
The Banished Yaksha by Abanindranath Tagore, 1907
మేఘసందేశం కావ్యానికి నాకు తెలిసిన ఇద్దరు ఆరాధకుల్లో ఒకరు మా మాష్టారు, మరొకరు రవీంద్రుడు. రవీంద్రుడికి ఆయన తండ్రి దేవేంద్రనాథుడు చిన్నప్పుడే ఉపనిషత్తులు, మేఘసందేశం, సంస్కృత కావ్యాలు బోధించాడు. ఆ కావ్య, ఔపనిషదిక సంస్కారం టాగోర్ సాహిత్యమతా కనిపిస్తుంది. అందుకనే ఒక రసజ్ఞుడు టాగోర్ కావ్యభాష బెంగాలీ కాదనీ, సంస్కృతంలోని సర్వశ్రేష్ట కావ్యభాష అనీ అన్నాడు. టాగోర్ మేఘదూతం మీద కనీసం రెండు వ్యాసాలు రాసాడు. ఒక దీర్ఘ కవిత కూడా రాసాడు. ప్రవాసితులందరి హృదయాల్లోనూ గూడుకట్టుకున్న విరహవేదనకి ఆయన తన కవితద్వారా ఒక గొంతునిచ్చాడు. యుగాలుగా అణచిపెట్టుకున్న దుఃఖం ఆయన కవిత్వధారలో జలజలా కురవడం ఈ కవితచదువుతున్నంతసేపూ మనకి తెలుస్తూనే ఉంటుంది. బహుశా, మేఘసందేశం కావ్యానికి ఇంతకన్నా ఘననీరాజనం మరొకరు సమర్పించలేరేమో!
మేఘదూతం
కవివరా! ఏ విస్మృత యుగంలోనో
ఏ ఆషాఢప్రథమదివసం నాడో
నువ్వు మేఘదూతం వినిపించావు
ప్రపంచంలోని వియోగదుఃఖాలన్నీ
పొరలుపొరలుగా మబ్బులు మబ్బులుగా గూడుకట్టుకుని
నీ శ్లోకాల్లో ఒదిగిపోయాయి.
ఆ మేఘాచ్ఛన్న దివసాన
ఏ విద్యుదోత్సవం, ఏ పవనసంచలనం
ఉజ్జయిని ప్రాకారాల్ని కంపింపచేసింది?
యుగాలుగా అణిచిపెట్టుకున్న మానవహృదయోద్వేగమంతా
ఆ ఒక్కరోజే కట్టలు తెంచుకుంది
దీర్ఘకాలం గుండెలో కుక్కుకున్న విరహతాపమంతా
కాలాన్ని బద్దలుగొట్టుకుని
నీ పద్యాల్లోంచి పొంగి ప్రవహించింది.
తమవాళ్లని ఎడబాసిన ప్రతి ఒక్క ప్రవాసీ
ఆ రోజు తల ఎత్తుకుని, చేతులు జోడించి
తన ప్రియగృహోన్ముఖుడై
మేఘాలద్వారా తన విరహగాథ వినిపిస్తున్నాడా?
అశ్రుపూరితమైన తన ప్రేమలేఖని
మేఘం తన రెక్కలమీద
తన సుదూరప్రియగృహగవాక్షం చెంతకు
తీసుకుపోవాలని ప్రార్థిస్తున్నాడా?
అక్కడ, ఆ శోకగృహంలో
ముడివెయ్యని జడతో, తడిసిన కళ్లతో
తనకోసం ఎదురుచూస్తున్న తన నెచ్చెలికి
తన ప్రేమసందేశాన్ని పంపించుకోగలుగుతాడా?
కవీ, చెప్పు, వాళ్లందరి విరహానికీ
నీ గీతంలో ఒక గొంతు దొరికిందా?
నీవెన్నో దినాలు, రాత్రులు,
దేశం వెనక దేశం పయనిస్తో
నీ కావ్యం ద్వారా నీ ప్రేమగమ్యాన్ని చేరుకోగలిగేవా?
తనలోకి ప్రవహిస్తున్న ప్రతి ఒక్క ధారనూ కలుపుకుంటూ
పరవళ్ళు తొక్కుతున్న జాహ్నవిని చూడు
తమ శిలాశృంఖాలాల్లో తామే బంధితులైన
హిమలయాలు తమ సహసర గిరికంధరాల్లోంచి
ఉచ్ఛ్వసిస్తున్న ఆవిరిపొగలు
బలమైన కాంక్షగా గిరిశిఖరాలమీద ఏకమై
ఆకాశాన్ని కప్పేస్తున్నవి ఆ ప్రథమదివసం తర్వాత అసంఖ్యాక
వర్షాకాలాలు గడిచిపోయాయి.
ప్రతి ఏడూ నీ కావ్యానికి కొత్తగా ప్రాణం పోస్తూనే ఉంది
దానిమీద తొలకరిచినుకులు కురిపిస్తూనే ఉంది.
చల్లని నీడలు పరుస్తూ, మేఘగర్జనలకు ప్రతిధ్వనిస్తూ
నీ వర్షోన్మత్త కవిత్వంలాగా
ఏరులై ప్రవహిస్తూనే ఉంది.
ఇన్ని యుగాలుగానూ, తారారహిత, వర్షసిక్త, ఆషాఢ సాయంసాంధ్యవేళల్లో
విరహవ్యథితులు తమ
శూన్యగృహాల్లో ఎదురుచూస్తోనే ఉన్నారు
మసకకమ్మిన దీపపుకాంతిలో, వారు ఆ శ్లోకాలు
తమకై తాము నెమ్మదిగా, బిగ్గరగా పఠిస్తో
తమ ఒంటరితనంలో కూరుకుపోయారు.
నీ కావ్యం ద్వారా, కవీ, వారి హృదయాలు నాకు వినబడుతున్నాయి
సముద్రకెరటాల్లాగా వారి కంఠాలు నా చెవుల్లో ఘొషిస్తున్నాయి.
ఇక్కడ భారతదేశానికి మరీ తూర్పుదిక్కున
ఆకుపచ్చని బెంగాల్లో నేనున్నాను
ఇక్కడే ఒకప్పుడు జయదేవకవి
ఇటువంటి వర్షాకాల దినాన్న
దూరతమాలవృక్షాల నీలి-ఆకుపచ్చని చిక్కటినీడల్నీ
సంపూర్ణసాంద్రమేఘాచ్ఛన్న గగనాన్నీ చూసాడు.
ఈ రోజు మరీ మబ్బుపట్టి ఉంది, ఆగీ ఆగీ వాన జల్లు-
ప్రచండంగా వీస్తోన్న గాలి- యుద్ధంలో ఆయుధాలు
ఎక్కుపెట్టినట్టు పైకి లేస్తున్న చెట్లకొమ్మలు,
వాటిల్లోంచి గాలి ఒక విలాపంగా వినబడుతోంది
మేఘాల్ని చీల్చుకుంటూ మెరుపుతీగలు
ఆకాశమ్మీద వంకర నవ్వులు నవ్వుతున్నాయి.
తలుపులు మూసిన, దిగులు కమ్మిన గదిలో
మేఘదూతం చదువుకుంటో నేనొక్కణ్ణే.
నా మనసు ఈ గదిని వదిలిపెట్టి రికామీ మేఘం వెంబడి
సుదూరదేశాలకు ప్రయాణం మొదలుపెట్టింది.
అదిగో, ఆమ్రకూట శిఖరం
అదిగో, సన్నని, స్వచ్ఛమైన రేవా నది
అక్కడే, ఆ వేత్రవతీనదీ తీరంలో
పక్వజంబూఫల వనాల పచ్చని నీడలో
నిద్రిస్తున్నవి దశార్ణదేశ గ్రామాలు
ఆ ఊరి తోటల చుట్టూ మొగలిపొదల కంచెలు,
ఆ గ్రామరథ్యలకు ఇరుపక్కలా చెట్లు
వాటిమీద గూడుకట్టుకోడం కోసం పుల్లాపుడకా పోగేసుకుంటున్న
పక్షుల కలకలంతో కదుల్తున్న కొమ్మలు
అదిగో, ఆ పేరు తెలియని కొండవాగు పక్కన మల్లెపొదల్లో
పూలుకోసుకుంటున్న పడుచులు
వారి చెంపల్ని అలంకరించిన నీలికలువలు
ఎండవేడికి తాళలేక మబ్బునీడకోసం
తపిస్తున్న వారి కపోలాలు
తమ నల్లనీలికళ్ళమీద పడుతున్న మబ్బునీడను చూడటానికి
చూడు ఆ జనపదవధువులు ఆకాశం కేసి ఎట్లా చూస్తున్నారో
ముగ్ధలు- కల్మషం ఎరగరు వారు
మేఘం ఉరమగానే తమ గుహల్లోకి పరుగెడుతో
‘రక్షించండి, ఏదో కొండ విరుచుకుపడుతున్నట్టుంది’
అని చూడు ఆ సిద్ధాంగనలు ఎలా అరుస్తున్నారో
అదిగో అవంతి, అదే నిర్వింధ్యానది
శిప్రానదీదర్పణంలో తన ప్రతిబింబాన్ని తిలకిస్తున్న
ఉజ్జయిని అదిగో.
అర్థరాత్రి ఆ నగరవీథుల్లో తమ ప్రియుల్ని కలవడానికి
పోతున్న అభిసారికలకు వెలుగుచూపుతున్న మెరుపులు
అదిగో కురుక్షేత్రం, బ్రహ్మావర్తం
కంఖల శిఖరం అక్కడే, గంగ నురగలు చిమ్ముతూ
శివజటాజూటితో ఆడుకుంటూ
సవతి కోపాన్ని చూసి చిరునవ్వింది అక్కడే.
ప్రయాణిస్తున్నది నా హృదయమట్లా
ఒక మబ్బువలె, దేశం నుంచి దేశానికి
చివరకు అలకానగరానికి చేరుకునేదాకా-
ఆ స్వర్గనగరానికి, ఎనాళ్ళగానో బెంగపెట్టుకున్న ఆ ఊరికి
ప్రేమైకహృదయుల ఆ తావుకి, ఆ సౌందర్యచరమసీమకి,
ఆ సదావసంతవనానికి, ఆ నిత్యజ్యోత్స్నానగరికి
ఆ స్వర్ణకమలసరసుకి, ఆ చంద్రకాంతశిలావేదికచెంతకి
నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి
నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు?
అక్కడ సకలసంపదలమధ్య
శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?
ఈ కొండకోనలకూ, నదీనదాలకూ ఆవల
ఆ సూర్యాతీత, సంధ్యాతీత, మణిద్వీపానికి
ఆ మానసరోవరతీరాన కాంక్షాపర్యంకిక చెంతకి
చేరుకోలేమా మనమెప్పటికీ
ఈ దేహంతో ?
11-7-2023
ఎంత అద్భుతంగా ఉన్నాయో
ధన్యవాదాలు
అద్భుతం. మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి ఈ రవీంద్రకవితను. “తారారహితవర్షసిక్త ఆషాఢసాయంసంధ్యావేళలు”, “సంపూర్ణసాంద్రమేఘాచ్ఛన్నగగనము” వంటి సమాసాలు మూలంలోనివా, లేక మీ అనువాదంలో వచ్చాయా తెలియదు కానీ అనుభూతిగాఢతను కలిగిస్తాయి (మీ ఇతర రచనల్లో కూడా ఇలాంటి సమాసఘటనను చూసాను).
కరుణశ్రీగారు ‘ఆషాఢస్య ప్రథమదివసే’ అనే పేరుతో మేఘదూతంపై ఒక నిడుపాటి కవిత వ్రాసారు. రవీంద్రుడితో పోల్చటం అన్యాయం కానీ అది వేదిక మీద చదవటం కోసం వ్రాసినట్లుంటుంది. రవీంద్రుడి కవిత – “తలుపులు మూసిన, దిగులు కమ్మిన గదిలో
మేఘదూతం చదువుకుంటో” ఒంటరిగా కాళిదాసకవిత్వోన్మత్తుడైన కవి అనుభవించి పలవరించింది కదా.
అనేకధన్యవాదాలు.
ఎంత బాగా చెప్పారు రవీంద్ర కవిత గురించి! ధన్యవాదాలు.
మీరు తప్ప,
నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు..!?
మీకు ఈ వ్యాసాలు నచ్చుతున్నందుకు సంతోషం
కవీ !చెప్పు, వాళ్ళందరి విరహానికీ నీ గీతంలో
ఒక గొంతు దొరికిందా…ఎంతటి ఆర్ద్రత రవీంద్రులది!
ద్రవించిపోయో,పరవశించిపోయో ఆయన హృదయం అక్షరరూపం దాల్చినట్టుగా వుంది
ఈ కవిత సర్!
ఏదో అర్థంకాని దుఃఖమూ కలిగింది చదువుతుంటే.
చివరిమాటలయితే మరీను!
అద్భుతమైన మీ అనువాదం🙏🙏🙏
ధన్యవాదాలు మేడం
ఎన్ని సార్లు చదివానో నిన్నంతా…రవీంద్రుని కవితలోని వడీ, కవిత ఆసాంతమూ వినపడే సంగీతం, సౌందర్యం అన్నీ ఈ కవితలోకి ఒదిగిపోయాయి. వేయేల ,
కావ్య ఆస్వాదనలో మీ ఇద్దరిదీ ముందు వెనుకగా ఈ భూమి మీద తారాడిన ఒకే హృదయం ❤️
ఈ వానాకాలపు ఉదయాల్లో, మధ్యాహ్నాల్లో, బయట నుండి వాన చప్పుడు లీలగా ఆగకుండా వినపడుతో ఉండే రాత్రుల్లో, మీ ఆషాడమేఘ సౌందర్యం మెలమెల్లగా కబళిస్తోంది. ఈ ఋతువు ధన్యమైంది ❤️
మీ స్పందన లభించినప్పుడు కదా మబ్బు వానగా మారేది!
🙏🙏❤️❤️
( రవీంద్రుని కవితల్లోని** – పైన కామెంట్ లో పొరబాటున కవితలోని అని వచ్చింది.)
మమ్మల్ని మరెవ్వరు తీసుకుపోగలరు?
నువ్వు తప్ప, చినవీరభద్ర కవీ, ఆ లక్ష్మీధామానికి
అక్కడ సకలసంపదలమధ్య
శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయినజాడలని తిరిగి మళ్ళీ, మళ్ళీ వెతికి, వెతికి మాకు అందిస్తున్నాందుకు మీకు మా కృతజ్ఞతా పూర్వక అభివందనాలు!
ప్రతి ఉదయం, వీలు కుదుర్చుకుని మీ కుటీరంలో కొంత తడవు విశ్రమించనిదే మాకు పొద్దు గడవదు
ఉదయన కథా కోవిదులుగా మీరు ఆసక్తికరంగా ఆమూలాగ్ర సాహిత్యవిశేషాలను అందిస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక నమస్సులు!
హృదయపూర్వక ధన్యవాదాలు సార్.