ఆషాఢమేఘం-25

దక్షిణం దిక్కునుంచి బయలుదేరిన మేఘం తమిళసీమ, గోదావరీ తీరం మీంచి, వింధ్యపర్వతాలు దాటి కాళిదాసుడి మేఘసందేశంలో మధ్యభారతమంతా సంచరించి హిమాలయాలకు ప్రయాణించడం ఇప్పటిదాకా చూసాం. నేనింకా అవంతీ, ఉజ్జయిని దగ్గరే ఆగిపోయాననీ, కాళిదాసు కాశ్మీరులోనే పుట్టి ఉంటాడనీ లేకపోతే అటువంటి రసహృదయం ఆయన సొంతమై ఉండేది కాదని మొన్న హరిచందన కుమార్ అన్నాడు. కాళిదాసు సంగతి నాకు తెలియదుగాని, ఆయనతో సమానుడైన కవిగా ప్రశస్తి పొందిన అమరకుడు మాత్రం కాశ్మీరదేశీయుడే. అందుకని ఈ రోజు ఆషాఢమేఘస్పర్శ అమరకుడితో ఎటువంటి కవిత్వం చెప్పించిందో చూద్దాం.

అమరకుడు అనే ఆయన కాశ్మీరదేశపు రాజు అని ఒక ప్రసిద్ధ కథనం. ఆయన రాసిన సంస్కృత ముక్తకాలు ‘అమరు శతకం’ పేరిట సంకలనం అయ్యాయి. ఆ శతకంలో ఉన్నవే కాక, సంస్కృత అలంకారికులు ఉదాహరించినవి, కొన్ని ప్రాచీన సంస్కృత కవితాసంకలనాల్లో లభించినవి కూడా కలిపితే ఆ సంఖ్య నూరు శ్లోకాల్ని దాటుతుంది.

అమరుకుడు రాసిన ముక్తకాల ప్రస్తావన వామనుడు, ఆనందవర్ధనుడు వంటి అలంకారికుల గ్రంథాల్లో మొదటిసారిగా కనిపిస్తుంది. ‘అమరుకుడి ముక్తకాల్నే మనం పూర్తిస్థాయి ప్రబంధాలుగా పరిగణించవచ్చు’ అని ఆనందవర్ధనుడు అన్నాడు. ‘అమరుక కవేః ఏకః శ్లోకః ప్రబంధ శతాయుతే’ (అమరుక కవి ఒక్కొక్క శ్లోకం వంద ప్రబంధాల పెట్టు ) అనే మాట కూడా ఒకటి సంస్కృత రసజ్ఞుల నానుడిగా మారింది. వామనుడు స్పష్టంగా అమరుకుడి పేరు ప్రస్తావించకపోయినా, ఆయన శ్లోకం ఒకటి ఉదాహరించడం వల్ల, అమరుకుడు కనీసం ఎనిమిదశతాబ్దానికి ముందువాడని చెప్పవచ్చు.

అమరుకుడి పేరుమీద ప్రసిద్ధిలో ఉన్న ఈ ముక్తకాల్ని శంకరాచార్యుడే రాసాడనే కథ కూడా ఒకటి ప్రాచీన కాలం నుంచీ వ్యాప్తిలో ఉంది. పధ్నాలుగవ శతాబ్దిలో శంకర దిగ్విజయం రాసిన మాధవవిద్యారణ్యులు ఈ కథని తన గ్రంథంలో ప్రస్తావించాడు. శంకరుడు ఒక వాదంలో నెగ్గడానికి కామశాస్త్రప్రావీణ్యం సంపాదించుకోడం కోసం పరకాయ ప్రవేశం చేసి ఆ విద్యలు నేర్చుకుని ఈ కావ్యం రాసారన్నది ఆ కథ. కాని దీన్ని మనం కథగానే తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ కథ వల్ల, పాతనిబంధనలో Song of Solomon చేరినట్టు, అమరుక శతకం కూడా శంకరగ్రంథావళిలో చోటు సంపాదించుకుంది, దానికి ఆధ్యాత్మికదృష్టిలో వ్యాఖ్యానాలు కూడా రాసారు. అమరుకావ్యాన్ని గట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారి తెలుగు అనువాదానికి ముందుమాట రాస్తూ శివశంకరస్వామి కాశ్మీర రాజవంశావళిలో ఎక్కడా అమరుకుడు అనే రాజు పేరు లేదని చరిత్రకారులు చెప్తున్నారనీ, అమరుకుడు ఒక స్వర్ణకారుడని నిర్ధారణగా తెలుస్తోంది అని రాసారు. కాని ఆ విశేషం నేనిప్పటిదాకా మరెక్కడా చదవలేదు.

కాని అమరుకుడు స్వర్ణకారుడైనందువల్ల ఆయన కావ్యంలో కూడా సువర్ణశిల్పం కనిపిస్తుందని శివశంకరస్వామి అన్నమాటలు మాత్రం నిజం. ఒకప్పుడు స్వీడిష్ కవి హేరీ మార్టిన్ సన్ కవితల గురించి రాస్తూ నేనీ మాటన్నాను. స్వర్ణకారుడు చిన్న చిన్నబంగారు తునకల్తో ఆభరణాలు తయారుచేసినట్టు అమరుకుడు చిన్న చిన్నమాటల్తో, సున్నితమైన ఊహల్తో తన ముక్తకాల్ని తీర్చిదిద్దాడు. ఆ పద్యాలది లోగొంతుక. బిగ్గరగా అరిచే కవులు, బిగ్గరగా అరిస్తే తప్ప కవిత్వం కాదనుకునే శ్రోతలూ అమరుకకావ్యాన్ని ఆనందించలేరు.

అమరుక శతకానికి అర్జున వర్మదేవ అనే ఒక రాజు పదమూడో శతాబ్దంలో వ్యాఖ్యానం రాసాడు. ఆ తర్వాత పదిహేనో శతాబ్దిలో వేమభూపాలుడు ‘శృంగార దీపిక’ పేరిట మరొక అందమైన వ్యాఖ్యానం రాసాడు (అందరూ సంగమరాజవంశ కాలంలో సంస్కృత సాహిత్యానికి గొప్ప ఆదరణ లభించిందని చెప్తారుగాని, తెలుగులో రెడ్డిరాజుల కాలంలో లభించిన ఆదరణ కూడా తక్కువేమీ కాదనిపిస్తుంది. కాటయవేమారెడ్డి కాళిదాసు నాటకాలకు రాసిన వ్యాఖ్యలూ, పెదకోమటి వేమారెడ్డి గాథాసప్తశతికి రాసిన వ్యాఖ్య, వేమభూపాలుడు అమరకానికి రాసిన వ్యాఖ్య సామాన్యమైనవి కావు.)

అమరుకుడి ముక్తకాల్లో సన్నివేశాలు కూడా loud గా ఉండవు. చాలా మృదువైన ఊహలు అవి. కాశ్మీరదేశంలో పూసిన గులాబీరేకల్లాగా మరీ గట్టిగా వ్యాఖ్యానిస్తే కూడా కందిపోతాయి అవి. ఈ మసృణత్వం వల్ల ఈ 21 వ శతాబ్దంలో కూడా పాశ్చాత్యప్రపంచం అమరుకుడి వెంటపడుతూ ఉంది. Andrew Schelling వెలువరించిన Erotic Love Poems from India (2004), Greg Baily తీసుకొచ్చిన Love Lyrics(2005) ఉండగా, A.N.D.Haksar పెంగ్విన్ సంస్థకోసం మళ్లా My Shameless Heart (2021) పేరిట మరొక కొత్త అనువాదం తో ముందుకొచ్చాడు.
తెలుగులో గట్టి లక్ష్మీ నరసింహశాస్త్రి (1943), దోర్బల విశ్వనాథ శర్మ (1996) చేసిన అనువాదాలు నేను చూసాను. ఇంకెవరైనా చేసారేమో గాలి నాసరరెడ్డి చెప్పాలి.

అమరు ముక్తకాలు ప్రధానంగా శృంగార ప్రధానాలు. ప్రత్యేకంగా ఒక ఋతువుకీ, ఒక ప్రాంతానికీ చెందిన పద్యాలు కావు. అకం కవిత్వంలాగా ఆ నాయికా నాయికలకు పేర్లు ఉండవు. కాబట్టి అది ఎవరు చదివినా ఆ అనుభూతి తమదే అనుకునేటంత సార్వత్రికత ఉంది ఆ పద్యాల్లో. కాని అందులో కవి తనకు తెలియకుండానే కాలాన్ని రాసిపెట్టిన పద్యాలు మాత్రం వర్షఋతు పద్యాలు. సంగం కవిత్వంలోలాగా, గాథాసప్తశతిలోలాగా, మేఘసందేశంలోలాగా ఈ పద్యాలు కూడా ప్రవాసితుల పద్యాలు. ప్రవాసం, ప్రవాసం వల్ల వచ్చే వియోగం, ఆ వియోగాగ్ని రగిలించే దుఃఖం- కాని ఈ కవి సున్నితమైన వాడుకాబట్టి ఆ వేదనని కూడా సున్నితంగానే చెప్తాడు.

చూడండి:


కాలువలు కట్టిన ఆమె కన్నీరు

1

‘ప్రయాణమైపోయినవాళ్ళు మళ్లా కలుసుకోరా
నా గురించి నువ్విట్లా చింతించవద్దు
ఇప్పటికే బాగా చిక్కిపోయావు ‘ చూడంటో
కన్నీటితో నేను చెప్తుంటే
తన కన్నీళ్ళనీ, లజ్జనీ అణిచిపెట్టుకుంటో
చిరునవ్వుతో ఆమె నా వైపు చూసిన చూపులో
ఇంక బతకను సుమా అనే
మరణోత్సాహమే కనిపించింది. (10)

2

అతడు ప్రయాణమయ్యింది
నూరుదినాలకుగాని చేరలేని తావు.
‘నువ్వు మళ్లా వచ్చేదెప్పుడు
పొద్దున్నే మొదటిజామునా
లేదంటే నడిజామునా
అదీ కాదంటే ఆ తర్వాత జామునా
బహుశా పగలంతా గడిచిపోయాక
వస్తావేమో కదా’ అంటోనే
కన్నీటిమాటల్తో ఆమె
అతడి ప్రయాణాన్ని ఆపేసింది (12)

3

అర్థరాత్రి, ఆ గ్రామంలో
నెమ్మదిగా పడుతున్న వానచప్పుడు.
తన సహచరి గుర్తొచ్చింది.
ఆ బాటసారి ఆ రాత్రంతా
ఎంతలా ఏడ్చాడంటే
ఇంకెప్పటికీ బాటసారుల్ని
తమ ఊళ్ళోకి రానివ్వకూడని
ఆ ఊళ్ళోవాళ్ళు కట్టడి చేసుకునేటంత. (13)

4

మలయమారుతం వీచి వీచి ఆగిపోయింది
వికసించిన మల్లెల గ్రీష్మం కూడా వాడిపోయింది
నా స్నేహం మర్చిపోయిన అతగాణ్ణి
మళ్లా దగ్గరకు చేరుస్తానంటావా మేఘమా!
అలానేకానీ, నాకేమి నష్టం?
ఎలాగూ వచ్చేవాడు ఫల్గుణుడే కదా (32)

5

అతడు ప్రయాణమవుతాడని తెలియగానే
అతడికెంతో ఇష్టమైన ఈ గాజులు కూడా
కన్నీళ్లతో ప్రయాణం మొదలుపెట్టాయి.
మనసు ముందే అతడివెంటబడింది.
వెళ్ళిపోతున్న ఆ ప్రాణమిత్రులందర్నీ వదిలి
ఓ జీవితమా? నువ్వెందుకింకా ఇక్కడే నిలబడ్డావు? (35)

6

వాళ్ళిద్దరూ చాలాకాలం తర్వాత కలుసుకున్నారు
చిరవిరహవేదనతో దేహాలు డస్సిపోయాయి.
తమకోసం ప్రపంచం మళ్లా
కొత్తగా పుట్టినట్టు తోచి
ఆ పగలూ, ఆ రాత్రీ
మొత్తం కబుర్లతోనే గడిచిపోయింది
ఇంక కలయిక మాట ఎక్కడ? (44)

7

చిరకాలం తర్వాత అతడు ఇంటికొచ్చాడు
ఇదేమిటిలా చిక్కిపోయావు
ఇదేమిటి నీ చెంపలిట్లా పాలిపోయాయి
ఇదేమిటి ఈ ముఖమిలా అయిపోయింది
అని అడుగుతుంటే
ఏమీ లేదు మామూలుగానే ఉన్నానంటో
కన్నీటిని కనురెప్పలకిందనే అణచుకుంటో
ఆమె పక్కకు తిరిగి ఒక నిట్టూర్పు విడిచింది (50)

8

రాత్రంతా మేఘం ఉరుముతున్నది
ఆ బాటసారి ఉద్వేగం అణచుకోలేక
తన ప్రాణాలు తోడేస్తున్నట్టుగా
ప్రవాస గీతాన్ని కన్నీటితో ఆలపించాడు.
ఆ పాట వింటుంటే
ప్రపంచం కూడా వెంటనే
తన సిగ్గుకీ అభిమానానికీ
నీళ్ళొదిలేసిందా అన్నట్టుంది. (54)

9

ప్రయాణానికి బయలుదేరిన ప్రియుణ్ణి
ఆమె కొంగుపట్టుకుని ఆపలేదు
గడప దగ్గర చేయి పట్టుకుని నిలపలేదు
పాదాలమీద పడి
ఉండిపో అని మాటమాత్రమైనా అనలేదు
కాలువలు కట్టిన ఆమె కన్నీరు
అతణ్ణి ఆపేసిందంతే. (62)

10

అతడు వెళ్తున్నాను అని చెప్పినప్పుడు
ఆ మాటలు సరిగానే విన్నాను.
వెళ్ళిపోతూ వెళ్లిపోతూ అతడు
మాటిమాటికీ ఆగి వెనక్కి తిరిగి
చూస్తున్నప్పుడు కూడా
నేను పట్టించుకోలేదు.
ఇప్పుడు ఈ శూన్యభవనంలో
ఒక్కత్తినీ ఉండిపోయాను
నా ఏడుపంతా వట్టిది.
చూడబోతే, నాకు జీవించడం మీదనే
ఎక్కువ ఆశలాగా ఉంది. (79)

11

అతడు ప్రయాణానికి బయల్దేరాడు
ఆమె చేతులు జోడించి వేడుకుంది
ఆ తర్వాత లేతతీగలాగా
అతణ్ణి పెనవేసుకుంది
అయినా కూడా పట్టించుకోకుండా
అతడు అడుగు ఎప్పుడు ముందుకేసాడో
అప్పుడే ఆమె ప్రాణబంధం విడిపోయింది
ఆ వెంటనే అతడూ బయటపడ్డాడు (85)

12

తన ప్రియురాలి చూపులు కనబడాలంటే
మధ్యలో వందలాదిగా
కొండలు, నదులు, దేశాలు
అడ్డున్నాయని తెలిసి కూడా
ఏదో ఆలోచిస్తోనే
ఆ బాటసారి అరికాళ్లు పైకిలేపి
ఆమె ఉన్న దిక్కుకేసి
పదే పదే తలెత్తి చూస్తున్నాడు (99)

12-7-2023

6 Replies to “ఆషాఢమేఘం-25”

 1. కైలాస మేఘం కి నా విన్నపం

  ఓ మేఘుడా, పార్వతీ పరమేశ్వరుల నివాసమూ, పరమ పవిత్రమూ అయిన కైలాస పర్వతాన్ని చూసీ చూడంగానే, ఎవరికి ఆనందంతో కళ్ళవెంట బాష్పాలు రావు? అయినా నువ్వు నీ బాష్పాలని అతి కష్టం మీద అణచుకొని ఒక్క సారి నీ దేహం కైలాస పర్వతాన్ని తగలగానే అప్పుడు ఆ ఆనంద బాష్పాలు వదలు. అప్పుడు అవి ఆ పర్వతం నుంచి ప్రవహించే దివ్య నదులలో కలిసి మరింత పుణ్యవంతాలు అవుతాయి. సత్పురుషులని కలిస్తే వచ్చేఅద్భుత ఆధ్యాత్మిక ఆనందం వేరే ఎలా లభ్యం అవుతుంది,చెప్పు.

  అక్కడ శిలా వితర్దికపై కూచుని భక్తులని అనుగ్రహిస్తున్న ఆది దంపతుల పైన ఎండ తగలకుండా గొడుగుగా వీలైనంత సేపు నిలబడు. అర్ధనారీశ్వరులైన ఆ మహితాత్ములని సేవించటం అనేది ఎంతో గొప్ప పురాకృత పుణ్య విశేషం కదా?. అలా గొడుగుగా ఉన్నప్పుడు చక్కటి ఇంద్ర ధనస్సులతో నీ దేహాన్నంతా రాగ రంజితం చేసి చూసే భక్తులకి ఆనందాన్ని ఇవ్వు. ఇతరులకి ఆనందాని ఇవ్వటమే జీవితం యొక్క ప్రయోజనం అనుకునే నీవంటి వాళ్ళు చేయవలసిన పని ఇదే సుమా

  ఉన్నది కదా అని నీ ఫెళఫెళార్భటుల శబ్దాన్ని ఎక్కువగా వినియోగించవద్దు. భక్తుల ధ్యానం భంగపడుతుంది. అలాజరిగితే మహాకాలుడైన పరమశివుడికి కోపం రావచ్చు. జాగ్రత్త. రాత్రి మొదలౌతున్నప్పుడు, సృష్టి అంతా ప్రణయోన్ముఖమౌతున్నప్పుడు, అమ్మవారు తన భర్త మందిరానికి బయలుదేరినపుడు మాత్రమే, అదీ తగు మాత్రం, నీ పిడుగు శబ్దం వినిపించు. దాని వల్ల ఆ తల్లి పరమశివుని దగ్గరకు త్వరగా వెళ్ళి భయంతో ఆయనని కౌగిలించుకొంటుంది. దాని వల్ల భక్త సులభుడైన ఆ శివుడు సంతోషిస్తాడు.

  కైలాసం దగ్గరకు రాగానే నీటితో నిండిన నిన్ను చూసి నీలకంఠుని కంఠం రంగులో ఉన్నావని భక్తులు ఆనందిస్తారు. ఆ కైలాస పర్వతం పై నీ జలాలన్నీ వదిలిన తరవాత నీ రంగు ఆ పరమశివుడి రంగులోకి మారటం చూసి మరీ సంతోషిస్తారు. సజ్జనులు ఏదిచేసినా అందరూ సంతోషిస్తారు కదా?.

  కైలాసంలో అద్భుతమైన మణి మంటపం ఉంది కదా. ఆ మంటపంలోనే నటరాజు సాయం సంధ్యలో తన తాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తాడు. పరమేశ్వరి చూసే ఆ ప్రదర్శన సమయంలో ఆ మణిమంటపం వెనక భాగంలో ఉన్న తెర లాగా నిలబడు. నీలవర్ణ సంశోభితమైన యవనిక ముందు శ్వేత వర్ణుడైన పరమేశ్వర నాట్యం మరింత శోభాయమానంగా ఉంటుంది.

  పార్వతీ పరమేశ్వరుల కుమారులైన గణేశుడూ, కుమార స్వామీ కైలాసం అంతా తిరుగుతూ ఆడుకుంటుంటారు. వారి దాగుడు మూతలు ఆటలో దాక్కోవటానికి నీ మేఘాలు చాలా పనికివస్తాయి సుమా. వారిని ఆనందింపచేయటానికి రకరకాల ఆకారాలు ధరించి వారిని వినోదింప చేయి.

  ఓ జలదమా, పాదధూళితో ప్రపంచాలు సృష్టించే లలితా పరాభట్టారిక సాయంత్రవేళ ఉద్యానవన విహారానికి బయలుదేరినప్పుడు ఆమె పాదాలు కందకుండా నీ మేఘాలని ఆవిడ పాదాల కింద ఉంచు. విహరిస్తూ ఆదేవి విశ్రమించ తలచితే వితర్దిక లాగా ఉండు. ఆ దేవి అక్కడే శయనిద్దామనుకుంటే చక్కటి పరుపుగల మంచంలాగా ఉండు.
  అప్పుడు ఆమె ప్రీతిని పొందుతుంది. ఆమె ప్రీతి పొందితే నీకు అనవరత సుఖం లభిస్తుంది.

  ప్రతిరోజూ పార్వతీదేవి పరమేశ్వర పాదాలు కడిగేటప్పుడు పరిచారికలు నీళ్ళు అందిస్తారు. వాళ్ళు నీళ్ళు అందించేలోపే నీ వద్ద ఉన్న నీళ్ళని పరమేశ్వరికి అందజేయి. ఆ పరమేశ్వరీ పరమేశ్వరాను గ్రహం నీకు తప్పక దొరుకుతుంది. ఆ పరాభట్టారిక పూజ చేసేటప్పుడు అక్కడ ఉండటం వల్ల పరమేశ్వర పాద జలం కొన్ని బిందువులైనా నీకు దొరుకుతాయి. ఆ అమృత బిందువులు సంసారంలోని సమస్త దుఃఖాలన్నింటినీ నశింపజేశే శక్తి కలవి కదా?

  పరమశివుడు అభిషేక ప్రియుడు కదా!
  ఆ మహాదేవుడు తపస్సమాధిలో కూర్చున్నప్పుడు ఆపకుండా ఆయన మీద నీ వర్షధారలు కురిపించు. సహస్రార పద్మం లో నివసించే శివశక్తులని దర్శించిన యోగికి అక్కడి అమృత బిందువులు తన దేహంలోని అన్ని నాడులనీ ఎలా తడుపుతాయో అలా నీకు చాతనైనంత సేపు ఆ కపర్ది సర్వాంగాలనీ అభిషేకిస్తే ఆయన నిన్ను కటాక్షిస్తాడు

  పిల్లలు చిరుజల్లులలో తడుస్తూ ఆడుకోవాలనుకుంటారు. గణేశ కుమారు లిద్దరూ అంతే అందుకని చిన్న చిన్నజల్లులతో కూడిన వర్షాన్ని అక్కడ కురిపించు. అప్పుడు ఆ పిల్లలు ఆనందంతో ఆ చిరుజల్లులలో ఆడుకుంటుంటే దాన్ని చూస్తూ ఆనందంతో వెలిగిపోయే కాత్యాయని దేవి ముఖారవిందం చూసి తరించే భాగ్యం నీకు కలుగుతుంది.

  అక్కడ ఉన్న పార్వతీ పరమేశ్వరులని దగ్గర చేయటానికి నీ శీతలత్వం ఎక్కువ చేయవద్దు. అక్కడ అసలే మంచుకొండల చలి, ఆపైన గంగాదేవి, చంద్రుడు ఇలా చుట్టూ అంతా చల్లగా ఉన్న ప్రదేశాన్ని నువ్వు ఇంకా శీతలం చెయ్యవలసిన పని లేదు.
  ఎవరైనా వేరుగా ఉన్న ఇద్దరిని దగ్గర చేయవచ్చు కానీ, ఒకరిలో ఒకరు సగమై ఉన్న వారిని ఎవరైనా ఏమిచెయ్యగలరు.

  అర్ధనారీశ్వరులై వెలిగే ఆ ఆదిదంపతులని చూసి ఆనందించు. వారి ఎదురుగా స్వఛ్ఛమైన అద్దంలాగా, కాంతి పరావర్తనం చేందేటట్లు నిలబడు. సగభాగంగా ఉన్న అయ్యవారు ఎలా ఉన్నారని అమ్మవారూ, ఆవిడ ఎలా వుందని అయ్యవారూ చూసే సుతీక్ష్ణమైన చూపులూ, తరువాత వారి ముఖాల్లో వెలిసే చిరునవ్వులూ నీ జీవితాన్ని ఉజ్జ్వలం చేస్తాయి

  జొన్నలగడ్డ సౌదామిని

  1. సహస్ర వందనాలు.
   వీరభధ్రుల వారి కుటీరంలో
   కైలాసదర్శనం చేయించి..
   ఆ అర్ధనారీశ్వరుని “సంసార” లీలా వైభోగాన్ని మనో నేత్రం ముందు సాక్షాత్కరింప చేశారు.
   ధన్యవాదములు.

 2. “ప్రవాస గీతాన్ని కన్నీటితో ఆలపించాడు.”
  How poetic!

Leave a Reply

%d bloggers like this: