ఆషాఢమేఘం-28

మళ్లా సంగం సాహిత్యం దగ్గరికొద్దాం. ప్రాచీన సంగం సాహిత్యంలో ‘ఎట్టుతొగై’ అనే ఎనిమిది కవితాసంకలనాలూ, ‘పత్తుప్పాట్టు’ అనే పది దీర్ఘకవితలూ ఉన్నాయని చెప్పుకున్నాం. సంగం కవిత్వంలో ‘అకం’, ‘పురం’ అనే రెండు సంప్రదాయాలున్నాయని చెప్పుకుంటూ అందులో అకం సంప్రదాయం అయిదు ప్రేమావస్థల్ని వర్ణించిందనీ, అందులో తొలివానాకాలాన్ని ‘ముల్లై’ అనే తిణైతో సంభావించిందని కూడా చెప్పుకున్నాం. అకం పద్ధతిలో రాసిన కవితల సంకలనాలు ‘పెరుంతొగై’, ‘కురుంతొగై’, ‘నట్టిన్రై’, ‘ఐంగురునూరు’లనుంచి కూడా కొన్ని కవితలు చూసాం. అలాగే పది దీర్ఘకవితల్లో ‘ముల్లైప్పాట్టు’ అనే కావ్యాన్ని కూడా పరిచయం చేసుకున్నాం.

పది దీర్ఘకవితలూ రెండో శతాబ్దం నుంచి అయిదో శతాబ్దం మధ్యలో రాసిన కవితలు. ఎనిమిది కవితాసంకలనాలకన్నా తర్వాత వచ్చిన కవిత్వం. ఈ పదింటిలోనూ నాలుగు దీర్ఘకవితలు ‘ఆట్ట్రుప్పడై’ అనే స్తోత్రాలవంటి కవితలు. ఇంకా చెప్పాలంటే పవిత్రస్థలాలకు యాత్రాదర్శిని లాంటి పద్యాలు. మిగిలిన ఆరు కవితల్లో నప్పూతనార్ రాసిన ముల్లైప్పాట్టు కాక కపిలార్ రాసిన ‘కురింజిప్పాట్టు’, మాంగుడి మరుదనార్ రాసిన ‘మధురైకాజ్ఞ్చి’, రుద్రన్ కన్ననార్ రాసిన ‘పట్టిణప్పాలై’, పెరుంకౌశికానార్ రాసిన ‘మలైపడుకడాం’లతో పాటు నక్కీరర్ రాసిన ‘నెడునల్ వాడై’ ఉన్నాయి. మొత్తం పది కవితల్లోనూ నక్కీరర్ రాసినవి రెండు: ‘నెడునల్ వాడై’, ‘తిరుమురుగాట్ట్రుప్పడై’.

ధూర్జటి కాళహస్తీశ్వరమాహాత్మ్యం చదివినవారికి ప్రసిద్ధమైన ప్రసిద్ధమైన ఈ పద్యం గుర్తుందే ఉంటుంది:

ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్యస్ఫురన్మాధురీ
చారు ప్రౌఢిమ చెప్పి పంప, విని మాత్సర్యంబు వాటించి, న
త్కీరుండూరకె తప్పుపట్టెనట, యేదీ! లక్షణంబో, యలం
కారంబో, పదబంధమో, రసమొ? చక్కంచెప్పుడీ తప్పినన్ (3-167)

ఒక కరువుకాలంలో ఒక బీదబ్రాహ్మణుడు పాండ్యరాజు కొలువులో పద్యం చెప్పి ఏదైనా కానుక పొందుదామన్న ఆశతో తనకొక పద్యం రాసిమ్మని శివుణ్ణి అడుగుతాడు. అప్పుడాయన స్వయంగా ఒక పద్యం రాసిస్తాడు. తీరా ఆ బీదవాడు రాజు కొలువులో ఆ పద్యం చదివివినిపించినప్పుడు అక్కడున్న నత్కీరుడు తప్పుపడతాడు. అప్పుడు స్వయంగా శివుడే ఆ రాజు కొలువులో ప్రత్యక్షమై ఏమిటిందులో తప్పు చెప్పమంటాడు. సాక్షాత్తూ శివుడే వచ్చి ప్రశ్నించినా కూడా నత్కీరుడు తగ్గడు. దేవుడు రాసినా సరే దోషముండే కవితని తాను కవితగా అంగీకరించలేనని చెప్తాడు.

ఈ నత్కీరుడే నక్కీరర్ అని గుర్తుపట్టగలం గాని, చరిత్రకారులు ఇద్దరు నక్కీరర్ లు ఉన్నారని, ఈ కథలో ఉన్నది రెండో నక్కీరర్ అని, అతడు తిరుమురుగాట్ట్రుపడై రాసినవాడనీ చెప్తున్నారు. కానీ నాకైతే ఇటువంటి ఐతిహ్యాలు సాధారణంగా అందరికన్నా మొదట ఏ కవి జీవించిఉంటాడో అతడికే చెందుతాయనిపిస్తుంది. దేవుడే దిగివచ్చినా, తానే రాసానని చెప్పినా, ఆ కవితలో ఔచిత్యం లోపించిందనిపిస్తే, ఆ కవితను నిరాకరించడానికి వెనుకాడని కవి మాత్రమే నెడు నల్ వాడై వంటి కవిత రాయగలడనిపిస్తుంది.

నెడు అంటే దీర్ఘమైన, నల్ అంటే శుభప్రదమైన, వాడై అంటే చలిగాలి. పొడవైన మంచి చలిగాలి- ఇలా తెలుగుచేస్తే ఈ పదబంధంలోని మాధుర్యం పోతోంది. నిడుపైన చలిగాలి అంటే అర్థమవుతుంది. కాని మంచి చలిగాలి ఎక్కడుంటుంది? కాని కవితలోని ప్రాణప్రదమైన అంశం ఆ ‘నల్ ‘ అన్న విశేషణమే. ఆ నల్ ను మనం అనుభూతి చెందడంకోసమే ఆ సుదీర్ఘశీతపవనాన్ని వర్ణిస్తాడు కవి.

పూర్వపు రోజుల్లో వానాకాలానికి ముందు యుద్ధాలకో, బతుకుతెరువుకో ప్రవాసానికి వెళ్లిన భర్తలు వానాకాలం రాగానే ఇంటిదారి పడతారనీ, వారికోసం ఎదురుచూసే భార్యల విరహవేదన, లేదా ఇంటికి తిరిగొస్తో, అక్కడ ఇంటిదగ్గర తమకోసం ఎదురుచూస్తున్న భార్యల్ని తలచుకునేటప్పటి బెంగనో ముల్లై తిణైకి కావ్యవస్తువులని చెప్పుకున్నాం. అలా యుద్ధానికి వెళ్లిన ఒక భర్త వానాకాలం తిరిగిరాగానే తన ఇంటికి తిరిగివస్తో చెప్పుకున్న దీర్ఘకవిత ముల్లైప్పాట్టు అని కూడా చూసాం. కొన్నిసార్లు వేసవి ముగిసిపోయి వానాకాలం వచ్చినా కూడా యుద్ధాలు ఆగకపోవచ్చు. ఆ వానాకాలమంతా కూడా యుద్ధం నడుస్తూనే ఉండవచ్చు. పొలాల్లో పైర్లు వేసే కాలంలో కూడా రాజు ఎక్కడో యుద్ధంలో కూరుకుపోయి ఉండటం ఆ రాజ్యానికి శుభప్రదం కానేకాదు. అటువంటి ఒక రాజును తలచుకుంటూ, వానాకాలపు చివరిదినాల్లో, శీతాకాలం మొదలవుతున్న వేళ, అతడి భార్య ఎదురుచూడటం నెడునల్ వాడై ఇతివృత్తం.

మామూలుగా అకం సంప్రదాయంలో ప్రేయసీప్రేమికులకు పేర్లు ఉండవు. తిణై సంకేతాలు తప్ప వారిని గుర్తుపట్టగల మరే సంజ్ఞలూ కూడా కవులు తమ కవితల్లో విడిచిపెట్టకూడదు. కాని ఈ నెడునల్ వాడై లో ఒక్క చిన్న ఆనవాలుని బట్టి ఆ రాజు పాండ్యరాజని గుర్తుపట్టవచ్చు. అతడు నెడుంజెళియన్ అని కూడా తర్వాత రోజుల్లో చరిత్రకారులు గుర్తుపట్టారు. ఈ చిన్న ఆనవాలు వల్ల అకం తిణైలో రాసిన ఈ కవిత పురం కవితగా మారిపోయింది. కాని పత్తుప్పాట్టు కాలం నాటికి అకం, పురం సరిహద్దులు చాలానే చెరిగిపోయాయి. పట్టిణప్పాలై కవితలో కావేరీపట్టణంలో ప్రతి ఒక్క తిణైకీ ఒక వాడ ఉండేదని రాస్తాడు కవి.

అకం తిణైకి చెందిన కవితలో పురం సంప్రదాయ సూచనలు వదిలిపెట్టడం కావ్యదోషం అని నక్కీరర్ లాంటి దోషజ్ఞుడికి తెలియదా? ఆ మాటకొస్తే ముల్లై తిణై వానాకాల ప్రారంభానికి చెందిన సందర్భం తప్ప వానాకాలం ముగిసేటప్పటిది కాదు కదా. నక్కీరర్ కావాలనే ఒక తిణైని తల్లకిందులు చేసి మరీ ఈ కవిత చెప్పాడనిపిస్తుంది. ఎందుకంటే, వానాకాలం మొదలవుతూనే జాజిపూలు వికసించడం ఎలానూ శుభసూచకమే, అందులో విశేషం లేదు. కాని వానాకాలంలో కూడా యుద్ధంలో కూరుకుపోయిన రాజుకీ, రాజ్యానికీ శుభం కోరడమెట్లా? నెడ్ నల్ వాడై లోని సౌందర్యానుభూతి అంతా ఈ అంశం చుట్టూతానే ఉంది.

నెడునల్ వాడై 188 పంక్తుల దీర్ఘకవిత. ఎక్కడా ఉత్కంఠ చెదిరిపోకుండా, ఒక దీర్ఘకవితను ఎలా నిర్వహించవచ్చో తెలుసుకోవాలనుకున్న కవులకి నెడునల్ వాడై ఒక పాఠం. 188 పంక్తుల కవితలో అత్యధికభాగం, అంటే, 1-165 దాకా నగరంలో అంతఃపురంలో రాజుకోసం ఎదురుచూస్తున్న అతడి భార్యవర్ణన. అది కూడా నేరుగా అంతఃపురానికి తీసుకువెళ్ళిపోడు. కవిత మొదలుపెడుతూ ముందు వానల్ని వర్ణిస్తాడు. ఆ వానల్లో పసులకాపర్ల పరిస్థితి చెప్తాడు. ఎడతెగని వానలూ, కమ్ముకొస్తున్న చలికాలాన్నీ వర్ణిస్తాడు. చూడబోతే మొత్తం కొండలే చలికి గడ్డకట్టుకుపోయేయా అన్నట్లుంది అంటాడు. అప్పుడు కెమేరాని నగరంవైపు తిప్పుతాడు. వీథుల్లో పురుషుల్నీ, ఇళ్ళల్లో సాయంకాలం పూజలు చేస్తున్న స్త్రీలనీ చూపిస్తాడు. ఆ ఇళ్ల కప్పుల్లో గూడుకట్టుకుంటున్న పావురాల్ని వర్ణిస్తాడు. ఈ ఇళ్ళల్లో స్త్రీలని వర్ణిస్తాడు. మడిచిపెట్టిన విసనకర్రల్నీ, మూసిపెట్టిన కిటికీల్నీ చూపిస్తాడు. ఆ చలిగాలిలో ఆ నగరంలో ఉన్నవాళ్ళు నీళ్లని ఏవగించుకుంటున్నారనీ, నిప్పుకోసం తహతహలాడుతున్నారనీ చెప్తాడు (‘జలాని అనుపభోగ్యాని, సుభగో హవ్యవాహనః’-వాల్మీకి). ఆ నగరంలో నర్తకులు తమ తంత్రీవాద్యాలు శ్రుతిపెట్టుకోవడం చూపిస్తాడు. విరహిణులకి కోతపెడుతున్న చలిగాలుల్ని మనకి కూడా చూపించాక అప్పుడు ఆ రాజభవనాన్ని వర్ణించడం మొదలుపెడతాడు. ఏ శుభముహూర్తంలో ఆ ప్రాసాదానికి శంకుస్థాపన చేసారో ఆ వివరాలన్నీ గుర్తుచేసుకుంటూ, దాని ప్రవేశద్వారాలు, తలుపులు, ఆ భవనం ముంగిలి, ఆ ప్రాసాదంలో వినవస్తున్న చప్పుళ్ళు చూపించాక అప్పుడు కేమేరాని రాణిమందిరం వైపు నడిపిస్తాడు. ఆ సదనంలో ఆమె ఏకాంతమందిరం, అందులో ఆమె శయ్య, ఆ శయ్యకుండే అలంకారాలు వర్ణించాక, అప్పుడు ఆ శయ్యమీద వాలి పరున్న రాణిని వర్ణిస్తాడు. అద్భుతమైన వర్ణన. ఆమెని ఆమె పరిచారికలు, అంతః పుర స్త్రీలు ఓదార్చడం కూడా చూపిస్తాడు. కాని వాళ్ళెంత ఓదార్చినా తగ్గని రాణి దుఃఖాన్ని కూడా మనతో పంచుకుంటాడు.

ఆ తర్వాత మూడు పంక్తులు (166-168) ఆ రాణి తన వేదననుంచి బయటపడాలని అంతఃపురస్త్రీలు కొట్రవై దేవతను ప్రార్థించారని చెప్పడం. ఇక 168 నుంచి 188 దాకా ఇరవై పంక్తులు యుద్ధశిబిరంలో ఉన్న రాజు వర్ణన. కవిత చివరకి చేరుకున్నాక కూడా యుద్ధం ముగిసిందనిగానీ, రాజు తిరిగి నగరానికి బయలుదేరాడని గానీ కవి చెప్పడు. ఆ కవితలో 166-168 పంక్తులమధ్యలో రాణి వేదన శమించాలన్న ప్రార్థనలోనే మనం ఆ శుభాంతాన్ని సంభావించుకోవలసి ఉంటుంది. రాణి వేదన నుంచి బయటపడటమంటే, రాజు ఇంటికి తిరిగిరావడమే కదా. ఆ అంతఃపుర పరిచారికలు ఏ దేవతను వేడుకున్నారో ఆ కొట్రవై యుద్ధదేవత కూడా. అంటే యుద్ధంలో రాజు జయించాలన్న ప్రార్థన కూడా అది. నెడు నల్ వాడై లోని నల్ ఆ నాలుగుపంక్తులే. వారలా ప్రార్థించారని చెప్పాకనే కవి తన కెమేరాని యుద్ధశిబిరం వైపు తిప్పుతాడు.

కవిత రాయడం సరే, ఒక కథ చెప్పడమంటే కూడా ఇలా చెప్పాలి అనిపించింది నాకీ కవిత మొదటిసారి చదివినప్పుడు. రచన సమాప్తి సమాప్తిలోనే ఉండదని టాగోర్ ఒక చోట రాస్తాడు. ఒక కథ పేజీల్లో ముగిసిపోయాక, మన అంతరంగంలో కొనసాగాలి. ఆ పాత్రలూ, ఆ సన్నివేశాలూ మనల్ని వెన్నాడాలి. రచయిత చెప్పకుండా వదిలిపెట్టిన ఆ కథని మనం మన మనోలోకంలో తిరిగి ప్రదర్శించుకోవాలి. ఆ కథ ఎలా ముగియవచ్చో రకరకాల స్క్రీన్ ప్లేలు రాసుకోవాలి.

నెడు నల్ వాడై గురించి రాస్తూండగా సినిమా సాంకేతిక పరిభాష వస్తోంది కదూ. ఆశ్చర్యం లేదు. చాలా ఏళ్ళకిందట ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు ఇదంతా ఒక పెద్ద తైలవర్ణ చిత్రంలాగా కనిపించింది. కాని లైటింగ్ గురించి బాగా తెలిసిన ఒక సినిమాటోగ్రాఫర్ తీసిన చిత్రంలాగా కనిపిస్తోంది ఇప్పుడు. శ్రీ శ్రీ ఈ మాట పూర్ణమ్మ కవిత గురించి అన్నాడు. ఆయన నెడు నల్ వాడై చదివి ఉంటే, ఈ కవిత గురించి కూడా ఆ మాట అనుండేవాడు.

నేను తమిళం నేర్చుకుని నెడునల్ వాడై పూర్తి కవితను ఎప్పటికైనా తప్పకుండా తెలుగు చేస్తాను. ఇప్పటికి మాత్రం కొన్ని పంక్తులు, మీ కోసం.


1

ఇంకా రంగులు వెయ్యని రేఖాచిత్రం

అక్కడ కూచున్నది శయ్యమీద రాణి
భర్తని ఎడబాసిన
ఒంటరితనంలో.

ముడివెయ్యని కేశపాశం, నుదుటిపైన అట్టలుకట్టిన అలకలు
ఆమె కంఠానికి దిగువగా మాంగల్యసూత్రం
ఇంచుక కిందకి జారిన చెవికమ్మల్లో
ప్రకాశవంతమైన లోలాకులకి బదులు
సన్నని, చిన్ని దుద్దులు.

ఆ ముంజేతులమీద ఒకప్పుడు బలంగా గుర్తులుపడేలాగా ధరించిన
బంగారు కంకణాలబదులు
ఇప్పుడు చిన్ని చిన్ని పూసలగాజులు
తెరుచుకున్న చేపనోరులాగా ఒంపు తిరిగిన ఉంగరం
కుడిచేతివేలుమీద తొడిగినచోట ఎర్రటి నొక్కు.

మణికట్టులకు చుట్టిన రకరకాల తాయెత్తులు, కాశీతాళ్ళు
పూల నగిషీతో మెరిసే పట్టుచీరబదులు
ఆ దేహాన్ని ఆచ్ఛాదిస్తో మాసిన నేతచీర.

అలంకరణవిహీనంగా
తన శయ్యమీద సోలిన ఆమెని చూస్తుంటే
ఇంకా రంగులు వెయ్యని
రేఖాచిత్రంలాగా కనిపిస్తున్నది.

2

అర్థరాత్రి గడుస్తున్నా నిద్రపోనేలేదు

గాఢనిశీథిలో రాజు నిద్రని పక్కకునెట్టి
అంగరక్షకులు తోడురాగా
యుద్ధశిబిరంలో సంచరిస్తున్నాడు.
శత్రుసైన్యం మీద ప్రతాపం చూపించడంలో
గాయపడ్డ సైనికుల్ని పరామర్శిస్తున్నాడు.
సమరగజాలముఖకవచాల్ని ఛేధించినవాళ్ళని,
వాటి తొండాలు విరిచి, నేలకూల్చినవాళ్ళని,
శత్రుకరవాలాలకి నిలువెల్లా గాయపడ్డవాళ్ళని.

ఉత్తరదిక్కునుంచి చలిగాలి వీస్తున్నప్పుడల్లా
దీపస్తంభాలమీద కాంతిశిఖలు
దక్షిణంవైపు వాలుతున్నాయి.
వేపమండలు చుట్టిన బలమైన బల్లెం పట్టుకుని
నడుస్తున్న సైనికుడి వెనగ్గా రాజు.
స్కంధావారాన్ని దగ్గరుండి చూపిస్తున్నాడతడు.

ఇంకా తొలగించని జీనుల్తో
గర్వంగా పాదాలు తాటిస్తున్న గుర్రాలచుట్టూ
చిమ్ముతున్న బురద.
అవి తమ ఒళ్ళు విదిలించుకుంటున్నప్పుడల్లా
చిందుతున్న నీటిబొట్లు.

ఎడమభుజమ్మీంచి వేలాడుతున్న
ఉత్తరీయాన్ని సందిట అదిమిపట్టి
ఖడ్గధారి అయిన ఒక అంగరక్షకుడి
భుజమ్మీద తన దక్షిణహస్తాన్ని మృదువుగా ఆనించి
దయాన్విత దృక్కుల్తో
క్షతగాత్రుల్ని సాంత్వనపరుస్తున్న రాజు.

అతడిమీద వానచినుకులు పడకుండా
కప్పిన రాజఛత్రానికి
వేలాడుతున్న ముత్యాలపోగుల గలగల.

ఎన్నో యుద్ధాల్లో శత్రువుల్ని చెండాడిన ఆ రాజు
శిబిరమంతా కలయతిరుగుతూ
అర్థరాత్రి గడుస్తున్నా కూడా
నిద్రపోనేలేదు.

15-7-2023

4 Replies to “ఆషాఢమేఘం-28”

  1. నిజం సినిమాటిక్ ఎఫెక్ట్ చాలామంది. పరిణత దర్శకుని స్క్రీన్ ప్లే లాగా ఉంది. మాటల్లో దృశ్యాన్ని చూపాలంటే ఎంత ఆరితేరాలో , కవిత్వం పండాలంటే కవికి ఎంత నిశితదృగ్వైభవం ఉండాలో ఇదంతా చదువుతుంటే అర్థం అవుతుంది. వెనుకట పత్రికలో సీరియళ్లకు ముందు కుండలీకరణాల్లో జరిగిన కథ చెప్పినట్టు సంగం కవిత్వం తీరు తెన్నులు చెప్పడం చాలా అవసరం . సంస్కృతాధారిత భాషలకు ఈ అవసరం పడకపోవచ్చు కానీ ,తమిళ భాష ఏ మాత్రం సంస్కృతచ్ఛాయలు లేని భాష కనుక ఆ పదాలు మదిలో స్థిరపడాలంటే తిప్పి తిప్పి ఆ పదాలను పదే పదే జోడించాలి. ఇది భాషాభ్యసనానానికి కూడా నర్తిస్తూంది నాకు తెలిసి.అకం, పురం సంప్రదాయాలు, ఎట్టుత్తొగై, పత్తుప్పాట్టు కవితా సంకలనాల వివరాలు, కవితల కాలాలు, తిణై వంటి సందర్భ సూచకాలూ ఇలాంటివి ఒకసారి చదవగానే మనసులో నాటుకోవు కనుక ప్రారంభం లో సంగం కవిత్వ సంక్షిప్త సమాచారం ఇవ్వడం పునరుక్తి దోషాన్ని అధిగమిస్తూంది. మీరేమైనా సంశయిస్తారేమోనని మీకు పాఠకుడిగా అది అవసరమని తెలియచేయటం నా ఉద్దేశం. కొత్త పాఠాలు నాకైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ధన్యవాదాలు.

  2. “ఒక కథ పేజీల్లో ముగిసిపోయాకా మన అంతరంగం లో కొనసాగాలి”
    దర్శకులు బాలచందర్ గారి సినిమా కథలు
    సినిమా చూసి వచ్చాక కూడా మనల్ని వెంటాడుతాయి,ఆలోచింపజేస్తాయి.

Leave a Reply

%d bloggers like this: