ఆషాఢమేఘం-26

తెలుగులో వేమన ఎలాగో సంస్కృత సాహిత్యంలో భర్తృహరి అలాగ. వేమన చుట్టూ ఎన్ని కథలున్నాయో, భర్తృహరి చుట్టూ కూడా అన్ని కథలున్నాయి. ఆ కథల్లో ఆయన్ని కూడా వేమనలాగే ముందు రాజుగానూ, ఆ తర్వాత విరాగిగానూ చెప్పుకుంటూ ఉంటారు. వేమనలాగే భర్తృహరి కాలనిర్ణయం కూడా అంతసులువైన పని కాదు. వేమనలాగే పాశ్చాత్యప్రపంచాన్ని ఆకర్షించిన భారతీయ కవుల్లో భర్తృహరి ముందుంటాడో, కాళిదాసు ముందుంటాడో చెప్పలేం. కాని ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. చాలామందికి కాళిదాసు పేరు తెలుసు. కాని చాలాకొద్ది మంది మాత్రమే ఆయన శ్లోకాలు గొంతులో దాచిపెట్టుకుని ఉంటారు. చాలామందికి తాము ఉటంకిస్తున్నది భర్తృహరి వాక్యాలని తెలియకపోయినా జీవితంలో కనీసం ఒక్కసారేనా భర్తృహరి సుభాషితాల్లోంచి ఒక్క వాక్యమేనా ప్రస్తావించకుండా ఉండరు. ప్రజల నాలుక మీద నానడంలో సంస్కృత కవుల్లో భర్తృహరి తర్వాతే ఎవరేనా.

ఇరవై ఏళ్ళ కింద భర్తృహరి సుభాషితాలు చదవడానికి కూచున్నప్పుడు నా మొదటి అనుభూతి ఆశ్చర్యం. ఎందుకంటే ఆ నీతిశతకంలోని చాలా శ్లోకాలు నా చిన్నప్పుడు తాడికొండలో సంస్కృతపాఠాలుగా చదువుకున్నవే. అంతే కాదు, వాటికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన తెలుగు అనువాదాలు దాదాపుగా నా చిన్నప్పణ్ణుంచీ వింటూ వస్తున్నవే. ఇంకా చెప్పాలంటే 1950 కి పూర్వం తెలుగులో కథలూ, నవలలూ రాసిన చాలామంది రచయితలు, చివరికి, శ్రీ శ్రీ, కొడవటిగంటిలతో సహా, ఒక్కవాక్యమేనా లక్ష్మణ కవి పద్యాలనుంచి ఉదాహరించనివాళ్ళు లేరనే చెప్పవచ్చు.

భర్తృహరి ఒకరా, ఇద్దరా, ఒక సమూహమా, అసలు లేరా అనే ప్రశ్నకి జవాబు వెతకడంలో భారతదేశపండితులు అలసిపోయారు. అతడు ఎవరు కాదో మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. అతడు వాక్యపదీయ కర్త అయిన భర్తృహరి కాడు, భట్టికాడు, బౌద్ధుడు కాడు, పంచతంత్రం కన్నా తరువాతి వాడు కాడు. కావ్యంలో అంతర్గత సాక్ష్యాల్నిబట్టి మొత్తానికి ఆ పద్యాల్లో చాలావరకు రాసిన రచయిత ఒకడుండేవాడనీ, అతడు ఉత్తరాదివాడనీ, బ్రాహ్మణుడనీ, అద్వైతి అనీ, శివకేశవభేదం లేకపోయినా, శివుడంటే ఎక్కువ మక్కువ ఉన్నవాడనీ, ఒకప్పుడు స్త్రీల పట్ల అపారమైన వ్యామోహంతో బతికి, ఏ కారణం చేతనో, స్త్రీల పట్ల చిన్నచూపు పెంచుకున్నవాడనీ చెప్పవచ్చు. చీనా యాత్రీకుడు ఇత్సింగ్ తన భారతదేశయాత్రల్లో ఒకాయన ఏడుసార్లు సన్న్యసించి మళ్ళా ఏడు సార్లు ప్రపంచంలోకి రాకుండా ఉండలేకపోయాడని రాసింది ఈ భర్తృహరి గురించే అని కూడా నమ్మవచ్చు.

భర్తృహరి రాసిన సుభాషితాల్ని నీతి, శృంగార, వైరాగ్య శతకాలుగా సంకలనం చేసారు. కాని వేమనలాగా, కబీరులాగా, భర్తృహరి పేరు మీద ప్రచారంలో ఉన్న శ్లోకాలు ఆ మూడువందల సంఖ్యని ఎప్పుడో దాటేసాయి. దేశమంతా వ్యాప్తిలో ఉన్న రకరకాల తాళపత్రాల్ని శోధించి భర్తృహరి సుభాషితాల సంశోధిత ప్రతి ఒకటి రూపొందించే బాధ్యత దామోదర ధర్మానంద కోశాంబి తన భుజాలకి ఎత్తుకోవడం మన అదృష్టం. ఆయన రెండువందలకు పైగా లిఖిత ప్రతుల్ని సంపాదించి, చదివి, ఒక నిర్దిష్ట ప్రతి రూపొందించాడు. ఆయన పరిశీలన ప్రకారం మూడు శతకాల్లోనూ అన్ని ప్రతుల్లోనూ ఉమ్మడిగా కనిపిస్తున్నవి రెండువందల శ్లోకాలు మాత్రమే. అవి కాక వివిధ ప్రతుల్లో లభిస్తున్నవి మరొక 657 శ్లోకాలదాకా ఉన్నాయనీ ఆయన తేల్చాడు. మూడేళ్ళకు పైగా చేసిన కఠోరశ్రమతాలూకు ఫలితంగా The Epigrams Attributed to Bhartrhari (1948) అనే విలువైన సంశోధిత ప్రతిని మనకు కానుకగా ఇచ్చిపోయాడు.

భర్తృహరిని తెలుగులో పదహారో శతాబ్దంలో ఎలకూచి బాలసరస్వతి అనే ఆయన మొదటిసారిగా అనువదించాడు. ఆ తర్వాత పద్ధెనిమిదో శతాబ్దంలో యేనుగు లక్ష్మణకవి అనువదించాడు. దాదాపుగా అదే కాలానికి చెందిన పుష్పగిరి తిమ్మన అనే ఆయన కూడా అనువదించాడు గాని, అందులో నీతిశతకం మాత్రమే మనకు దొరుకుతున్నది. ఈ ముగ్గురిలోనూ యేనుగు లక్ష్మణకవి చేసిన అనువాదాలు, ముఖ్యంగా నీతిశతక పద్యాలు తెలుగునాట గొప్పగా వ్యాపించాయి. ‘మకర ముఖాంతరస్థమగు మానికమున్’, ‘తెలివి యొకింత లేని యెడ తృప్తుడనై’, ‘అకాశంబుననుండి శంభుని శిరంబు’, ”జలముల నగ్ని’, ‘హర్తకు గాదు గోచరము’,’తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’- ఇలా ఎత్తి చెప్పాలంటే దాదాపుగా అన్ని పద్యాల్నీ ఉటకించవలసి ఉంటుంది. వేమన, పోతన, తిరుపతివెంకటకవుల పాండవోద్యోగ విజయాలు పద్యాలతో సమానంగా యేనుగు లక్ష్మణ కవి సుభాషితాలు తెలుగు వాళ్ళ నాలుకలమీద గూళ్ళు కట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదు. నిజానికి భర్తృహరి సుభాషితాల వివిధ ప్రతుల్లో ఆంధ్ర ప్రాంతపు ప్రతి చాలా నిర్దుష్టంగా ఉందని కోశాంబినే అన్నాడు.

భర్తృహరి పైన కోశాంబి ఒక వ్యాసం రాసాడని నాకు మొదటిసారి కొడవంటిగంటి వ్యాసాల ద్వారా తెలిసింది. తర్వాతరోజుల్లో కోశాంబి రాసిన ఆ వ్యాసం చదివాను. The Quality of Renunciation in Bhartrhari’s Poetry (1941) అనే ఆ వ్యాసం కోశాంబి వైదుష్యానికి మచ్చుతునక. అందులో ఆయన భర్తృహరిని ప్రపంచస్థాయి కవిగా ప్రస్తుతిస్తూ, అదే సమయంలో ప్రపంచమహాకవుల ముందు ఎందుకు నిలబడలేడో కూడా చెప్తాడు. తిరిగి మళ్లా సంస్కృత సాహిత్యంలో భర్తృహరి స్థానాన్ని పదిలపరిచే ప్రయత్నం చేస్తాడు. తాను ఎంతగానో అభిమానించి తన జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని ఆ కవికోసం కేటాయించిన కోశాంబి ఇలా రాయడం కొంత ఆశ్చర్యం కలిగించకమానదు. కాని కోశాంబి ప్రధానంగా మార్క్సిస్టు కాబట్టి, మార్క్సిస్టు దృక్పథంలో భర్తృహరిని అంచనా వెయ్యడానికి ప్రయత్నించాడు. నిజానికి అటువంటి అనుశీలన మార్క్సిస్టు విమర్శకులు తక్కిన భారతీయ కవుల పట్ల కూడా చెయ్యదగ్గదే, కాని ఎవరూ ఇంతదాకా ఆ పని చేసినట్టు కనిపించదు. భర్తృహరిమీద కోశాంబి ప్రధామైన అభియోగం ఏమిటంటే, ఆయన మాట్లాడుతున్న నీతి ప్రధానంగా దిగువ మధ్యతరగతి నీతి అనీ, ఆయన శృంగారంలో అధికభాగం స్త్రీద్వేషం అనీ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా, ఆ వైరాగ్యం నిజమైన వైరాగ్యం కానే కాదనీ, అదొక రకమైన పలాయనం మాత్రమేననీ. అయితే రాజ్యం లేదా వనవాసం అనే భావనలోనే ఒక class contradiction ఉందంటాడు ఆయన. దొరికితే ప్రభుత్వోద్యోగం లేకపోతే సన్న్యాసజీవితం అనే ఆలోచనలోనే శ్రమకి దూరంగా జీవించాలనే ఒక వర్గ ప్రయోజనం ఉందనేది కోశాంబి అభిప్రాయం. నేనిక్కడ ఈ వాదాన్ని చర్చకు పెట్టాలనుకోవడం లేదు. ఒక కవిమీద జీవితకాలం కృషి చేసినంతమాత్రాన ఆ కవిత్వానికి మూఢభక్తుడిగా మారక్కర్లేదనేది కోశాంబి మనకు నేర్పుతున్న పాఠం.

తన మూడు వందల శ్లోకాల్లో వానాకాలాన్ని వర్ణించడానికి కూడా భర్తృహరి ఆరేడు శ్లోకాలు కేటాయించడం విశేషం. (వాటిలో అయిదారు శ్లోకాలు కోశాంబి రూఢిపరిచిన సంశోధిత ప్రతిలో ఉన్నవే.) కాని అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే భర్తృహరి స్త్రీలనీ, సంగీతాన్నీ ఎంతగా ఇష్టపడ్డాడో దక్షిణాది కవుల కవిత్వాన్ని కూడా అంతే ఇష్టపడ్డాడు. సా.శ. 4-7 శతాబ్దాల మధ్య దక్షిణాది కవుల కవిత్వం అంటే ప్రాకృత కవిత్వం, సంగం కవిత్వమే. ఈ శ్లోకం చూడండి:

అగ్రే గీతం, సరస కవయః పార్శ్వయోర్దాక్షిణాత్యాః
పశ్చాల్లీలావలయరణితం చామరగ్రాహిణీనాం
యద్యస్త్యేవం కురు భవరసాస్వాదనే లంపటత్వం
నోచేచ్చేతః ప్రవిశ సహసా నిర్వికల్పే సమాధౌ (వై.66)

(మనసా! ఎదురుగా సంగీతం, పక్కన సరసులైన దక్షిణాది కవులు, వెనక చామరాలు పట్టుకుని వీచే స్త్రీల గాజుల గలగల- ఇవి దొరికాయా, సంసారంలో ఉండు. లేదా నిర్వికల్పసమాధిలో ప్రవేశించు)

ఆషాఢమేఘాలమీదా, వర్ష ఋతువు మీదా భర్తృహరి రాసిన పద్యాలు ప్రాకృతకవుల కవిత్వం మీద ప్రీతితోనే రాసి ఉంటాడని మనం ఊహించవచ్చు. నిజానికి నా ఉద్దేశ్యంలో శతక త్రయంలో నీతిపద్యాలది మొదటిస్థానం. ఆ తర్వాత వైరాగ్యశతకానిది. శృంగార శ్లోకాలది వాటికన్న కొద్దిగా దిగువస్థాయి. కాని ఆ పద్యాల్లో బాగా అనిపించినవాటికి భర్తృహరి ప్రాకృతకవులకి ఋణపడి ఉంటాడనిపిస్తుంది నాకు.


ఆనందమూ, ఆందోళనా

1

తొలకరి మబ్బుల్ని చూసిన బాటసారి
ఆమె ప్రాణాలతో మిగిలి ఉంటే ఏమిటి
లేకపోతే ఏమిటి
నాకు బతకడం మీదనే
ఆశపోయిందనుకుంటో
అక్కడే తచ్చాడుతున్నాడు. (శృం.66)

2

ఈ వానాకాలం కూడా
జవరాలిలాంటిదే
కోరికపుట్టిస్తుంది,
జాజిపూల సువాసనలీనుతుంది,
ఉన్నతపయోధరాలతో
బరువెక్కి కనిపిస్తుంది. ( శృం.90)

3

దట్టమైన మబ్బులు కమ్మిన ఆకాశం,
నేలంతా పొటమరించిన గడ్డిపూలు,
కొత్తగా పూస్తున్న కడిమిపూల, జాజిపూల
సుగంధాన్ని మోసుకొచ్చే తెమ్మెర,
నెమళ్ళ కేకలతో నిండిన అడవులు-
సుఖినిగాని, దుఃఖినిగాని
ఎవరినైనా సరే మత్తెక్కిస్తాయి. (శృం.91)

4

బాటసారులు పైకి చూద్దామంటే
మబ్బులబారు.
పక్కకి చూద్దామంటే
నెమళ్లు తిరుగుతున్న కొండలు.
కిందకి చూద్దామంటే
ఎటు చూడు విరబూసిన గడ్డిపూలు-
మరింక ఎటు చూసేది! (శృం.92)

5

ఇటువైపు మెరుపు తీగలు,
ఇక్కడేమో మొగలిపొదల సుగంధం,
మరొక పక్క మేఘగర్జన,
ఆ పక్కనేమో నెమళ్ళ కలకలం-
దట్టమైన కనురెప్పలుండే అతివలు
ఈ వియోగదినాల్నెట్లా గడిపేది? (శృం.93)

6

సూది పడటానికి కూడా
సందులేని చీకటి,
ఆకాశమంతా అరుస్తున్న
చిక్కటి మబ్బులు,
ఎడతెరిపిలేని వర్షధార
బంగారు తీగలాగా మెరిసే మెరుపులు-
అభిసారికలకు ఈ రాత్రిపూట
ఎంత ఆనందమో అంత ఆందోళన. (శృం. 94)

7

కురుస్తున్న వానకి
ఇంట్లోంచి బయటికి పోలేరు,
వణికిస్తున్న చలిగాలినుంచి
తప్పించుకోడానికి
విశాలనేత్రల కౌగిళ్ళే గతి.
కలయికల్లోని అలసటని
తగ్గించే చల్లగాలి.
ఎవరన్నారు వర్షదినాలు
దుర్దినాలని?
సుదినాలైతేను! (శృం.95)

8

చాతకమా! నేను చెప్పే మాటలు
ఇంచుక ఆలించు.
ఆకాశంలో చాలా మేఘాలున్నాయి,
అన్నీ ఒక్కలాంటివి కావు,
కొన్ని మటుకే కురుస్తాయి,
కొన్ని ఊరికే అరుస్తాయి.
మబ్బులు కనబడ్డంతమాత్రాన
అడుక్కుంటూ పోకు. (మహారాష్ట్ర ప్రతి, నీ.శ.51)

9

తలుచుకుంటే చాలు
వేడెక్కిస్తుంది,
చూస్తే చాలు
వెర్రి పుట్టిస్తుంది,
తాకితే చాలు
మత్తెక్కిస్తుంది-
ఆమెనెట్లా అనగలం
ప్రియురాలని? ( శృం. 42)

10

చూడనంతసేపూ
ఎప్పుడు చూస్తామా అని ఒకటే కోరిక,
తీరా చూసాక
కౌగిలించుకోవాలన్న కోరిక,
కౌగిలించుకుంటామా-
ఇక ఆ రెండుదేహాలూ ఎప్పటికీ
విడిపోకూడదనే తపన మొదలు. ( శృం.22)

13-7-2023

Leave a Reply

%d bloggers like this: