ఆషాఢమేఘం-29

ఈ రోజు ఒక వార్త చూశాను. ఈ ఏడాది దాదాపు పాతిక రోజులు ఆలస్యంగా గోదావరిలోకి ఎర్ర నీళ్లు ప్రవేశించాయని. ఇదే ఆశ్చర్యం. వరదలు మనని ముంచెత్తి అపారమైన ప్రాణ నష్టం కలిగిస్తున్నా కూడా ప్రతి ఏడాదీ మనం నదుల్లోకి వరద నీరు రావాలనే కోరుకుంటాం. ఏ కారణం చేతనైనా నదుల్లో వరదరావడం ఆలస్యం అయితే మనకి ఆందోళన మొదలవుతుంది. ఎందుకో మనందరికీ తెలుసు. నదుల్లో ఇవాళ వరద వస్తేనే రేప్పొద్దున మనకి అన్నం దొరికేది.

వేసవికాలంలో చిక్కిపోయిన నదుల్లో, వానాకాలం రాగానే, మొదటి వరద నీరు కనిపించే దృశ్యంలో ఏదో అనాది ఆదిమ సంతోషం ఉంది. చెప్పలేని మాంత్రికానుభవం అది.

మా ఊళ్లో ఊరిని ఆనుకుని ఒక కొండ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాదీ వానాకాలంలో ఆ ఏట్లో ఎర్ర నీటి వరద వచ్చేది. అప్పుడు ఊరు ఊరంతా ‘ఏరొచ్చింది’, ‘ఏరొచ్చింది’ అంటో కలకల్లాడుతో ఆ ఏటి దగ్గరికి పరిగెత్తే వారు. ఉధృతంగా ప్రవహించే ఆ వరద నీటిని చూస్తూ మైమరచిపోయి నిలబడి పోయేవారు. అలా ఊరంతా ఆ కొత్త నీటిని చూస్తో నిలబడి ఉండే దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అటూ ఇటూ బస్సులు, లారీలు ఆగిపోయి ఉండేవి. ప్రయాణీకులు వరద తగ్గేదాకా అలానే ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఎవరూ ఆ వరదని తిట్టుకున్నట్టుగానీ, శపించినట్టుగానీ నేను ఎరుగను.

ఆ వరదలో కొండల మీంచి కురిసిన వానతోపాటు విరిగిపడ్డ చెట్లు పూల కొమ్మల్తో కొట్టుకొచ్చేవి. వాటితో పాటు ఒక్కొక్కప్పుడు పశువులు కూడా కొట్టుకొచ్చేవి. నింగీ, నేలా ఏకమై ధారాపాతంగా వర్షం కురుస్తున్నా కూడా జనం ఆ కొత్త వరద నీటిని అట్లానే చూస్తూ నడుస్తూనే నిలబడి ఉండేవారు. బహుశా ప్రతి ఏడాదీ చైత్రమాసపువెన్నెల రాత్రుల్లో, హేమంత ప్రత్యూషాల్లో తిరగాలని కోరుకున్నట్టే, ఏరుల్నీ, నదుల్నీ వరదలు ముంచెత్తేటప్పుడు కూడా మనుషులు వాటిని చూస్తో అట్లానే నిలబడి ఉండాలని కోరుకుంటారు అనుకుంటాను.

సంగం సాహిత్యంలోని ఎనిమిది సంకలనాల్లో చివరి సంకలనం పరిపాడల్ ఈ వరదల గురించే పాడుకున్న కవిత్వం. పరిపాడల్ అంటే ప్రవహించే పాటలు అని చెప్పుకోవచ్చు. తక్కిన సంగం కవితల్లాగా కాకుండా ఇవి గీతాలు. రాగయుక్తంగా పాడుకోదగ్గవి. కొన్ని సంభాషణ ప్రధానం కూడా. అంటే పాడుకునేవాళ్ళు రెండు బృందాలుగా విడిపోయి ఒకరితో ఒకరు వాదించుకుంటున్నట్టుగా, సంవాదం చేస్తున్నట్టుగా పాడుకోదగ్గవన్నమాట.

తక్కిన సంగం కవిత్వాన్ని వెలుగులోకి తెచ్చిన స్వామినాథ అయ్యరే ఈ పరిపాడల్ ని కూడా ప్రపంచానికి పరిచయం చేసారు. ఈ గీతాలు మొత్తం 70, కానీ, 1918 లో అయ్యర్ వీటిని పుస్తకరూపంగా వెలువరించడానికి ఆయనకి 22 గీతాలు మాత్రమే లభ్యమయ్యాయి. వీటిలో ఆరు తిరుమాల్ అంటే విష్ణువుని స్తుతిస్తూ రాసినవి, ఎనిమిది గీతాలు మురుగన్ స్తోత్రాలు. మిగిలిన ఎనిమిదీ వైగై నది చుట్టూ అల్లినపాటలు.

వైగై పశ్చిమతమిళనాడులో పుట్టి 258 కిలోమీటర్లమేరకు ప్రయాణించి రామనాథపురం జిల్లాలో సముద్రంలో కలుస్తుంది. ప్రాచీన తమిళదేశచరిత్రలో పాండ్యరాజ్యానికి వైగై అన్నం పెట్టింది. ఆ నది ఒడ్డున ఉన్న మధురైనీ, వైగైనీ విడదీసి చూడలేమన్నంతగా, ఆ నది పాండ్యసంస్కృతిలో భాగమైపోయింది. చివరికి విశ్వనాథ సత్యనారాయణ వంటి తెలుగురచయిత కూడా పాండ్యకుటుంబాల చుట్టూ అల్లిన ఏకవీర నవల మొదలుపెడుతూనే వైగై నది ప్రోషితభర్తృక లాగా ఉంది అని రాయకుండా ఉండలేకపోయాడు.

వానాకాలం మొదలవగానే ఆ నదిలో కొత్తనీళ్ళు రావడం, ఆ నదిచుట్టూ జీవితం ఒక సంరంభంగా మారిపోవడం పరిపాడల్లోని వైగై గీతాల నేపథ్యం. ఆ గీతాల్లో నదికి యవ్వనం వచ్చినట్టు కనిపిస్తుంది. తక్కిన సంగం సాహిత్యంలో వానాకాలమంటే విరహం, శోకం, కృశించిన దేహాలు, శూన్యగృహాలు కనిపిస్తే, పరిపాడల్ లో వానాకాలమనగానే నదిలో కొత్త వరద, కొత్త ఉత్సాహం, జలకాలాటలు, అలకలు, ఎత్తిపొడుపులు, ప్రణయకలహాలు కనిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ గీతాల్లో కనిపించేది వైగై వరద కాదు, యవ్వనపు వరద.

సాధారణంగా ముల్లై తిణై గీతాలు భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా ఏర్పడ్డ విరహం గురించి రాసే గీతాలు అని అనుకున్నాం. అది కూడా యుద్ధం కోసమో, బతుకు తెరువు కోసమో భర్తలు తమ భార్యలను వదిలిపెట్టి వెళ్లడం వల్ల తలెత్తిన వియోగం అని చెప్పుకున్నాం. అకం సంప్రదాయంలోని ఐదు తిణైల్లోనూ భార్యాభర్తల దాంపత్యంలో మూడవ మనిషి ప్రస్తావన, అంటే భర్త భార్య పట్ల కాక మరొక స్త్రీ పట్ల మోహమో, ప్రేమనో చూపించడం అనేది మరుదం తిణైకి సంబంధించిన ఇతివృత్తం. ముల్లై లో అటువంటి మూడో మనిషి ప్రసక్తే ఉండదు. కానీ పరిపాడల్లో మూడో మనిషి కనిపిస్తుంది. అది కూడా నది ఒడ్డున, తాత్కాలికంగా, ఆ వేడుకల్లో భాగంగా మాత్రమే. ఆ మూడో మనిషి వల్ల ఆ భార్యాభర్తల మధ్య చిరుకోపాలు రావడం, అలకలు పూనటం, ఇంతలోనే మళ్ళా ఆ కోపాలూ, తాపాలూ అదృశ్యం అయిపోవడం కనిపిస్తుంది. ఇదంతా వైగై మహిమ అంటారు ఆ కవులు.

ఈ గీతాల్లో ప్రధానంగా కనిపించేవి ప్రణయ సల్లాపాలూ, ప్రణయకలహాలూను. జల క్రీడలు ఆడుకుంటూ సరససల్లాపాలు చేయడాన్ని వాళ్లు ‘ఆడల్’ అన్నారు ప్రణయకలహాల్ని ‘ఊడల్’ అన్నారు. ఆ ఆడల్, ఊడల్ రెండూ కూడా ఆ నదిలో పోటెత్తిన వరద ప్రభావం వల్ల జీవితంలో పొంగులెత్తే ఉత్సాహం వల్ల సంభవిస్తున్నవే అని మనం గ్రహిస్తాం.

ఇటువంటి ప్రణయ కలహాలు మరుదం కవితల్లో కూడా కనిపిస్తాయి కానీ అక్కడ ప్రకృతి ఒక అస్పష్ట నేపథ్యం మాత్రమే. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనుషుల జీవన సంరంభం ఎంత ముఖ్యమో నది అంతకన్నా ముఖ్యం. ఇవి పూర్తిగా నదితో పుట్టి, నదిలో పెరిగి, నదితో పాటే ప్రవహించే సంతోషాలు.

మనకి తెలిసి ఇటువంటి వేడుక పుష్కరాల సమయంలో మాత్రమే చూసి ఉంటాం. కానీ పుష్కరాలు దాదాపుగా ఒక మతధార్మిక క్రతువుగా మారిపోయాయి కాబట్టి జలకాలాటలు, ప్రణయకలహాలు తప్ప తక్కిన జీవిత సంరంభం అంతా పుష్కరాల్లో కనిపిస్తుంది. పరిపాడల్లో కూడా పూజ, పువ్వులు, పసుపు, కుంకుమ, మంత్రాలు, మంగళవాద్యాలు కనిపిస్తాయి గాని ఆ గీతాలన్నీ పూర్తి లౌకిక గీతాలని చెప్పవచ్చు. ఆడుకోవడం, పాడుకోవడం నదిలో మునగడం, తేలడం, నీళ్లు చల్లుకోవడం, తడిసిన దుస్తుల్లో ఒకరి అందాలు మరొకరు కన్నార్పకుండా చూసుకోవడం- ఇంతకు మించి ఆ కవులు ఎక్కువ కోరుకోనూలేదు, ఎక్కువ గానం చేయనూ లేదు.

భారతీయ కవిత్వంలో వర్షఋతువును వర్ణించే కవిత్వంలో ఎక్కడా కూడా ఇంత ఉల్లాసభరితమైన నదీ గీతాలు కనిపించవు. వర్షఋతువుతో సంబంధం లేకుండా ఒక నది చుట్టూ ఇంత గానం, నాకు తెలిసి, బ్రహ్మపుత్ర పైన భూపేన్ హజారికా రాసిన గీతాల్లోనే కనిపిస్తుంది.

నేను మధురై చూడలేదు, వైగైనదినీ చూడలేదు. కానీ ఈ గీతాలు చదివాక వైగైనది ఎలా ఉంటుందా అని నెట్ లో ఫోటోలు చూశాను. తక్కిన అన్ని జీవనదుల్ని తినేసినట్టే ఇక్కడ కూడా మానవసమాజం వైగైని పూర్తిగా తినేసింది. ఇప్పుడు ఆ నదీ సౌందర్యాన్ని చూడాలంటే బహుశా ఈ గీతాలు ఒక్కటే మనకు దిక్కు

పరిపాడల్ లోని పన్నెండవ గీతం నుంచి కొన్ని పంక్తులు మీకోసం.


వైగైముందు స్వర్గం చిన్నబోయింది

గాలులు మేఘాల్ని ఢీకొని మెరుపుల్నీ, చీకటినీ సృష్టిస్తున్నాయి.
పడమటి కొండల చుట్టూ అల్లుకున్న మేఘాలు అలుపు లేకుండా కురుస్తున్నాయి.
కొండల మీద రాలిపడ్డ పూలనీ, చెట్లనీ, సుగంధాన్నీ నీళ్లు మోసుకు వస్తున్నాయి.
గాలుల్లాగా ప్రవహిస్తున్న నీళ్లు సాగర జలాల వైపు పరుగులు తీస్తున్నాయి.

మధురై నగర కుడ్యాల్ని ఒరుసుకుంటో అందమైన వైగై నదిలో నీళ్లొచ్చాయని వినగానే విద్యున్మాలల లాంటి ఆభరణాలతో, పూలు నగిషీ చెక్కిన స్వర్ణాభరణాలతో, దోసిళ్లతో పూలు పట్టుకుని మగవాళ్లు నది ఒడ్డుకు చేరుకున్నారు. తమ ఒంటిమీది చందన చర్చల్ని తుడిచేసి అగరు లేపనాలు అద్దుకుంటున్నారు.

నల్లని మబ్బుల్లాంటి కబరీభరాలతో, సుగంధాలు విరజిమ్ముతున్న పూల మాలలతో, కంఠాభరణాలతో నవ్య వస్త్రాలతో స్త్రీలు నది ఒడ్డుకు చేరుకుంటున్నారు. పరిమళాలు చిమ్ముతున్న నేతితో, ముగ్గుపొడితో తుడిచిపెట్టిన అద్దాల్లో తమను తాను చూసుకుంటున్నారు.

వాళ్ల ప్రతిబింబాల్లో సహజ సౌందర్యం ప్రతిఫలిస్తున్నది. ప్రేమ వల్ల పుట్టే వెలుగు వారి ముఖాల్లో తాండవిస్తున్నది. వారంతా తాంబూల చర్వణం చేస్తున్నారు.

మరికొందరు స్త్రీలు అందమైన కంకణాలతో, దండ కడియాలతో, కాలి అందెలతో కనిపిస్తున్నారు. వారు ధరించిన పూలమాలల్లోంచి తేనె స్రవిస్తున్నది. వాళ్ళు తమ దేహాల మీద చల్లుకున్న సుగంధం యోజనదూరం వ్యాపిస్తున్నది.

నెమ్మదిగా అడుగులు వేస్తున్న గుర్రాల మీదనో లేదా ఆడ ఏనుగుల మీదనో కూర్చున్న స్త్రీలు హంసల్లాగా నది ఒడ్డుకు చేరుకుంటున్నారు.

పురుషులు ప్రయాణిస్తున్న రథాలు చిరుగంటలు మోగుతున్నవి. కొందరు అశ్వారూఢులుగా ఉన్నారు, మరి కొందరు మదించిన మగ ఏనుగుల మీద కూర్చున్నారు.

ఎక్కడ చూడు జనం, జనం. పరుగులు పెడుతూ ఎటు చూస్తే అటు అందంగా పొంగిపొర్లుతున్నారు.

ప్రజల స్తోత్ర గానం మధ్య వైగైలోకి కొత్తనీళ్లు ప్రవేశించాయి. అక్కడ చేరుకున్న జనం అంతా ఆ నదీకూలాల్లాగా కనిపిస్తున్నారు. ప్రేమ వరదను తాగుతున్నాయా అన్నట్లుగా నదీ జలాలు గట్ల మీంచీ, చూపరులహృదయాల మీంచీ పొంగిపొర్లుతున్నాయి .

స్నాన ఘట్టాల దగ్గర జనం గుంపులు గుంపులుగా చేరి అంతా తలో మాట మాట్లాడుతుంటే ఏ ఒక్క మాటా అర్థం కావడం లేదు. అయినా వాటిని ఈవేళప్పుడు ఎవరు విని అర్థం చేసుకోగలరని? మాకైతే ఏవో కొన్ని మాటలు మటుకే చెవిని పడుతున్నాయి. ..

అక్కడ నీళ్లు మళ్లా గట్లు తెంచుకుంటున్నాయి. మల్లెలు, మరువం, సంపంగి ,అరవిందం సమస్త పుష్ప సముదాయ పరిమళాలు ఆ నీళ్లలో ప్రవహిస్తున్నాయి. ..

అక్కడ చేరుకున్న వాళ్ళ మాటలతో పాత మధురై నగరం మొత్తం ప్రతిధ్వనిస్తోంది.
వాళ్ళు ఒకళ్లతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు: ‘చూడండి రత్నాల రాశులతో మిలమిల్లాడుతూ పొంగిపొర్లుతున్న ఆ నీళ్లను చూస్తుంటే పూల బొమ్మలు అద్దకం చేసిన వస్త్రంలాగా లేదూ’ అని అనుకుంటున్నారు.

వాళ్ళ మాటల కన్నా నదీ జలాలు మరింత అందంగా ఉన్నాయి. నదిలో స్నానం చేస్తున్న వాళ్ళు మరింత ప్రేమాస్పదంగా ఉన్నారు. ఎవరికి వారే అద్వితీయ సౌందర్యంతో దగధగలాడుతున్నారు.

వారి వక్షఃస్థలాల నుంచి పారుతున్న చందన చూర్ణంతో, వారి వస్త్రాల నుంచి కారుతున్న నీళ్లతో అక్కడంతా బురద బురదగా అయిపోయింది.

ఆ నది ఒడ్డుని చూస్తుంటే వర్షం కురుస్తున్నట్టుంది.

ఇలాంటి పండగ రోజుల్లో వైగై మరీ మరీ గొప్పగా కనిపిస్తుంది. ఆ అందం ముందు స్వర్గం కూడా చిన్నబోయినట్టే ఉంటుంది.

పాత మధురై నగరం నలుదిక్కులా సంతోషం! సౌందర్యం!
ఎక్కడ చూడు, మంచితనం!మంచితనం! మంచితనం!
ఓ వైగైనదీ ప్రవాహమా! నీ వైభవాన్ని అందుకోవడానికి ఇంత విశాల ప్రపంచమూ సరిపోదనిపిస్తోంది!

16-7-2023

.

2 Replies to “ఆషాఢమేఘం-29”

  1. నేను మదురై వెళ్ళినప్పుడల్లా ఏ .కే రామానుజన్ వర్ణించిన వైగై మాత్రమే కనపడింది సర్. వరదనీటితో పొంగి పొర్లే వైగై నా ఊహల్లో మాత్రమే.

Leave a Reply

%d bloggers like this: