పునర్యానం-5

నా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాల్లో మా ఊరు అంటే అడవీ, కొండలూ, ఏరూ, ఋతువులూ మాత్రమే కాదు, మా ఊళ్లో ఉండే రకరకాల వృత్తులూ, ఆ వృత్తి పనివాళ్లు పనిచేసుకునే చోట్లూ కూడా ఉన్నాయి. అవన్నీ నా మనసు మీద ఎన్నటికీ చెరపలేనంతగా ముద్రితమైపోయాయి. నా చిన్నప్పుడు చూసిన కంసాలి సోమలింగం, మంగలి వీరాస్వామి, కుమ్మరిఅప్పారావు, వడ్రంగి వీరాచారి, గిన్నెల సాయిబు, చాకలి రాములు నా జీవితంలో కూడాముఖ్యమైన పాత్రలే. నాకు ఏ కొత్త అనుభవాలు సంప్రాప్తమవుతున్నా, మా ఊరు వదిలిపెట్టి యాభై ఏళ్ళు గడిచాక కూడా, ఆ చేతి వృత్తుల వాళ్ళు మళ్ళా మళ్ళా గుర్తొస్తూనే ఉంటారు.

నోబెల్ పురస్కారం పొందిన స్వీడిష్ మహాకవి హేరీ మార్టిన్ సన్ పద్యాలు చదివినప్పుడు నాకు మా ఊళ్ళో నా చిన్నప్పుడు తన బంగారు పని కొట్టు ముందు కూర్చుని బంగారానికి అతుకు పెడుతూ ఉండే కంసాలి సోమలింగమే గుర్తొచ్చాడు. తెలుకులాళ్లనూనె గానుగ, కుమ్మరి వాళ్ళ ఆవం, కుమ్మరి చక్రం, మా ఇంటి పక్క ముర్ల సూర్యారావు ఇంట్లో వేప చెట్టు కింద కత్తులు సానపెట్టుకుంటూ ఉండే సానరాయి- ఇవి నా తదనంతర జీవితానుభవాన్ని అర్థం చేసుకోవడానికి నా బాల్యం ఏర్పరిచి పెట్టిన మూసలు. నా పార్థివ జీవితంలో నేను చూసిన సత్యాన్ని కవిత్వంగా మల్చాలనుకున్నప్పుడు వీళ్ళందరూ నాకు గుర్తొచ్చారు. వణకరాయి దగ్గర చెరుకుతోటలో బెల్లం వండే ఊటావాళ్లు, మా ఊరి లోపల లంకా వాళ్ళ ఇంటి ఎదురుగా చెట్ల నీడలో బాణాలు తయారు చేసే అంబుల చిన్నయ్య నా మనసులోనే తిష్ట వేసుకున్నారని ఈ కవితలు రాయటానికి కూర్చున్నప్పుడు తెలిసి వచ్చింది.

తాను చూసిన పరమ సత్యాన్ని ప్రకటించడానికి కబీరు చేట వైపు, తిరగలి వైపు, సంతవైపు, సంతలో కత్తులు బేరమాడే వాళ్ళ వైపు చూసినట్టే నేను కూడా నాకు అనుభవానికి వస్తున్న సత్యాన్ని గుర్తుపట్టడానికి ఆ చిన్నప్పటి అచ్చుల్నే ఆశ్రయించాను.

అటువంటి ఒక నమూనాల్లో మా మంగలి వీరాస్వామి ఒకడు. ఆయన చక్కని మేనిచాయతో, కోర మీసాలతో, ఉంగరాల జుట్టుతో స్ఫురద్రూపిగా ఉండేవాడు. మాకు క్షవరం చేయించడానికి మా నాన్నగారు ఆయన్ని మా ఇంటికి పిలిపించేవారు. అతడు రాగానే ఇక తక్కిన కార్యక్రమం అంతా ఒక రిచువల్ లాగా ఉండేది. అతడు గుడ్డలో చుట్టి తెచ్చుకున్న తన సామాన్లు ఉండేవి. అతడు రాగానే మా ఇంటి వాకిట ఒక చెట్టు కింద నాకు ఒక పీట వేసి కూర్చోమనేవాడు. తను పొది లోంచి సామాన్లు ఒక్కొక్కటీ బయటకు తీసేవాడు. ఒక గిన్నెలోనో, ముంతలోనో వేణ్ణీళ్లు కావాలని అడిగేవాడు. అప్పుడు ముందుగా తన మంగలి కత్తిని ఒక తోలుముక్క మీద కొంత సేపు సానపెట్టేవాడు. ఆ తరువాత క్షవరం చేయటం మొదలు పెట్టేవాడు. అంతా అయిపోయాక చివరగా తన పొదిలోంచి ఒక చిన్న చేతి అద్దం బయటకు తీసి నా చేతుల్లో పెట్టి అద్దంలో నన్ను చూసుకోమనేవాడు. ఆ అద్దం ఎప్పుడో ఏ కాకరపాడు సంతలోనో కొని ఉంటాడు. దాని అంచులు నల్లబడి అద్దం మీద అక్కడక్కడ మసగ్గా ఉండేది. ఆ మసకటద్దంలోనే నన్ను నేను చూసుకోగానే నాలోంచి ఒక కొత్త పిల్లవాడు ప్రత్యక్షమయ్యేవాడు. ఆ అనుభవాన్నే ఈ కవితగా రాశాను.

మిత్రురాలు గోటేటి లలిత గారికి ఈ కవిత అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు.

ఇంకో మాట కూడా చెప్పాలి.

మనిషికి ఇంద్రియ సంవేదనల వల్ల లభించే జ్ఞానాన్ని గుర్తుపట్టడానికి అతని మనసులో పేరుకున్న పూర్వ అనుభవాల, జ్ఞాపకాల మసకలు అడ్డుపడుతూ ఉంటాయి అని చెప్పాను కదా. అలా మనసులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన వాసనాకోశాన్ని యోగాచార బౌద్ధం ‘చిత్తం’ అంది. ఆ చిత్తానికి ఒక విశేషమైన లక్షణం ఉంది. అది దేన్ని చూసినా దానిలాగా మారిపోవాలని ఉద్రేక పడుతూ ఉంటుంది. దాన్నే చిత్తవృత్తి అన్నారు. వృత్తి అంటే circular activity. చిత్తం ఒక యాపిల్ పండుని చూసిందనుకోండి, తాను వెంటనే ఆపిల్ పండుగా మారిపోవాలనుకుంటుంది. లేదా అద్భుతంగా శిల్పాలు చెక్కుతున్న ఒక శిల్పిని చూసిందనుకోండి, తను కూడా శిల్పి కావాలని తపించడం మొదలు పెడుతుంది. ఇది అంతులేని ప్రక్రియ. దీన్ని ఎక్కడో ఒక చోట ఆపకపోతే తప్ప మనం దీన్నించి బయటపడలేం. యోగం వల్ల అటువంటి చిత్తవృత్తి నిరోధం సాధ్యమవుతుందని (యోగః చిత్తవృత్తి నిరోధః, 1.2) పతంజలి మహర్షి అన్నాడు. నువ్వు చూసిన ప్రతిదానికీ అంటుకుపోయే అలవాటు నుంచి బయటపడాలంటే అలా అంటి పెట్టుకోకూడదనే మెలకువ ఉండాలి అని భగవద్గీత అంది. అటువంటి సంకల్పాన్ని భగవద్గీత ఒక కత్తితో పోల్చింది. (అసంగ శస్త్రేణ ధృఢేన ఛిత్వా, 15.3).

ఇవన్నీ నేను తర్వాత తర్వాత చదివిన, తెలుసుకున్న విషయాలు. ఇవేమీ తెలియక ముందే మా మంగలి వీరాస్వామి దగ్గరుండే కత్తీ, అద్దమూ నాకు ఏదో సత్యాన్ని చెప్పాయని ఇవన్నీ చదివాక మరింత బాగా అర్థమైంది.


మంగలి వీరాస్వామి గుడ్డవిప్పి పరుస్తూండేవాడొక్కక్కటే
ముందొకకత్తి, అప్పుడొక కత్తెరా, దాన్ని సానబెట్టే తోలుము­క్క
సంతలో కొన్న కొత్త దువ్వెన

అతనికి నా తలనప్పగించాక నేనెటు చూడాలో, ఎటు తలతిప్పాలో
ఎప్పుడు వంచాలో, ఎప్పుడు తలపైకెత్తాలో:
అతని సన్నిధిలో ఉన్న క్షణాలకతడే
నా చలన నిర్ణేత, సర్వాధినేత.

పనంతా పూర్తయ్యేక అప్పుడొచ్చేది బయటకి అన్నిటికన్నా వెనగ్గా
అతని మూటలోంచి, మసకమసకల చేతి అద్దం.

కాలం నెమ్మదిమీద బోధించింది అతని పనిముట్ల అసలు రహస్యం
జీవనసౌందర్యాన్ని చూపాలనుకున్నావా, అప్పుడన్నిటికన్నా
మొదటి అవసరం కత్తి, అడ్డొచ్చినదాన్ని నిర్దయగా తెగేసే కత్తెర.

అద్దమంటావా, దానితో పని పడేది
అందం పరిపూర్ణతనొందే ఆ చివరి క్షణాల్నే

(పునర్యానం, 1.1.25)


To begin working, Veeraswamy, the village barber,
Draws out his tools one by one.
A razor, scissors, comb, and leather piece.

My fate is decided by him once I surrender my head to him
As to whether I should raise my head or bow, he tells me.
After finishing the job, he pulls out his last tool.
A hand mirror with stains here and there.

Over time, I realized-
Cleaning starts with a cutter.
What about the mirror?
A final moment of beauty calls for it.

3-8-2023

10 Replies to “పునర్యానం-5”

  1. Realizing the higher knowledge in a simple day to day ritual and putting it in a beautiful poem and the sketch that conveys it all!! Super, sir.
    చాలా చాలా బాగుంది. 🙏🏽

  2. నా చలన నిర్ణేత, సర్వాధినేత.

    ఎంత నిజం….ఎవరికీ తప్పని నిజం.

  3. జీవన సౌందర్యం నిండిన కవితా చిత్రం

  4. చదివి చాలా అనంద పడ్డాను. మీలాంటివారి రచనలు చదివి బాగుంది అనే మెచ్చుకోలు చెప్పేంత వారము కాదు.
    చిత్రం కూడా. చెంపలు చెవి మెడ అద్దంకెసి చూసె యాంగిల్ . మీరు మూర్తి చిత్రాలను ఎప్పుడు FB లో లేదు సార్.

  5. బహుశా ఆడపిల్లలకు అమ్మచేత జడ వేయించుకుని చాదు బొట్టు పెట్టించుకునే అనుభవంతో పోల్చవచ్చేమో?కాకపోతే ఇది నిత్యకృత్యం. కానీ నిజంగానే నా మొహం ప్రతీ రోజూ కొత్తగా కనపడేది .ఎదిగాక అద్దంలో చూడకుండా జడా బొట్టు సాధించా

  6. ఒక్కసారి వెనక్కి వెళ్లి మా ఊరు కూడా చూసి వచ్చాను గురువు గారూ

Leave a Reply

%d bloggers like this: