పునర్యానం-6

చిన్నప్పుడు అన్నీ ఆశ్చర్యమే అని రాశారు దీవి సుబ్బారావు గారు. చిన్నప్పుడు మనం ప్రతి ఒక్కటీ ఆశ్చర్యంగా పరికిస్తాం. బహుశా అప్పుడు మన మనసు మీద ఎలాంటి పూర్వానుభవాల ముద్రలూ ఉండవు కాబట్టి, మన మనోఫలకం మసకల్లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి, బాహ్య ప్రపంచపు వెలుతురు అంత స్పష్టంగానూ మన అంతరంగంలో ప్రతిఫలిస్తుంది. పెద్దయ్యే కొద్దీ మనం ప్రపంచాన్ని రకరకాల కళ్ళద్దాలతో చూడటం మొదలుపెడతాం. వినడానికి కూడా మనకి తెలియకుండానే రకరకాల ఫిల్టర్లు వాడడం మొదలు పెడతాం.

తర్వాత రోజుల్లో జీవితంలో నాకేమైనా బాధాకరమైన అనుభవాలు తటస్తిస్తూ వచ్చినప్పుడు వాటి ఒత్తిడి నుంచి బయటపడడానికి నేనొక చికిత్స కనుక్కున్నాను. అదేమంటే, నన్ను ఎవరైనా బాధ పెట్టినప్పుడో, లేదా తట్టుకోలేనంత కష్టం కలిగినప్పుడో, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ చిన్నప్పటి పరిశుభ్ర క్షణాల్ని ధ్యానించడం. ఆ అనుభవాలు ఎక్కడో నా అంతరంగంలో మూలికల్లాగా దాచి పెట్టుకున్నవాటిని ఒక్కసారి మనసులోకి తెచ్చుకుని ఆ సుగంధాన్ని ఆఘ్రాణించగానే ఎంతటి బాధాకరమైన అనుభవమైనా క్షణాల్లో కరిగిపోవడం నేను ఎన్నోసార్లు గమనించాను.

పునర్యానంలోని మొదటి అధ్యాయంలో అటువంటి పరిశుభ్రమైన క్షణాల్ని వీలైనన్ని పట్టుకు రావడానికి ప్రయత్నించాను. ఆ కావ్యం రాసిన ఇరవై ఏళ్ల తర్వాత ఈ మధ్య, ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల రాయటానికి కూర్చున్నప్పుడు, మళ్ళా ఆ క్షణాలే అంత పరిశుభ్రంగాను నా మనసులో సాక్షాత్కరించడం నాకు చెప్పలేనంత ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది.


బెల్లం వంట మొ­దలవడంతో ఉలిక్కిపడ్డాయి­ చెరకుతోటలు
పండిన పొలాల తృణాంకురాల సుగంధం నలుదిశలా
తీపిగాలుల్తో సంతతోవలు కిక్కిరిసిపోయాయి
కట్టకవతలతోటల్లో పండ్ల కోతలు మొదలయ్యాయి

ఊరి పొలిమేరల్లో అడుగిడుతున్న ప్రతి బాటసారికీ వెలుతురు నీడపరిచింది
పెద్ద పెద్ద రేకు కలశాల్లో చెరుకుపానకం బెల్లం రంగు తిరుగుతోంది
చీమ మొదలుకుని మేఘం దాకా పిలుపు వెళ్లింది ప్రతి ఒక్కరికీ
మాధుర్య పరిణామ వేళ పుష్పాలకీ, తుమ్మెదలకీ పండగే పండగ

అచ్చుపోసిన బెల్లం దిమ్మలతో ఈతచాపలు తీపెక్కాయి
వూతపెట్టిన ఎండుగడ్డికేదో పాత జ్ఞాపకాల పులకింత
పుష్యమాస మధ్యాహ్నాలకు సీతాకోకలు రంగులద్దుతున్నాంయి
సూక్ష్మసుగంధాల కుండపోతతో అవని తడిసి ముద్దయ్యింది.

జీవన కల్యాణానికి ఎదురు సన్నాహాలతో వేడెక్కింది గాలి
ఉత్సవ రథాన్ని లాగుతున్న ఊహల సందోహం
చేరవలసింది మరెక్కడో లేదు, ఇది యాత్రాంతం
కోరవలసింది మరేమీ లేదు, ఇది పరమాన్నం.

(పునర్యానం, 1.2.12)


When they started making jaggery
A thrill swept across sugarcane fields.
The air was rich and ripe, and
A heavenly scent filled the market pathways.

Every passerby has light and shelter.
Sugarcane juice simmers in a cauldron.
Everyone is invited, from ants to clouds
Sweetness beckons both flowers and bees.

Rolls of jaggery flavored the mats
As does the hay covering the slabs.
Butterflies brighten January afternoons, and
A fragrance permeated the earth.

Festivities abound in the air, and
It was a procession of dreams
Reached the destination, no more stops,
Time to cut the cake.

3-8-2023


9 Replies to “పునర్యానం-6”

 1. “చీమ మొదలుకుని మేఘం దాకా పిలుపు వెళ్లింది ప్రతి ఒక్కరికీ“ 😃

  మా ఊళ్ళో చెరుకు (బెల్గం) గానుగల రోజుల్ని పొట్లం కట్టి తెచ్చినట్లుంది.
  Thank you for bringing them back so beautifully with all that sweetness intact.

  “కోరవలసింది మరేమీ లేదు, ఇది పరమాన్నం.”
  Your poem is పరమాన్నం!!
  🙏🏽

 2. అనువాద మధురిమ
  చెరకురసం బెల్లం పానకమైనట్టు
  అచ్చుపోసిన బెల్లం దిమ్మలతో ఈత చాపలు తీపెక్కాయి. కవిత్వీకరణకు మచ్చు.

 3. చెరకుతోట నీటిరంగుల చిత్రంలో మీరూ చెరుకు గడల మోతలో మీరూ పాలుపంచుకున్నట్టుంది.

 4. సూక్ష్మసుగంధాల కుండపోతతో అవని తడిసి
  ముద్దయింది…చదివిన మా హృదయాలూ సర్!

Leave a Reply

%d bloggers like this: