ఆషాఢమేఘం-22

నీచైర్గిరి దాటిన తర్వాత మేఘం హిమాలయాలకు ప్రయాణించాలంటే నేరుగా ప్రయాణించాలి. కాని ఆ దారిలో పడమటివైపు ఉజ్జయిని ఉండగా మేఘాన్ని కాళిదాసు నేరుగా హిమాలయాల వైపు ఎలా పంపిస్తాడు? అందుకని, కొద్దిగా పక్కదారిలో ఉన్నప్పటికీ, కొద్దిగా వంకరతోవన పోవలసి వచ్చినప్పటికీ ఉజ్జయిని మాత్రం చూడకుండా వెళ్ళకు అని చెప్తాడు.

అవంతి, ఉజ్జయిని, నిర్వింధ్య, సింధు, శిప్ర

ఇక అక్కణ్ణుంచి పదహారు శ్లోకాల్లో (28-44) కవి అవంతీదేశం గురించి, అక్కడి నదుల గురించి, ఉజ్జయిని గురించి వర్ణిస్తాడు. అలకాపురి గురించి చెప్పడానికి పదమూడు శ్లోకాలే కేటాయించిన కవి, తన స్వదేశం గురించి చెప్పడానికి మాత్రం ఏకంగా పదహారు శ్లోకాలు కేటాయించాడంటే ఆశ్చర్యం ఏముంది? అందులో మరో రసస్ఫూర్తి కూడా ఉంది. దేవనగరాన్ని వర్ణించవలసి వస్తే కూడా అది ఉజ్జయిని తర్వాతనేనని చెప్పడం కూడా.

మాళవపీఠభూమికి తూర్పు-ఈశాన్యదిక్కుల్లో దశార్ణజనపదం ఉంది. దానికి విదిశ రాజధాని. పడమటి దిక్కున అవంతి ఉంది. దానికి ఉజ్జయిని రాజధాని. ఆ నగరానికి మరోపేరు విశాలా. కాళిదాసు రెండు పేర్లూ వాడతాడు. మనం చిన్నప్పటినుంచి వింటూ వస్తున్న జానపదకథలవల్ల, ఈ అవంతీ, ఉజ్జయిని – ఈ పేర్లు మన మనసుల్లో ఒక అతిలోక స్ఫురణని కలగచేస్తూ ఉంటాయి. వాల్మీకి తర్వాత సంస్కృత కవులు ముఖ్యంగా భాస, కాళిదాసులు, భవభూతి మొదలైనవాళ్ళు ఉజ్జయినిని భారతదేశపు కావ్యరాజధానిగా మార్చేసారు. ఆ కావ్యాల వల్ల, ఆ కథల వల్ల ఉజ్జయిని అనగానే మనలో ఏదో వెన్నెల నగరం ఆవిష్కారమవుతుంది.

ఆ నగర వైభవమంతా గతించిపోయాక, ఆ పూర్వకాల శోభ మొత్తం ఒక జ్ఞాపకంగా మారిపోయాక భర్తృహరి రాసిన ఒక శ్లోకం (వైరాగ్యశతకం-41) చూడండి:

సా రమ్యా నగరీ, స మహాన్ నృపతిః, సామంత చక్రం చ తత్
పార్శ్వే తస్య సా చ విదగ్ధపరిషత్, తాశ్చంద్ర బింబాననాః
ఉన్మత్తః స చ రాజపుత్ర-నివహః తే వందినః తా కథాః
సర్వం యస్య వశాదగాత్ స్మృతిపథం కాలాయ తస్మై నమః

(ఎట్లాంటి అందమైన నగరం! ఎటువంటి మహారాజు! ఎటువంటి పరివారగణం! రెండుపక్కలా ఎటువంటి కవిపండితుల పరిషత్తు! ఎటువంటి సుందరీమణులు! ఆ రాజపుత్ర బృందం ఎట్లాంటింది! వాళ్ళ గుణగణాలు కీర్తించే ఆ గాయకులెలాంటి వాళ్ళు! వాళ్ళు చెప్తూ ఉండేవి ఎలాంటి కథలు! ఇప్పుడవన్నీ వట్టి జ్ఞాపకంగా మారిపోయాయి. కాలమా! నీకు ఒక నమస్కారం!)

ఆ నగరం ధగధగలు ఒక జ్ఞాపకంగా మారిపోయినప్పుడే ఒక కవి ఇటువంటి పద్యం రాసాడంటే, తాను ఆ నగరంలో జీవించి ఉండగా, ఆ సంతోషాన్ని ఒక మహాకవి ఎలా వర్ణించి ఉంటాడో ఊహించడంలో కష్టమేముంది?

ఆ నగరాన్ని వర్ణించడానికి కాళిదాసు వట్టి నగరాన్ని మాత్రమే కాదు, ఆ మొత్తం జనపదాన్ని, మూడు నదుల్నీ, ఒక దేవాలయాన్ని, అక్కడ చెప్పుకునే కథల్నీ ప్రతి ఒక్కటీ వర్ణిస్తాడు. తక్కినచోట్ల మేఘాన్ని తొందరతొందరగా ప్రయాణించమని చెప్పే కవి ఉజ్జయినిలో మాత్రం మహాకాలుడి సాయంకాల హారతి వేళ దాకా ఉండి మరీ వెళ్ళమని చెప్తాడు. ఇది కదా, ఒక కవిని కన్నందుకు, ఆ ఊరికి లభించే భాగ్యం! మరో కవి ఎవరేనా ఉన్నారా? ఇలా ఒక మేఘాన్ని తన ఊరికి ఆహ్వానించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండీ మరీ చూపించడానికి ఉత్సాహపడ్డ కవి!

నిర్వింధ్య

అవంతీ జనపదంలో అడుగుపెట్టగానే కవి మేఘానికి నిర్వింధ్యానదిని చూపిస్తాడు. మేఘాన్ని చూడగానే నదిలో కలిగే అలజడిని ఒక తొట్రుపాటుగా ఊహిస్తూ, దాన్నొక ప్రణయవచనంగా భావించమని చెప్తాడు. అందమైన ఊహ. లలితమైన పద్యం. చూడండి:

వీచిక్షోభస్తనిత విహగశ్రేణికాంచీ గుణాయాః
సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః
నిర్విన్ధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు ( 1-29)

(నువ్వు ఉజ్జయిని వెళ్ళేటప్పుడు వింధ్యపర్వతాలకు ఉత్తరంగా ప్రవహించే నిర్వింధ్య అనే నదిని కలుసుకుని మనసులోపల పులకింత పొందినవాడివవుతావు. ఆ నదిలో తిరిగే సుళ్ళు ఆ నదికి నాభిలాగా కనిపిస్తాయి. కదలుతున్న అలల సవ్వడిమధ్య ఎగురుతున్న పక్షుల పంక్తి ఆ నదికి మొలనూలులాగా కనిపిస్తుంది. ఆమెలో కదలాడే అలజడి ఆమె నీకు పలుకుతున్న ప్రణయవచనంగా భావించు. ఎందుకంటే, స్త్రీలు పలికే ప్రథమ ప్రణయవచనం విభ్రమమే కదా)

నర్మదానదిని వర్ణించినప్పుడు కూడా ఒక శ్లోకం మాత్రమే చాలనుకున్న కవి నిర్వింధ్యకు మరో శ్లోకాన్ని (1-30) కూడా కేటాయించాడు. ఆమెను సంతోషపెట్టి మరీ వెళ్ళమని చెప్తాడు యక్షుడు మేఘుడితో.

అవంతీ దేశం

అవంతీదేశాన్ని పరిచయం చేస్తూ చెప్పిన ఈ శ్లోకం కూడా దశార్ణదేశాన్ని పరిచయం చేసిన శ్లోకంలాగే సుప్రసిద్ధమైంది. చూడండి:

ప్రాప్యావంతీనుదయనకథాకోవిది గ్రామవృద్ధాన్
పూర్వోద్దిష్టామనుసర పురీం శ్రీ విశాలాం విశాలాం
స్వల్పీభూతే సుచరిత ఫలే స్వర్గణాం గాం గతానాం
శేషైః పుణైర్హృతమివ దివః కాంతిమత్ఖండమేకం (1-31)

(ఆ అవంతిని చేరుకుని నేనుముందే చెప్పిన ఆ నగరంలో ప్రవేశించు. ఆ విశాలా నగరం లక్ష్మీమంతం. అక్కడ ఉదయన కథాకోవిదులైన గ్రామపెద్దలు కనిపిస్తారు. స్వర్గాన్ని చేరుకున్నవాళ్ళు కూడా వాళ్ళ పుణ్యం తక్కువై మళ్ళీ భూమ్మీద పడవలసి వచ్చినప్పుడు ఆ మిగిలిపోయిన కొద్దిపాటి పుణ్యాన్నీ ఇక్కడ అనుభవించడానికి తెచ్చుకున్నారా అన్నట్టుగా ఉండే ఈ నగరం వెలుగులు చిమ్మే స్వర్గపు తునక అని తెలుసుకో)

‘కాంతిమత్ దివః ఏక ఖండం ‘ వెలుగుతున్న స్వర్గఖండం- స్వర్గపు తునక. ఏ కవి అయినా తన ఊరి గురించి చెప్పగలిగే మొదటి మాటా ఇదే, చివరి మాటా ఇదే. కాళిదాసు కూడా ఇందుకు మినహాయింపు కాడు.

కాని ఈ శ్లోకంలో అపురూపమైన మాట మరొకటి చెప్పాడు. అదేమంటే ఆ నగరంలో ఉదయనకథాకోవిదులైన గ్రామవృద్ధులుంటారని. మా మాష్టారు పదే పదే ఈ మాట చెప్తూండే వారు. ఆయన ఆ మాటలు తలుచు కుంటున్నప్పుడు, నాకు రాజమండ్రి ఒక ఉజ్జయినిలాగా, ఆయన ఒక ఉదయన కథాకోవిదుడిలాగా కనిపించేవారు.

ఉదయనుడు వత్సరాజు. బుద్ధుడి సమకాలికుడు. ఉజ్జయినిని పాలించే ప్రద్యోతనుడు ఉదయనుణ్ణి బంధించి ఉజ్జయినికి తీసుకువస్తాడు. వాసవదత్త ప్రద్యోతనుడి కూతురు. ఉదయనుడు, వాసవదత్త ప్రేమలో పడతారు. ఆ ప్రణయం భాసమహాకవి రాసిన ‘స్వప్నవాసవదత్త’, ‘ప్రతిజ్ఞా యౌగంధరాయణం’ నాటకాల ప్రధాన ఇతివృత్తం. హర్షుడు రాసిన ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాల్లో మళ్ళా ఆ కథ వినబడుతుంది. సోమదేవ సూరి రాసిన ‘కథాసరిత్సాగరం’ లో కూడా మళ్ళా మనకి ఆ కథ కనబడుతుంది. చివరికి ‘దమ్మపదం’, ‘మిళింద పన్హ’ల్లో కూడా వాసవదత్త ప్రస్తావన కనిపిస్తుంది. అంటే ఇంతమంది మహాకవులు ఉదయన కథాకోవిదులుగా ఉన్నారన్నమాట! ఇవి కాక, మన జానపద కథలు, అంటే కాశీమజీలీ కథల్లాంటివాటికి కథాసరిత్సాగరమే మాతృక కాబట్టి, మళ్ళా ఏదో ఒక రూపంలో ఈ కథలు మనం చిన్నప్పుడు చందమామలో చదువుకున్నాం. చివరికి పాతాళభైరవిలో తోటరాముడు కూడా ఉజ్జయినీ నగర రాకుమారిని కలవడంకోసం సాహసం చేసినవాడే, గుర్తుంది కదా!

ఒక నగరంలో నలుగురు పెద్దలు కూచుని మాటాడుకుంటున్నప్పుడు ఆ నగరంలో ఒకప్పుడు జరిగిన కథల్ని మళ్ళా చెప్పుకుంటున్నారంటే, ఆ కథానాయకుడు గొప్పవాడనే కాదు, అసలు అలా చెప్పుకునేటంత తీరిక ఆ నగరానికి ఉందన్నది దానిలో విశేషార్థం. ఊరికే చెప్పుకోడం కాదు, అలా ఆ కథలు చెప్పడంలో కొందరు గొప్ప ప్రావీణ్యం కూడా సంపాదించిఉండేవారట-కోవిదులు- అంటే అర్థమదే, అంటే ఉదయనకథాకోవిదులు ఉండేవారట ఆ నగరంలో. అంటే ఆ కథలు ఆ ప్రజలకి ఎన్నిసార్లు విన్నా తనివి తీరేవి కావనీ, అలా చెప్పడంలో ప్రజల ఆసక్తి సన్నగిల్లకుండా ఎప్పటికప్పుడు ఉత్సాహం కలిగిస్తో ఎలా చెప్పాలో తెలిసిన నేర్పరులైన కథకులు ఉండేవారట.

గమనించండి. తన నగరాన్ని వర్ణించడానికి ఈ శ్లోకంలో కాళిదాసు మూడు విశేషణాలు వాడేడు. ఒకటి శ్రీ విశాల అన్నాడు. అంటే విస్తారమైన సంపద కలిగింది అని. రెండవది, దాన్ని వెలిగే స్వర్గపు తునక అన్నాడు. ఈ రెండింటికన్నా కూడా ముందు చెప్పిన మాట, ఆ నగరంలో ఉదయన కథాకోవిదులైన గ్రామవృద్ధులున్నారనడం. అంటే ఏమిటి? ఒక నగరానికి వన్నెతెచ్చేవి అక్కడ లభించే సంపదలూ, స్వర్గసుఖాల కన్నా కూడా అక్కడ కథకులు, వాళ్ళు చెప్పుకునే కథలు. అందుకనే భర్తృహరి తన శ్లోకంలో కూడా ‘తే వందినాః తా కథాః’ అని తలచుకున్నాడు.

ఎందుకంటే సంపదల్నీ, స్వర్గసుఖాల్నీ వెన్నంటే ఒక అభద్రత కూడా ఉంటుంది, నిత్యభయం ఉంటుంది. కాబట్టి ఒక నగరం ప్రశస్తి చెప్పడానికి దాన్ని దేనగరంలాంటిది అంటే చాలదు, అక్కడ తీరిగ్గా కూచుని కథలు చెప్పుకునేవాళ్ళుంటారు అని చెప్పినప్పుడే ఆ నగరం భయరహితంగా ఉందని చెప్పినట్టవుతుంది. ఇంతకీ ఆయన ఆ మాటలు ఒక్క ఉజ్జయిని గురించే కాదు, ‘ప్రాప్యావంతీనుదయన కథాకోవిదిగ్రామవృద్ధాన్’-మొత్తం అవంతీ జనపదమంతా ఉంటారని చెప్తున్నాడు.

మీకు గుర్తుందా! మాయాబజార్ లో ఘటోత్కచుడు అర్థరాత్రి ద్వారకలో అడుగుపెట్టిన దృశ్యం. అప్పుడు ఆ నగరంలో కావలివాళ్ళు పాచికలాడుకుంటూ, నవ్వుకుంటో ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడే నివసిస్తున్న ద్వారకలో రాత్రి కాపలా లాంఛనప్రాయం మాత్రమే అనే ధ్వని ఉంది ఆ సన్నివేశంలో.

ఉదయన కథాకోవిదులైన గ్రామవృద్ధుల్ని నేను రాజమండ్రిలో కూడా చూసాను. సన్నిధానం నరసింహశర్మ అటువంటి రాజమండ్రి కథాకోవిదుడు. రాత్రుళ్ళు సమాచారం పత్రికా కార్యాలయంలో మేము కూచుని మాటాడుకుంటున్నప్పుడు ఆయన రాజమండ్రి సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వీరేశలింగం, చిలకమర్తి, నాళం కృష్ణారావు, న్యాపతి సుబ్బారావు, వడ్డాది సుబ్బరాయుడు మొదలైన వాళ్ళ ముచ్చట్లు చెప్తూ ఉంటే కాలం తెలిసేది కాదు. ఆయన వాళ్ళ గురించిన చెప్తున్న కథలు వింటున్నంతసేపూ వాళ్ళు ఆ ఊళ్ళో జీవితులుగా ఉన్నారనే అనిపించేది.

ఇందులో మరొక ధ్వని కూడా ఉంది. ఆ కథల్లో ఉదయనుడు నాయకుడో, ఒక పాత్రనో అయి ఉండవచ్చు. కానీ మనం చూడవలసింది అది కాదు, ఆ కథలు చెప్పుకుంటున్నారన్నది కూడా కాదు. అక్కడ కథ అనేది ఒక metonymy. అది మొత్తం సాహిత్యాన్ని సంకేతపరిచే మాట. ఒకప్పుడు ఈ దేశంలో, గ్రామాల్లో కూడా, సాహిత్యం గురించీ, కావ్యాల గురించీ మాట్లాడగలిగే కోవిదులు ఉండేవారు. అలా మాట్లాడితే వినే తీరిక ఉండేది. ఆ మాటలు వినడంకోసం పోగయ్యే శ్రోతలు ఉండేవారు. నిజానికి ఈ దేశంలో సాహిత్యం అటువంటి చిన్న చిన్న బృందాల ద్వారానే బతికింది. ప్రింటింగు ప్రెస్సులు లేని ఆ యుగాల్లో ధారణమీదనే మహాకావ్యాలు బతుకుతూ వచ్చాయంటే అటువంటి కథాకోవిదులే అందుకు కారణం. కాబట్టి ఒక దేశం, ఒక నగరం నిజంగా సాంస్కృతికంగా ఉన్నతమైనవి అని చెప్పాలంటే, ఆ దేశంలో, ఆ నగరాల్లో, ఆ గ్రామాల్లో కావ్యకళాకోవిదులు, కథాకోవిదులు ఉండాలి. సాయంకాలాలో, రాత్రులో వాళ్ళు సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటే వినే శ్రోతలు ఉండాలి. భర్తృహరి విదగ్ధ పరిషత్తు అన్న మాట కేవలం రాజుగారి కొలువులో ఉండే పండితుల గురించే అన్నమాట కాదు. ‘పార్శ్వే’ అన్నాడాయన. అంటే ‘రెండు పక్కలా’- కొలువులోనూ, గ్రామాల్లోనూ కూడా.

అందుకనే టాగోర్ మేఘదూతం గురించిన తన వ్యాసంలో ఆ దశార్ణమేమైపోయింది అని అడుగుతో, ఏ అవంతిలో గ్రామవృద్ధులు ఉదయనవాసవదత్తల కథలు చెప్పేవారో ఇప్పుడు వారయినా ఉన్నారా లేదా అని అడుగుతాడు.

తన మాళవదేశాన్ని వర్ణించేటప్పుడు కాళిదాసు చెప్పిన ఈ రెండు మాటలు- దశార్ణం గురించి చెప్తున్నప్పుడు, అక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉండివెళ్ళిపోయే హంసల గురించీ, అవంతి గురించి చెప్పినప్పుడు ఆ దేశంలో ఉదయన కథాకోవిదులైన గ్రామవృద్ధుల గురించీ చెప్పిన మాటలు- మనమెప్పటికీ మర్చిపోలేని మాటలు.

9-7-2023

9 Replies to “ఆషాఢమేఘం-22”

 1. ఇన్ని రోజులు మేఘ సందేశం చదువకపోతినే అనే బెంగ ఉండేది. అది ఇప్పుడు తీరింది. పుట్టిన ఊరు కలిగించే పులకరింపు అనుభవైకవేద్యము. మీరు మాకు ఉదయమే అంతర్జాలనగరంలో ఆసక్తికరంగా ఆమూలాగ్ర సాహిత్యవిశేషాలను వినిపించే ఉదయనకథాకోవిదులు. మీకు నమస్సులు.జయధీర్ తిరుమలరావు గారిద్వారా సన్నిధానం నరసింహ శర్మగారి పరిచయభాగ్యం కలిగింది. వారి బ్రౌను ఉదాహరణం పుసితకావిష్కరణ సభలో ఆ కావ్యగానమా చేసే అదృష్టం నాకు కలుగడం మరువలేనిది. వారి ద్వారా రాజమహేంద్రి గౌతమీ గ్రంథాలయ విశేషాలు విన్నాను.

 2. మేఘదూత కావ్య విశేషాలను,
  కవి భావాలను .. మీ ద్వారా తెలుసుకొనే అదృష్టం కలిగింది. ధన్యవాదాలు.

 3. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు సర్ ,ప్రపంచమంతటా సాహిత్యం ముందు చెబితే విన్నదే కదా .హోమర్ కావ్యాలు చదవడానికి దొరికింది ఏ కాలానికో. నేను ఊహించుకునేదాన్ని ,కళ్ళు కనిపించని కవి కథ రాగయుక్తంగా చెబుతూంటే చుట్టూ శ్రోతలు ,పైన ఆకాశంలో నక్షత్రాలు.

 4. అందుకే కదా స్వామీ శ్రీ శ్రీ గారు సైతం ఇలా వాపోయింది
  ఏవితల్లీ: నిరుడు కురిసిన హిమ సమూహములు ?
  కాళిదాసు మహా కవీంద్రుని
  కవనవాహినిలో కరంగిన
  ఉజ్జయినినేడెక్కడమ్మా
  ఉంది? చూపించు ?….
  జగద్గురువులు, చక్రవర్తులు,
  సత్కవీశులు, సైన్యనాధులు,
  మానవతులగు మహారాజ్ఞులు
  కానరారేమీ ?
  పసిడిరెక్కలు విసిరి కాలం
  పారిపోయినజాడలని తిరిగి మళ్ళీ, మళ్ళీ వెతికి, వెతికి మాకు అందిస్తున్నాందుకు మీకు మా కృతజ్ఞతా పూర్వక అభివందనాలు!
  ప్రతి ఉదయం, వీలు కుదుర్చుకుని మీ కుటీరంలో కొంత తడవు విశ్రమించనిదే మాకు పొద్దు గడవదు
  ఉదయన కథా కోవిదులుగా మీరు ఆసక్తికరంగా ఆమూలాగ్ర సాహిత్యవిశేషాలను అందిస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక నమస్సులు!

Leave a Reply

%d bloggers like this: