ఆషాఢమేఘం-30

ఇప్పటివరకు మనం ప్రాచీన భారతీయ సాహిత్యాల్లో, అంటే సంస్కృతం, తమిళం, ప్రాకృతాల్లో తొలివానాకాలం చుట్టూ అల్లిన కవిత్వాన్ని చూసాం. ఈ కవిత్వాలన్నీ దాదాపుగా తొమ్మిదో శతాబ్దం కన్నా ముందటివి. ఇంకా చెప్పాలంటే అమరుకుడు, భర్తృహరి తప్ప తక్కిన కవులు, వాల్మీకితో సహా, దక్షిణభారతదేశానికి చెందినవాళ్ళే. కాళిదాసు మధ్యభారతానికి చెందినవాడేగాని, అది దక్షిణ భారతాన్ని ఆనుకున్న మధ్య భారతం.

దక్షిణ, మధ్యభారతదేశాల్లో ఈ కవిత్వం వికసిస్తూ ఉన్నప్పుడు ఉత్తరాదిన ఏం జరుగుతూ ఉంది? ధర్మశాస్త్రాలు, స్మృతులు, అర్థశాస్త్రం, కామసూత్రాలవంటి రచనలు ప్రభవిస్తూ ఉన్నాయి. వైదిక, బౌద్ధ, జైన, చార్వాక, మీమాసాది దర్శనాలు, సూత్రవాజ్ఞ్మయం వికసిస్తూ ఉంది. కాని ఆ వాదవివాదాల్తో నిమిత్తం లేకుండా, జీవితం గురించీ, ప్రపంచంగురించీ గాఢమైన చర్చల్తోనో, దార్శనిక మీమాంసలతోనో నిమిత్తం లేకుండా, పూర్తి ఐహిక, ఐంద్రియక, లౌకిక జీవితాన్ని ఒక ఉత్సవంలాగా జరుపుకోవడం మీదనే ఈ దక్షిణాది సాహిత్యాలు దృష్టిపెడుతూ వచ్చాయి. అంతేకాదు, ఈ కవిత్వాల్లో వ్యక్తి ప్రధానంకాదు, సమూహం ప్రధానం. ఆ సామూహిక భావోద్వేగాల్ని వ్యక్తి ఆలంబనగా కవులు ప్రతిబింబిస్తూ వచ్చారు.

భారతీయ సాహిత్యాల్లో పదవశతాబ్దం తర్వాత తమిళం తప్ప తక్కిన అన్ని దేశభాషల్లోనూ సాహిత్యాలు ప్రభవించడం మొదలుపెట్టాయి. తమిళంలో కూడా నాయనార్ల, ఆళ్వార్ల ప్రభావం వల్ల సరికొత్త సాహిత్యం వర్ధిల్లుతూ వచ్చింది. ఈ సాహిత్యాల్లో వర్షఋతు వర్ణనల్ని చూస్తే ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. పదవశతాబ్దానికి ముందటి సాహిత్యాల్లో కవిత్వాల్లో ఆషాఢమేఘమూ, తొలివానాకాలమూ ప్రధానంగా కనిపిస్తుండగా, పదవశతాబ్ది తర్వాత కవిత్వాల్లో మలివానాకాలం ప్రధానంగా కనిపిస్తోంది. తెలుగులో శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి కవులు వర్షఋతువుని వర్ణించేటప్పుడు కుంభవృష్టి కురిసే నడివానాకాలాన్నే వర్షించారు. ఉత్తరాది భక్తి కవుల కవిత్వాల్లో ఆషాఢమేఘాల స్థానంలో శ్రావణమేఘాలు వచ్చిచేరాయి. దేశభాషా సాహిత్యాల్లో చివరగా వచ్చి చేరిన ఉర్దూ కవిత్వంలో కూడా నడివానాకాలమే ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఆ వానల్లో ఆషాఢమేఘం చుట్టూ ఉన్న విరహం కనబడదు. ఆ ప్రవాసాలు, ఆ వియోగాలు కనిపించవు. వాటికి బదులు గాఢమైన ప్రేమోత్కంఠత కనిపిస్తుంది. ఆషాఢమేఘం చుట్టూ అల్లుకున్న కవిత్వం దాంపత్యజీవితంలోని విరహం చుట్టూ అల్లుకున్నది కాగా, శ్రావణమేఘాల చుట్టూ అల్లుకున్న కవిత్వానికి ఆ కవిసమయాలు, ఆ నిర్బంధాలూ లేవు.

పదవశతాబ్దం తర్వాత ఏమి జరిగింది? ఎందుకు ఆ అమాయికమైన గ్రామసీమల స్థానంలో, ఆ ప్రీతిస్నిగ్ధ జనపద వధూలోచనాల స్థానంలో కొత్తగా వచ్చిన కవిత్వం గాథాసప్తశతిలాగా, సంగం కవిత్వంలాగా ఎందుకు లేదు? పదవ శతాబ్ది తర్వాత వచ్చిన కవిత్వాలు రెండు ప్రధానశాఖలుగా విడిపోయాయి. ఒకటి, రాజాస్థానాల్లో వర్థిల్లిన కవిత్వం. రెండోది భక్తి కవిత్వం. ఇందులో పదవశతాబ్ది పూర్వపు కవిత్వాన్ని ఏదో ఒక రూపంలో కొనసాగించడానికి భక్తికవులే ప్రయత్నించారని మనకి అర్థమవుతూ ఉంది. నాయన్మార్ల, ఆళ్వారుల కవిత్వం ప్రజాదరణ పొందడానికి కారణం అవి సంగం కవిత్వపు పాదులో వికసించడమే అని రామానుజన్ రాసాడు. మహారాష్ట్రలో జ్ఞానదేవ్ విరహిణి అభంగాల వెనక గాథాసప్తశతి కవిత్వం ఉందని మనం గుర్తుపట్టవచ్చు. అవధ్, బ్రజ్ భాషల్లో వికసించిన హిందీ భక్తి కవిత్వం నిస్సందేహంగా ప్రాకృత, అపభ్రంశ కవిత్వాలకు వారసురాలు. కాని ఈ కొత్త కవిత్వాలేవీ కూడా ఒక కపిలార్ నో, ఒక నక్కీరర్ నో, ఒక కాళిదాసునో, ఒక హాలుణ్ణో, ఒక అనులక్ష్మినో, ఒక విజ్జికనో, ఒక శీలభట్టారికనో పుట్టించలేకపోయాయి. పదవశతాబ్దానికి పూర్వం కవిత్వంలో కనిపించే ఆ గ్రామసీమల్ని, ఆ మేఘాల్ని, ఆ పొలాల్ని, ఆ కొంగల్ని, ఆ నదుల్ని, ఆ పండగల్ని ఆ నిర్మలకాంతిలో మళ్ళా మనం ఆధునిక యుగం తలెత్తేదాకా సాహిత్యంలో చూడలేకపోయాం.

పదవ శతాబ్దానికి ముందూ, ఆ తర్వాతా అని నేను ప్రతిపాదిస్తున్న ఈ సరిహద్దుకి ఏదైనా ఒక విభజనరేఖని గుర్తుపట్టగలనా అని చూస్తే శ్రీమద్భాగవతం కనిపిస్తోంది. భాగవత మహాపురాణం అష్టాదశపురాణాల్లో ఒకటి. దాన్ని వ్యాసుడు రాసాడనే ప్రతీతి. కాని ఇటీవలి పరిశోధకులు అది 8-10 శతాబ్దాల మధ్యకాలంలో తమిళదేశంలో రాయబడ్డ పురాణంగా లెక్కేస్తున్నారు. కొందరి దృష్టిలో అది తమిళంలో ఆళ్వారులు ప్రభవించిన తర్వాత, ఆ ప్రభావంతో రాసిన పురాణం. పదవశతాబ్దం తర్వాతి భారతీయ భక్తి కవిత్వాల్ని భాగవతపురాణమే గణనీయంగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. తిరిగి మళ్లా ఆ భక్తికవిత్వాల వెలుగులో 18 వ శతాబ్దంలో ఆ పురణాన్ని మళ్ళా గణనీయంగా సవరించారని కూడా పరిశోధకులు చెప్తున్నారు. నిజానికి భారతీయ సాహిత్యం నుంచి పాశ్చాత్యప్రపంచానికి పరిచయమైన మొదటి రచన కూడా భాగవతమే. 1788 లో ఒక తమిళ ప్రతిని ఫ్రెంచిలోకి అనువదించడం ద్వారా భాగవతం యూరోప్ కి ప్రయాణించింది. ఉపనిషత్తులు కూడా ఆ తర్వాతే లాటిన్ లోకి అనువాదమయ్యాయి.

భాగవత పురాణం చేసిన ప్రధానమైన పని ఏమిటంటే అంతదాకా స్త్రీపురుషుల లౌకిక ప్రేమపైన దృష్టి పెడుతూ వచ్చిన సాహిత్యాన్ని భగవంతుడికీ, భక్తుడికీ మధ్యప్రేమవైపు మరల్చడం. ఈ మలుపు కి మూలాలు ప్రాచీన కాలం నుంచీ ఉన్నాయి. నారదభక్తి సూత్రాలు, శాండిల్య భక్తిసూత్రాలు, సంగం సాహిత్యంలోని పత్తుప్పాట్టులోని ఆట్రుప్పడై గీతాలూ, పరిపాడల్ లోని తిరుమల్, మురుగన్ ల పైన స్తోత్రాలూ పదవశతాబ్దానికి పూర్వకాలానివే. అయితే ఒక దీన, పరిత్యక్త హృదయానికి ఊరట కోసం సమాజకేంద్రంలోకాక, ఊరవతల వల్లకాటిలో కారైక్కల్ అమ్మైయ్యారు వెతుక్కోడంతో, కొత్త సాహిత్యం భక్తి సాహిత్యంగా భారతదేశంలో ప్రభవించింది. ఆమె స్ఫూర్తిగా నాయన్మార్లు, మాణిక్యవాచకర్, ఆళ్వారులు, రామానుజులు, కన్నడ వీరశైవ వచన కవులు, మహారాష్ట్ర సంత్ కవులు, అవధ్, బ్రజ్ భాషల భక్తికవులు, బెంగాలీ, అస్సామీ, మైథిలీ భాషల తొలి చర్యాగీత కవులు- వీరంతా భారతీయ కవిత్వం రూపురేఖల్ని మార్చేసారు. మరొకవైపు రాజాస్థానాల్లో కవులు కాలం తాకిడికి చెక్కుచెదరకుండా ఉండేలాగా ప్రబంధాల్ని నిర్మిస్తో ఉన్నారు.

అంతదాకా ఆషాఢమేఘం కవిత్వంలో ఏ భావోద్వేగాల్ని స్ఫురింపచేస్తో ఉన్నదో, భాగవతపురాణం వాటిని కృష్ణుడికి ఆరోపించింది. అంటే ఆషాఢమేఘం పదవశతాబ్దం తర్వాతనీలమేఘశ్యాముడిగా మారిపోయిందన్నమాట. ఇక ఆ తర్వాత దాంపత్యప్రేమకీ, దాంపత్యవిరహానికీ కాక, గోపీప్రేమకీ, సర్వస్వశరణాగతికి పెద్దపీట లభించింది. తులసీదాసు వంటి ఎవరో ఒకరిద్దరు కవులకి తప్ప దాంపత్యప్రేమచుట్టూ తమ కవిత్వాన్ని అల్లడం మీద అటు రాజాస్థాన కవులకీ, ఇటు భక్తి కవులకీ కూడా ఆసక్తిలేకపోయింది. దాంతో ఐహిక, లౌకిక, ఐంద్రియక ప్రేమ స్థానంలో, ఆ లక్షణాలన్నీ భగవంతుడికి మీదకు మరల్చిన భగవత్ప్రేమ కవిత్వం భారతదేశమంతా వ్యాపించింది.

ఈ మార్పు భాగవతంలోనే మనం చూడవచ్చు. దశమస్కంధంలో వర్ష ఋతు వర్ణన (20:3-31) ని మనం ఇప్పటిదాకా చూసిన వర్షర్తు కవిత్వాల్తో పోల్చి చూడండి. ఆ ఉపమానాలు, ఆ భాష, ఆ రంగులు చూడండి. రామాయణ వర్షాన్ని భాగవత వర్షంతో పోలిస్తే వెయ్యేళ్ళ కాలంలో భారతీయ దృక్పథంలో ఎటువంటి మార్పు వచ్చిందో మనకి తేటతెల్లంగా తెలుస్తూ ఉంది. తత్పూర్వ కవిత్వాలు ఇంద్రియతాపాన్ని రగిలించేవిగా ఉండగా, భాగవత వర్షం ఇంద్రియతాపాన్ని శమింపచెయ్యడం మీదనే దృష్టిపెట్టిందని మనకి సులభంగానే బోధపడుతుంది.

కానీ ప్రేమ మానవజీవన ప్రాథమిక అవసరం. కవిత్వం ఆ ప్రేమోద్వేగాలకి వాహిక కాగలగాలి. భాగవతంలోని వర్హఋతు వర్ణనలో ఆ భావోద్వేగం కొరవడుతోందని గ్రహించినందువల్లనే జయదేవుడు గీతగోవింద కావ్యం మొదటిశ్లోకంలో మళ్ళా ఆషాఢమేఘాన్ని పట్టుకొచ్చాడు. ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాను. చూడండి.

ఇందులో ‘గృహం ప్రాపయ’ అనే ఆ మాట చాలా కీలకమైన మాట. కాని భాగవతం దృష్టిలో గృహానికి అంటిపెట్టుకోవడం, చెరువుకూలిపోతున్నా కూడా కొంగలు ఇంకా ఆ చెరువునే అంటిపెట్టుకోవడం లాంటిది. కాని గృహమే లేకపోతే, ఆ స్త్రీపురుష పరిష్వంగం లేకపోతే, ముందు ఆ రుచి తెలియకపోతే, దాన్ని భగవంతుడిలో కూడా చూడలేమని జయదేవుడికి తెలుసు. అందుకని ఆయన కవిత్వాన్ని మళ్ళా గృహం వైపు మళ్ళించాలనుకున్నాడు. కాని చిత్రమేమిటంటే, ఆ రాధా, మాధవుడూ, ఇద్దరూ కూడా ఈ గృహానికి వెళ్ళే దారిలోనే రహస్యప్రణయంలో కూరుకుపోయారు. గీతగోవిందమంతా ఆ కేశవకేళీగానమే. చూడండి, కవిత్వాన్ని జయదేవుడు గృహం వైపు మళ్ళించాడుగాని, గృహానికి చేర్చలేదు. నందుడు కేశవుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది రాధకి, కృష్ణుడి భార్యకి కాదు. ఆషాఢమేఘం చుట్టూ అల్లుకున్న ప్రణయం, విరహం భార్యాభర్తలకి సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకుంటే, గీతగోవిందం కూడా ఎంత దూరం వచ్చేసిందో మనకి అర్థమవుతుంది. తిరిగి కబీరు వచ్చినదాకా కవిత్వం గృహానికి చేరలేదు. కాని అప్పటికి భారతీయ కవిత్వంలో ఆ గృహం రూపురేఖలే మారిపోయాయి, అది వేరే సంగతి.

ఈ ఒక్కశ్లోకంతో జయదేవుడు భారతీయ ప్రేమకవిత్వాన్ని మలుపు తిప్పి తాను కీర్తించిన కేశవకేళి రహస్యమంతా శరత్కాలానికి తీసుకుపోయాడు. జయదేవుడు చేసిన ఈ ఇంద్రజాలం వల్ల పన్నెండో శతాబ్ది తర్వాత విరహానికి శ్రావణమాసమూ, కలయికలకి శరద్రాత్రులూ భారతీయ కవిత్వానికి ఆలంబనలుగా మారిపోయాయి.

నడివానాకాలపు ఆ కవిత్వాల గురించి, ఆ శ్రావణమేఘం గురించి మరో సారి.


శ్రీమద్భాగవతం

ఆకాశకాంతి మసకబారింది

1

తతః ప్రావర్తత ప్రావృట్ సర్వసత్త్వసముద్భవా
విద్యోతమానపరిధిర్విస్ఫూర్జితనభస్థలా (10-20-3)

(సకల జీవులకీ ప్రాణంపోసే వర్షాకాలం అరుదెంచింది. ఆకాశమంతటా ఉరుములు వినిపిస్తున్నాయి, దిగంతమంతా మెరుపులు కనిపిస్తున్నాయి)

2

సాంద్రనీలాంబుదైర్వ్యోమ సవిద్యుస్తునయిత్నుభిః
అస్పష్టజ్యోతిరాచ్ఛిన్నం బ్రహ్మేవ సగుణం బభౌ (10-20-4)

(అప్పుడు నల్లనిమబ్బులు, మెరుపులు, ఉరుములు ఆకాశాన్ని ఆక్రమించాయి. మనుషుల్లోని పరమాత్మని వస్తుప్రపంచం కప్పేసినట్టుగా ఆకాశకాంతి మసకబారింది)

3

తడిద్వంతో మహామేఘాశ్చండశ్వసనవేపితాః
ప్రీణానం జీవనం హ్యస్య ముముచుః కరుణా ఇవ (10-20-6)

(ఉరుముతున్న, మెరుస్తున్న మేఘాల్ని ప్రచండవాయువులు కంపింపచేస్తున్నాయి, కరుణకలిగినవాళ్ళలాగా మేఘాలు ఈ లోకంకోసం తమని తాము త్యాగం చేసుకుంటున్నాయి)

4

తపః కృశా దేవమీఢా ఆసీద్ వర్షీయసీ మహీ
యథైవ కామ్యతపసస్తనుః సంప్రాప్య తత్ఫలం (10-20-7)

(వేసవితాపానికి కృశించిపోయిన పృథివికి వానలు మళ్ళా ప్రాణం పోసాయి. అంతదాకా తపసుచేసి కృశించిన మనిషికి చేసిన తపస్సుకి ఫలితం దక్కినట్టుగా ఉంది)

5

నిశాముఖేషు ఖద్యోతాస్తమసా భాంతి న గ్రహాః
యథా పాపేన పాషండా న హి వేదాః కలౌ యుగే (10-20-8)

(కలియుగంలో పాషండుల పాపాలు వేదాల్ని మరుగుపర్చినట్టుగా, చీకటిపడగానే మిణుగురుపురుగులు మెరుస్తున్నవి తప్ప, తారకలు కనిపించడం లేదు.)

6

శ్రుత్వా పర్జన్యనినదం మండుకాః ససృజుర్గిరః
తూష్ణీం శయానాః ప్రాగ్ యద్వద్బ్రాహ్మణా నియమాత్యయే (10-20-9)

(గురువు ఆదేశించగానే బ్రాహ్మణవిద్యార్థులు వేదపాఠం వల్లెవేసినట్టుగా, మేఘగర్జనలు వినగానే కప్పలు బెకబెకలాడటం మొదలుపెట్టాయి.)

7

ఆసన్నుత్పథగామిన్యః క్షుద్రనధ్యోనుశుష్యతీః
పుంసో యథాస్వతంత్య్రస్య దేహద్రవిణసంపదః (10-20-10)

(ఇంద్రియాలకి లోబడ్డ మనిషి దేహం, విత్తం, సంపద అన్నీ ఇంద్రియాలు చెప్పినట్టు నడిచినట్టే వర్షాకాలం రాగానే చిన్న చిన్న ఏర్లు కూడా వరదలతో పోటెత్తి గతులు తప్పాయి.)

8

హరితా హరిభిః శష్పైరింద్రగోపైశ్చ లోహితా
ఉచ్ఛిలీంధ్రకృతచ్ఛాయా నృణాం శ్రీరివ భూరభూత్ (10-20-11)

(కొత్తగా పెరిగిన పచ్చిక భూమిని ఇంద్రనీలంగా మార్చింది. ఆరుద్రపురుగులు లోహిత వర్ణాన్ని సంతరిస్తున్నాయి. తెల్లటి పుట్టగొడుగులు మరొక వన్నె సమకూరుస్తున్నాయి. మొత్తం మీద భూమి అకస్మాత్తుగా సంపన్నుడైన మనిషిలాగా భాసిస్తోంది.)

9

మేఘాగమోత్సవా దృష్టాః ప్రత్యనందచ్ఛిఖండినః
గృహేషు తప్తనిర్విణ్ణా యథాచ్యుతజనాగమే (10-20-20)

(గృహస్థజీవితం వల్ల నిర్విణ్ణులైనవారు తమ ఇంటికి భగవద్భక్తులు వస్తే మురిసిపోయినట్టుగా, మేఘాల రాకని చూసి నెమళ్ళు సంతోషం ప్రకటిస్తున్నాయి.)

10

సరః స్వశాంతరోధః సు న్యూషురంగాపి సారసాః
గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః (10-20-22)

(లౌకిక జీవితానికే అంకితమైపోయిన వాళ్ళు ఎన్ని చికాకులున్నా గృహస్థజీవితాన్ని వదిలిపెట్టనట్టు వర్షాలకి సరోతీరాలు విరిగిపడుతున్నా కూడా కొంగలు అక్కణ్ణుంచి కదలడం లేదు)

శ్రీ గీతగోవిందమహాకావ్యం

మేఘైర్మేదురమంబరం వనభువః శ్యామాస్తమాలద్రుమైః
నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ
ఇత్థం నందనిదేశతశ్చలితయోః ప్రత్యధ్వకుంజ్జద్రుమం
రాధామాధవోర్జయంతి యమునా కూలే రహఃకేలయః (1)

(రాధా! ఆకాశంలో మబ్బులు వ్యాపిస్తున్నాయి, కానుగచెట్ల అడవిలో చీకట్లు చిక్కనవుతున్నాయి, రాత్రి సమీపిస్తోంది, ఈ పిరికి పిల్లవాణ్ణి తొందరగా ఇంటికి తీసుకుపో అని నందుడు చెప్పినప్పుడు ఆ రాధా, ఆ మాధవుడూ ఇద్దరూ ఆ దారిలో, ఆ యమునా నది ఒడ్డున ప్రతి చెట్టు నీడనా రహస్యప్రణయంలో కూరుకుపోయారు)


(2008 లో చినుకు పత్రిక కోసం మొదలుపెట్టిన ఈ వ్యాసాల్ని ఇప్పటికీ పూర్తి చేయగలిగాను. ఈ ఆషాఢమాసమంతా వీటిని మనసారా ఆహ్వానించి ఆస్వాదించిన మీకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ వ్యాసగుచ్ఛాన్ని నా మిత్రుడూ, రసహృదయుడూ, కవీ గంటేడ గౌరునాయుడుకీ, ఈ బొమ్మల్ని మానస చామర్తికీ కానుక చేస్తున్నాను)

17-7-2023

21 Replies to “ఆషాఢమేఘం-30”

 1. ఆ ఆషాడ మేఘాల మీద కూచోబెట్టి మీతోపాటు ప్రపంచ కవితా విహారం చేయించారు.

  “వేసవితాపానికి కృశించిపోయిన పృథివికి వానలు మళ్ళా ప్రాణం పోసాయి. అంతదాకా తపసుచేసి కృశించిన మనిషికి చేసిన తపస్సుకి ఫలితం దక్కినట్టుగా ఉంది”.

  మంచి కవిత్వంకోసం తపిస్తున్న నాలాంటివాళ్ళకి ఈ వ్యాసాలు దొరికినట్టుగా కూడా ఉంది.

  1. Sir, మీ ఈ ఆషాడమేఘం వలన అనేక గొప్ప గొప్ప కవుల రచనల గురించి తెలుసుకోవటం జరిగింది గాధ సప్తశతి (దీవి సుబ్బారావు )రంగురంగుల కవిత్వం, మేఘసందేశం వంటివి వెంటనే కొనుక్కొని ఆస్వాదించే అవకాశం దక్కింది. 🙏🙏
   ఎన్నో మంచి పుస్తకాలు గురించి తెలుస్తున్నాయి.
   ధన్యవాదములు sir.

 2. నేను నా జీవితమంతా అపురూపంగా దాచుకునే కానుక…❤️ ఈ సిరీస్ లో ప్రతి వ్యాసమూ దిద్దుకుని జ్ఞాపకం ఉంచుకోదగిన మాటలతో నిండినదే. ప్రింట్ చేసుకుంటాను. 2013 లో మీ రామాయణంలో వర్ష ఋతు వర్ణనలు చదివినప్పటి నుండి ఈ ప్రయాణం నాకూ తెలుసు అనుకోవడంలో ఏదో సంతోషం. ఒక అద్భుతాన్ని దగ్గరగా, జరుగుతోండగా చూసిన సంతోషం..

  ఎప్పటిలాగే, Million Thanks for everything you give us here! ❤️❤️

 3. వేసవి తాపానికి కృశించిపోయిన పృథివికి మల్లెనే మేమంతా కూడా!మీ రచనలు జీవం. ఇవన్నీ ఒక పుస్తకంలో ఒదిగితే బాగుంటుంది.

 4. మీ అద్భుత వ్యాసాలను ఆస్వాదించే అదృష్టం కలిగించినందుకు ధన్యవాదాలు. నమస్కారములు.

 5. కావ్యదృశ్యాలూ దృశ్యకావ్యాలూదట్టమైన ఆషాఢమేఘ మాలలై నెలరోజులు ఆనందాన్ని పంచాయి. ఇది సాహిత్య ఋణం కిందికి వస్తుంది.
  మీ ఋణం తీర్చుకోలేనిది. మీకు వందనాలు.

 6. శ్రావణ మేఘాల కోసం ఎదురుచూస్తూ.. ధన్యవాదాలు మీకు

 7. అప్పుడే ముగిసిందా ఆషాఢం? అనేకానేకధన్యవాదాలు.

  “నడివానాకాలపు ఆ కవిత్వాల గురించి, ఆ శ్రావణమేఘం గురించి మరో సారి.” అని వాగ్దానం చేసారు. ఎదురు చూస్తూ ఉంటాము.

  1. ఈ వ్యాసాలన్నీ మీకు పంపిస్తాను. మీరు దయతో ఒకసారి సరి చూడగలరు. అలాగే ముందుమాట కూడా రాయగలరు.

   1. సరి చూడటం వరకు తప్పక చేయగలను. ముందుమాటా, అమ్మో!

 8. “భాగవత మహాపురాణం అష్టాదశపురాణాల్లో ఒకటి. దాన్ని వ్యాసుడు రాసాడనే ప్రతీతి. కాని ఇటీవలి పరిశోధకులు అది 8-10 శతాబ్దాల మధ్యకాలంలో తమిళదేశంలో రాయబడ్డ పురాణంగా లెక్కేస్తున్నారు. కొందరి దృష్టిలో అది తమిళంలో ఆళ్వారులు ప్రభవించిన తర్వాత, ఆ ప్రభావంతో రాసిన పురాణం. పదవశతాబ్దం తర్వాతి భారతీయ భక్తి కవిత్వాల్ని భాగవతపురాణమే గణనీయంగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. తిరిగి మళ్లా ఆ భక్తికవిత్వాల వెలుగులో 18 వ శతాబ్దంలో ఆ పురాణాన్ని మళ్ళా గణనీయంగా సవరించారని కూడా పరిశోధకులు చెప్తున్నారు.”

  ఈ ప్రతిపాదన నన్ను నిలేసింది. భాగవతపరిణామం గురించిన వివరాలు ఎక్కడ దొరుకుతాయి?

Leave a Reply

%d bloggers like this: