
Self Portrait by Ivan Shishkin, 1854
మనిషి ప్రకృతిని అర్థం చేసుకోడానికీ, ఆ తర్వాత జయించడానికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోనే వచ్చాడు. అగాధమైన సముద్రాల్లో ప్రయాణించడం, మహాపర్వతశ్రేణుల్ని ఆరోహించడం, రోదసిలో అడుగుపెట్టడం లాంటివన్నీ అందులో భాగాలే. అలాగే ప్రకృతిని కాగితం మీదకు దించడానికి ప్రకృతిచిత్రకారుడు కావడం కూడా అటువంటి ప్రయత్నమే.
మనిషి ఒక లాండ్ స్కేప్ ఆర్టిస్టు కావడం వెనక ఉన్న దాహం అపారమని చెప్పాలి. నీ ముందున్న కొండల్నీ, కోనల్నీ, జలపాతాల్నీ, సూర్యకాంతినీ, సంధ్యవేళల్నీ, వెన్నెలవెలుగునీ ఎలా కాగితం మీదకు తేగలగుతావు? ప్రకృతిలోని ఏ చిన్న దృశ్యాన్ని తీసుకున్నా, ఆ రాశి, ఆ వైవిధ్యం, ఆ విస్తీర్ణత ఉన్నదున్నట్టుగా చిత్రంగా మలచడం అసాధ్యం. ఒక ఓక్ చెట్టునో, మర్రిచెట్టునో, చివరికి ఒక వెదురుపొదనో చిత్రించాలనుకున్నా కూడా, నీ రెండు చేతుల్తో చిత్రించాలనుకున్నా కూడా దాదాపుగా అసంభవం అనే చెప్పవచ్చు. కాని ఆ దృశ్యం నిన్ను కవ్విస్తుంది. తననెలాగేనా రెండు కొలతల కాగితం మీదనో, కాన్వాసుమీదనో బంధించమంటుంది. సాగరగర్భంలోకి దూకేవారూ, ధ్రువప్రాంతాలకు సాహసయాత్ర చేసేవారూ, యెవరెస్టు శిఖరం ఎక్కడానికి ముందడుగు వేసేవారూ ఎటువంటి పిలుపుని విని తమని తాము నిగ్రహించుకోలేకపోయారో, ప్రాణాలకు తెగించి సాహసయాత్రకు పూనుకున్నారో, దాదాపుగా అటువంటి పిలుపే లాండ్ స్కేప్ చిత్రకారుడికి కూడా వినిపిస్తూ ఉంటుంది. తట్టుకోలేని ఆ ఆకర్షణకి అతడు స్కెచ్ బుక్కు తీసుకుని అడవిలోకో, కొండల దగ్గరకో, నది ఒడ్డుకో వెళ్ళడమైతే వెళ్తాడుగానీ, ప్రతి సారీ, తన అశక్తతతో అతడు పరాజయాన్ని నెత్తినేసుకుని తిరిగి వస్తాడు. కాని మర్నాడు తెల్లవారగానే మళ్ళా బొమ్మలు గీయడానికి కూచుంటాడు.
ప్రకృతికీ, ప్రకృతిని చిత్రించాలనుకున్న చిత్రకారుడికీ మధ్య జరిగే ఈ ఎడతెగని సంవాదం, సంఘర్షణని ఏదో ఒక విధంగా ఎవరు పరిష్కరించుకోగలిగినా మానవజాతి వారివైపు ఆసక్తిగానూ, ఆరాధనతోనూ చూస్తుంది. ఉదాహరణకి చీనా చిత్రకారుల్ని చూడండి. ఆ మహాపర్వతాల్ని ఏం చేసీ మనం ఉన్నదున్నట్టుగా బొమ్మ గియ్యలేం. కానీ వాళ్ళు ఆ పర్వతశ్రేణుల్నీ, వాటిమీంచి కిందకు దూకే జలపాతాల్నీ, ప్రవహించే నదీనదాల్నీ చిత్రలేఖనాలుగా మార్చడానికి ఒక ప్రత్యేకమైన శైలి రూపొందించుకున్నారు. షాన్-షుయి (కొండలూ-నీళ్ళూ) అని పిలిచే ఆ చిత్రలేఖనాల్ని చూడండి. అవి కొండలూ, నీళ్ళూ కావు. చిత్రకారులు వాటిని తాము చూస్తున్న పద్ధతిలో కాగితం మీద ప్రతిసృష్టి చేసిన కొండలూ, నీళ్ళూ మాత్రమే. కాని శతాబ్దాలు గడిచేక, చూపరులకి బయటి కొండలూ, నదులూ ఎంత అందంగా కనిపిస్తున్నాయో, ఈ బొమ్మల్లోని నదులూ, కొండలూ కూడా అంతే అందంగా కనిపిస్తూ వచ్చాయి.

Pure and Remote Views of Streams and Mountains by Xia Gui (partial), Song dynasty painting
యూరోప్ లో చిత్రకళలో లాండ్ స్కేప్ కి మొదట్లో ఏమంత ప్రాధాన్యత ఉండేది కాదు. వాళ్ళు దాన్ని చాలా చిన్నపాటి ప్రక్రియగానే భావించి దానికి ద్వితీయ ప్రాధాన్యతనే ఇచ్చారు. వాళ్ళ ప్రాధాన్యతా క్రమంలో చారిత్రిక సన్నివేశాలది మొదటి స్థానం. ముఖచిత్రాలది రెండో స్థానం. కాని చరిత్రఘట్టాల్నో, ముఖచిత్రాల్నో చిత్రించేటప్పుడు వాటికి బాక్ గ్రౌండ్ లో ఒక అమరికగా మాత్రమే చిత్రించడానికి పూనుకునేవారు. ఉదాహరణకి మోనాలిసా చూడండి. అందులో ఆమె వదనం వెనగ్గా కనిపించే కొండలూ, చెట్లూ, దారీ, ఆకాశమూ చూడండి.

బహుశా మీరిప్పటిదాకా అక్కడ అటువంటి ప్రకృతి దృశ్యం ఉందనే గుర్తుపట్టకపోయి ఉండవచ్చు. ఆ చిత్రకారుల మనసుల్లో ఆ దృశ్యానికి మరీ అంత ప్రాధాన్యత లేదు కాబట్టి చూపరులకి కూడా అది ప్రధానంగా కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. పదిహేడో శతాబ్దంలో పౌసిన్, లొరేన్ వంటి చిత్రకారులు వచ్చి లాండ్ స్కేప్ ని కూడా సమానమైన ప్రాధాన్యతగల ప్రక్రియగా మార్చినదాకా అదే పరిస్థితి. ఆ తర్వాత క్లాసిసిస్టులూ, రొమాంటిసిస్టులూ లాండ్ స్కేప్ ని చిత్రించడం మొదలుపెట్టాక వాళ్ళు కూడా వాస్తవ ప్రకృతిని ఉన్నదున్నట్టుగా చిత్రించలేని అశక్తతలో ఒక కాల్పనిక ప్రకృతిని, లేదా కల్పన పాలు అధికంగా ఉండే ప్రకృతిని చిత్రించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంప్రెషనిస్టులు ఆరుబయట చిత్రలేఖనాలు చేపట్టిన తరువాత కూడా ప్రకృతి దృశ్యాలమీద పడే వెలుగుని పట్టుకోడం మీద దృష్టి పెట్టారే తప్ప ప్రకృతిని యథాతథంగా చిత్రించలేదు.
కాని చూస్తున్న ప్రకృతిని చూసినట్టుగానే చిత్రించే సవాలును సాహసంగా తీసుకుని, ఆ పనిలో కృతకృత్యుడైన చిత్రకారుడు ఒకాయన ఉన్నాడు. ఇంటర్ నెట్ పుణ్యమా అని మనకి వివిధ దేశాల, సంస్కృతుల సమాచారం విరివిగా లభ్యమవుతోంది కాబట్టి ఇవాన్ షిష్కిన్ (1832-1898) గురించి ఇప్పుడు తెలుస్తోంది గాని, లేకపోతే, లాండ్ స్కేప్ చిత్రకళ అంటే టర్నర్, కాన్ స్టేబుల్ వంటి వారికేసే చూస్తూ ఉండేవాణ్ణి. కాని ఒకసారి షిష్కిన్ చిత్రలేఖనాలు పరిచయమయ్యాక ప్రపంచంలోని మరే లాండ్ స్కేప్ చిత్రకారుడు అతడి దరిదాపులకు కూడా రాలేడని అర్థమవుతుంది. అతడు గీసిన చిత్రలేఖనాలు నా దృష్టిలో ప్రతి ఒక్కటీ ఒక పర్వతారోహణ, ప్రతి ఒక్కటీ ఒక సాగరగర్భంలోకి లోతుమునక, ప్రతి ఒక్కటీ ఒక రోదసీ యానం.

Morning in the Pine Forest, 1886
లాండ్ స్కేప్ ని ఉన్నదున్నట్టుగా చిత్రించలేమనే నిస్పృహ వల్ల, పెయింటింగ్ గురించిన పాఠ్యపుస్తకాల్లో ఏం చెప్తారంటే, మీరు చెట్లని గీయాలంటే, ప్రతి కొమ్మా, ప్రతి ఆకూ గీయకండి, ఇంత ఆకుపచ్చ రంగు పూస్తే చాలు అని చెప్తారు. చిత్రలేఖనాల ప్రమాణాలు కూడా చిత్రకారుల సామర్థ్యాల్ని బట్టే నిర్ణయమవుతాయి కాబట్టి, దాదాపుగా, ఇప్పుడు ప్రతి చిత్రకారుడూ చేసేది ఆ పనే, ఒక్క షిష్కిన్ తప్ప.
తన కాలం నాటి యూరోప్ లో రొమాంటిసిస్టులు చిత్రిస్తున్న కాల్పనిక ప్రకృతిమీద తిరుగుబాటుగా షిష్కిన్ ప్రకృతిని ఉన్నదున్నట్టుగా చిత్రించడానికి పూనుకున్నాడు. అంటే ఒక పైన్ వనాన్నో, ఓక్ చెట్ల అడవినో చిత్రించాలంటే, కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్క చెట్టునీ, కొమ్మనీ, ఆకునీ, చివరికి విరిగిపడ్డ కొమ్మల్నీ, చిత్తడినీ కూడా చిత్రించడం అన్నమాట. ప్రకృతిని ఏవిధంగానూ ఎక్కువ చేయకుండా, తక్కువ చేయకుండా, ఉన్నదున్నట్టుగా, సహజంగా చిత్రించాలనే ఈ తపన వల్ల ఆయన్ని నాచురలిస్టు గా పిలుస్తున్నారుగాని, అది టాల్ స్టాయిని రియలిస్టు అనడం లాంటిదే. షిష్కిన్ సమకాలికులు ఆయనొక మహామానవుడని గుర్తుపట్టారుగాని, వర్ణలేపనంలో ఆయనకి తమ ఆరాధ్య చిత్రకారుడు ఇవాన్ క్రాంస్కోయి (1837-87) కి తర్వాత స్థానమే ఇచ్చారు. ఎందుకంటే పందొమ్మిదో శతాబ్దం ముగిసేటప్పటికి, చిత్రకారుడి పని కాపీయింగ్ కాదు, తన ఆత్మని ఆవిష్కరించడం అనే భావన మొదలవుతూ ఉంది. కానీ, దాదాపు ఒకటిన్నర శతాబ్దం తర్వాత మళ్ళా నాబోటి వాడు షిష్కిన్ చిత్రాల్ని చూస్తుంటే, అతణ్ణి సమకాలిక రష్యా ఆరాధించినప్పటికీ, అర్థం చేసుకోలేకపోయిందనే అనిపిస్తున్నది.

Rye, 1878
దీని గురించి చర్చించడం మొదలుపెడితే చివరికి చిత్రలేఖనంలోని conceptual art, perceptual art మధ్య వివాదానికే వచ్చి చేరతాం. కాని తన ఇంద్రియాల ద్వారా తాను గ్రహిస్తున్న సంవేదనల్ని సౌందర్యంగా మార్చడంలో ఒక చిత్రకారుడు పొందగల భావోద్వేగం, కళాసంతృప్తి తన మనసులో తోచినవాటిని తోచినట్టుగా గీయడంలో పొంగలడని అనుకోలేం. అలాగని షెజానె, వాన్ గో, డాలీ, ఎడ్వర్డ్ మంచ్ లాంటి చిత్రకారులు ప్రకృతికి చేసిన వ్యాఖ్యానాల్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కాని ప్రతి ఒక్క చిత్రకారుడూ తన ఇంద్రియగోచర సౌందర్యాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించలేకపోతున్న నిస్పృహ వల్లనే ప్రయోగాత్మక చిత్రకారుడిగా మారతాడనేది నా అభిప్రాయం.
షిష్కిన్ గీసిన చిత్రాల్లో కనిపించే ప్రకృతి రసహీనం అని ఎలా చెప్పగలం? ఆ దృశ్యాల్లోంచి మనం ఒక రష్యాని చూడగలం. పందొమ్మిదో శతాబ్ది గ్రామసీమల్ని, అడవుల్ని, ఇంకా కలుషితం కాని, ఇంకా కూలిపోని ఒక నిసర్గరామణీయకతను చూడగలం. తాను చూస్తున్న దృశ్యానికి ఎటువంటి వ్యాఖ్యానాన్నీ జతపరచకుండా చూసింది చూసినట్టుగా చెప్పాలనే ఆ చిత్రకారుడి నిజాయితీ వల్ల మాత్రమే, ఆ కాలం గడిచిపోయినా, ఆ రష్యా రూపురేఖలు మారిపోయినా, ఆ సౌందర్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది.

Oak Grove, 1887
షిష్కిన్ జీవితంలో చాలా విషాదం చూసాడు. అతడి తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులూ, ఒకరిద్దరు ప్రియశిష్యులూ వెంటవెంటనే చనిపోవడం చూసాడు. ‘మీకు చాలా ఇష్టమైన శబ్దాలు ఏమిటి?’ అని ఎవరో అడిగితే, తన పిల్లల పేర్లు అని చెప్పినమనిషికి, ఆ పిల్లలిద్దరూ కళ్ళముందే చనిపోవడం ఎటువంటి విషాదాన్ని మిగల్చగలదో ఊహించగలం. కాని, ఆ రోజుల్లోనే చిత్రించిన ఈ At the Edge of a Pine Forest, 1897 అనే చిత్రం చూడండి. ఈ మధ్యనే ఈ చిత్రం రెండుకోట్ల పౌండ్లకి వేలంపాడిందని విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించదు. విమర్శకులకి ఆ చిత్రంలో గుర్రపు బగ్గీలో ఉన్నది షిష్కిన్ అనిపించడంలో ఆశ్చర్యం లేదు కూడా. చూడబోతే, అతడు ఆ ప్రకృతిలోకే ప్రయాణించి ఆ చెట్లమధ్య, ఆ సౌందర్యంలోనే అదృశ్యమైపోతాడా అన్నట్లుంది.

At the Edge of a Pine Forest, 1897
షిష్కిన్ కి తల్లి, తండ్రి, భార్య, ప్రియురాలు, పిల్లలు, సమస్త జీవితం ప్రకృతి మటుకే. అతడికి తాను పుట్టిన ఊరు యెలాబుగ అంటే విపరీతమైన ఇష్టం, మక్కువ, ప్రేమ. అతడు జీవితమంతా ఆ ఊరినీ, అక్కడి అడవినీ, అక్కడి నీళ్ళనీ, వెలుగునీ ప్రేమించాడు, వాటినే తన చిత్రాల్లోకి తీసుకురాడానికి తపించాడు. అందుకనే అతడు మళ్ళీ పెళ్లిచేసుకున్నప్పుడు, ఆ రెండో భార్యకూడా ప్రసూతిలో మరణించినా తట్టుకోగలిగాడు. ప్రాకృతిక రష్యా అతణ్ణి తనకోసమే సృష్టించుకుంది. ఆ రష్యాకీ, తనకీ మధ్య ఉన్న అనుబంధం ఒక్కటే సత్యం, తక్కినవన్నీ అస్థిరాలనుకున్నాడు అతడు.
షిష్కిన్ గురించి చాలా కథలున్నాయి. అతడికి ఎవరినీ కలుసుకోవడం ఇష్టం ఉండేది కాదట. ఊరికే స్నేహితుల్తో కూచుని కబుర్లు చెప్పుకోడం కూడా ఇష్టముండేది కాదట. ఎంతసేపూ ఒక పెన్సిల్ చేత్తోపట్టుకుని అడవికి పోడానికే సిద్ధంగా ఉండేవాడట. అతడి ఖ్యాతి విని జార్ చక్రవర్తి ఒకసారి తన దగ్గరకు పిలిచాడు. చక్రవర్తి పిలిచాడు కాబట్టి షిష్కిన్ కోటూ, టై వేసుకోక తప్పలేదు. చక్రవర్తి అడిగిన ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పలేదు, తలాడిస్తో ఉన్నాడంతే. ఆయన పక్కకి వెళ్ళగానే అక్కడే ఉమ్మేసి, ఆ కోటూ, ఆ టై అక్కడే పారేసి వచ్చేసాడట. ఒకసారి తాను గీసిన బొమ్మని చక్రవర్తి కొనుక్కుంటానంటే తన మిత్రుడు అంతకుముందే అడిగాడని చెప్పి ఆ బొమ్మ తన మిత్రుడికే ఇచ్చేసాడట. కళాకారులంటే వాళ్ళు. అందుకనే షిష్కిన్ ని Czar of Forest అనడంలో ఆశ్చర్యమేముంది?
‘నీ జీవితాన్ని చిత్రలేఖనానికి అంకితం చెయ్యడంటే, తక్కిన వృథాసంతోషాలన్నిటికీ స్వస్తి చెప్పడమన్నమాట. లలితకళలు నిన్ను సౌందర్యం వైపు, నిజాయితీ వైపు, ఔన్నత్యం వైపు నడిపిస్తాయి. నీకు ఆశ కలిగిస్తాయి, హితవు చెప్తాయి, ఓదార్పునిస్తాయి’ అని అన్నాడు షిష్కిన్. ‘యూరోప్ అంతా తిరిగి ఎలబుగా రాగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టనిపిచింది. గాలి పీల్చుకున్నాను, రంగుల వెలుగులో తడిసిముద్దయ్యాను, ఆకాశం లోతుల్లో, ఎత్తుల్లో విహరించాను’ అని చెప్పుకున్నాడు. ఆశ్చర్యం లేదు, యూరోప్ నే కాదు, ఆ మాటకొస్తే, సెంట్ పీటర్స్ బర్గ్ లో కూడా అతడికి ఊపిరాడలేదు. ‘పీటర్స్ బర్గ్ వీథుల్లో నువ్వు నడుస్తున్నావనుకో, ఏ వేళప్పుడుగానీ, ఏ వీథిలో నడువు, ఓ బానపొట్ట వేలాడేసుకు తిరిగే సైనికాధికారి తారసపడతాడు లేదా ఎవడో ఒక ఉన్నతాధికారి ముక్కు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవడో ఒకడు నీమీద అధికార దర్పం చూపించబోతాడు. పీటర్స్ బర్గ్ మొత్తం ఇలాంటి పశువుల్తో నిండిపోయిందని నీకు తెలియడానికి ఆట్టే సమయం పట్టదు’అని కూడా అన్నాడట. అందుకనే ఒక గోగోల్ ఒక ముక్కు గురించీ, ఒక డాస్టవిస్కీ ఒక సైనికాధికారి గురించీ, ఒక తుర్జనీవ్ అధికారదర్పం గురించీ రాయకుండా ఉండలేకపోయారు. బహుశా వాళ్ళకి కూడా ఒక ఎలబుగ దొరికి ఉంటే వాళ్ళు కూడా ప్రకృతి చిత్రకారులై ఉండేవారేమో అనిపిస్తుంది.
మీరు ముఖచిత్రాలు ఎందుకు గియ్యరు అని అడిగితే, తనకి ఆ ప్రక్రియ అంటే కూడా ఇష్టమేనని చెప్తూ కాని తనకి తెలిసింది రష్యన్ అడవులు మాత్రమేననీ, వాటిగురించి మాత్రమే తాను చెప్పగలననీ అన్నాడు. ఏ చిత్రకారుడైనా తనకి ఏది అత్యంత ప్రేమాస్పదమో దానిమీదనే తన సమస్త శక్తిసామర్థ్యాలూ కేటాయించాలని కూడా సలహా ఇచ్చాడు.
1893 లో, అంటే అప్పటికి, అతడు తన ప్రసిద్ధ చిత్రాలు Morning in a Pine Forest (1886), Rye (1878) గీసి ఉన్నాడు, అయినా కూడా, ఒక పత్రిక అతణ్ణి మీ జీవితాశయం ఏమిటని అడిగితే, గొప్ప చిత్రకారుణ్ణి కావడం అని చెప్పాడు! మీరెలా మరణించాలనుకుంటున్నారు అని అడిగితే, ‘అనాయాస మరణం, ప్రశాంతంగా ఈ లోకాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటున్నాను’ అని చెప్పాడు. ఆ మాటలు చెప్పిన మరి అయిదేళ్ళ తరువాత, ఒకరోజు ఈజిల్ ముందు నిల్చుని ఒక ప్రకృతి దృశ్యం చిత్రిస్తూ, అట్లానే కుప్పకూలిపోయాడు.
మన యువతీ యువకులకి తెలియవలసింది ఇటువంటి మనుషులు. నాకెలానూ సాధ్యం కాలేదు, కనీసం ఏ ఇరవయ్యేళ్ళ యువకుడైనా ఇటువంటి జీవితగాథ చదివి, తాను కూడా ఒక ప్రకృతి తపస్విగా మారగలిగితే అంతకన్నా కోరుకునేదేముంటుంది?
Featured photo: Rain in Oak Forest, 1891
27-7-2023
‘నీ జీవితాన్ని చిత్రలేఖనానికి అంకితం చెయ్యడంటే, తక్కిన వృథాసంతోషాలన్నిటికీ స్వస్తి చెప్పడమన్నమాట. లలితకళలు నిన్ను సౌందర్యం వైపు, నిజాయితీ వైపు, ఔన్నత్యం వైపు నడిపిస్తాయి. నీకు ఆశ కలిగిస్తాయి, హితవు చెప్తాయి, ఓదార్పునిస్తాయి’ యూరపు సందర్శనలో ప్రతి నగరమూ మనకు చిత్రకళాస్ఫూర్తిని నింపడం, స్పృహను కలిగించడం గమనించాను. అనేక వీథుల్లో చిత్రకారులు తమ ప్రదర్శనను కొనసాగిస్తుంటారు. ఫ్లారెన్సులో లియొనార్డో డావిన్సీ యంత్రపరికరాల ప్రదర్శనశాలతో పాటు అనేక చిత్రకళా ఖండాలున్నాయి.నాకు తెలిసినంత వరకు అంటే పిల్లలు చెప్పిన దానిని బట్టి ఒక్కో నగరంలో ఒక్కో కళాఖండాన్ని ప్రదర్శనకుంచారు. పారిస్ లో మోనాలిసా పెయింటింగ్ ని , మిలాన్ లో లాస్ట్ సప్పర్ పెయింటింగ్ ని ప్రదర్శనకు ఉంచారు. మిలాన్ నగరంలో మరో గమ్మత్తైన అనుభవం మనకు బొమ్మ గీచే అవకాశం కల్పిస్తారు. చిత్రకళ గురించిన ఏ విషయాలు తెలియని నేను అవి చూడటం మట్టుకే గానీ వాటికి ఇంత లోతైన చరిత్ర ఉందని మీ వల్ల , రామవరపు గణేశ్వర్ రావు గారి వల్ల తెలుసుకున్నట్టనిపించినా అవి ధారణకు నిలిచే వయసు దాటింది. స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజుల్లో నోటుబుక్కుల మార్దిన్ లన్నీ పెన్నుతో గీచిన బొమ్మలతో నిండటం నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలోనే ఎవరైనా మంచి మార్గదర్శకులు కనిపిస్తే బాగుండేది కదా అని అనిపిస్తుంది. పడుచు వయసులో కూడా పలక బలపం కనిపిస్తే బొమ్మలు గీయటం మలపటం నాకు మాత్రమే ఆనందం కలిగించే ప్రక్రియ గా ేపట్టడం, ఇప్పుడు ఐపాడ్ లో ఒక యాప్ తో కుస్తీ పట్టడం, ఆసక్తి ఉన్నా అనుభవం లేని కారణంగా
ఆ కళలో అడుగులు ముందుకు పడలేదు. కానీ నన్ను నేను వితర్కించుకుంటే ఏడేళ్ల నాటి తపనే డెబ్బయి దాటినా ఉందని మాత్రం చెప్పగలను. షిష్కిన్ యెలబుగ మీది మమకారం చదువగానే నేను నా పుస్తకం నేనెక్కడ్నో తప్పిపోయిన కు నేను వేసుకున్న మా ఎలగందుల ఖిల్లా బొమ్మ గుర్తుకు వచ్చింది. ఎన్నో సార్లు అనుకున్నాను మానేరు డ్యాంలో మునిగిన మాఊరి చిన్ననాడు నేను చూసిన ప్రదేశాలను బొమ్మలుగా గీయాలని. కాని నాకు శక్తి చాలదని కూడా తెలుసు. మీరన్నట్లు యువతరం లో ఎవరైనా ఇలా చిత్రకళ మీద చిన్నతనంలోనే అవగాహన కలిగే అవకాశం ఉంటే బాగుండు అనిపిస్తుంది.ఇంకా చాలా విషయాలు గుర్తు వస్తున్నా నన్ను నేను అదిమి పెట్టుకుంటున్నా
సర్. చిత్రకళకు సంబంధించిన విషయాలతో మీ నుండి ప్రత్యేకంగా ఒక పుస్తకం వెలువడితే బాగుంటుంది. అది ఎందరికో ఉపయోగ పడుతుంది. దీర్ఘ స్పందనకు మన్నించమని మనవి.
మీ స్పందన దీర్ఘం కాదు, విశాలం. ఉదారం. మీ హృదయ స్పందనకు నేను సదా ఋణపడి ఉంటాను.
అనాయాస మరణం …
ఎంత గొప్ప …!
కొన్ని సార్లు అసమాపకం ఎంతో సమగ్రత.
మీ ప్రతీ రచన… ఒక అనుభవం!
ధన్యవాదాలు రామ్ భాస్కర్
‘ప్రతి ఒక్క చిత్రకారుడూ తన ఇంద్రియగోచర సౌందర్యాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించలేకపోతున్న నిస్పృహ వల్లనే ప్రయోగాత్మక చిత్రకారుడిగా మారతాడనేది నా అభిప్రాయం.’
నిజం సార్
షిష్కిన్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మీ స్పందనకు ధన్యవాదాలు.
మనసు చంచలం ,చూసిన ప్రతీదీ ఏదోవిధంగా స్వంతం చేసుకోవాలనిపిస్తుంది ,అక్షరం ,కుంచె ,ఉలి అన్నీ సాధనాలు.ఇలా ఏకోన్ముఖం చేసుకుంటే కానీ పరిపక్వత సాధించలేము .ఎంత పట్టుదల వుండాలి సర్ ,ఇది నా ప్రపంచం ,ఇంతకు మించి నాకేమీ అక్కర్లేదు అనడానికి.!
అవును మేడమ్. సరిగ్గా చెప్పారు.
ప్రతీ సారి కొత్త విషయాలు తెల్సుకుంటున్నాను. కెమెరాతో తీసినట్లునన్నాయి చిత్రాలు ముఖ్యంగా Morning in a pine forest, Oak Grove… అనాయాస మరణం… అదృష్టవంతులకేమొనేమో..మా నాన్నగారు గుర్తుకొచ్చారు.. September 2021 లో అప్పటివరకు మాట్లాడి నాతో నిద్రపోతాను అన్నారు. అదే చివరి దీర్ఘ నిద్ర అయ్యింది. అనాయాస మరణం అని అందరూ అన్నారు కానీ మేం యింకా పూర్తిగా కోలుకోనేలేదు..
నమస్సులు.
నమస్తే సర్, అవి చిత్ర లేఖనాలంటే నమ్మలేనంత గొప్పగా ఉన్నాయి..ఈ ఉదయం ఈ వాక్యాలు చదివాక ఆ మహా కళా తపస్వి కలుసుకున్న భావన కలిగింది.ధన్య వాదాలు సర్
ధన్యవాదాలు మేడం
goppa parichayam ( Shishkin ) tho koodina hrudyamaina write-up sir. camera tho theesina pictures laagaane vunnaayi. Thanks once again !
ధన్యవాదాలు
షిష్కిన్ పరిచయాన్ని చదువుతూ .. చిత్రాల్ని చూస్తూవుంటే ఆ ప్రకృతిలోకి పయనిస్తున్నట్లే ఉంది. ఆ భాగ్యాన్ని కలిగిచినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు కిషన్ గారూ!
సర్…మీరు చెప్పినట్టు కనులకి గోచరిస్తున్న ప్రకృతిని యథాతథంగా చిత్రించగలగటమే
అసలైన నైపుణ్యం అనిపిస్తుంది.
అసలు చిత్రకళ పరమావధే అది కదా.
అవును మేడమ్