ఆ దేవదా, ఆ పారు, ఆ చంద్ర

నందకిశోర్ చెప్పినట్టు ‘నిజంగా ఎప్పట్లాంటిది కాదీ వాన. నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది’.

ఎంట్లాంటి వాన! ఎన్నేళ్ళయ్యింది ఇలాంటి ముసురుపట్టిన రోజుని చూసి! పొద్దున్నే లేవగానే కిటికీ తెరవగానే లోకమంతా తడిసిపోయి కనిపించింది. చైత్ర, వైశాఖాల్లో పూలు పూసి, నిండా పక్షుల్తో అథితిగృహంలాగా కలకల్లాడిన దిరిసెన చెట్టు వీథిచివర వానలో తడిసిపోతూ, అతిథులెవ్వరూ రాని అతిథిగృహంలాగా ఉంది. వానకి నల్లబడ్డ కొమ్మలు, ఈనెలు, ఆ గుబుర్లమధ్య ఇప్పుడు కొత్తగా ఒక వెలుగు పూత. నా మనసంతా మృదులమైపోయింది. ఎవరితో నైనా కొత్తగా స్నేహం మొదలుపెట్టాలనిపించింది. ఎవరికేనా ప్రేమలేఖ రాయాలనిపించింది. ఎవరితోనైనా కలిసి ఆ ముసురుజల్లులో ఎక్కడికో ఆగకుండా ఏదేనా ప్రయాణం చేస్తూ ఉండాలనిపించింది. వానగాలి గదుల్లోకీ ప్రసరిస్తుంటే ఎప్పటివో సుకుమారమైన అనుభవాలు, అవి తటస్థించినప్పుడు మరేదో ధ్యాసలో ఉండిపోయినవి, ఇప్పుడు తీరిగ్గా నా చుట్టూ మూగినట్టనిపించింది. ఏదో చదవాలని, ఏవో పాటలు వినాలని, ఎవరేనా ఈ లోకానికి చెందని మాటలేవేనా చెప్తుంటే వింటూ ఉండాలని..

ఆ ఊహల్లోంచే ఎవరో చెవిలో చెప్పినట్టుగా, యూ ట్యూబ్ తెరిచి సైగల్ ‘దేవదాసు’ తీసాను. వినడమే తప్ప, ఇన్నాళ్ళూ చూడలేకపోయిన సినిమా. ఇప్పుడు చూడొచ్చని కూడా ఇన్నాళ్ళూ తట్టని సినిమా. కాని ఆగీ, ఆగీ ఈ రోజంతా, రాత్రి పొద్దుపొయ్యేదాకా, ఆ సినిమాతోనే గడిపాను. మళ్లా ఆ దేవదా, ఆ పారు, ఆ చంద్ర, ఆ గోవిందపురం, ఆ కలకత్తా-

‘మీరు దేవదాస్ నవల చదివేరా?’ అనడిగాడు పరేశ్ దోశి, 1996 లో ఒక రాత్రి, మెహిదీపట్నం సెంటర్ లో. ఆ రోజో, అంతకుముందో, బిమల్ రాయ్ రెట్రాస్పెక్టివ్ లో దేవదాస్ చూసిన సందర్భం అది.

దేవదాస్ చదవకుండానే నేనింతదూరం ప్రయాణించి ఉంటానని అతడెలా అనుకుంటున్నాడు అనిపించింది. కాని ఆ మాట పైకి అనలేకపోయాను.

‘అదేం ప్రశ్న?’ అన్నాను.

‘అంటే ఈ మధ్య మళ్ళా చదివేరా అని?’

లేదన్నాను. నాగార్జున సాగర్ లో జూనియర్ కాలేజిలో వానాకాలపు ఆదివారాల్లో సగం దాకా దుప్పటి కప్పుకుని, వ్రతం పట్టినట్టుగా శరత్ ని చదివిన రోజులు గుర్తొచ్చాయి. శ్రీకాంతుడి భ్రమణగాథ, చరిత్రహీనులు, గృహదహనం, బడదీది.

‘అందరూ చదివినట్టే, నేనూ నా నవయవ్వనదినాల్లో చదివాను’ అన్నాను.

‘అదే, అందుకే అడుగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు చదవండి. ఆ పేజీల్లో లైన్లు కాదు, బిట్వీన్ ద లైన్స్ చదవండి’ అన్నాడు పరేశ్, అతడికి హృదయం ఉండవలసినచోట, ఒక లేతగులాబీ పువ్వు ఉందనే నాకిప్పటికీ నమ్మకం.

ఆ మర్నాడో, ఆ వారంలోనో, దేవదాసు నవల సంపాదించి చదివాను. అతను చెప్పిన మాట నిజమే. ఆ నవల నేను అంతకుముందు చదవలేదనిపించింది. అప్పటికే తెలుగు దేవదాసు సినిమా చూసి ఉన్నా కూడా, బిమల్ రాయ్ సినిమాలోనే దేవదాసు కథ కొత్తగా చూసినట్టు.

కాని, ఇవాళ పి.సి.బారువా తీసిన ఈ దేవదాస్ (1936) చూస్తో ఉంటే, నేను ఇంతకుముందు చదివిన నవలా, ఇంతకుముందు చూసిన రెండు దేవదాసులూ, వేదాంతం రాఘవయ్య, బిమల్ రాయ్- పక్కకు పోయాయి. నిన్ననే ఎవరో మళ్ళా కొత్తగా దేవదాస్ సినిమా నలుపు-తెలుపులో తీసి ఉంటే అది చూస్తున్నట్టే ఉంది.

సినిమా చూడబోతూ, సైగల్ పాటల కోసం ఈ సినిమా చూడబోతున్నాను అనుకున్నాను. కాని గాయకుడు సైగల్ కన్నా తెరమీద కథానాయకుడు సైగల్ మరింత విభ్రాంతకరంగా ఉన్నాడు. దేవదాస్ అంటే అతడే అన్నట్టుగా ఉన్నాడు. సినిమా తీసిన 90 ఏళ్ళ తరువాత చూస్తున్న నాకే ఇలా ఉంటే, ఆ రోజు ప్రేక్షకులకి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోగలుగుతున్నాను.

పాటలు తప్ప దేవదాస్ లో మళ్ళా కొత్తగా చూసేది ఏముంటుంది అనుకున్నాను. కాని ఈ రోజు సినిమాలో పాటలది రెండో స్థానమే. అసలు ఆ కథ, ఆ కథనం, ఆ సన్నివేశాలు, ఆ సంభాషణలు- అచ్చం నవల చదువుతున్నట్టే ఉంది. తెలుగు దేవదాసులో ఎంతకాదన్నా, కథ చుట్టూ చాలా embellishment ఉందనిపించింది. బిమల్ రాయ్ దేవదాస్ లో ఒక విషాద కావ్యాన్ని లేసువస్త్రంలో చుట్టినట్టుగా చాలా sophistication ఉందనిపించింది. బహుశా, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నప్పుడే బిమల్ రాయ్ తన మనసులో తన దేవదాసు ని చిత్రీకరించుకుంటూ ఉండి ఉండవచ్చు. కాని ఈ సినిమాలో అన్నిటికన్నా నాకు నచ్చిందేమంటే, ఆ కథని దాటి దర్శకుడు ఒక్క అడుగు కూడా పక్కకి వెయ్యలేదు. అయినా కూడా రెండు గంటల నిడివి దాటిన సినిమా. ఎందుకని? ఎందుకంటే, ఆ పాత్రల్ని, ఆ సంఘర్షణని, ఎటువంటి వ్యాఖ్యానం లేకుండా మనముందు ఆవిష్కరించాలనుకున్నాడు కాబట్టి.

సైగల్, కె.సి.డే ల గానం, పార్వతి, చంద్రముఖిల presence, ఇక సైగల్, సినిమా ఆద్యంతం, అతడు దేవదాసుగానే మనకి కనబడతాడు. ఏమాశ్చర్యం! సైగల్ ఎవరో నాకు తెలుసు. ఫోటోలు చూసి ఉన్నాను. కానీ తీరా తెరమీద ఆ సైగల్ పక్కకు తప్పుకుని దేవదాసునే కనబడుతూ ఉన్నాడు.

పట్టుమని వందపేజీలు కూడా లేని ఈ నవల ఇరవయ్యవ శతాబ్ది భారతదేశాన్ని ఎందుకని అంతలా స్పందించగలిగింది? ఇంతకన్నా గాఢమైన అన్వేషణ, సంఘర్షణ ఉన్న శ్రీకాంత్ కన్నా, ఇంతకన్నా నాటకీయంగా ఉండే గృహదహనం కన్నా, ఇంతకన్నా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిన శేషప్రశ్నకన్నా, ఎందుకని, ఈ కథ భారతీయ పాఠకుణ్ణీ, ప్రేక్షకుణ్ణీ అంతగా స్పందింపచేయగలిగింది?

పరేశ్ చెప్పాక ఆ నవల మరో సారి చదివినప్పుడు నాకు ఒకటనిపించింది. దేవదాస్ కథలో రసస్ఫూర్తి దేవదాసు, పార్వతిల మధ్య, చంద్రముఖి, దేవదాసులమధ్యా తలెత్తిన ప్రేమలోకన్నా, ఆ ప్రేమకీ, సామాజిక నియమాలకీ మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు, వారు పాటించిన సున్నితమైన మర్యాదలో ఉందనిపించింది. వాళ్ళ ప్రేమ, దేవదాసు-పార్వతిల విషయంలో చిన్నతనపు ఉద్వేగాన్నీ, చంద్రముఖి విషయంలో ‘సగం మటుకే నాటుకుని, ఊడబెరుక్కోలేని ప్రణయశరఘాతాన్నీ’ దాటి పరస్పర స్నేహంగా వికసించడంలో ఉంది. వాళ్ళు తమకి తెలియకుండానే, స్త్రీపురుషుల మధ్య వికసించగల స్నేహాన్ని అందుకోగలిగారు. బిగ్గరగా ఆదర్శాలు వల్లించకుండానే, నీతిపాఠాలు చెప్పకుండానే, ఆ ముగ్గురూ, వ్యవస్థ పరిమితుల తాలూకు క్రూరత్వాన్ని జయించగలిగారు.

ముప్ఫై ఏళ్ళకింద అనిపించిన ఆ అభిప్రాయం ఈ సినిమా చూస్తున్నంతసేపూ నాకు ధ్రువపడుతూనే ఉంది. తనని పెళ్ళిచేసుకుంటావా అని అర్థరాత్రి పార్వతి దేవదాసు ఇంటికి వెళ్ళి అడగడం నిజంగా సాహసోపేతమైన సన్నివేశం. కాని అదే పార్వతి తనకు పెళ్ళయ్యాక, మరోసారి దేవదాసుని కలిసి అతణ్ణి తాగుడుమానమని చెప్పడం, తనకి ఎవరేనా మంచి పిల్లని చూసి పెళ్ళి చెయ్యమని దేవదాసు అడుగుతుంటే, అతడు పరిహాసం ఆడటం లేదుకదా, అతడు నిజంగానే అలా కోరుకుంటే ఎంత బాగుణ్ణు అని పార్వతి అనుకోవడం- సాధారణంగా ఈ రెండో సన్నివేశం మనకి గుర్తుండదు. మొదటి సన్నివేశమే గుర్తుపెట్టుకుంటాం. కాని పార్వతి, దేవదాసు చిన్నప్పణ్ణుంచీ, ఆడుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకున్నామని అనుకున్నారేగాని, నిజంగా, వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నది ఆ రెండో సారే. పార్వతి మళ్లా అర్థరాత్రి దేవదాసు దగ్గరికి వచ్చినప్పుడే.

ఈ సినిమాలో చంద్రముఖి చాలా ఎత్తులో కనిపించింది. ఆమెని దేవదాసు అసహ్యించుకున్నాడనీ, తర్వాత తర్వాత ఆమె చేసిన సపర్యకి మనసు మారి, ఆమెని ఈ జన్మలో కాక, మరో జన్మలో అంగీకరించగలిగే మనఃస్థితికి చేరుకున్నాడనీ అర్థం వచ్చేటట్లుగా తెలుగుసినిమాలో చూపించినట్టు గుర్తుంది. కాని ఈ సినిమాలో దేవదాసు, నిజమే, చంద్రముఖిని అసహ్యించుకున్నాడు, ఆమె వృత్తిని నానా మాటలూ అన్నాడు. కాని ఆ తర్వాత దేవదాసు తాగుబోతుగా మారాక, చంద్రముఖి చెప్తుంది: ‘నువ్వు నా వృత్తిని ఎంత అసహ్యించుకున్నావో, తాగుబోతుల్ని నేను అంత అసహ్యించుకుంటాను. కాని నిన్ను చూస్తే నాకు అసహ్యం కలగడం లేదు, బాధ కలుగుతోంది’ అని. ఆ సన్నివేశంలో దేవదాసు, చంద్రముఖి ఇద్దరూ కూడా, మొదటిసారిగా, సమతలం మీద నిలబడ్డారు. ఇద్దరూ సంఘం దృష్టిలో పరిచ్యుతులే. అప్పటిదాకా, వారి వారి విలువల్ని బట్టి, ఒకరి దృష్టిలో మరొకరు కూడా పరిచ్యుతులే. కాని ఆ సన్నివేశం తర్వాత, దేవదాసుకి అర్థమయింది, ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరేనా ఒక మనిషి ఉంటే, అది చంద్రముఖి మాత్రమే అని. ఆ ఎరుకకి దేవదాసుతో పాటు మనం కూడా చేరుకునేటట్టుగా తీసాడే, అది దర్శకుడు ఈ సినిమాలో సాధించిన పతాక.

‘బాధ వల్ల ప్రపంచం పరాయిదవుతుంది. మనలాగా బాధపడే మరొక మనిషి కనిపించినప్పుడు అప్పటిదాకా పరాయిగా తోచిన ప్రపంచం సొంతప్రపంచంగా మారుతుంది’ అని నేను ఎప్పుడో ఒక కథలో రాసుకున్నాను. ఆ రోజు నేను రాసుకున్న మాటలు ఈ రోజు నాకు మళ్ళా అర్థమయ్యాయి.

పార్వతిని పెళ్ళిచేసుకోలేకపోయినందుకు దేవదాసు భగ్నప్రేమికుడై తాగుబోతుగా మారాడనేది పైపై కథ. దేవదాసుకి తండ్రి, తల్లి, అన్న ఉండికూడా అతడికి ఏమాత్రం లేనట్టుగా ఉండటం, చివరికి అన్న తనని డబ్బుకోసం మోసం చేస్తున్నాడని తెలిసి కూడా దేవదాసు ఆస్తి వదులుకోవడం మనం మర్చిపోకూడదు. మహాత్మాగాంధీ పెద్దకొడుకు జీవితచరిత్ర అనువాదం చేసినప్పుడు కూడా నాకు ఇదే అనిపించింది. హరిలాల్ గాంధీ భార్య చంచల్ అర్థాంతరంగా చనిపోకపోయి ఉంటే హరిలాల్ అలా అయ్యుండేవాడు కాడు అని చెప్పగలం. దేవదాస్ సమస్య తన ప్రేమతో కాదు, పార్వతితో కలిసి ఉండలేకపోవడమూ కాదు, తన ఇష్టం, తన క్షేమం కోరుకునే ఒక్క మనిషి అతడికి దొరికినా కూడా అతడు సంతోషంగా జీవించగలిగి ఉండేవాడు. చివరికి చంద్రముఖిలో అతడు అటువంటి మనిషిని చూసాడు. కాని ఆమె అతణ్ణి ప్రేమిస్తో ఉంది. నిష్కల్మషమైన ఆ ప్రేమని స్వీకరించగల శక్తి తనకు లేదని దేవదాసుకు అర్థమయింది. డాస్టొవిస్కీ Idiot నవల్లో కథానాయకుడి గురించి ఎవరో అంటారు, అతడికి ప్రేయసి కాదు, ఒక నర్సు అవసరం అని. దేవదాసుకి ఒక సోదరి ఉండి ఉంటే, బహుశా అతడి కథ మరోలా ఉండి ఉండేది. ఎవరో (బహుశా కె.వి.రమణారెడ్డి అనుకుంటాను) దేవదాసు పతనమైపోతున్న జమీందారీ వ్యవస్థతాలూకు కథ అని రాసింది నా చిన్నప్పుడు చదివినట్టు గుర్తుంది. నిజమా? దేవదాసు కింగ్ లియర్ లాంటి కథ. దాన్ని ఒక కాలానికి కట్టిపడెయ్యలేం. అది ప్రేమరాహిత్యం తాలూకు కథ. ఏ కాలంలో కుటుంబసంబంధాలు మర్యాదసంబంధాలుగానూ, పెళ్ళిళ్ళు పరువువ్యవహారాలుగానూ ఉంటాయో, అటువంటి ప్రతికాలంలోనూ దేవదాసులు పుట్టుకొస్తూనే ఉంటారు.

ఆ పాటలు – ‘బాలం ఆయే బసో మోరే మన్ మే’, ‘దుఃఖ్ కే అబ్ దిన్’- నా రక్తంలో కలగలిసిపోయిన ఆ పాటలకన్నా కూడా ఇవాళ ఆ సన్నివేశాల గురించే, ఆ ముగ్గురి గురించే మళ్ళా మళ్ళా మాట్లాడుకోవాలని ఉంది. ఇన్నాళ్ళూ పార్వతీ, చంద్రముఖి బలమైన వ్యక్తిత్వాలున్న రెండు స్త్రీపాత్రలనీ, దేవదాసు బలహీనుడైన పురుష పాత్ర అనీ అనుకుంటూ వచ్చాను. కాదు, దేవదాసు వ్యక్తిత్వం కూడా అంతే బలమైంది. రామాయణంలో పాత్రలన్నీ అయితే రాముడికి అభిమానులుగానో, అనుచరులుగానో లేదా శత్రువులుగానో మారకుండా ఉండలేరనీ, ఒక్క సీత మాత్రమే రాముడితో సమానమైన పాత్ర అనీ ఎక్కడో చదివాను. ఒక పురుషుడు, ఒక స్త్రీ సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటే అది రామకథ. ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు అంతే బలమైన వ్యక్తిత్వాలు కలిగిఉంటే!

దేవదాసు, పార్వతి మరణించారు కాబట్టి అది విషాదాంతకథ అని అనుకుంటూ ఉన్నాం. కాని వాళ్ళు మరణించని విలువల్ని నిలబెట్టుకున్నారని సగటు భారతీయ పాఠకుడికీ, ప్రేక్షకుడికీ తెలిసినందువల్లే ఆ కథ ఇన్నేళ్ళయినా సజీవంగా నిలబడిందని అనుకుంటున్నాను.

20-7-2023

19 Replies to “ఆ దేవదా, ఆ పారు, ఆ చంద్ర”

  1. ఎన్నిసార్లు చూసినా…. పాత్రల్ని దాటి సినిమా చూడలేక పోయాను సర్. నిజమే సన్నివేశం మనసుని హత్తుకునేలా చేయడం సెగల్ కే సాధ్యమైంది.. ఈ ముసురులో మళ్ళీ ఒకసారి చూడాల్సిందే సర్ బాగా గుర్తు చేశారు థాంక్యూ ☺️🙏

  2. ఒక పురుషుడు, ఒక స్త్రీ సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటే అది రామకథ. ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు అంతే బలమైన వ్యక్తిత్వాలు కలిగిఉంటే!

    కలిగి ఉంటే…???

    ఎన్నో వాదోపవాదాలకు, జవాబు దొరకని ప్రశ్నలకు… సమాధానమిది.

    చలిగాలి సంవేదన పరిపూర్ణం.

    1. మీ విశ్లేషణ ఎప్పుడూ ప్రత్యేమే!
      తెలుగు దేవదాసు సినిమా చిన్నతనం లో చూడటం..ఏడవడం అంతేకాని..పుస్తకం చదవలేదు. ఇహ పెద్దయ్యాక విషాదాల కి అంతగా చలించ మేమో..
      సైగల్ సినిమా యూట్యూబ్ లో వుంటే చూస్తాను.
      ధన్యవాదాలు.🙏

  3. అద్భుతమైన విశ్లేషణ సర్..

  4.  దేవదాసు కింగ్ లియర్ లాంటి కథ. దాన్ని ఒక కాలానికి కట్టిపడెయ్యలేం. అది ప్రేమరాహిత్యం తాలూకు కథ. ఏ కాలంలో కుటుంబసంబంధాలు మర్యాదసంబంధాలుగానూ, పెళ్ళిళ్ళు పరువువ్యవహారాలుగానూ ఉంటాయో, అటువంటి ప్రతికాలంలోనూ దేవదాసులు పుట్టుకొస్తూనే ఉంటారు.
    విశ్లేషన బాగుంది

  5. ‘దేవదాసు బలహీనుడైన పురుష పాత్ర అనీ అనుకుంటూ వచ్చాను’.. నేను కూడా, బహుశా చాలా మంది. ‘కాదు, దేవదాసు వ్యక్తిత్వం కూడా అంతే బలమైంది’ అని అనిపిస్తోంది ఇప్పుడు చదివాక.

  6. ‘బాధ వల్ల ప్రపంచం పరాయిదవుతుంది. మనలాగా బాధపడే మరొక మనిషి కనిపించినప్పుడు అప్పటిదాకా పరాయిగా తోచిన ప్రపంచం సొంతప్రపంచంగా మారుతుంది’
    ఎంత నిజం!
    బాధ కి సరైన వివరణ,
    చాలా బాగా చెప్పారు

  7. “ఒక పురుషుడు ,ఒక స్త్రీ సమానమైన వ్యక్తిత్వం కలిగి వుంటే అది రామ కథ.
    అదే ఒక పురుషుడు ,ఇద్దరు స్త్రీలు అంతే బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే ”
    ఇలాంటి ఎన్నో నిశితమైన పరిశీలనలు చోటు చేసుకున్నాయి మీ విశ్లేషణలో…
    కాని
    ఈనాటికీ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా!
    ఎన్నో ఆధునిక విద్యలు నేర్చుకుంటున్నాము.
    ఇప్పుడు అన్నీ ఆర్థిక విలువలు మాత్రమే
    ఆత్మీయ విలువల కు చోటు ఉందా
    వివాహబంధాలకు విలువలు లేదు.
    హృదయ సంబంధమైన ప్రేమలకు చోటు దక్కడ లేదు.
    ప్రస్తుత సమాజంలో ఏ కొందరో తప్ప
    మొత్తం సమాజం బండ బారిపోయింది.
    సున్నితత్వం ఎక్కడుంది sir

  8. నా కౌమార వయస్సులో బందరులో చూశాను. చూశాను అనే కంటే మా నాన్నగారు చూపించారు. ఆయనో కామెంట్ చేశారు. “ఈ సినిమా రిలీజయినప్పుడు మ్యాటిని చూసి ఏడుస్తూ మళ్ళా లైను లో టిక్కట్ల కోసం నిలబడే వాళ్ళం. ఆ లైనులో సగం మంది ఏడుస్తూ కనపడేవాళ్ళు.” ఆయన వ్యాఖ్య నాకెప్పుడూ గుర్తోస్తుంది. చెప్పలేని అనుభూతే కన్నీటికి కారణం కదా సర్.. అద్భుత విశ్లేషణ.

Leave a Reply

%d bloggers like this: