రావిశాస్త్రి వారసులు

చాలా ఏళ్ళ కిందట అత్తలూరి నరసింహారావుగారు ‘జులై 30’ పేరిట రావిశాస్త్రిగారి పైన ఒక అభినందన సంచిక తెచ్చారు. అప్పట్లో నా మిత్రుడు, తర్వాత రోజుల్లో సుప్రసిద్ధ కవి, ఒకాయన ఆ పుస్తకం చూసి ‘అక్టోబరు రెండు అంటే అర్థమవుతుంది, నవంబరు పధ్నాలుగు అంటే అర్థమవుతుంది. జూలై 30 అంటే ఏమిటి? ఇలా ఒక మనిషిని ఒక ఐకాన్ గా ఎందుకు మారుస్తున్నారు?’ అనడిగాడు. కాని అప్పటికే రావిశాస్త్రి ఒక ఐకన్. నాకు తెలిసి, సాహిత్యప్రపంచంలో శ్రీ శ్రీ తర్వాత అంత క్రేజ్ కూడగట్టుకున్న రచయిత మరొకరు లేరు. ఆయన కథలూ, నవలలూ, ఆయన శైలీ, ఉపమానాలూ మాత్రమే కాదు, ఆయన మాట్లాడే మాటలూ, ఆ మాటవిరుపూ, ఆ ఛలోక్తులూ ప్రతి ఒక్కటీ పదే పదే తలచుకుంటో, చెప్పుకుంటో ఉండే సాహిత్యబృందాల్ని నేను చాలా దగ్గరగా చూసాను. చివరికి శాస్త్రిగారి పట్ల క్రేజ్ సుంకు పాపారావు నాయుడు గారిదాకా విస్తరించడం కూడా చూసాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి శాస్త్రిగారిని కూడా కాలం మరిపించగలదా అనిపించేది. కాని మళ్లా కుమార్ కూనవరపు వల్ల జూలై 30 కి మరణం లేదని అర్థమయింది. కిందటేడాది శాస్త్రి గారి శతజయంతి వైభవంగా జరిపించడంతో పాటు మళ్ళా ఈ ఏడాది శాస్త్రిగారిని నలుగురూ స్మరించుకునేలాగా ఆయన మళ్ళా సభ నిర్వహించారు.

ఈ సారి సభలో ‘ఉదయిని సాహిత్యవేదిక’ అనే సంస్థని స్థాపిస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ముగ్గురు యువకథకులకి రావిశాస్త్రి కథాపురస్కారం అందించారు. ‘నల్లవంతెన, ఇంకొన్ని కథలు’ రాసిన నాగేంద్ర కాశి, ‘దేవుడమ్మ, మరో 10 కథలు’ రాసిన ఝూన్సీ పాపుదేశి, ‘ఢావ్లో గోర్ బంజారా కథలు’ రాసిన రమేశ్ కార్తీక్ నాయక్ ఆ పురస్కారం అందుకున్నారు. దాంతో మూడు ప్రాంతాలకు చెందిన కథకులకీ గౌరవం లభించినట్టయింది. ముగ్గురు కథకులకీ తమ కథాసంపుటాలు మొదటి సంపుటాలు కావడం, మూడూ కూడా అన్వీక్షకి పబ్లికేషన్స్ కావడం మరో విశేషం.

నిన్న జరిగిన సభలో ఆ ముగ్గురి కథలమీదా ముగ్గురు వక్తలు ప్రసంగించారు. నాగేంద్ర కాశి కథల్ని తాడి ప్రకాశ్ పరిచయం చేసారు. ఝూన్సీ కథలమీద ప్రసిద్ధ కథకుడు పెద్దింటి అశోక్ కుమార్ సమగ్ర విశ్లేషణ చేసారు. అందరిలోకీ వయసులో చిన్నవాడూ, గిరిజన కథకుడూ అయిన రమేష్ కథలమీద మెర్సీ మార్గరెట్ అపారమైన వాత్సల్యంతో ఆత్మీయ ప్రసంగం చేసారు. చివరలో రావిశాస్త్రి వ్యక్తిత్వాన్నీ, సాహిత్యాన్నీ మరొకసారి సభమొత్తం తలుచుకునేవిధంగా జి.ఎస్.చలం రావిశాస్త్రి స్మారక ప్రసంగం చేసారు.

సభకి అధ్యక్షత వహించే అవకాశం లభించినందువల్ల పురస్కార గ్రహీతలు ముగ్గురి పైనా నా అభిప్రాయాలు కూడా చెప్పే అవకాశం లభించింది. వాటిల్లో ఢావ్లో కథలకు ముందుమాట నేను రాయవలసి ఉండింది. కాని కుదరలేదు. ఝూన్సీ కథల ఆవిష్కరణ సభ నా అధ్యక్షతనే జరిగింది. కాని ఆ కథలు నేనిప్పుడే చదివాను. ఇక నాగేంద్ర కాశి కూడా తన పుస్తకం నాకు వెంటనే పంపినప్పటికీ, ఈ సందర్భంగానే ఆ కథలు చదవగలిగాను.

మొదట చెప్పవలసిందేమంటే, మూడు సంపుటాలూ కూడా శాస్త్రి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవే. అంటే ఆయన శైలినో, రాజకీయ దృక్పథాన్నో అని కాదు. సమాజంలో చీకటి పార్శ్వాల్ని పట్టుకోవడంలో, సామాజిక అసమానతల్ని, అన్యాయాల్నీ గుర్తుపట్టడంలో, శక్తిమంతంగా ఎత్తిచూపడంలో ఈ ముగ్గురు కథకులూ తెలుగువాళ్ళ అవగాహనని విస్తృతపరుస్తున్నారు అనే చెప్పాలి. ఒకప్పుడు రావిశాస్త్రి చేసింది ఇటువంటి పనినే.

కాని కాలం రావిశాస్త్రినాటికన్న మరింత సంక్లిష్టంగా మారిపోయింది. నేనొకప్పుడు రామగోపాలం గారి కథల గురించి రాస్తూ 60 లలో, 70 లలో చాటుమాటుగా ఉండే అవినీతి, తొంభైల చివరికి వచ్చేటప్పటికి మాఫియాగా, నెట్ వర్క్ గా మారిపోవడాన్ని ఆ కథకుడు పట్టుకున్నాడు అని రాసాను. కాని ఇప్పుడు అవినీతి, అన్యాయం పూర్తి ఆర్థిక-రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించి మనుషుల్ని తమ అవసరాలకు పరికరాలుగా వాడుకుంటున్న కాలానికి వచ్చిపడ్డాం. నిజానికి సాహిత్యకారులు కాలంకన్నా ముందుంటారని ప్రతీతి. కాని ఇప్పుడు సాహిత్యకారులు కాలం కన్నా ఎంతో వెనకపడ్డారు. రియల్ టైమ్ వేగంతో సంభవిస్తున్న ఈ సంక్లిష్టపరిణామాల్ని పట్టుకోగల శక్తి రచయితలకి కొరవడుతూ ఉంది. అందుకనే ప్రజలు సాహిత్యం వైపు చూడటం మానేసారు.

వందలాది ఛానెళ్ళు, ఓటీటీలు, వేలాది సైట్లు ఒక్క క్లిక్ దూరంలో అరచేతిలోకి వచ్చాక, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తక్షణమే తెలుసుకునేటంత వేగంగా సమాచార విప్లవం సంభవించాక పాఠకులు కనుమరుగై, వీక్షకులు పెరుగుతున్నాక, ఆడియో-విజువల్ మీడియా వేగాన్ని అందుకోలేక ప్రింట్ మీడియా రాజకీయ పార్టీల కరపత్రంగా, నిలువెత్తు పోస్టరుగా మారిపోయేక కవులూ, రచయితలూ అక్కడక్కడా అరకొరగా మిగిలిన పాఠకులకీ, అసంఖ్యాకవీక్షకులకీ ఏమి చెప్పగలరు? తమ అనుభవాలనుంచి ప్రపంచం నేర్చుకునేది ఎంతో కొంత ఉందని ఎలా నమ్మించగలరు?

మనం నిజంగానే ఒక సంధికాలంలో ఉన్నాం. 2000 లో ఇంటర్నెట్ బూమ్ మొదలయినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా రచయితల్నీ, పాఠకుల్నీ కలుపుతుందనీ, ప్రతి పర్సనల్ కంప్యూటర్ ఒక లెర్నింగ్ సెంటర్ గా మారుతుందనీ, ప్రగతినీ, అభ్యుదయాన్నీ, సామాజిక న్యాయాన్నీ కోరుకునేవాళ్ళందరూ మునుపటికన్నా మరిత వేగంగా, మరింత విస్తృతంగా సంఘటితపడతారనీ అనుకున్నారు. కాని వెబ్ 2.0 వచ్చిన తరువాత, ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ మీడియా గా మారిన తరువాత, మానవుడు సముపార్జించిన సాంకేతిక పరిజ్ఞానం మొత్తం మధ్యతరగతి ఎంటర్టెయిన్ మెంట్ కోసమే అన్నంతగా నెట్ మారిపోయింది. ఒకప్పుడు రోమ్ లో గ్లాడియేటింగ్ లాగా, ఇప్పుడు ట్రోలింగ్ ఒక నిత్యవినోద క్రీడగా మారిపోయింది. మనుషులు ఒకరినొకరు నరుక్కోవడం, చుట్టూ చేరి గుంపులు చప్పట్లు చరచడం రోజువారీ వ్యాపకంగా మారిపోయింది. ఒకప్పుడు రచయితలూ, కవులూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తారని అనుకుంటూ ఉండేవారు. కాని ఇప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పేవారూ లేరు, వినేవారూ లేరు. బహుళాభిప్రాయాల వ్యాప్తి మొదలయ్యాక, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి మిన్నకుండటమే సంస్కృతిగా, నాగరికతగా మారిపోయేక రెండే మిగుల్తాయి: ఒకటి, మౌనం, లేదా, ట్రోలింగ్. ఇప్పుడు వెబ్ 2.0 కూడా ముగిసిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ తో కూడిన వెబ్ 3.0 శకం మొదలవుతోంది. ఇది రానున్న రోజుల్లో ప్రపంచ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోందో ఊహించలేకున్నాం.

మనుషుల మధ్య భావప్రసారాన్ని, అభిప్రాయ వినిమయాన్ని, భావోద్వేగ ప్రకటనల్నీ ఇలా కలగాపులగం చేసేసాక, నేను పదే పదే చెప్తున్నట్లుగా, ప్రపంచ కార్మికులంతా ఏకం కాకపోగా, ప్రపంచ పెట్టుబడిదారులంతా ఎన్నడూ లేనంతగా మరింత బలంగా ఏకమవుతున్నారు. ప్రజలకు వినోదపు మత్తునిచ్చి ఆ ముసుగులో కార్పొరేట్లు సమస్త వనరుల్నీ (చివరికి ప్రతిభావంతులైన రచయితలనే మానవవనరుతో సహా) ఆక్రమిస్తూ ఉన్నారు.

ఇటువంటి బీభత్సమయ ప్రపంచంలో, ఇంత సంక్లిష్ట వర్తమానంలో, ఈ ముగ్గురూ కథకులూ ఇలా తాము చూసినవాటిని, విన్నవాటిని లేదా తాము అనుభవించినవాటిని కథలుగా మార్చడం నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఈ మూడు పుస్తకాలూ చదివిన తరువాత వారి పట్ల ఆరాధన కూడా కలిగింది. ఆరాధన అనే పెద్ద మాట ఎందుకు వాడానంటే, భయకరమైన ఒక నియంతృత్వాన్నో, ఆధిపత్యాన్నో ధిక్కరించడానికి తమ చేతిలో ఏ ఆయుధాలుంటే ఆ ఆయుధాల్తోనే, తమ పోరాటం విజయం సాధించిపెడుతుందో లేదో అన్నదాంతో నిమిత్తం లేకుండా తిరగబడే స్వాతంత్య్రవీరుల్లాగా ఈ కథకులు కనిపించారు నాకు. ఈ ముగ్గురనే కాదు, సామాజిక జీవితం మరింత న్యాయబద్ధంగా ఉండాలనీ, మనుషులు మరింత సమతలంమీద నడవాలనీ, ఒకరిమీద ఒకరు పెత్తనం చెయ్యకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి బతకాలనీ కోరుకుంటూ ఇప్పుడు రచనలు చేసే ఏ రచయిత అయినా నా దృష్టిలో స్వాతంత్య్ర వీరుడే.

ఈ యువతీయువకుల్లో నాకు నచ్చింది వాళ్ళకి ప్రపంచం పట్లగానీ, తమ జీవితాల పట్ల గానీ complacency  లేకపోవడం.

‘ఈ దిక్కుమాలిన జీవితం దేనికీ ఎదురు తిరగడం నేర్పలేదు. మట్టి గురించి తప్ప మనుషుల గురించి నేర్పలేదు’ అని అనుకుంటుంది ఒక పాత్ర నాగేంద్ర కాశి రాసిన ఒక కథలో. ముప్ఫై ఏళ్ళ యువకుడు, అది కూడా సినిమారంగంలో పనిచేస్తున్న ఒక రచయిత ఈ మాటలు రాయడం నాకెందుకో చాలా ఆశాజనకంగా అనిపించింది. యువతీయువకులు జీవితం పట్ల ఈ అసంతృప్తిని ఫీల్ కాగలిగితే, దాన్ని నిస్సంకోచంగా ప్రకటించగలిగితే, తప్పకుండా ఈ ప్రపంచంలో కొత్త కిటికీలు తెరుచుకుంటాయి.

ఈ రచయితలకి కలలున్నాయి. ఏమి చేసీ ఈ బీభత్సమయ వర్తమానం వీళ్ళ కలల్ని కూల్చలేకపోయింది. రమేష్ కార్తిక్ నాయక్ రాసిన ఒక కథలో ఈ వాక్యాలు చూడండి:  

‘సక్రు భవిష్యత్తులో ఓ గొప్ప వక్త అవుతాడు. మెల్లిమెల్లిగా తన లాంటి తెగల గురించి తెలుసుకోవడం మొదలుపెడతాడు. హక్కులకోసం, అడవులకోసం, మట్టికోసం పోరాటం చేయాలని భావిస్తాడు. పుస్తకాలు చదువుతాడు. ఏవో రాసుకుంటాడు. తండాలు తిరుగుతాడు. ఈ విశ్వంపై అర్హత ఎవరికుందో వివరిస్తూ తిరుగుతాడు. తన ప్రయాణంలో మూడువందలకు పైగా తెగలను కలుస్తాడు. వారి జీవితాలను, వారి సామాజిక పరిస్థితిని గమనిస్తాడు..’

ఒక పాత్ర కలగా చెప్పిన ఈ కల రచయితనే కలనే అని మనకి తెలుస్తూనే ఉంటుంది. పాతికేళ్ళ ఒక గిరిజన యువకుడి ఈ కల ఒక్కటి చాలు, ఈ ప్రపంచం మీద నేను నమ్మకం కోల్పోకుండా ఉండటానికి.

ఈ రచయితలకి కథ, శిల్పం అంటో మనం పాఠాలు చెప్పవలసిన పని కూడా లేదు. ఝూన్సీ రాసిన ‘దేవుడమ్మ’ , ‘నీరుగట్టోడు’, ‘ఊర్ధ్వతలం’ లాంటి కథలు చదివినప్పుడు వాటిలోని పరిణత శిల్పం పాఠ్యపుస్తకాల స్థాయిని అందుకుందనిపించింది. గాఢమైన ఆవేదన, అనుశీలన తప్పకుండా ఒక కథకి కావలసిన శిల్పాన్ని తామే తెచ్చిపెడతాయి.

ఈ మూడు సంపుటాల్లోనూ కథకులు రాసిన కథల్ని synchronic గా మాత్రమే కాక diachronic గా కూడా చూడవచ్చు. ఏకకాలంలో అవి ఆ కథకుల్నీ, సుదీర్ఘ కథన సంప్రదాయాన్నీ రెండింటినీ ప్రతిబింబిస్తున్నాయి. నాగేంద్ర కాశి రాసిన ‘కొయిటా అబ్బులు’ పద్మరాజుగారి పడవప్రయాణానికి వారసురాలు. ఆయన రాసిన ‘ఎడారి ఖర్జూరం’ కథని కొ.కు రాసిన ‘కొత్త జీవితం’, ఓల్గా రాసిన ‘రాజకీయ కథ’ల్తో కలిపి చదివితే, గ్రామీణ-పట్టణ వలసల సామాజిక-చారిత్రిక పరిణామాన్ని తెలుగు కథ ఎప్పటికప్పుడు ఎలా గమనిస్తూ ఉందో మనకి అర్థమవుతుంది. అలాగే ఇతివృత్తాల్లో కూడా ప్రపంచ కథన సంప్రదాయాన్ని తెలుగు కథ ఎలా ప్రతిబింబిస్తుందో చూడాలంటే నాగేంద్ర కాశి రాసిన ‘నిశీథి శలభం’ కథని ఓ హెన్రీ రాసిన Gift of the Magi తో కలిపి చదవాలి. పందొమ్మిదో శతాబ్దపు న్యూయార్క్ నుంచి ఇరవై ఒకటవ శతాబ్దపు మెట్రోలదాకా అమానుషత్వం ఎలా పరిణమిస్తోందో, అలానే మానవత్వం కూడా ఎలా పుష్పిస్తూ ఉందో చూడగలుగుతాం.

రమేష్ రాసిన కథలు, అసంపూర్ణాలే కావచ్చు, కాని వాటిలో ఒక epic dimension కనిపించింది నాకు. ఎపిక్ అంటే ఏమిటి? ఒక పుట్టుక, ఒక మరణం, ఒక పెళ్ళి, ఒక కలయిక, ఒక వీడుకోలు, ఒక హత్య, ఒక ఉద్ధరణ, ఒక యుద్ధం, తప్పనిసరి శాంతి- వీటన్నిటి చిత్రణనే కదా. రమేష్ రాసిన ఢావ్లో కథల్లో ఇవన్నీ ఉన్నాయి. అంతే కాదు, ఒక జాతి తొలిగా సాహిత్యాన్ని సృజిస్తున్నప్పుడు ఆ రచనల్లో ఉండే స్వభావ రామణీయకత ఆ కథల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. నేను చెప్తున్నదేమితో అర్థం కావాలంటే, ఢావ్లో సంపుటిలోని ‘లతకడా’ అనే కథ చదవండి.

వస్తువైవిధ్యాన్ని చూపించగలగడంలో కేశవరెడ్డినీ, ప్రగాఢవాస్తవాన్ని, సంక్లిష్టతల్నీ పట్టుకోవడంలో ఆర్. వసుంధరా దేవినీ ఝాన్సీ గుర్తుకు తెస్తున్నది. వర్తమాన జీవితంలో స్వతంత్ర జీవితాన్ని కోరుకునే స్త్రీలు ఎదురుకునే ప్రశ్నలు ఎంత బలంగా ఉంటున్నాయో ఆమె కథల్లో కనిపిస్తాయి. నవీన మహిళకు మనం మన అభిప్రాయాలతోనూ, జడ్జ్ మెంట్లతోనూ అడ్డుపడకపోతే, ఆమె తన చరిత్రను తాను తిరిగి రాసుకోగలదనే హామీ ‘ఊర్ధ్వతలం’, ‘మూవ్ ఆన్’ వంటి కథల్లో కనిపిస్తుంది. ఒకసారి ఆమె తన చరిత్రను తాను తిరిగి రాసుకోగలిగితే, మహాకవి నమ్మినట్లుగా, మానవచరిత్రను కూడా తిరిగి రాయగలుగుతుంది.

మొత్తం  మీద నిన్న సాయంకాలం నాకు చాలా తృప్తినిచ్చింది. ఆశ కలిగించింది. రావిశాస్త్రిని స్మరించుకోవడమంటే ఆయన కథల గురించి మరోసారి మాట్లాడుకోవడం కాదు, ఆ దీపాన్ని పట్టుకుని ముందుకి నడుస్తున్న యువతీయువకుల కథల గురించి మాట్లాడుకోవడం. ఆ అవకాశాన్నిచ్చినందుకు కూనపరాజు కుమార్ కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.    

31-7-2023

6 Replies to “రావిశాస్త్రి వారసులు”

  1. రావిశాస్త్రిని స్మరించుకోవడమంటే ఆయన కథల గురించి మరోసారి మాట్లాడుకోవడం కాదు, ఆ దీపాన్ని పట్టుకుని ముందుకి నడుస్తున్న యువతీయువకుల కథల గురించి మాట్లాడుకోవడం.-ఈ వాక్యాలు వర్ధంతులు జయంతులు శతజయంతులు వంటి ప్రాతఃస్మరణీయుల పేరిట జరిగే అందరి కార్యక్రమాలకు వర్తిస్తాయి.
    ఒకప్పటి మీడియాకు ఇప్పటి మీడియాకు తారతమ్యాన్ని చాలా చక్కగా తెలిపారు .మోనార్కిజం పెరుగుతున్న ఈ రోజుల్లో పరిస్థితులను సమీక్షించి హెచ్చరించి మార్గదర్శనం చేయగల బలమైన సాహిత్య శక్తి ఇంకా బాగా ప్రభవించాలని ఆశిద్దాం. కార్యక్రమాన్ని శక్తిమంతంగా అక్షరాల్లో వీక్షింపజేసారు.

  2. అనుకోకుండా నేను వచ్చాను…. రాకపోయి ఉంటే ఒక అపురూపాన్ని పోగొట్టుకునే దాన్నేమో…సభ చాలా ఆనందాన్ని అందించింది… మీ మాటలు మరొక్కసారి సభలో విషయాలన్నిటిని పూర్తిగా గుర్తుకు తెచ్చి సభ తాలూకు పరిమళాన్ని అందించి వెళ్ళింది… Thank you

  3. సభకు మీరు అధ్యక్షత వహించడం, పుస్తకాలను సమీక్షించడం, నేటి సాహిత్య పర్యావరణాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు 🙏
    కుమార్ కూనపరాజు

Leave a Reply

%d bloggers like this: