ఆషాఢమేఘం-23

శిప్రానది

ఉజ్జయిని శిప్రానది ఒడ్డున ఉంది. యక్షుడు ఆ నదిని మేఘుడికి ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి:

దీర్ఘీకుర్వన్ పటు మదకలం కూజితం సారసానాం
ప్రత్యూషేషు స్ఫుటితకమలామోద మైత్రీ కషాయః
యత్ర స్త్రీణాం హరతి సురతగ్లానిమంగానుకూలః
శిప్రావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః (1-32)

(అక్కడ గాలులు మత్తెక్కిన సారసపక్షుల కూజితాల వల్ల మరికొంతసేపు వీస్తున్నట్టుగా ఉంటాయి. అప్పుడే వికసిస్తున్న తామరపూల సుగంధాన్ని ఆస్వాదించి మరింత అనుకూలంగా మారే శిప్రానదీ ప్రత్యూషపవనాలు రాత్రంతా ప్రణయంలో అలసిపోయిన స్త్రీలకు మరింత హాయి కలిగించే వారి ప్రియులు పలికే అనునయవాక్యాల్లాగా ఉంటాయి)

ఉజ్జయిని

అప్పుడు విశాలా అని పిలిచే ఉజ్జయినిని యక్షుడు వర్ణిస్తూ నాలుగు శ్లోకాలు చెప్పాడు. అందులో రెండు ఉత్ప్రేక్షలు. వాటిని పక్కన పెట్టినా రెండింటి గురించి చెప్పుకోక తప్పదు. అందులో ఒకటి మరీ ముచ్చటైన శ్లోకం. ఉజ్జయినిలో ఉన్నవాళ్ళు దూరప్రాంతం నుంచి తమ బంధువులు తమ ఇంటికి వచ్చినప్పుడు అన్నిటికన్నా ముందు ఆ ఊరి కథలు చెప్పి సంతోషిస్తారట. చూడండి:

ప్రద్యోతస్య ప్రియదుహితరం వత్సరాజోత్ర జహ్రే
హైమం తాలద్రుమవనమభూదత్ర తస్యైవ రాజ్ఞః
అత్రోద్భ్రాంతః కిల నళగిరిః స్తంభముత్పాట్య దర్పా
దిత్యాగస్తూన్రమయతి జనో యత్ర బంధూనభిజ్ఞః (1-34)

(ఇక్కడే వత్సరాజు ఉదయనుడు ఉజ్జయినీ చక్రవర్తి ప్రద్యోతనుడి కుమార్తె ముద్దుబిడ్డను అపహరించాడు. ఇక్కడే ఆ రాజుకి బంగారు తాటితోపు ఉండేది, ఇక్కడే ప్రద్యోతనుడి ఏనుగు నళగిరి అనేది మదించి ఎగురుతూ ఉండేది, అని అక్కడి జనులు దూరప్రాంతాలనుంచి వచ్చిన తమ బంధువులకు ఆ కథలు చెప్పి సంతోషిస్తూ ఉంటారు)

ఇంతకు ముందు అవంతీ దేశాన్ని వర్ణిస్తూ అక్కడ ఉదయన కథాకోవిదులుంటారు అని చెప్పినదానికి ఇది కొనసాగింపు. నగరంలో మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పొద్దున్నే ఇంకా వాళ్ళూ, మనమూ కూడా స్నానం, సంధ్య ఏమీ మొదలుపెట్టకుండానే, అలానే కూచుని ఆ పరగడుపునే ముందు ఆ నగరవిశేషాలు మాట్లాడుకుంటామే, అదేనన్న మాట ఇది. కాకపోతే ఆ ఉజ్జయిని నగరంలో గతం, వర్తమానం అన్నీ ఉదయనకథాగానమే. మరో విశేషం లేదు. ఆ ఉదయనుడు ఎవరో గాని, మన తీరికసమయాల్ని ఎంతగా లోబరచుకున్నాడు! లేకపోతే, ఈ ఆషాఢప్రభాతాన నేనిట్లా కూచుని పరగడుపున మళ్ళా ఆ కథలే మీతో ముచ్చటించడమేమిటి!

మరొక శ్లోకం ఒక రాజస్తానీ మీనియేచర్ లాంటి వర్ణచిత్రం. చూడండి:

జాలోద్గీర్ణై రుపచితవపుః కేశసంస్కారధూపై
ర్బంధు ప్రీత్యా భవన శిఖిభిర్దత్త నృత్యోపహారః
హర్మ్యేష్వస్యాః కుసుమసురభిష్వధ్వఖేదం నయేథాః
పశ్యన్ లక్ష్మీం లలితవనితాపాదరాగాంకితేషు (1-36)

(అక్కడ మేడమీద స్త్రీలు తమ కేశసంస్కారం కోసం వేసుకున్న ధూపం ఆ గవాక్షాల గుండా వెలువడుతూ ఉంటుంది. దాన్ని ఆస్వాదించి మరింత ఉప్పొంగు. ఆ ఇళ్ళల్లో ఉండే నెమళ్ళు నీకు తమ నాట్యాన్నే కానుకగా సమర్పిస్తాయి. పూలతో పరిమళించే ఆ మేడలమీద తిరుగాడుతున్న వనితల పాదాల లత్తుక వదిలిపెడుతున్న ముద్రల్తో కూడుకున్న ఉజ్జయిని వైభవాన్ని కళ్లారా చూస్తూ నీ మార్గాయాసం పోగొట్టుకో).

మేడమీద గదిలో తమ తలారబెట్టుకుంటున్న స్త్రీలు వేసుకున్న సాంబ్రాణిధూపం కిటికీ గుండా బయటికి వెలువడుతున్న దృశ్యం, ఆ ఇళ్ళ మేడలమీద నెమళ్ళు, ఆ స్త్రీల పాదాలకు పూసుకున్న పారాణి- ఒక నగరసౌందర్యాన్ని లలితంగా వర్ణించాలంటే ఇలానే వర్ణించాలి.

గంధవతి

ఆ తర్వాత నాలుగు శ్లోకాలు మహాకాళేశ్వర దేవాలయ వర్ణన. ఉజ్జయిని వెళ్ళినందుకు మూడు లాభాలున్నాయంటున్నాడు కవి. మొదటిది, అది ఈశ్వరుడుండే తావు. రెండవది అక్కడి ప్రమథులు నిన్ను చూసి నీకు సహాయపడతారు. మూడవది అక్కడ గంధవతి అనే నది ఉంది. ఆ నదిలో స్త్రీలు స్నానం చేస్తుంటారు. వారి స్నానచందనాలపరిమళంతో కూడుకున్న కలువపూలసుగంధంతో కూడుకున్న గాలులు అక్కడి ఉద్యానవనాలమీంచి వీస్తూ ఉంటాయి. అవి కూడా నిన్ను తాకుతాయి అంటాడు. ఎన్నో శతాబ్దాల తర్వాత శ్రీనాథుడు భీమఖండాన్ని వర్ణించేటప్పుడు, రక్తి, ముక్తి రెండూ లభించే క్షేత్రంగా ద్రాక్షారామాన్ని వర్ణించడానికి ఈ శ్లోకమే స్ఫూర్తి అని చెప్పవచ్చు.

మహాకాళేశ్వర దేవాలయం

మేఘుడు ఉజ్జయినిలో అడుగుపెట్టినప్పుడు ప్రత్యూషవేళ కదా. కాని ఆ సాయంకాలం దాకా అతణ్ణి అక్కడే ఉండమని చెప్తున్నాడు యక్షుడు. ఎందుకంటే, సంధ్యవేళ పరమేశ్వర పూజజరిగేటప్పుడు మేఘం తన ఉరుముల్ని కూడా ఆ సంధ్యాహారతిలో జోడించవచ్చునట. అంటే మేఘప్రయాణంలో ఒక రోజంతా ఉజ్జయినిలో ఉండమని చెప్తున్నాడు. ఆ సాయంకాలం అక్కడి పూజలో వేశ్యలు స్వామికి చామరాలతో వీస్తున్నప్పుడు వారికి హాయిగొల్పేటట్లుగా కొన్ని జలకణాల్ని వాళ్ళ మీద వర్షిస్తే వాళ్ళు తమ క్రీగంటిచూపుల్తో నిన్ను చూస్తారని కూడా ఆశపెడతాడు.

ఆ తర్వాతి శ్లోకం పూర్తిగా కాళిదాసు తరహా భావన. చూడండి:

పశ్చాదుచ్చైర్భుజవనతరువనం మండ లేనాభిలీనః
సాంధ్యం తేజః ప్రతినవజపాపుష్ప రక్తం దధానః
నృత్యారంభే హరపశుపతేరార్ద్ర నాగాజినేచ్ఛాం
శాంతోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా (1-40)

(ఆ తర్వాత శివుడు నాట్యం మొదలుపెడతాడు. నాట్యానికి ఎత్తిన ఆ పశుపతి రెండుభుజాలనే వనం మీద ఎర్రని జపాపుష్పంలాగా సంధ్యకాంతిని అలంకరించు. నీ ఆచ్ఛాదనే ఒక వస్త్రంకాగా తన పతికి ఇంక ఆ గజాసురుడి రక్తవస్త్రంతో పనిలేదుకదా అని భవాని సంతోషిస్తుంది. ఆమె శాంతోద్వేగ స్తిమితనయనాల్లో నీ భక్తి ప్రతిఫలిస్తుంది)

చాలా అందమైన భావన. ఇది ఉత్ప్రేక్షనే గాని, అక్కడితో ఆగిపోకుండా దాన్నొక పరిపూర్ణమైన ఊహగా తీర్చిదిద్దడం. ఇటువంటి ప్రతిభ కృష్ణదేవరాయల కవిత్వంలో కనిపిస్తుంది. ఇందులో మరీ అందమైన మెటఫర్లు- ‘భుజతరువనం’, (భుజాలనే చెట్లుకలిగిన తోట), దానిమీద ‘మండలేనాభిలేన’ ( వర్తులాకారంగా వ్యాపినవాడివై) ‘సాంధ్యం తేజః ప్రతినవాజపాపుష్పరక్తం దధాన'(అప్పుడే విరిసిన జపాపుష్పంలాగా ఎర్రటిసంధ్యకాంతిని ధరించినవాడివై)- ఇలా అల్లిన శ్లోకం యుగాలైనా చెక్కుచెదరదు కదా!

ఆ పూజ, శివతాండవం అయ్యేటప్పటికి చీకటి పడుతుంది. అది అభిసారికలు తమ ప్రియుల్ని కలుసుకోడానికి వెళ్ళే సమయం. ఆ వానాకాలపు రాత్రుళ్ళల్లో కారుమబ్బులు కమ్మినవేళ ఆ స్త్రీలకి దారి కనబడదు. మెరుపులు మెరుస్తూ ఉంటేనైనా వాళ్ళకి కొంత సాయం చేసినట్టవుతుంది. కాబట్టి నువ్వు బంగారు మెరుపులు మెరుస్తూ ఉండు అంటున్నాడు యక్షుడు మేఘంతో, కాని ఉరమకు సుమా, వాళ్ళు భయపడతారు అని కూడా చెప్తున్నాడు. ఈ శ్లోకం లో భావం ఇదే, చూడండి:

గచ్ఛంతీనాం రమణవసతిమ యోషితాం తత్ర నక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచిభేద్యైస్తమోభిః
సౌదామిన్యా కనకనికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గ స్తనితముఖరో మాస్మభూర్విక్లబా స్తాః (1-41)

అప్పటికి బాగా చీకటిపడుతుంది కాబట్టి నువ్వూ, నీ మెరుపుల భామా కలిసి ఆ రాత్రికి ఏదైనా మేడమీద శయనించండి (1-42) అని చెప్తూ, ఆ మర్నాడు మళ్లా ప్రయాణం మొదలుపెట్టి గంభీరానదిని చూడమని చెప్తాడు.

గంభీరా

మేఘం ప్రయాణించే మార్గంలో ఎక్కడ ఏ నది కనిపించినా యక్షుడు మేఘాన్ని ఆ నదిని చూడమనే చెప్తున్నాడు. ఎందుకంటే మార్గం సుదీర్ఘం. ఈలోపు దారిపొడుగునా కురిసిపోతున్నందుకు మేఘం సన్నగిల్లుతుంది కాబట్టి ఎక్కడికక్కడ నదుల్లోంచి మళ్లా తన బలం పుంజుకోవలసి ఉంటుంది. గంభీర లోతైన నది మాత్రమే కాదు, ప్రసన్న సలిలాలు కలిగింది కూడా. నదీ జలాలు ప్రసన్నంగా ఉంటాయనేది వాల్మీకి మాట. ఆ నది ఎంత ప్రసన్నంగా ఉంటుందంటే, మేఘానికి అందులో తన ప్రతిబింబం కనిపించేటంత నిర్మలంగా ఉంటుందట. నువ్వు ఆ నదిని చేరకపోయినా, దాని మనసులో నువ్వే నిండి ఉంటావు సుమా (1-44) అని కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత మరొక అందమైన ఉత్ప్రేక్షతో ఆ నదిని వర్ణిస్తాడు (1-45).

దేవగిరి

గంభీరానదినుంచి మేఘాన్ని దేవగిరికి వెళ్ళమని చెప్తాడు. ఆ నదినుంచి సెలవుతీసుకోడానికి నీకు మనసొప్పదు అని చెప్తూనే ప్రయాణం మొదలుపెట్టగానే ఎటువంటి శుభసంకేతాలు కనిపిస్తాయో వర్ణిస్తాడు. మేఘం మొదట్లో కనబడ్డప్పుడు ప్రయాణం మొదలు పెట్టమని చెప్తూ అప్పుడు కనిపిస్తున్న శుభసంకేతాల్ని వర్ణిస్తాడు, గుర్తుందా (1-9), తిరిగి మళ్లా అటువంటి శుభసంకేతవర్ణననే మళ్ళా ఇక్కడ చేస్తున్నాడు. చూడండి:

త్వన్నిష్యంధోచ్ఛ్వసిత వసుధా గంధసంపర్క రమ్యః
స్రోతోరంధ్రధ్వనితసుభగం దంతిభిః పీయమానః
నీచైర్వాస్య త్యుపజిగమిషో ర్దేవపూర్వం గిరిం తే
శీతో వాతః పరిణమయితా కానానోదుంబరాణాం (1-46)

(నువ్వు గంభీరానదినుంచి బయలుదేరి దేవగిరికి చేరగలుగుతావు. ఆ ప్రాంతమంతా నీ వానకి తడిసిన మట్టివాసనతో సుగంధభరితమై, చెవులకింపుగా ఉండే ఏనుగుల ఘీంకారాల్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. బాగా పండిన అత్తిపండ్లమీంచి వీచే గాలి ఆ దారిపొడుగునా నీకు మెల్లగా వీవెనలు వీస్తుంది)

ఆ దేవగిరి స్కంద గిరి కూడా. అక్కడ కుమారస్వామి ఆలయం ఉందనీ, ఆ దేవుడిమీద చల్లనినీళ్ళు వర్షించమని చెప్తూ (1-47), ఆ కుమారస్వామి నెమలిని కూడా మరొక శ్లోకంలో (1-48) వర్ణిస్తాడు.

చర్మణ్వతి

దేవగిరినుంచి ముందుకు పోయే తోవలో చర్మణ్వతి నది కనిపిస్తుందని (1-49) చెప్తాడు. ఒకప్పుడు రంతిదేవుడు నిరంతర యజ్ఞాలకోసం గోవుల్ని వధిస్తూ పోగా పారిన రక్తం కాలువలుకట్టి ఆ నదిగా మారిందని కూడా చెప్తాడు. ఆ నదికి నమస్కరించి ముందుకు వెళ్ళు అని చెప్తాడు. ఇప్పుడు చంబల్ గా పిలుస్తున్న ఆ చర్మణ్వతిని వర్ణిస్తో ఒక అందమైన ఉపమాలంకారం వేస్తాడు. చూడండి:

త్వయ్యాదాతుం జలమవనతే శార్గ్ఞిణో వర్ణచౌరే
తస్యాః సింధోః పృథుమపి తనుం దూరభావాత్ప్రవాహం
ప్రేక్షిష్యంతే గగనగతయో నూనమావర్జ్యదృష్టీ
రేకం ముక్తాగుణమివ భువః స్థూలమధ్యేంద్ర నీలం (1-50)

(శ్రీకృష్ణుడి తనూకాంతిని అపహరించావా అన్నంత నీలంగా ఉండే నువ్వు ఆ నదిదగ్గర వంగి నీళ్లు తీసుకుంటున్నప్పుడు నువ్వు చిన్నవాడిగానూ, ఆ నది పెద్దగిగానూ కనిపిస్తుంటే, ఆకాశంలో వెళ్తున్నవాళ్లకి ఒక ముత్యాలాహారంలో పొదిగిన ఇంద్రనీలమణిలాగా కనిపిస్తావు)

దశపుర

చర్మణ్వతీ దాటి దశపుర ప్రాంతం మీంచి ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి గ్రామాల్లోని స్త్రీలు మేఘాన్ని చూస్తారనీ, ఆ దృశ్యం చూడటం మేఘానికి కూడా ఒక వేడుకగా ఉంటుందనీ యక్షుడు ఆ తర్వాత శ్లోకంలో (1-51) చెప్తాడు. చూడండి:

తాముత్తీర్య వ్రజపరిచిత భ్రూలతావిభ్రమాణాం
పక్షోత్షేపాదుపరివిలస్త్కృష్ణశారప్రభాణాం
కుందక్షేపాదుగమధుకర శ్రీముషామాత్మబింబం
పాత్రీకుర్వందశపురవధూనేత్రకౌతూహలానాం

(ఆ నదిని దాటి పయనిస్తున్న నిన్ను దశపుర స్త్రీలు చూడటానికి ఉత్సాహపడతారు. వాళ్ళ నేత్రాలు నీకు బాగాపరిచితమైన పూలతీగల్లాగా ఉంటాయి. విలాసపూర్వకంగా కనిపిస్తాయి. మల్లెల తెల్లదనాన్ని తోసిరాజనేవిగా, తుమ్మెదల కాంతిని అపహరించేవిగా, ఇంచుక తెల్లగానూ, ఇంచుక నల్లగానూ ఉండే ఆ వధూనేత్రాల కుతూహలానికి నువ్వు తగినవాడివి కావాలని కోరుకుంటున్నాను)

మేఘం రామగిరినుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటిదాకా మధ్యభారతదేశంలోని గ్రామాల్నీ, అడవుల్నీ, కొండల్నీ, నదుల్నీ, నగరాల్నీ చూస్తూ సాగుతుండటం చూసాం. ఆ దారిలో చివరి మజిలీ దశపురం. దాన్నిప్పుడు మేవార్ మాళ్వా ప్రాంతాల మధ్యనుండే మాందసోర్ గా గుర్తిస్తున్నారు. ఒకరకంగా అది మధ్యభారతదేశ సరిహద్దు. ఇక ఆ తర్వాత మేఘం కురుక్షేత్రానికి ప్రయాణమవుతుంది. అక్కడినుంచి మేఘం సాగే తోవ కాళిదాసు స్వయంగా తిరిగిన తోవకాదనీ, పురాణేతిహాసాలనుంచి తెలుసుకుని చెప్పిన తోవ అనీ మనకి తెలుస్తూనే ఉంటుంది. మేఘసందేశంలోని మేఘమార్గం రామగిరినుంచి దశపురందాకా కావ్యమార్గమనీ, ఆ తర్వాతదంతా పురాణమార్గమనీ అనిపిస్తుంది నాకు. అందుకని, ఈ ట్రావెలోగ్ ని ఇక్కడితో ఆపుతాను.

10-7-2023

12 Replies to “ఆషాఢమేఘం-23”

 1. ఎప్పుడో కాళిదాసు పనిమీద దూరదేశం వెళ్లినపుడు అనుభవించినదంతా యక్షుడి పేరుమీద రాసి ఉంటాడు. అనుభవించకుండా ఆ విరహోద్వేగం అంతటి కమనీయ కవిత్వం కాదేమో. ఏది ఏమైనా అద్భుత రసోదయాలు కొన్ని ఆ మహాకవి పేరు మీద అలరించినందుకు నమస్సులు.

 2. మీ ఆషాఢమేఘయానం మేఘదూతకావ్యభూమిని దాటి వెళ్ళిపోతున్నదని కొంచెం బెంగ, తరువాత ఏం చూడనున్నామోనని ఉత్కంఠ.

  హిమాలయాలను దేవతల పరమశివుడి అట్టహాసాల గుట్ట అని వర్ణించిన శ్లోకం‌ గురించి చెప్పలేదే అని అనుకున్నాను. ఆ కబుర్లు ఇంకెప్పుడైనా చెప్పండి.

 3. ఎప్పుడో చదువుకునేటప్పుడు మేఘసందేశమనే కావ్యాన్ని కాళిదాసు మహాకవి రచించెను అని చదువుకోవటమే.
  ఇప్పుడు ఇంత వివరంగా మీ ద్వారా తెలుసుకోవటం చాలా ఆనందంగావుంది
  సర్! ధన్యవాదములు.

 4. ఈ అషాడ మాసం లో అషాడమేఘం గురించి చదవడం మనసుకు ఎంతో ఆనందం కల్గించింది.అభివందనాలుమీకు..!

 5. చాలా విషయాలకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. ఇప్పుడు ఈ కాళిదాసు మేఘసందేశం పరిచయం తో మరీ రుణపడి ఉంటాను. ధన్యవాదాలండీ.🙏

 6. తస్మిన్ కాలే నయనసలిలం యోషితాం ఖండితానాం
  శాంతిం నేయం ప్రణయభిరతో వర్త్మ్య భానోస్త్వజాశు
  ప్రాలేయాస్రం కమల వదనాత్ సోపి హర్తుం నలిన్యాః
  ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః

  1-43

  వల్లభులు తమచే కుపితలయిన నాయికల కన్నీటిని శాంతింపజేయవలసిన ప్రభాత సమయం అది. కనుక భానుని దారికి అడ్డురాకు. లేదంటే, పద్మిని మంచు కన్నీటిని తుడువ ప్రయత్నిస్తున్న అతనికి ఎంతో అసహనం కలుగుతుంది.

  మొదట చదివినప్పుడు ఏమిటీ ఈ రెండిటికీ సంబంధం అనిపించింది. తీరా వ్యాఖ్యానం చూస్తే, పద్మ బాంధవుడు రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి వస్తే, సూర్య సతి కుపిత అవకుండా ఉంటుందా! మరి కన్నీరు తుడవాలి కదా, అందరూ వల్లభుల వలనే!

  Thanks for getting me to read these once more! 🙏💗

Leave a Reply

%d bloggers like this: