పునర్యానం-3

అన్నమయకోశం గురించి తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పినదాని గురించి వ్యాఖ్యాతలు, ముఖ్యంగా ఆధునిక కాలంలో దాన్ని gross reality అనీ, స్థూల శరీరమనీ రకరకాలుగా వివరిస్తున్నారు. కాని అన్నాన్ని ఉపనిషత్తు ఒక స్థూల వాస్తవంగా భావించలేదు. ఆ ఆవరణలో కూడా అన్ని కోశాలూ పనిచేస్తాయి. అక్కడ కూడా ప్రాణం, మనస్సు, తెలివి, ఆనందం అన్నీ ఉంటాయి. నిజానికి ప్రతి కోశం ఆవరణలోనూ కూడా అయిదు కోశాలూ జాగరితంగానే ఉంటాయి. కాని గమనించవలసిందేమంటే ఎక్కడ మనిషి తన చైతన్యానికి ఆధారభూమికగా స్థూల సత్యాన్ని మాత్రమే గ్రహిస్తాడో అది అన్నమయకోశమని. అంటే అది లేకుండా తక్కిన భూమికలు, తక్కిన చైతన్యతలాలు లేవు, కాని అదొక్కటే చైతన్యం కాదు. ఈ సత్యం గ్రహించినందువల్లనే హెన్రిక్ జిమ్మర్ అనే జర్మన్ ఇండాలజిస్టు తైత్తిరీయాన్ని యూనివర్సల్ కమ్యూనిస్ట్ మానిఫెస్టో అని అన్నాడని శేషేంద్ర ఒకచోట రాసాడు.

పునర్యానంలో మొదటి అధ్యాయాన్ని నేను ఈ మెలకువతోనే రాసాను. దృశ్యప్రపంచంలోని సౌందర్యాన్ని, నా బాల్యం, మా ఊరు, నేను నడుస్తూ వచ్చిన దారులు నాకు చూపించిన అందాల్ని, అవి నాలో కలిగించిన ఉద్వేగాల్ని పట్టుకోడానికి ప్రయత్నించాను. కాని వాటికి ఆధారం దృశ్యప్రపంచం, స్థూల ప్రపంచం అన్నది మర్చిపోలేదు. ఆ సౌందర్యం ఎదట నిల్చొన్నప్పుడు అదే పరమసత్యం అనే భావనలో ఒకప్పుడు జీవించాననేది ఆ కవితల్లో సారాంశం. కాని ఎక్కడో ఆ స్థూల ప్రపంచం తృప్తినివ్వకపోవడం కూడా ఆ కవితల్లో కనిపిస్తుంది.

‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ లో ‘ఇప్పుడు రాస్తున్న కవిత’ (1987) లోని చేపపిల్ల మీకు గుర్తుంటే, ఈ కవిత దాన్నుంచి ఎంత ముందుకు వచ్చిందో అర్థమవుతుంది.


మహాసముద్రదేహం మీదకు వలల చేతుల్తో పాకి
పట్టుకొస్తారు రంగురంగుల మీన నేత్రాల్ని,
తుళ్లిపడే ప్రతి చేపతో మహాసము­ద్రం మనల్నే చూస్తూంటుంది
ప్రతి చూపూ మనం వెతుక్కుంటున్న అర్ధాన్నేదో ఇవ్వలేక వీగిపోతుంది

వలలో పడ్డ చేపల చుట్టూ మూగుతారు జాలర్లు, వర్తకులు
ప్రతి కొత్త కవిత చుట్టూ మూగినట్టు కవులు, రసజ్ఞులు

ప్రతి కొత్త కవితా ముందొక కుతూహలం, క్షణం గడవగానే భరించలేని ఆశాభంగం
‘ఇదేనా నీ వలలో పడ్డ చేప ! ఇందుకేనా అన్ని పొద్దుల అన్వేషణ’
ఈసడించి తప్పుకుపోతారు, ఎవరి రహస్యాన్వేషణలో వాళ్లు

అందిన ప్రతి చూపూ అంతరంగాన్ని పట్టివ్వదు. మరులు కల్పిస్తుంది
చేతికి చిక్కిన ప్రతి చేపా చేజిక్కని మహామీనమేదో మసలుతోందని చెప్తుంది

ఇక ఆ పై మహాసము­ద్రం మనని మరింత కవ్విస్తుంది

(పునర్యానం, 1.1.9)

As they crawl over the ocean, their nets bring out colorful eyes.
Through the trembling eyes of the fish, the ocean stares at us.
Yet, each look fails to convey what we are looking for.

As fishermen and traders rush to catch the catch,
Connoisseurs and poets flock to new poems.

Poems that are new at first are exciting, but then disappoint
“Is this the fish you have been seeking all these days?”
They ridicule the catch as they leave.

New looks may entice, but they don’t tell the whole story.
Getting a fish suggests that there is a greater one uncaught.

The ocean intensifies the excitement even further.

1-8-2023

7 Replies to “పునర్యానం-3”

  1. ఉపమేయానికి ఉపమానం అద్భుతం.
    కవితాంతరార్థం రసజ్ఞ మనోహరం. అనువాదం ,మూలం కవలపిల్లల వలె ఉన్నాయి.

  2. రాసేటప్పుడు కూడా ఇంతకన్నా సరైన మాట అనే వెతుకులాట గేలానికి వేసిన ఎర ,మళ్ళీ నీళ్ళలోకి దూకేలా చేస్తుంది.

Leave a Reply

%d bloggers like this: