ఆషాఢమేఘం-27

సంస్కృత సాహిత్యంలో కవయిత్రులుండేవారని నాకు చాలాకాలం దాకా తెలియదు. Andrew Schelling సంకలనం చేసి వెలువరించిన The Cane Groves of River Narmada (1998), Dropping the Bow (1991) అనే రెండు పుస్తకాలు ఇరవయ్యేళ్ళ కింద నా చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ కవయిత్రుల పేర్లు మొదటిసారిగా విన్నాను, పగడపు దీవుల్తో కూడిన ఒక ద్వీపసముదాయాన్ని చూసానని అనుకున్నాను.

ముఖ్యంగా Kenneth Rexroth సంకలనం చేసి అనువదించిన Women Poets of China (1972) చూసిన తరువాత అటువంటి పుస్తకం ఒకటి భారతీయ కవయిత్రులమీద కూడా వచ్చి ఉంటే ఎంత బాగుణ్ణు అనుకునేవాడిని. చాలాకాలం కిందట ఒక పుస్తకాల షాపులో సుశీ తారు, కె.లలిత సంకలనం చేసిన Women Writing in India: 600 BC to the Present (1991) అనే సంకలనాల రెండు వాల్యూములు చూసాను. అందులో మొదటి వాల్యూములో కవయిత్రుల పట్టిక చూసినప్పుడు కారైక్కల్ అమ్మైయ్యారూ, ఆండాళూ కనిపించలేదు. ఇంక ఆ పుస్తకాలు కొనుక్కోవడం అనవసరం అనిపించింది. అమ్మైయ్యారునీ, ఆండాళ్ నే విస్మరించిన సంపాదకులకి ప్రాచీన సంస్కృత, ప్రాకృత కవయిత్రులు కనిపించకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? కాని ప్రాచీన సంస్కృత, ప్రాకృత కవయిత్రులు ఎంతమంది ఉన్నారో, వారి తక్కిన కవిత్వం ఎలా ఉంటుందో చూడాలన్న నా కోరిక చాలా ఏళ్ల పాటు అలానే ఉండిపోయింది.

నా అదృష్టవశాత్తూ అటువంటి ఒక సమగ్ర సంపుటం ఇన్నాళ్ళకు నాకు లభించింది. జతీంద్ర బిమల్ చౌధురీ అనే ఆయన Contribution Of Women To Sanskrit Literature అని ఏడు సంపుటాలు వెలువరించాడు. అందులో రెండవసంపుటంలో సంస్కృత, ప్రాకృత కవయిత్రుల పరిచయాలు, వారి కవిత్వమూ సంకలనం చేసి అందించాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేసిన జె.బి.సి చేసిన ఈ మహత్కార్యానికి కవిత్వప్రేమికులందరూ శాశ్వతంగా ఋణపడి ఉంటారు.

ప్రాచీన భారతీయ సంస్కృత ముక్తక సంకలనాల్నీ, అలంకార గ్రంథాల్నీ శోధించి చౌధురీ సంస్కృత, ప్రాకృత కవయిత్రుల గురించిన వివరాల్నీ, వారి కవిత్వాన్నీ, వాటికి ఇంగ్లిషు అనువాదాల్నీ అందించాడు. సంస్కృత కవయిత్రుల్ని, వేదకాల ఋషుల్తో, బౌద్ధ సన్న్యాసినుల్తో, ప్రాకృత కవయిత్రుల్తో కూడా పోల్చిచూసి తన పరిశీలనలు కూడా మనకి అందించాడు. అంతేకాక, విషయాలవారీగా, వస్తువుప్రకారం, వర్ణనలప్రకారం కూడా ఆ కవిత్వాన్ని వింగడించిన పట్టికలు కూడా జతపరిచాడు.

జె.బి.సి చెప్పినదాని ప్రకారం వేదకాలంలో మంత్రాలు చెప్పిన ఋషులు 27 మంది. థేరీ గాథలు చెప్పిన బౌద్ధ సన్న్యాసినులు 71 మంది. ప్రాకృత కవయిత్రులు అయిదుగురు. వారు కాక కావ్యదృష్టితో కవిత్వం చెప్పినవారు దాదాపుగా 47 మంది స్త్రీలు ప్రాచీన భారతీయ సంస్కృత సాహిత్యంలో కనిపిస్తున్నారు. అంటే ప్రాచీన సంస్కృత, ప్రాకృత, పాళీ సాహిత్యాల్లో మొత్తం నూటయాభై మందిదాకా కవయిత్రులు కనిపిస్తున్నారు. ప్రాచీన గ్రీకు, లాటిన్, పర్షియన్ సాహిత్యాల్లో పోల్చి చూస్తే ఈ సంఖ్య చాలా పెద్దది. ప్రాచీన చీనా సాహిత్యం కూడా ఈ అంశంలో భారతీయసాహిత్యం కన్నా వెనకనే అనుకోవచ్చు. ఇంతకీ ఈ సంఖ్యలో సంగం కవయిత్రుల్నీ, దేశభాషల్లో కవిత్వం చెప్పిన కవయిత్రుల్నీ కలపనేలేదు. ఏ విధంగా చూసినా ప్రాచీన కాలంలో అత్యధికసంఖ్యలో కవయిత్రులు వర్ధిల్లింది భారతదేశంలోనే అని చెప్పుకోవచ్చు. కాని వేలాది శ్లోకాల, ముక్తకాల, వందలాది కావ్యాల సంస్కృత సాహిత్యంలో కవయిత్రులపేరు మీద మనకి లభ్యమవుతున్నది 140 పద్యాలూ, ఆరు కావ్యాలూ మాత్రమేనని తెలిసినప్పుడు ఆ ఉత్సాహమంతా ఆవిరైపోతుంది.

సంస్కృతంలో కవిత్వం చెప్పిన ప్రాచీన కవయిత్రుల్లో 9 మందివి పేర్లు మటుకే లభ్యమవుతున్నాయిగాని, కవిత్వం లభ్యం కావడం లేదు. 32 మందివి దాదాపు 140 పద్యాలదాకా లభిస్తున్నాయి. మరొక ఆరుగురివి పూర్తి కావ్యాలు లభ్యమవుతున్నాయి. ప్రాచీన అలంకారికుడు రాజశేఖరుడు వర్ణించినట్లుగా ఆ కవయిత్రుల్లో అందరూ ఉన్నారు- రాజకుమార్తెలు, అమాత్యుల భార్యలు, గణికలు, విలాసపత్నులు, కానీ ప్రతి ఒక్కరూ శాస్త్రవిద్యల్లోనూ, కవిత్వంలోనూ దిట్టలు.

ఆ కవయిత్రులందరిలోనూ అత్యధికంగా శ్లోకాలు లభిస్తున్నదీ, వారందరిలోనూ అత్యంత ప్రతిభాశాలిగా అలంకారికులు పరిగణించిందీ విజ్జిక అనే కవయిత్రిని. విద్య, విజ్జక, విజ్జిక, బిజ్జక ఇలా రకరకాల పేర్లతో ఆమె ప్రాచీన ఆలంకారికుల ప్రశంసలు అందుకుంది. ఆమె సా.శ 8-9 శతాబ్దాల మధ్య ఉండి ఉంటుందని ఒక అంచనా. ఆమె పేరుమీద 29 పద్యాల దాకా లభిస్తున్నాయి. ఆమె గురించి జె.బి.సి ఇలా రాస్తున్నాడు:

‘సంస్కృత కవయిత్రులందరిలోనూ బహుశా విజ్జ సుప్రసిద్ధురాలేకాక, గొప్ప విదుషీ, గొప్ప కవయిత్రి అని కూడా చెప్పవచ్చు. ఎన్నో సంకలనాల్లో, ఎన్నో లక్షణగ్రంథాల్లో ఆమె పద్యాలు కనిపిస్తున్నాయి. తన శక్తి సామర్థ్యాలపట్ల ఆమెకి ఉన్న ఆత్మవిశ్వాసం వల్లనే తనను తాను సరస్వతిగా చెప్పుకోడానికి సంకోచించలేదు. ఆమె పాండిత్యాన్నీ, కవిత్వ ప్రతిభనీ ధనదదేవుడు కూడా ప్రశంసించాడు. విజ్జక పద్యాల్లో అత్యున్నత శ్రేణి సంస్కృత కవిత్వంలోని లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఆమె అభివ్యక్తిలో స్వాభావిక శక్తి, పదరాజసం, సుదీర్ఘసమాసాలను నిర్వహించగల ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. నిరాడంబరమైన అభివ్యక్తి ఆమె గుణం కాదు. అందుకు బదులు ఆమె కావాలనే గంభీరపదప్రయోగాలకు పూనుకోవడమే కాక భాషమీద తనకి ఉన్న పట్టుని ప్రదర్శించుకోడానికి ఉత్సాహపడుతూంటుంది కూడా ‘

ఇందులో ఆమె తనని తాను సరస్వతిగా చెప్పుకుంది అనడం వెనక ఒక సుప్రసిద్ధమైన ఈ శ్లోకం ఉంది :

నీలోత్పల దళశ్యామం విజ్జకాం మామజానతా
వృథైవ దండినా ప్రోక్తం సర్వశుక్లా సరస్వతీ

(నీలికలువలాంటి ఈ విజ్జక ఉందని తెలుసుకోకుండా సరస్వతి తెల్లగా ఉంటుందంటో దండి వృథా మాట్లాడాడు.)

ఇటువంటి కవయిత్రులుకదా మనకి తెలియాలి. ఈమె ఏ ఏథెన్సులోనో, రోమ్ లోనో పుట్టి ఉంటే, ఆమెని ప్రపంచమంతా చదువుతూ ఉండేది కదా!

సంఖ్యరీత్యా పద్యాలు అత్యధికంగా లభిస్తున్నవాళ్ళల్లో విజ్జిక తరువాత గౌరి అనే కవయిత్రి ఉంది. ఆమెవి పందొమ్మిది పద్యాల దాకా దొరికాయి. కాని, విజ్జిక తర్వాత స్థానంలో, (కొందరి దృష్టిలో, విజ్జిక కన్నా ముందు స్థానంలో) శీలభట్టారిక అనే కవయిత్రి గురించి చెప్పుకోవలసి ఉంటుంది. శీల భట్టారికను ఈ మధ్యకాలందాకా భోజుడి సమకాలికురాలిగా కొందరూ, రాష్ట్రకూటరాజైన ధ్రువుడి భ్యార్య శీలమహాదేవి అని మరికొందరూ భావిస్తూ వచ్చారు. కాని ఈ ఏప్రిల్లోనే భండార్కర్ ఓరియెంటల్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఒక పండితుడు శీలభట్టారిక రెండవపులకేశి కూతురని ప్రతిపాదించాడు. ఆమె చారిత్రికంగా ఎవరో మనకి ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉన్నప్పటికీ, దొరికిన ఆరు పద్యాల ఆధారంగా ఆమెని కవయిత్రుల్లో మహారాణిగా లెక్కవెయ్యవచ్చు. రాజశేఖరుడు ఆమెనిలా ప్రశంసించాడట:

శబ్దార్థయోః సమో గుంఫః పాంచాలీ రీతిరిష్యతే
శీలాభట్టారికా వాచి బాణోత్కిషు చ సా యది

(శబ్దార్థాల్ని సమానంగా నిర్వహించడం పాంచాలీ రీతి అనిపించికుంటుంది. అందులో శీలభట్టారిక కవిత్వం కూడా బాణుడితో పోల్చదగ్గది.)

ఆషాఢమేఘం గురించే రాయకపోయినా ఇక్కడ శీలభట్టారిక పద్యం ఒకటి తెలుగుచేయకుండా ఉండలేకపోతున్నాను (ఆరవశ్లోకం). ఎందుకంటే, ఏదో రాతప్రతిలో ఈ శ్లోకాన్ని చదివిన చైతన్యమహాప్రభువు స్పృహతప్పిపోయారట. దివ్యప్రేమకు ఇంతకన్నా మించిన అభివ్యక్తిని చూడలేదన్నారట ఆయన. ఈ పద్యాన్ని ఇప్పుడు పాశ్చాత్య విమర్శకులు అత్యున్నత భారతీయ పద్యంగా పేర్కొంటున్నారు. కొందరి దృష్టిలో ఈ పద్యంలో నాయిక తన భర్తనికాక పూర్వప్రేమికుణ్ణి తలచుకుంటూ ఉంది. కాని నా దృష్టిలో ఈ కవితలో నాయిక, ప్రస్తుతం వివాహిత, తన భర్తనే, అతడు తనకు ప్రేమికుడిగా పరిచయమైన రోజుల్ని తలచుకుంటూ ఉంది. ఈ పద్యం చదవగానే ఒక లీ జింగ్ ఝావో లాంటి చీనా కవయిత్రినో, మురసకి సతి లాంటి జపనీయ రచయిత్రినో మనకి గుర్తు రాకుండా ఉండరు. ఈ పద్యం చదివి ఉంటే టాల్ స్టాయి ‘ఫామిలీ హాపీనెస్’ లాంటి మరో నవల రాసివుండేవాడు. ఇందులో నాయిక తలచుకుంటున్నది తన భర్తనిగానీ లేదా తన ప్రియుణ్ణిగానీ- ఆ తలపు మాత్రం చైతన్యులు భావించినట్టుగా ఒక దివ్యప్రేమోన్మత్తత అని మాత్రమే చెప్పగలను.

శీలమహాదేవి తర్వాత ప్రస్తావించవలసిన కవయిత్రి వికటనితంబిక. ఆమె తొమ్మిదో శతాబ్దానికి చెందిన కవయిత్రి. ఆమెవి పదకొండు పద్యాలు లభిస్తున్నాయి. విజ్జికలాగా కాకుండా వికటనితంబిక శైలి సరళమని చెప్తారు. అందుకనే ఆమె గురించి రాజశేఖరుడు ఇలా అన్నాడట:

కే వైకట్యనితంబేన గిరాం గుంఫేన రంజితాః
నిందంతి నిజకాంతానాం న మౌగ్ధ్య-మధురం వచః

(వికటనితంబిక కవిత్వం విన్నాక ఎవరేనా తమ ప్రియురాళ్ళ మాటల మాధుర్యాన్ని కూడా మర్చిపోకుండా ఎలా ఉంటారు?)

తక్కిన కవయిత్రుల్లో నేను పరిచయం చేయడానికి మరొక ముగ్గురి కవితలు మాత్రమే ఎంచుకున్నాను. వారు మదాలస, మోరిక, ఇందులేఖ. ఇందులో మోరికవి నాలుగు, మదాలసవి రెండు, ఇందులేఖవి ఒకటీ మాత్రమే పద్యాలు లభిస్తూ ఉన్నాయి. ఇందులేఖ లాంటి కవయిత్రిది ఒక్క పద్యం మాత్రమే మనకు దొరుకుతుండటం నిజంగా దురదృష్టం అంటాడు జె.బి.సి.

సంస్కృత కవయిత్రుల కవిత్వంలో సింహభాగం ప్రేమకవిత్వమేననీ, మదాలస రాసిన ఒక్క శ్లోకం తప్ప తక్కిన కవిత్వంలో ఎక్కడా పరలోక స్పృహలేదనీ కూడా సంపాదకుడు చెప్తున్నాడు. వారు అన్ని రకాల పురుషుల్నీ- రాజుల్నీ, కవుల్నీ, లోభుల్నీ, క్రూరుల్నీ, చివరకి రోగుల్నీ కూడా చూసారని ఆ పద్యాలు సాక్ష్యమిస్తాయి. ఒక్క విజ్జిక తప్ప తక్కిన కవయిత్రులంతా సరళభాషలోనూ, సంగీతప్రధానంగానూ కవిత్వం చెప్పారని కూడా సంపాదకుడు పేర్కొన్నాడు. ఐహిక ప్రపంచం, ఐంద్రియిక జీవితం, సజీవ, చైతన్యవంతమైన అనుభవాలే ఆ కవయిత్రులకు కావ్యవస్తువులని కూడా ఆ పద్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆధునిక కవయిత్రులు ఎటువంటి లౌకిక, ఆనుభవిక, సౌందర్యాత్మక, సాధికారిక జీవితాన్ని అభిలషిస్తున్నారో, దాదాపుగా ప్రాచీన సంస్కృత కవయిత్రులు కూడా ఆ దారినే కోరుకున్నారని మనకి ఈ పద్యాలు వెల్లడిస్తున్నాయి.

సంస్కృత కవయిత్రుల్ని వైదిక, ప్రాకృత, పాళీ కవయిత్రుల్తో పోల్చి వారందరిలోనూ ఉమ్మడిగా కనిపిస్తున్న విశేషం ఒకటుందని చెప్తాడు జె.బి.సి. అదేమంటే, లభిస్తున్న ఈ సూక్తాల్లో, గాథల్లో, శ్లోకాల్లో ఎక్కడా కూడా ఒక్క కవయిత్రి కూడా పురుషప్రపంచం మీద నిందకుగానీ, దూషణకుగానీ, ఫిర్యాదుకు గానీ పూనుకున్నట్టు కనిపించదని. బౌద్ధ సన్న్యాసులు రాసిన కవితలు థేరగాథలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో ఆ కవితలు రాసిన పురుషులు తమ సాధనకు అడ్డు వస్తున్నారని స్త్రీలని నిందించడం, ద్వేషించడం కనిపిస్తుందిగానీ, బౌద్ధ సన్న్యాసినులు ఒక్క కవితలో కూడా ఒక్క పురుషుణ్ణి కూడా నిందించిన ఒక్క మాటకూడా లేదు అని రాస్తున్నాడు ఆయన.

ఆ కవిత్వంలోంచి పదిశ్లోకాలు మీకోసం. అరుదైన పద్యాలు కాబట్టి మూలాలు కూడా ఇస్తున్నాను.


రెల్లుపూల పానుపు పైన

విజ్జిక

1

స్వావస్థా కథనం

గతే ప్రేమాబంధే హృదయ-బహు-మానేపి గలితే
నివృత్తే సద్భావే జన ఇవ జనే గచ్ఛతి పురః
తథా చైవోత్ ప్రేక్ష్య ప్రియ-సఖి గతాంస్తాంశ్చ దివసాన్
న జానే కో హేతుర్దలతి శతధా యన్న హృదయం.

(ప్రేమబంధం తెగిపోయాక, అభిమానం అదృశ్యమైపోయాక, పరస్పరం ఇష్టం కూడా అడుగంటి పోయాక, అతడు నా ముందునుంచి ఎవరో మనిషిలాగా నడిచివెళ్తుంటే, ఆ గడిచినరోజులూ, ఆ గడిపిన తీరూ గుర్తుకొస్తుంటే, సఖీ, ఎందుకని నా హృదయమింకా నూరుముక్కలు కాకుండా నిలిచి ఉంది?)

2

వర్షా-1

సోత్సాహా నవ-వారి-భార-గురవో ముంజంతు నాదం ఘనా
వాతా వాన్తు కదంబ-రేణ-శబలా నృత్యన్త్వమీ బర్హిణః
మగ్నాం కాంత-వియోగ-దుఃఖ-జలధౌ దీనాం విలోక్యాంగనాం.
విద్యత్ ప్రస్ఫూర్సి త్వమప్యకరుణా స్త్రీత్వేపి తుల్యే సతి.

(ఆ ప్రియుడు దగ్గరలేని దుఃఖం ఒక సముద్రంలాగా నన్ను ముంచెత్తుతుంటే, కొత్తనీళ్ళబరువుతో ఆ మబ్బులు ఉత్సాహంగా అరిస్తే అరవనివ్వు, కడిమిపూల పరాగం మోసుకుంటూ ఆ గాలులు వీస్తే వీచనివ్వు, నెమళ్ళు నాట్యం చేస్తే చేయనివ్వు, కానీ, ఓ సౌదామినీ, నువ్వూ, నేనూ ఇద్దరమూ స్త్రీలమే కదా, నువ్వెలా మెరుస్తున్నావు కనికరం లేకుండా!)

3

వర్షా-2

మలిన-హుత-భుగ్-ధూమ-శ్యామైర్దిశో మలినా ఘనై
రవిరల-తృణైః శ్యామా భూమిర్నవోదగత-కందలైః
సురత-సుభగో నూనం కాలః స ఏవ సమాగతో
మరణ-శరణా యస్మిన్నేతే భవంతి వియోగినః

(సరిగ్గా మండని మంటలోంచి వచ్చే పొగలాంటి నల్లని మబ్బుల్తో దిక్కులు మసకబారాయి. కొత్తగా అంకురించిన కందళిపుష్పాల్తో పచ్చిక నేలంతా పరుచుకుంది. ప్రేమికులు కలుసుకోడానికి నిజంగా అనువైనకాలం సమీపించింది. ప్రేమికులు దగ్గరలేని వాళ్ళకి మరణం తప్ప మరో గతిలేని సమయం కూడా.)

శీలభట్టారిక

4

నాయికానునయం

విరహవిషమో వామః కామః కరోతి తనుం తనుం
దివసగనాదక్షశ్చాయం వ్యపేత-ఘృణో యమః
త్వమపి వశగో మాన-వ్యాధేర్విచింతయ నాథ హే
కిసలయ-మృదుర్జీవేదేవం కథం ప్రమదా-జనః

(వియోగంవల్ల భరించజాలని ప్రేమ నా దేహాన్ని తినేస్తోంది. యముడు కూడా రోజులు లెక్కపెట్టలేక నా పట్ల జాలిమాలాడు. ఇలాంటి పరిస్థితుల్లో, నువ్వు కూడా నా పట్ల కినుక పూనితే, లేతచిగుళ్ళగుత్తుల్లాంటి స్త్రీలు చెప్పు, ప్రభూ, ఎలా మనగలుగుతారు?)

5

వియోగినీ అవస్థ

ప్రియ విరహితస్యాయ హృది చింతాసమాగతా
ఇతి మత్వా గతా నిద్రా కే కృతఘ్నముపాసతే.

(ప్రియుడినుంచి దూరంగా ఉన్నప్పుడు అతడి తలపు మదిలో మెదిలిందో లేదో నిద్ర కూడా వదిలిపెట్టేసింది. కృతఘ్నుల్ని ఎవరు మటుకు ఆరాధిస్తారు గనుక?)

6

అసతీ

యః కౌమార-హరః స ఏవ హి వరస్తా ఏవ చైత్ర-క్షపా
స్తే చోన్మీలిత-మాలతీ-సురభయః ప్రౌఢాః కదంబానిలాః
సా చవాస్మి తథాపి చౌర్య-సురత-వ్యాపార-లీలా-విధౌ
రేవా-రోధసి వేతసీ-తరు-తలే చేతః సముత్కంఠతే.

(నా నవయవ్వనంలో నా హృదయాన్ని దోచుకున్ననా వరుడు వాడే. మళ్ళా తిరిగివచ్చినవి ఆ వెన్నెలరాత్రులే. కడిమిచెట్టుని అల్లుకున్న మాలతీ తీగమీంచి కమ్ముకుంటున్న పరిమళాలూ అవే. నేనూ ఆనాటిమనిషినే. కాని నర్మదానది ఒడ్డున, ఆ రెల్లుపూల పానుపు మీద, ఆ ప్రణయోద్వేగం ఎక్కడ?)

వికటనితంబిక

7

అభిసారికా సంచారం

క ప్రస్థితాసి కరభోరు ఘనే నిశీథే
ప్రాణాధిపో వసతి యత్ర మనః-ప్రియో మే
ఏకాకినీ వద కథం న బిభేషి బాలే
నాన్వస్తి పుంజ్ఞిత-శరో మదనః సహాయః

(‘అందమైనయువతీ! ఈ చిమ్మచీకటి రాత్రి ఎక్కడికి బయల్దేరావు?’ ‘నా ప్రాణాధిపుడు, నా మనసుకు నచ్చినవాడు ఎక్కడున్నాడో అక్కడికి’. ‘మరి ఇంత రాత్రి ఒక్కర్తివీ వెళ్తున్నావు, బాలా, భయం లేదా?’ ‘ఎందుకు? నాకు తోడుగా మన్మథుడున్నాడుగా’.)

ఇందులేఖ

8

అస్తమయం

ఏకే వారినిధౌ ప్రవేశమపరే లోకాంతరాలోకనం
కేచిత్ పావక యోగితాం నిజగదుః క్షీణోహ్ని చండార్చిషః
మిథ్యాచైతదసాక్షికం ప్రియ సఖి ప్రత్యక్ష తీవ్రాతపం
మన్యేహం పునర్ధ్వనీన రమణీ చేతోధిశేతే రవిః

(రోజు గడిచిపోయేవేళ సూర్యుడు సముద్రంలో ప్రవేశిస్తాడని కొందరంటారు. కొంతమందేమో, లేదు, మరో లోకంలో అడుగుపెడతాడంటారు, ఇంకొంతమందంటారు, అతడు అగ్నిలో లీనమవుతాడని. కానీ ఈ ఊహలన్నీ వట్టివి- వాటికి సాక్ష్యం లేదు. సఖీ, నేననుకుంటాను, చీకటిపడేవేళ సూర్యుడు విరహిణుల గుండెల్లో చేరతాడు, రాత్రంతా రగిలిమండటానికి.)

మదాలస

9

మేఘగర్జన

సాంద్ర చంద్ర విరుతైః స్థిత-వాణైనార్జితం జగదిదం మదనేన
అంబుదో దిశి దిశి ప్రథమానో గర్జితైరితి నివేదయతీవ.

(వాడిగా, మెరుస్తున్న బాణాలతో మదనుడు ఈ లోకాన్నంతటినీ ఆక్రమించుకున్నాడు. ఆ వార్త చెప్పడానికే మబ్బులు దిక్కులంతా వ్యాపించి మరీ గర్జిస్తున్నాయి.)

మోరిక

10

వియోగినీ అవస్థ

లిఖతి న గణయతి రేఖాం నిర్భరబాష్పాంబు-ధౌత-గండ-తటా
అవధి-దివసావసానం మా భూదితి శంకితా బాలా.

(చెంపలు కన్నీళ్ళతో తడిసిపోతున్న చిన్నారి, రోజుల లెక్కకోసం, నేలమీద గీతలైతే గీస్తోందిగాని, తీరా, లెక్కపెట్టాలంటే భయపడుతోంది)

14-7-2023

8 Replies to “ఆషాఢమేఘం-27”

  1. Sir, మీరు retired అయ్యాకా మరో serviceలోకి ప్రవేస్తారమేనుకున్నముగాని ఇలా మా గుండెలో చేరి సాహిత్య విరహగ్ని రగిలిస్తారని అనుకొలేదు సార్ .. Thank you sir❤🌹🙏

  2. …….
    నమస్కారాలు సర్..

Leave a Reply

%d bloggers like this: