దేశదిమ్మరి తేనె తలపులు

ఏమి వాన! ఉరుములు విరుచుకుపడ్డ రాత్రి. అసలు అక్కడికి చేరుకోగలమా అనుకున్నాను. మేము ఎక్కిన ఆటో ఎక్కడో ఒకచోట ఆగిపోతుందేమో అనుకున్నాను. కాని ఎలాగైతేనేం చేరుకోగలిగాను. పద్మ సంకల్పం అంత గట్టిది అని అర్థమయింది. ఆమె రాసిన కొత్త కవిత్వ సంపుటి ‘దేశదిమ్మరి తేనె తలపులు’ నిన్న రాత్రి తమ ఇంట్లో శర్మ, శాంత దంపతులు ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని పద్మ నాకు కానుక చేసింది.

ఒక పుస్తకాన్ని, అందులోనూ కుప్పిలి పద్మ రచనని అంకితం తీసుకోడానికి నాకేమి అర్హత ఉందని! కాని అది మా రాజమండ్రి రోజులకు గుర్తుగా, ఒకనాడు మాతో కలిసి మెలిసి కబుర్లు చెప్పుకుని అర్థాంతరంగా వెళ్ళిపోయిన మా రాజమండ్రి మిత్రుల జ్ఞాపకంగా వారందరి తరఫునా ఆ పుస్తకం నేనందుకున్నాను అనుకున్నాను. సుబ్బు, మహేశ్, సావిత్రిగారు, శరత్ బాబు, రామనాథం లతో పాటు ఏమైపోయాడో తెలియని గోపీచంద్ కూడా నిన్న రాత్రి నా తో పాటు అక్కడున్నారని గుర్తుపట్టాను.

నలభయ్యేళ్ళ కిందట పరిచయమైన ఒక మిత్రురాలు ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ స్నేహాన్ని వదులుకోకపోవడం ఆశ్చర్యమే. ఈ రోజుల్లో ఒక స్నేహం తెగిపోడానికి కొన్ని నెలలు చాలు, కాని నలభయ్యేళ్ళ పాటు నిలబడిందంటే అందుకు కారణం రాజమండ్రిలో మేము కలిసి చదువుకున్న సాహిత్యమే. సాహిత్యం నేర్పిన సంస్కారమే.

ఈ సంపుటికి సంపాదకుడిగా ఉన్న సరిదే సత్యభాస్కర్ కూడా మా రాజమండ్రి రోజుల మిత్రుడు. ఆయన కూడా నిన్న ఆవిష్కరణలో ఉన్నాడు, మాట్లాడేడు. పద్మ జీవితప్రయాణంలో ఇన్నేళ్ళుగా ఆమె హృదయానికి దగ్గరగా వచ్చిన మరికొందరు మిత్రులు కూడా తమ మాటల్తో, నవ్వుల్తో, పద్మ పట్ల అపారమైన ప్రేమతో నిన్నటి ఆవిష్కరణను నిండుగా వెలిగించారు.

ఆ సంపుటిలోంచి ఒక కవిత.


గోదావరి

యింతటి సౌందర్యాత్మకంగా మరే నది
భూమి మీద మరెక్కడా ప్రవహిస్తూ ఉండదేమో!

యిక్కడ ఆదిత్యుడు రోజురోజంగా అందాన్ని విరజిమ్ముతూనే వుంటాడు
ప్రత్యూషాన దోరగా పండిన నారింజ తళతళ. ..
అపరాహ్ణవేళ నారింజ పూల ధగధగ. ..
గోధూళి వేళ మగ్గిన నారింజపండు మిలమిల. ..
యిక్కడ సూరీడు కాంతిప్రవాహి!

వెదురువనాల్లో రాత్రంతా మంచుని మేసిన మురళి
ప్రభాతరాగమై తేలియాడుతూ వొస్తుంది.

రావి చెట్టు గలగలలాడుతూ కొన్ని పద్యాలతో నదిని అభిషేకిస్తుంది.

కొబ్బరాకు మొదల్లో కూర్చున్న కాకి వొక్కటి
నదీసౌరభాన్ని మనసారా ఆస్వాదిస్తూనే ఉంటుంది

గోదావరి జలాల మునిగి లేవగానే
ఆత్మను చుట్టుకునే కవిత్వపు చీర
అవును. . తను గోదావరి మాత
భూమికి పచ్చని వస్త్రాన్ని కానుక చేసిన
అమృత హృదయిని.

వశిష్ఠ, శబరి, ప్రాణహితల
ఆరు రుతువుల జీవన ప్రవాహి.

చామంతి, గులాబీ, బంతి, కనకాంబరం, మరువం. ..
అంతటా వసంత సౌరభం.

రాజమహేంద్రవరపు నీలిరంగు గోదావరి జలాల్లో
కవిత్వమంతా అన్నం మెతుకు పరిమళం!

25-7-2023

4 Replies to “దేశదిమ్మరి తేనె తలపులు”

  1. వెదురువనాల్లో రాత్రంతా మంచుని మేసిన మురళి
    ప్రభాతరాగమై తేలియాడుతూ వొస్తుంది. wow sir

Leave a Reply

%d bloggers like this: