మరో గ్రంథాలయ ఉద్యమం

మంచికంటి వెంకటేశ్వరరెడ్డి ప్రకాశంజిల్లాకి చెందిన ఉపాధ్యాయుడు. చదువు ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమనేది అతనికి వట్టి నమ్మకం కాదు, అతడి జీవితాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం. గత ఇరవయ్యేళ్ళుగా అతడు చెయ్యని ప్రయోగం లేదు. కొన్నేళ్ళ కిందట అతడి శాంతివనం ప్రయోగాల గురించి విని అతడు పనిచేస్తున్న పడమటి నాయుడు పాలెం పాఠశాలకి వెళ్ళాను. ఆ అనుభవాలు ఇక్కడ మీతో పంచుకున్నాను కూడా.

నేను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టరుగా పనిచేస్తున్నప్పుడు తెలుగులో బాలసాహిత్యాన్ని, కౌమార సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో మంచికంటిని కో ఆర్డినేటర్ గా ఉండమని అడిగాను. అతను జిల్లావారీగా రచయితల జాబితాలు తయారు చేసి, వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి, గొప్ప కదలికనే తీసుకొచ్చాడు. రాష్ట్రవ్యాప్తంగా రచయితల్ని గుర్తించాక వారిలో కొంతమందితో విజయవాడలో ఒక వర్క్ షాపు కూడా నిర్వహించాం. కానీ ఆ తర్వాత నేను పాఠశాల విద్య సంచాలకుడిగా వెళ్ళడంతో, ఆ సమస్యల్లో తలమునకలై, బాలసాహిత్యకృషిని కొనసాగించడానికి మంచికంటికి తగిన తోడ్పాటుని ఇవ్వలేకపోయాను. నా తర్వాత వచ్చిన అధికారులు ఎందువల్లనో మంచికంటినుంచి పొందవలసిన సేవలు పొందలేకపోయారు.

కాని ఈ మధ్య నడివేసవిలో, రోజూ నిప్పులు కురుస్తున్న రోడ్లమీద మంచికంటి మరో గ్రంథాలయ ఉద్యమం కోసం ఒక మోటార్ సైకిల్ యాత్ర మొదలుపెట్టాడని తెలియగానే నిర్ఘాంతపోయాను. వట్టి సంకల్పమో, పట్టుదలనో మాత్రమే కాదు, ఏమైనా సరే తను అనుకున్నది సత్వరమే చేసి తీరాలన్న మొండితనం ఉంటే తప్ప అటువంటి పనులకి ఆ ఎండల్లో ఎవరూ పూనుకోరు. నేను హైదరాబాదులో ఉండిపోయానే, అతడితో కలిసి, ఆ మోటార్ సైకిలు మీదనే వెనకసీటుమీద కూచుని అతడితో కలిసి ఆ ప్రయాణం చెయ్యలేకపోయానే అని అనుకుంటూనే ఉన్నాను.

తనయాత్రలో మంచికంటి అనంతపురం నుంచి శ్రీకాకుళందాకా సాహిత్యాభిమానుల్నీ, పుస్తకప్రేమికుల్నీ, విద్యావేత్తల్నీ కలుసుకున్నాడు. వారందరిలోనూ ఉన్న పుస్తకప్రేమని మరోసారి రగిలించాడు. యాత్ర ముగించాక రెండు పనులు చేసాడు. ఒకటి తన యాత్రానుభవాల్ని పుస్తకంగా తీసుకురావడం. రెండోది వారందరిలోనూ వీలైనంతమందిని విజయవాడ పిలిచి భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడటం.

మొన్న ఆదివారం విజయవాడలో సర్వోత్తమ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఆ సమావేశానికి రెండు రాష్ట్రాలనుండీ పెద్ద ఎత్తున పుస్తకప్రేమికులూ, పిల్లల ప్రేమికులూ హాజరయ్యారు. ఆ సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించాడు. ‘ఏం చెయ్యాలి మనమంతా’ అని అడిగాను. ‘మరో గ్రంథాలయ ఉద్యమం ఇది’ అన్నాడు. నన్ను ప్రారంభోపన్యాసం చెయ్యమని అడిగాడు. ‘నాకు ఎందుకు ఈ గౌరవం?’ అని అడిగాను. ‘నా యాత్రకి మీరే స్ఫూర్తి కాబట్టి’ అని అన్నాడు. ఆ మాట ఆ పుస్తకంలో రాసాడు కూడా. ఆశ్చర్యపోయాను. అతనిలాంటివాళ్ళు నాకు స్ఫూర్తి అని అనుకుంటూ ఉంటాను. నా ఏ మాటలు పట్టుకుని లేదా ఏ ఆలోచనల్ని ఆలంబన చేసుకుని ఆ ఎర్రటి ఎండల్లో అతడు ఆంధ్రదేశమంతా తిరిగాడు?

మూడేళ్ళ కిందట నేను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా పనిచేయడమే కాక, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు పర్సన్ ఇన్ ఛార్జిగా కూడా వ్యవహరించాను. అప్పటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి గ్రంథాలయాలంటే గొప్ప ప్రేమా, వాటిని బలోపేతం చెయ్యాలనే గాఢమైన తపనా ఉండేవి. అందువల్ల మేమిద్దరం కలిసి కొన్ని పనులకి శ్రీకారం చుట్టాం. వాటిలో మొదటిది అప్పటికి ఏడేళ్ళుగా గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఏవో సాంకేతిక కారణాలవల్ల విజిలెన్సు డిపార్ట్ మెంటు లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిశీలించి పుస్తకాల కొనుగోళ్ళు ప్రారంభించడానికి ఎవరూ సాహసం చెయ్యలేకపోయారు. అప్పటి గ్రంథాలయ సంచాలకుడు మస్తానయ్య సాయంతో మేము ఆ అభ్యంతరాల్ని పరిశీలించి తిరిగి ప్రభుత్వ అనుమతి సంపాదించగలిగాం. ఆ తర్వాత గ్రంథాలయ శాఖ సంచాలకుడిగా వచ్చిన దేవానందరెడ్డి సహాయంతో దాదాపు ఆరువేల పుస్తకాల దాకా పరిశీలించి పుస్తకాల్ని కొనుగోలు చెయ్యడానికి అనుమతులు మంజూరు చేసాం. అలా పుస్తకాలు ఎంపిక చేసేటప్పుడు రచయితలు స్వంతంగా ప్రరురించుకున్న పుస్తకాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. అదంతా దాదాపు ఆరునెలలపాటు నిర్విరామంగా జరిగిన ప్రక్రియ.

అలాగే రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థల సెక్రటరీలందరితోనూ గుంటూరులో ఒక సమావేశం నిర్వహించాం. అందులో గ్రంథాలయాల్ని బలోపేతం చెయ్యడం కోసం చాలా నిర్ణయాలు తీసుకున్నాం. స్థానిక సంస్థలనుంచి రావలసిన సెస్సుల్ని రాబట్టడం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతోనూ, అత్యున్నత మౌలిక సదుపాయాల్తోనూ ఒక రాష్ట్ర గ్రంథాలయాన్ని నిర్మించడం, అన్ని గ్రంథాలయాల్నీ డిజిటైజ్ చేసి వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించడం, అంతేకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్తో కూడా అనుసంధానించడం వంటి చాలా నిర్ణయాలు ఆ సమావేశంలో తీసుకున్నాం.

ఆ సమావేశంలో చర్చిస్తున్నప్పుడు రాజశేఖర్ గారు ఒక విషయం మీద ఆశ్చర్యపోయారు. అదేమంటే, పాఠశాలలూ, గ్రంథాలయాలూ రెండూ కూడా ఒకే ప్రభుత్వశాఖ ఆధీనంలోనే ఉన్నా ఆ రెండు విభాగాల మధ్యా చెప్పలేనంత దూరం ఉండటం. ఆ దూరాన్ని పూడ్చటంకోసం సత్వరం ఏదైనా కార్యక్రమం చేపట్టాలని ఆయన చాలా గట్టిగా అనుకున్నారు. ఆ సంకల్పానికి అప్పటి సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ వెట్రిసెల్వి గారు, ఒకప్పుడు గ్రంథాలయ శాఖ సంచాలకులుగా పనిచేసిన పార్వతి గారు కలిసి We Love Reading, చదవడం మాకిష్టం అనే సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలమీద కూడా ప్రభుత్వం సమగ్రమైన ఉత్తర్వుల్ని విడుదల చేసింది. 2020 నవంబరులో గుంటూరులో అప్పటి ఉపముఖ్యమంత్రి సుచరితగారు, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ప్రతి ఆదివారం ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థుల్ని స్థానిక గ్రంథాలయాలకు తీసుకువెళ్ళాలి. కనీసం ఒక గంటసేపు పిల్లలు ఆ గ్రంథాలయంలో  గడపాలి. చదివిన పుస్తకాలమీద చరించాలి. వాళ్ళకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు పెట్టాలి. ఇటువంటి చాలా ఉద్దేశాల్తో ఆ కార్యక్రమం చాలా ఉత్సాహంగా నే మొదలయ్యింది.

ఇవి కాక పాఠశాల గ్రంథాలయాల్ని కూడా బలోపేతం చెయ్యడంకోసం చాలా ప్రయత్నాలు చేసాం. నేషనల్ బుక్ ట్రస్ట్, సాహిత్య అకాడెంఈ, పబ్లికేషన్స్ డివిజన్ లాంటి ప్రభుత్వ సంస్థలు పిల్లలకోసం రూపొందించిన పుస్తకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పాఠశాలలకు పంపించాం. కరోనా రోజుల్లో ఆ పుస్తకాల్ని పిల్లలకి ఇంటిదగ్గరే అందచేసాం. రోజూ ఒక పుస్తకం చొప్పున ఆ ఊళ్ళో ఉన్న పిల్లలంతా అన్ని పుస్తకాలూ చదివేలా సర్కులేటింగ్ గ్రంథాలయాలు నడిపాం. కరోనా రోజుల్లో చేపట్టిన ఇన్నొవేటివ్ కార్యక్రమాల్లో దాన్ని కూడా ఒక విలువైన ప్రయత్నం గా భారతప్రభుత్వం గుర్తించింది.

మాకు అన్నిటికన్నా పెద్ద కల గ్రంథాలయాలు గ్రామాల్లో లెర్నింగ్ అండ్ కల్చర్ సెంటర్స్ గా మారాలి అనేది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ కూడా ఉంది. ఆ ఓపెన్ స్కూల్ సొసైటీనీ, గ్రంథాలయ శాఖ నీ, వయోజన విద్యాశాఖ నీ సమన్వయం చేసి గ్రంథాలయాల్ని ఓపెన్ స్కూల్ లెర్నింగ్ సెంటర్స్ గా మార్చాలి అనేది కూడా ఒక ఆలోచనగా ఉండింది. నా ఉద్యోగ జీవితంలో నేను నెరవేర్చుకోలేకపోయిన కలల్లో ఇది కూడా ఒక కలగా మిగిలిపోయింది.

కాని ఆ రోజు నేను ప్రారంభోపన్యాసం చెయ్యడానికి లేచి నిల్చున్నప్పుడు గ్రంథాలయాలు పునరుజ్జీవం కావడానికి ప్రభుత్వమూ, పాఠశాల విద్యాశాఖా, ఉపాధ్యాయులూ చెయ్యగలిగేది చాలా స్వల్పమని అనిపించింది. తాడికొండలో మా హీరాలాల్ మాష్టారు తరచూ ఒక మాట చెప్తుండేవారు: ఆంధ్రదేశంలో స్వాతంత్య్రోద్యమం అంటే గ్రంథాలయ ఉద్యమమే అని. గ్రంథాలయ ఉద్యమ రథసారథి గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు దక్షిణభారతదేశంలో రాజద్రోహ నేరం మీద జైలుకు వెళ్ళిన తొలి స్వాతంత్య్ర వీరుడు కావడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణాలో కూడా అంతే. తెలంగాణా విమోచన పోరాటాల స్ఫూర్తి గ్రంథాలయాల్లోనే మొదలయ్యింది కాబట్టే గ్రంథాలయ ఉద్యమాన్ని నిజాం ఉక్కుపాదంతో అణిచెయ్యాలని చూసాడు. ఈ చరిత్ర అంతా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది: అదేమంటే గ్రంథాలయాల్లో ఉన్నది కేవలం పుస్తకాలు కాదు. ఒక జాతికి స్వేచ్ఛని నూరిపోసే సాధనాలు. ఒక సమాజానికి క్రమశిక్షణ నేర్పే పాఠాలు. ఒక స్వాతంత్య్రపోరాటానికి ఒక ప్రభుత్వం ఎప్పటికీ నాయకత్వం వహించలేదు. అది ప్రజలే నడుపుకోవలసిన ఉద్యమం. ఆ మాటే చెప్పాను ఆ రోజు- పుస్తకాల పట్లా, గ్రంథాలయాల పట్లా ఆసక్తి పునరుజ్జీవం కావాలంటే మనం చూడవలసింది ప్రభుత్వం వైపూ, ప్రభుత్వోద్యోగుల వైపూ కాదు, ప్రజలవైపు, ముఖ్యంగా తల్లిదండ్రులవైపు అని చెప్పాను.

ఉద్యమాలు అనగానే మన దేశంలో మన కళ్ళముందు మనకు తెలీకుండానే కొన్ని దృశ్యాలు కదలాడుతుంటాయి- పెద్ద పెద్ద ఊరేగింపులు, నినాదాలు, అశేష ప్రజానీకాన్ని ఉద్దేశిస్తో గంభీరంగా వేదికలమీంచి చేసే ప్రసంగాలు, ధర్నాలు, రాస్తారోకోలు- కానీ నిజమైన ఉద్యమాలు వేదికలమీంచి పుట్టవు, ఊరేగింపుల్లోంచి పెరగవు. అవి మంచికంటి లాంటి దీక్షాపరులైన వ్యక్తుల స్ఫూర్తితో మొదలవుతాయి. చిన్న చిన్న బృందాల్లో వికసిస్తాయి. చిన్న చిన్న అడుగుల్తో ముందుకు నడుస్తాయి. అలా నెమ్మదిగా చాపకింద నీరులాగా సమాజమంతా వ్యాపిస్తాయి. ఒకరోజు తెల్లవారేసరికి ఉన్నట్టుండి మన చుట్టూ ఉన్న ప్రపంచమే మనకి కొత్తగా కనబడటం మొదలుపెడుతుంది. గ్రంథాలయ ఉద్యమానికి కూడా ఇదే దారి అని చెప్పాను.

ఈ మధ్య బెంగలూరులో మొదలైన ఒక పుస్తక పఠన ఉద్యమం గురించి కూడా ప్రస్తావించేను. ఈ ఏడాది జనవరిలో ఇద్దరితో మొదలైన ఆ ఉద్యమం జూన్ నెలకి 30000 మందికి వ్యాపించింది. అందులో భాగంగా ప్రతి ఆదివారం పుస్తకప్రేమికులు ఏదో ఒక పుస్తకం తీసుకుని ఏదో ఒక పార్కుకి చేరుకుంటారు. అక్కడ ఏదో ఒక్క చెట్టుకింద కూచుని ఆ పుస్తకం పూర్తిచేస్తారు. పిల్లలూ పెద్దలూ కూడా పెద్ద ఎత్తున్న పాల్గొంటున్న ఈ ఉద్యమం ఇప్పుడు విశాఖపట్టణానికి కూడా చేరిందని విన్నాను.

ఆ రోజు నేను చెప్పింది ఇటువంటి ఆలోచనలు మరికొన్ని కావాలనీ, పెద్ద ఎత్తున రావాలనీ. ఉదాహరణకి కవులూ, రచయితలూ పాఠశాలలకీ, కళాశాలలకీ, ప్రభుత్వ కార్యాలయాలకీ, ఫాక్టరీలకీ వెళ్ళవచ్చు. వారంలో ఒకరోజు ఒక లంచ్ అవర్ లో అరగంట సమయం పుస్తకపఠనం కోశం కేటాయించినా కూడా అది కార్చిచ్చు కాగలుగుతుంది. ఊహించండి, విద్యావంతులు పొలాలకూ, ఫాక్టరీలకూ వెళ్ళి పుస్తకాల గురించి మాట్లాడటం. ఆ మాటకొస్తే అంత దూరం కూడా పోనక్కర్లేదు. ప్రతి ఒక్క పుస్తకప్రేమికుడూ తానుంటున్న చోటనే, దీన్నొక neighborhood movement గా మార్చవచ్చు.

అలాగని సాంప్రదాయిక పౌర ఉద్యమాల అవసరం లేదని కాదు. స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేస్తున్న గ్రంథాలయ సెస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అయిదారువందల కోట్లు గ్రంథాలయ శాఖకు బదిలీ చెయ్యవలసి ఉంది. తెలంగాణలో కూడా కొన్ని వందల కోట్లు బకాయిలు ఉండి ఉండవచ్చు. వాటిని గ్రామీణ, పట్టణ స్థానికసంస్థలు వేరే అవసరాలకోసం మళ్లిస్తూ ఉన్నాయి. ఆ నిధుల్ని గ్రంథాలయాలకు వినియోగిస్తే రెండు రాష్ట్రాల్లోని గ్రంథాలయాల రూపురేఖల్నీ గణనీయంగా మార్చెయ్యవచ్చు. ఏ స్థానిక సంస్థ అయితే మూడేళ్ళకు మించి లైబ్రరీ సెస్సుల్ని తన దగ్గర అట్టేపెట్టుకుంటుందో ఆ జిలాపరిషత్ ఛైర్మన్ ని లేదా ఆ మునిసిపల్ ఛైర్మన్ ని అనర్హుడిగా ప్రకటించేటట్టు చట్టంలో మార్పులు ప్రతిపాదించాలి. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాల్లో కూడా ‘నాడు-నేడు’ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్యమంత్రిగారు ఎప్పుడో అంగీకరించారు. పాఠశాల విద్యాశాఖ ఆ నిర్ణయాన్ని అమలు చెయ్యాలి. అటువంటి ప్రయత్నమే తెలంగాణాలో కూడా చెయ్యవచ్చు. కనీసం ప్రభుత్వాలు ప్రచారాలమీద చేసే వ్యయాన్ని గ్రంథాలయాలమీదకు మళ్ళించినా కూడా అద్భుతాలు చూడవచ్చు.

మొన్న ఆదివారం ఆ సభలో పాల్గొన్న చాలామంది పుస్తకప్రేమికుల అనుభవాలు విన్న తరువాత బెంగలూరు ఉద్యమంలాంటి ఉద్యమాలు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్నాయనీ కాని వాటి గురించి మనకే తెలీదనీ అనిపించింది. ఉదాహరణకి విజయవాడలో ముంజులూరి కృష్ణకుమారిగారు ప్రతి ఆదివారం సర్వోత్తమ గ్రంథాలయంలో పిల్లలతో కూచుని దగ్గరుండి పుస్తకాలు చదివిస్తున్నారు. కరోనా, ఎండలూ కూడా ఆమె ప్రయత్నాన్ని ఆపలేకపోయాయి. వరంగల్ లో కాసుల రవికుమార్ చేపట్టిన లీడ్ లైబ్రరీ వినూత్న ప్రయోగం. ఆ రోజు రవి కుమార్ ప్రసంగం చాలా స్ఫూర్తిమంతంగా ఉండింది. జహీరాబాద్ లో డా.విజయలక్ష్మిగారు మన లైబ్రరీ పేరిట చేస్తూ వస్తున్న ప్రయోగాలు దేశమంతా వినదగ్గవి. ఆమె తన పిల్లవాడికి పుస్తకపఠనం అలవాటు చెయ్యడం కోసం మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు జహీరాబాద్ మొత్తం పట్టణానికే విస్తరించింది. అభ్యాసకృష్ణగారి అభ్యాస విద్యాలయం ఇంతవరకూ ఉత్తమ పాఠశాల అని మాత్రమే అనుకుంటూ ఉండేవాణ్ణి, కాను ఆ రోజు ఆయన అనుభవాలు విన్నాక, ఆ పాఠశాల పుస్తకపఠనానికి కూడా ఒక ఊయెలతొట్టెగా మారిందని అర్థమయింది. కుంచనపల్లిలోని అరవింద స్కూలు ప్రయోగాలు కూడా అంత విలువైనవీ అనిపించాయి. నల్గొండ శివార్లలో ఉన్న కేశిరాజుపల్లిలో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించి నడపడంలో తన స్వానుభవాన్ని స్కైబాబా వివరిస్తుంటే ఆ అనుభవాల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపించింది.

తక్కిన వక్తలు కూడ ఇటువంటివే ఎంతో స్ఫూర్తిదాయకమైన అనుభవాల్ని పంచుకున్నారు. వీటిగురించి నలుగురికీ తెలియాలి. ముఖ్యంగా కవులకీ, రచయితలకీ తెలియాలి. ఒకప్పుడు మన సమాజంలో పత్రికాసంపాదకులు స్ఫూర్తిప్రదాతలుగా ఉండేవారు. కాని వారిప్పుడు యాజమాన్యాల ప్రయోజనాలకోసం పనిచెయ్యడంలో తలమునకలుగా ఉన్నారు. ఎందుకంటే, తెలుగునేలమీద ఇటువంటి అద్భుతమైన ప్రయోగాలు జరుగుతూ ఉంటే ఒక్క సంపాదకుడు కూడా ఒక్క సంపాదకీయం కూడా రాసినట్టు నేను చూడలేదు. సినిమాతారల కుటుంబాల్లో జరిగే వేడుకల మీద ఉన్న ఆసక్తి మన టెలివిజన్ ఛానెళ్ళకి ఇటువంటి ప్రయత్నాల గురించి నలుగురికీ చెప్పడం మీద లేదు. అదేమంటే, ప్రజలకి వాటిమీదనే ఆసక్తి ఉంది కాబట్టి మేము కూడా వాటినే రిపోర్టు చేస్తున్నాం అంటారు. కాని వాళ్ళు మాట్లాడుతున్నది ఏ ప్రజల గురించి? ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు, ఇంతదాకానాదరణకి గురైనవారు, ఎస్.సి. ఎస్.టి, వెనకబడిన తరగతులవారు, స్త్రీలు, మైనారిటీ వర్గాల్లో చదువు పట్ల ఎంత తపన ఉందో నేను కళ్లారా చూసాను. ఆ మధ్య గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారితో కలిసి మేము అరకువేలీ దగ్గర ఒక పొరజా గ్రామానికి వెళ్ళాం. చాలా బీద గ్రామం. సరైన రోడ్డు కూడా లేదు. ‘మీరు నన్ను మీ ఊరికి పిలిచినందుకు మీకు వెంటనే ఏదైనా సాయం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఏమి కావాలి?’ అనడిగారు కమిషనర్ పద్మగారు. ఆశ్చర్యం, ఆ నిరుపేద పొరజా గ్రామస్థులు తమ ఊరికి లైబ్రరీ కావాలని అడిగారు!

ఇటువంటి ప్రయోగాలు రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో సి ఏ ప్రసాద్ గారికి కొట్టినపిండి. మొన్న తన యాత్రలో మంచికంటి ఆ ప్రయోక్తల్ని చాలామందిని స్వయంగా పోయి కలిసి వచ్చాడు. ఆదివారం జరిగిన సభ ఒక curtain riser. నావరకూ నాకు చాలా కనువిప్పు కూడా. ఈ ఉద్యమంలో నువ్వు నాకు ఏ పని అప్పగించిన చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వచ్చాను మంచి కంటితో.

19-7-2023

8 Replies to “మరో గ్రంథాలయ ఉద్యమం”

 1. కొడిగట్టీపోతున్న దీపానికి అరచేతులు అడ్డం పెట్టి కాపాడే ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
  మంచిని కన్న మంచికంటిని కనుగొన్న మనమందరం తోచిన సాయం ఈ ఉద్యమానికి అందించాలి.
  ” మంచికంటి వెనకాల కూర్చొని నేను ప్రయాణం చేద్దాం ” అనుకున్న మీ ఉత్సాహం అందరికీ ప్రేరణ కావాలి.
  క్షేత్ర స్థాయి వాస్తవికతను గుర్తించి మీరు చెప్తున్న మాటలు/ చేతలు మీ నిరాడంబర వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి.
  మంచి పూనిక పూనారు.
  సమధికోత్సాహం తో అందరం పాలు పంచుకుందాం.
  చిన్న మాట సార్ :
  ఐదు సంవత్సరాల క్రితం నేను డిప్రెషన్ లాంటి దానికి గురైనప్పుడు సేదతీరినది అమ్మఒడి లాంటి గ్రంధాలయం లో సార్. నన్ను పునరుజ్జీవింపజేసింది గ్రంథాలయం సార్.

 2. మీదీ ఒక ఉద్యమమే. తెలుసుకోవలసిన విషయాలను ఎంతో తెలియజెప్పడం మామూలు కాదు. వారికి మరు స్ఫూర్తి కావడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా గ్రంథాలయాలు జాతికి స్వేచ్ఛని నూరిపోసే సాధనాశ్రమాలు . ఒక సమాజానికి క్రమశిక్షణ నేర్పే పాఠశాలలు. Read a book , it leads your look అని నాకనిపిస్తుంది.

 3. మంచికంటి అన్న చేస్తున్న స్ఫూర్తివంతమైన పని సామాన్యమైనది కాదు.గ్రంధాలయం నిజంగా బతుకులు దిద్దే ఆలయమే…
  సమావేశానికి హాజరు కాలేక పోయాను.త్వరలో భాగస్వామిని అవుతాను.

   1. ప్రతి రోజు ప్రొద్దున్నే ఒక జ్ఞ్యాన నిధి నాకు లభిస్తుంది. కృతజ్ఞతలతో సరిపుచ్చలేను. గొప్ప పదాలుంటే వెదకాలి సార్.

Leave a Reply

%d bloggers like this: