్తున్న సవ్వడి
కాలవగట్టు అవతలి నీడలో గంధర్వుల రథాలేవో ఆగిన కలకలం
దూరంగా చెట్టు నీడ ఒక లేగ మధ్యాహ్నాన్ని నిద్రబుచ్చుతోంది

ఊరిని కమ్మిన నిశ్చింత, నిద్రిస్తున్న కొండలు
పగటికలల్తో ఎగిసిపడుతున్న పడుచుపక్షం,
ఇక రావలసిన అతిథులెవరూ లేరు, చెయ్యకుండా మిగిలిన పనుల్లేవు
తీరిక చూసుకుని ఆకాశం మరే లోకానికో పయనమయ్యింది.

(పునర్యానం, 1.2.14)


Around the roots of a tall Arjuna tree,
A small pool of water entwines like a small pause in a song
In its sweet embrace, children swim
Over their hair, light falls like white dust.

Footprints of summer on the sandbank
As if thousands of hands are cheering on a playing field.
The siesta of summer noon, the seesaw of laziness
A long dip in the pool, and a dragonfly game.

With a mischievous murmur, the streamlet flows by,
As if the water nymphs changed their dresses there.
Celestial cars must be halting on the other side, and
To make the noon sleep, a calf sings a lullaby.

The village is cocooned in comfort, the hills are dozing.
The youthful heart is filled with daydreams
There will be no more guests today, no tasks to complete
The sky takes a leisurely stroll.

3-8-2023

7 Replies to “పునర్యానం-7”

 1. ఇక రావలసిన అతిథులెవరూ లేరు, చెయ్యకుండా మిగిలిన పనుల్లేవు
  తీరిక చూసుకుని ఆకాశం మరే లోకానికో పయనమయ్యింది.

  Sweet Melancholy!
  “రాకోయీ అనుకోని అతిధి …ఈ వేళ కాని వేళ ”
  పాట మంద్రంగా వినబడుతోంది…సర్

  ఆదివారం… ధన్యం

 2. పాత బంగారు లోకం!
  మళ్ళీ కావాలి సొంతం!!
  ఏటి ఒడ్డున ఆటలు!
  తీపి జ్ఞాపకాల ఊటలు !!

 3. ‘నీడలే వెలుగును పట్టిస్తూ ఉంటాయి’. రంగులమయం కావాలనుకునేవారు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం

 4. మీరు గొప్ప ప్రదేశాలలో తిరిగారా, మీరు తిరగడం వలన అవి గొప్ప ప్రదేశాలుగా మారాయా

  ఎప్పటికీ తేలని లెక్క గురువు గారూ

Leave a Reply

%d bloggers like this: