
(ఈ రోజు సాయంకాలం విజయవాడలో మా అక్క రాసిన ‘కొన్ని శేఫాలికలు ‘పుస్తకం ఆవిష్కరణ. ఆ వ్యాసాలు చదివినప్పుడు నాకు కలిగిన స్పందన ‘దయామృత ధార’ అని ఆ పుస్తకానికి ఇలా ముందుమాట గా రాసాను.)
అల్లసాని పెద్దన చంద్రుణ్ణి అన్ని ఋతువుల్లోనూ పూచే పువ్వు అని అభివర్ణించాడు. ఈ శేఫాలికలు కేవలం ధనుర్మాసంలో మాత్రమే పూసే పూలు కావు. ఇవి అన్ని ఋతువుల్లోనూ పూసిన పూలు. ఇంకా చెప్పాలంటే, జీవితకాలం పాటు పువ్వు పువ్వునుంచీ ఏరుకుని నింపుకున్న మధుకోశాన్ని మళ్ళా నలుగురికీ పంచడంకోసం మళ్ళీ పూసిన పూలు.
ఈ రచనలన్నీ దాదాపుగా సారంగ పత్రికలో వస్తున్నప్పుడే చదివాను. కాని ఇప్పుడిలా పుస్తకరూపంలో తీసుకువస్తున్నాను చూడమని అక్క అడిగినప్పుడు మొదటి వ్యాసం చదివినప్పటికే నా గుండె గద్గదమైపోయింది. మరో రెండు వ్యాసాలు చదివేటప్పటికి నా కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయని గ్రహించుకున్నాను.
ఎందుకని? ఎందుకని ఈ వాక్యాలు, ఈ వ్యాసాలు నాకు కన్నీళ్ళు తెప్పించాయి? వీటిలో ఉన్నదేమిటి? సాహిత్యం, సంగీతం, సినిమాలు, మిత్రులు, మానవసంబంధాలు- వీటిగురించే అయితే సంతోషం కలిగి ఉండాలిగాని హృదయం అశ్రుపూరమెందుకవ్వాలి?
ఆలోచించాను. బహుశా, మా చిన్నప్పుడు, ఆ కొండకింద పల్లెలో, ఆ తాటాకు ఇంట్లో, నిండుగా రాధామనోహరాలు పూచిన ఆ పూలపందిరి కింద మేము పెరిగి పెద్దవాళ్ళమవుతున్నప్పుడు, ఇంత సుదీర్ఘమైన జీవితం జీవిస్తామనిగానీ, ఇంత సుదూరమైన ప్రయాణం చేస్తామనిగానీ లేదా ఇంత సుసంపన్నమైన అనుభూతి ఐశ్వర్యానికి వారసులు కాగలమని గానీ ఊహించలేదు. అసలు అప్పుడు మాకెవ్వరికీ మా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అప్పటి మా జీవితాల్లో మేము చూసిన లేమి, కష్టం, అశాంతి- వీటిఫలితంగా మేమెలా మారి ఉండాలి! ఆ చిన్ననాటి చేదుఫలాన్ని మరింత కటువుగా నలుగురికీ పంచే విషవృక్షాలుగా ఎదిగి ఉండాలి కదా! అందులోనూ మా అక్క పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కావు. కాని ఆ చేదుజీవితం ఇలాంటి మధురపుష్పాలు పూసిందేమిటి? ఇలాంటి అమృతఫలాలు కాసిందేమిటి?
నువ్వు ఏది నాటితే దాన్నే కోసుకుంటావు అనేది నానుడి. కాని మా అక్క జీవితంలోంచి ఇంత సుమానుషం గంపలకెత్తింది అంటే ఆమె అనుభవించిన సుఖదుఃఖాలకన్నా మించిన ఓషధులేవో ఎవరో ఆమె హృదయంలో నాటి ఉండాలి కదా! అవేమిటి? జీవితం నీతో విషం తాగిస్తే, నువ్వు తియ్యని పాట పాడుతున్నావంటే, ఆ తీపిదనం నీలో పుట్టుకనుంచే ఉందా? లేక నువ్వేది ఆరగించినా దాన్ని క్షీరంగా మార్చుకునే రహస్యవిద్య ఏదైనా నీకు కరతలామలకమయ్యిందా?
ఈ రోజు చిన్న చిన్న కష్టాలకే లోకం మీద ఆగ్రహం ప్రకటిస్తున్న రచనలు చూస్తున్నాను. ప్రపంచం మీద తాము తీర్చుకోవలసిన ప్రతీకారం ఇంకా మిగిలే ఉందని ప్రసంగిస్తున్న వాళ్లని చూస్తున్నాను. ఏ కష్టమూ లేకపోయినా, జీవితం అన్ని విధాలా సౌకర్యవంతంగా అమిరి ఉన్నా కూడా, మనుషుల మీద విరుచుకు పడటం ఒక యుగధర్మంగా భావించి తాము కూడా నాలుగు మాటలు అనడానికి ఉత్సాహ పడుతున్నవాళ్ళనీ వింటున్నాను. ఇటువంటి కాలంలో, ఇటువంటి సమాజంలో ఈ పుస్తకం చదవగానే నాకు పట్టలేనంతగా కన్నీళ్ళు పొంగిపొర్లాయంటే ఆశ్చర్యమేముంది?
సాహిత్యం ఎరుకని కలిగించాలన్నమాట నిజమే గాని, ఆ ఎరుక దయగా మారడం మరింత అవసరం. లేకపోతే అది విరక్తిగా మారి నిన్ను ఈ లోకం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. కానీ అక్కకి సాహిత్యమూ, కళలూ, జీవితానుభవాలూ ఎరుకనివ్వడంతో పాటు ఆమెని దయామూర్తిగా కూడా మార్చేయి. అదే! అదెలా సాధ్యమయ్యింది?
ఎలా సాధ్యమయ్యిందో తెలియాలంటే ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, కళ్ళకి నీళ్ళు అడ్డుపడుతున్నా సరే.
21-7-2023
మహాద్భుతం ఈ మీ పరిచయం.
ధన్యవాదాలు
దయ మాట పలకడమే మంత్రం లాంటిది.
దయచుట్టంబౌ అనిశతక్కారుడు చెప్పింది జీవితంలో ప్రతిఫలిస్తే ఇలాంటి పుస్తకాలు వస్తాయి. అనుభవాలు వస్తాయి
పుస్తకం లోని శేఫాలికలకు దీటైన ముందుమాట.
ధన్యవాదాలు మేడం
జీవితం నీతో విషం తాగిస్తే, నువ్వు తియ్యని పాట పాడుతున్నావంటే, ఆ తీపిదనం నీలో పుట్టుకనుంచే ఉందా? లేక నువ్వేది ఆరగించినా దాన్ని క్షీరంగా మార్చుకునే రహస్యవిద్య ఏదైనా నీకు కరతలామలకమయ్యిందా? 🙏
నమః
” జీవితం నీతో విషం తాగిస్తే, నువ్వు తియ్యని పాట పాడుతున్నావంటే, ఆ తీపిదనం నీలో పుట్టుకనుంచే ఉందా? ”
ప్రతి మనిషికీ ఇంత కన్నా ఏ పాఠం కావాలి?
ఈ వాక్యం ఒక పుస్తక సమానం. సర్
ధన్యవాదాలు రామ్ భాస్కర్
ఆవిష్కరణకు ముందే మీనుండి ‘కొన్ని శేఫాలికలు’ అందుకోవడం ఓ వరమయితే, పుస్తకం తెరవగానే మీ మాష్టారు మల్లంపల్లి శరభయ్య గారి గురించి చదవడం ఓ ఆశ్చర్యం. ఎందుకంటే.. చిలుక జోస్యం లో తీసిన కార్డులా- ఆ శేఫాలికనే మునుముందుగా కనిపించి, మీతో పంచుకున్న ఆకాలానికి అనువాదంలా తోచింది. మాష్టారు గారు విశ్వనాథవారి నుండి ఏం పొందారో- ఆ రెండుగంటల సమయంలో జీవితకాలానికి సరిపడేంత ఫలశ్రుతి నేను పొందాను. అక్కగారికి అభినందనలు.
హృదయపూర్వక ధన్యవాదాలు
మీ మాటలు హృదయాన్ని కదివించాయ్ సర్.మీ అక్కగారి గొప్పదనాన్ని మీరు మాటల్లో అద్భుతంగా పొందుపరిచారు.
ధన్యవాదాలు
అక్కయ్య గారి పెంపకం లో పెరిగిన పారిజాతపు మొక్క మీరు. మీ నుండి పూసిన పూలన్నీ శెఫాలికలే.
నేను కూడా చాలావరకు చదివాను, స్పందించాను,అద్భుతమైన,ఆలోచచనాత్మక
వ్యాసాలు.ఒక్కొక్కటీ ఒక్కొక్క రస గుళిక.
ధన్యవాదాలు మాష్టారూ
నమస్కారం, ఒక్కొక్క శేఫాలిక చదివినపుడు నేనిలాగే కళ్ళునీళ్ళతొ నిండుకున్నాయి.అలాగే స్పందించాను.నిజమే ఇప్పుడు పుస్తకంగా రావటం, ఒక్కసారి దోసిలిలొ నిండుకున్నాయి. ఆ పరిమళాల్ని ఆస్వాదించాలి!!
ధన్యవాదాలు
ఎంత చక్కని పరిచయం మీ పరిచయ వాక్యాలు చదువుతుంటే వ్యాసాలు చదవాలనే ఆశక్తి కలుగుతోంది
తప్పకుండా చదవండి
ఇంత అనుభూతి కలిగించిన పుస్తక ఆవిష్కరణ ఈ మధ్యకాలంలో విజయవాడ లో జరగలేదు Sir , memories to cherish for long
ధన్యవాదాలు సార్
సారంగ పత్రికలో 36 శేఫాలికలు చదివి ఒక సంపుటంగా వస్తే బాగుంటుందని వీరలక్ష్మీదేవిగారితో అంటే త్వరలోనే రాబోతోందని చెప్పారు.
చాలా దూరంగా ఉండటం వల్ల పుస్తకావిష్కరణోత్సవానికి హాజరు కాలేకపోయాను.
ఎప్పుడెప్పుడు వస్తానా, పుస్తకం చదువుతానా అనిపిస్తుంది. మీ ముందుమాట చదివాక అది మరీ ఎక్కువయింది.
ధన్యవాదాలు సార్