పునర్యానం-4

చాలాసార్లు దృశ్య ప్రపంచం మనలో కారణం తెలియని ఒక వేదనని కలిగిస్తూ ఉంటుంది. కాళిదాసు దాన్నే పర్యుత్సుకిత అన్నాడు. దానికి కారణం జననాంతర సౌహృదాలు అన్నాడు. అందమైనవాటిని చూసినప్పుడు లేదా చక్కటి సంగీతం విన్నప్పుడు మనలో మనకు తెలియకుండానే ఒక మెలాంకలి కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఆ అనుభవాలు మనకు గుర్తొచ్చినప్పుడల్లా ఆ తీయని వేదన కూడా మనకి గుర్తొస్తూనే ఉంటుంది.

ఎందుకని?

దృశ్య ప్రపంచాన్ని మనం మన ఇంద్రియాలు తోటే పట్టుకుంటాం. కానీ దృశ్య ప్రపంచం క్షణక్షణం మారుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించిన మన జ్ఞానం కూడా ఎప్పటికప్పుడు అస్థిరంగానే ఉంటుంది. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మన అనుభవాలు, ఆలోచనలు, ఊహలు, జ్ఞాపకాలు- వీటన్నిటి వల్లా దృశ్య ప్రపంచం ఎప్పటికప్పుడు మరింత వైయక్తికంగా మారిపోతూ ఉంటుంది.

నా చిన్నప్పటి ఊరే, కానీ నేను పెరిగి పెద్దయ్యేకొద్దీ నేను చదువుకున్న కావ్యాలు, చూసిన ఇతర గ్రామాలు, ప్రదేశాలు, నాకు తటస్తించిన అనుభవాలు- వీటన్నిటి వల్లా ఆ ఊరు కూడా నాతో పాటు ఎదుగుతూ వస్తుంది. మన మనోమయ జ్ఞానమయ ప్రపంచాలు లేకుండా కేవలం స్థూల ప్రపంచం మనకు ఎప్పటికీ ఆత్మీయం కాలేదు. కానీ మన మనసు, జ్ఞానం, భావోద్వేగాలు ఎప్పటికప్పుడు ఒక ఆలంబన కోసం వెతుక్కుంటూ ఉంటాయి కాబట్టి మన దృశ్య ప్రపంచం లేకుండా అవి ఏవీ కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి నిరపేక్షమైన అస్తిత్వం ఎలా ఉంటుందో మనకు ఎప్పటికీ తెలియదు. మనమొక అనుభవానికి కొత్తగా లోనవుతున్నప్పుడల్లా, మన ఇంద్రియాలు మనకి అందించే సంవేదనల్లో మన పూర్వానుభవాల జ్ఞానం ఎంతో కొంత కలగలసివస్తూనే ఉంటుంది. వేదాంతులు దాన్ని ‘వాసన’ అని అన్నారు.పోస్ట్ మాడర్న్ తత్వవేత్తలు దాన్ని ‘టెక్స్ట్’ అన్నారు. చివరికి, దృశ్య ప్రపంచం ఎప్పటికప్పుడు పంచస్కంధాల కలయిక వల్ల పుడుతూ, మరుక్షణమే విడిపోతూ ఉంటుందని చెప్పిన బౌద్ధులు కూడా స్మృతిని పక్కన పెట్టేయ లేకపోయారు. అందుకని ఆలయ విజ్ఞానం (Storehouse-consciousness) అనే ఒక భావనని అదనంగా తెచ్చుకున్నారు.

మా ఊర్లో ఊరి వెనక అడవి దగ్గర లోయలో ఉండే కొండ మామిడి చెట్టు నా చిన్నప్పుడు ఒట్టి మామిడి చెట్టు మాత్రమే. కానీ తర్వాత రోజుల్లో నా ప్రతి రసాత్మక అనుభవాన్నీ ఆ చెట్టు అదృశ్యంగానే పరిపాలిస్తూ వచ్చిందనీ, ఆ రసాత్మక అనుభవాలు కూడా నా మనసులో ఆ చెట్టును ఒక కావ్యమయవృక్షంగా మార్చేశాయంటే ఆశ్చర్యం లేదు.


వైశాఖ మధ్యాహ్నాలకు నా నమస్సులు, వేసవి వానల మట్టి వాసనకు నమస్సులు

ఆ అడవి వాలులో, ఎవరికీ తెలియని గిరికందరాల్లో విరగపండిన కొండ మామిడి
ఋష్యమూక శిఖరం మీది ఆ చెట్టు మీదనే ఒక వైదేహి నగలవూట జారవిడిచింది
ఆ వెంటనే, ఆమె రాసుకున్న ప్రణయలేఖలూ,

చిత్రకూట గిరిశిఖరం అంచుల్లో పూలతెప్పలు తేలి వచ్చే నదిని చూసిన వాళ్ల జ్ఞాపకాలున్నాయందులో
ఆ గిరివనప్రియు­ల చిరకాల విరహవేదనలడాగు ఆ జాబుల మీద.

శోక గాథల్తో హృదయాన్ని ఖండించే తియ్యని కరవాలం వైశాఖం
నెత్తురోడుతున్న గొంతుల్ని మామిడిపళ్ల రసంతో చల్లార్చడమూ దానికే చెల్లింది.

(పునర్యానం, 1.1.12)


A bow to May’s afternoons,
And a salute to the scent of summer rains.

The Ramayana Rshyamukam lies in our village.
A mountain with a mango grove and a forest.
When a demon abducted Vaidehi, she left her jewelry there
Aside from the ornaments, she also left her love letters.

The letters contain memories of Chitrakuta, and
Its rivers and flowers.
With time, separation of lovers stained those letters.

Whenever May arrives,
You are reminded of those who loved the mountains and forests.

Mid-summer burns your heart with their stories and sorrows,
Then cools you down with a summer shower.

2-8-2023

8 Replies to “పునర్యానం-4”

  1. “ మన మనోమయ జ్ఞానమయ ప్రపంచాలు లేకుండా కేవలం స్థూల ప్రపంచం మనకు ఎప్పటికీ ఆత్మీయం కాలేదు. కానీ మన మనసు, జ్ఞానం, భావోద్వేగాలు ఎప్పటికప్పుడు ఒక ఆలంబన కోసం వెతుక్కుంటూ ఉంటాయి కాబట్టి మన దృశ్య ప్రపంచం లేకుండా అవి ఏవీ కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి నిరపేక్షమైన అస్తిత్వం ఎలా ఉంటుందో మనకు ఎప్పటికీ తెలియదు.” – Thank you for explaining this so clearly. sir. పంచకోశవివేకం గురించి ఇపుడిపుడే తెలుసుకుంటున్నాను.

    “ కొండ మామిడి చెట్టు నా చిన్నప్పుడు ఒట్టి మామిడి చెట్టు మాత్రమే. కానీ తర్వాత రోజుల్లో నా ప్రతి రసాత్మక అనుభవాన్నీ ఆ చెట్టు అదృశ్యంగానే పరిపాలిస్తూ వచ్చిందనీ” – మా ఊరి గుళ్ళో పొన్న చెట్టు కనబడుతూ వుంటుంది నా జ్ఞాపకాల్లో ఎప్పటికప్పుడు మరింత అందంగా.

    “గిరివనప్రియులు” 🙏🏽

  2. గిరిరసాలతరువును ఐతిహాసిక సంకేతంగా తలచడంలో కవితకు సాంద్రత హెచ్చింది.
    శోక గాథల్తో హృదయాన్ని ఖండించే
    తియ్యని కరవాలం వైశాఖం
    నెత్తురోడుతున్న గొంతుల్ని మామిడిపళ్ల రసంతో చల్లార్చడమూ దానికే చెల్లింది.

    వైశాఖాతప మధురహింసనూ, నోరూరించే రసాలఫలరసోపశమనచర్యనూ భావించడం
    అనితరవశం. అనువాదం నిత్యనూతన పాఠ్యాంశం.నమస్సులు

  3. చదువుతున్న ప్రతి రసహృదయులకీ వారి అనుభూతులని అక్షరాల్లో పెట్టి వారి ఎదుట
    వుంచుతుంటే అపురూపమైన ఆశ్చర్యం,ఆనందం కలుగుతున్నాయ్ సర్.

Leave a Reply

%d bloggers like this: