ఆషాఢమేఘం-21

ఆమ్రకూటం మీంచి మేఘాన్ని ప్రయాణించమనడం వ్యాఖ్యాతల్నీ, పరిశోధకుల్నీ కూడా తికమకపెట్టింది. అదొక చిక్కు ప్రశ్నగా మారింది. కొందరు వ్యాఖ్యాతలు ఆ ఆమ్రకూటం ఎక్కడుందో పట్టించుకోకుండా వదిలేసారు. కొందరు పరిశోధకులు అది అమరకంటక్ కాదనీ, రామగిరికి దగ్గర్లోనే మరేదో కొండ అయి ఉండవచ్చుననీ అన్నారు. కొందరు వింధ్యపర్వతాలు దాటమని యక్షుడు మేఘానికి చెప్పలేడు కాబట్టి చుట్టు తిరిగి వెళ్ళమని చెప్పి ఉంటాడని ఊహించారు. కాని నేనేమనుకుంటానంటే, కాళిదాసు తాను చూసిన అందమైన దేశాన్ని మనకి కూడా చూపించాలని ఉత్సాహపడినందువల్లనే ఆ చుట్టుదారి ఎంచుకున్నాడని. మధ్యభారతదేశమంటేనే అడవులూ, కొండలూను. ఆ సౌందర్యాన్ని కూడా చూపిస్తేనే కదా ఒక ప్రాదేశిక సౌందర్యాన్ని పూర్తిగా చూపించినట్టవుతుంది. ఆమ్రకూటం ప్రధానంగా గిరిజన ప్రాంతం. పందొమ్మిదో శ్లోకంలో ‘వనచరభుక్త కుంజే'(ఆదివాసి స్త్రీలు విహరిస్తున్న పొదరిండ్లు గల) అనే విశేషణం మీద వ్యాఖ్యాతలు దృష్టిపెట్టి ఉంటే, ఆ ఆమ్రకూటం ఎక్కడిదనే సందేహం వారికి వచ్చి ఉండేది కాదు. ఆమ్రకూటాన్ని ఆయన ఒక aerial view లో చూపిస్తాడు. చూడండి:

ఛన్నోపాన్తః పరిణతఫలద్యోతిభిః కాననార్మైః
స్త్వయ్యారూడే శిఖరమచలః స్నిగ్ధవేణీ సవర్నే
నూనం యాస్యత్యమరమిథున ప్రేక్షణీయామవస్థాం
మధ్యే శ్యామః స్తన ఇవభువః శేషవిస్తారపాండుః (1-18)

మేఘం ఆ పర్వతశిఖరం వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ పర్వతకాంత జడలాగా కనిపిస్తుందంటాడు. పైనంతా పండిన మామిడిచెట్లతో తెల్లగా కనిపిస్తున్న కొండకొమ్ము, చుట్టూ నల్లని జడ అల్లుకున్నట్టుగా పరుచుకున్న మేఘం- పైనుంచి చూసే అమరదంపతులకి ఆ పర్వతం భూమితాలూకు స్తనంలాగా కనిపిస్తుంది అని వర్ణిస్తాడు.

రేవానది, వింధ్యపర్వతాలు

మామిడిచెట్ల కొండల మీద దావాగ్నుల్ని చలార్చి, తాను కూడా ఒకింత సేదతీరి, అప్పుడు వింధ్యపర్వతాలలోయలో ప్రవహిస్తున్న రేవానదిని చూడమని చెప్తాడు. రేవా అంటే నర్మద. భారతదేశంలో అత్యంత పురాతనమైన నదీనదాల్లో నర్మద ఒకటి. నర్మద అంటేనే సంతోషాన్నిచ్చేది అని. ఆమెని పైనుంచి చూస్తుంటే తన ఒళ్ళంతా మదగజం కారుతున్న చారికలతో నిండిపోయిన ఏనుగులాగా కనిపిస్తుంది (1-19) అంటాడు. రేవా నదిదాటాక వింధ్యపర్వతాలు ఎదురవుతాయి. కాబట్టి ఆ నదిలోంచే కొన్ని నీళ్ళు తీసుకుపో అని చెప్తున్నాడు. పైగా ఏ దారిన ప్రయాణిస్తాడో ఆ దారిమొత్తం చల్లబడుతుంది, అక్కడ పూలు వికసిస్తాయి, గాలి తీపెక్కుతుంది అని కూడా అంటున్నాడు. ఈ శ్లోకం చూడండి:

నీపం దృష్ట్వా హరితకపిశం కేసరైరర్ధరూఢై
రావిర్భూత ప్రథమముకుళాః కందళీశ్చానుకచ్ఛం
జగ్ధ్వారణ్యేష్యధిక సురభిం గంధమాఘ్రాయ చోర్వ్యాః
సారంగాస్తే జలవముచః సూచయిష్యంతి మార్గం (1-21)

(ఆ దారిలో సగం మొలిచిన పచ్చికబయళ్ళలోనూ, వికసించిన కడిమిపూల నల్లని ఆకుపచ్చని కింజల్కాలమధ్యా, అప్పుడే కొత్తగా మొగ్గలు విచ్చిన కందళిపుష్పాల తోవలోనూ, అడవుల్లోంచీ, నేలమీంచి వీస్తున్న సౌరభాన్ని ఆఘ్రాణిస్తూనూ, నువ్వు కురిసివెళ్ళిన నీటిబిందువుల్ని లేళ్ళు ఆస్వాదిస్తూ ఉంటే, నువ్వు ఆ దారినే వెళ్ళావని తెలిసిపోతూ ఉంటుంది)

చాలా అందమైన పద్యం. గాథాసప్తశతి పద్యాల గురించి చెప్పినమాటనే ఇక్కడ కూడా చెప్తున్నాను. ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. వర్ణన నెపంతో కవి కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది. ‘ఆవిర్భూత ప్రథమముకుళాలు’ అనే మాట చూడండి. దాన్నే తర్వాత రోజుల్లో నన్నయ అక్షరరమ్యత అన్నాడు. అటువంటి భాషకోసమే కృష్ణశాస్త్రి తపించాడు. తిలక్ కవిత్వం మనకి తియ్యగా ఉండటానికి కారణం కూడా అటువంటి వర్ణసమ్మిశ్రమమే.

దశార్ణదేశం

దశార్ణ అంటే ఒక నది, ఒక జనపదం కూడా. అది మాళవభూమి. విదిశ ఆ జనపదానికి రాజధాని. ఆ దశార్ణ అనే పేరులోనే ఏదో mysterious స్ఫురణ ఉంది. అసలు ఆ దేశాన్ని చూపించడానికే కాళిదాసు మేఘాన్ని ఆమ్రకూటం మీంచి నడిపించాడా అని కూడా అనుమానం కలుగుతుంది. ఆ కవికి ఆ ప్రాంతంతో, అక్కడి పల్లెటూళ్ళతో, అక్కడి పొలాల్తో, పశుపక్ష్యాదుల్తో ఏదో ఆత్మీయ అనుబంధం ఉంది. తన కౌమార, యవ్వనకాలాల్లో ఆయన ఆ ప్రాంతంలో నివసించాడేమో అనిపిస్తుంది. అప్పటిదాకా మేఘాన్ని నెమ్మదిగా నడిపిస్తున్నవాడు దశార్ణదేశం రాబోతున్నదనగానే తొందరతొందరగా నడవమనిచెప్తాడు. ‘కథమపి భవాంగంతుమాశు వ్యవస్యేత్’ (1-23) ‘ఎలాగైనా సరే (కథమపి) నువ్వు తొందర తొందరగా అంగలు వెయ్యి’ అనడంలోనే ఆ ఊళ్ళు చూపించాలన్న ఉత్సుకత మొత్తం కనిపిస్తుంది. ఇక దశార్ణదేశాన్ని చూపిస్తూ చెప్పిన ఈ పద్యం మొత్తం సంస్కృత సాహిత్యానికే తలమానికం లాంటిది. చూడండి:

పాండుచ్ఛాయో పవనవృతయః కేతకైస్సూచిభిన్నై
ర్నీడారంభైర్గృహబలిభుజామాకులగ్రామచైత్యాః
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజంబూ వనాంతాః
సంపత్యంతే కతిపయదినస్థాయి హంసా దశార్ణాః (1-24)

(నువ్వు దశార్ణదేశాన్ని సమీపిస్తున్నప్పుడు ఆ గ్రామాల్లోని తోటల చుట్టూ కంచెలాగా కట్టిన మొగలిపొదలమీద తెల్లటికాంతి పరుచుకుని ఉంటుంది. ఊరిమధ్యలో రచ్చబండల దగ్గర చెట్లమీద గూడుకట్టుకున్న కాకులు ఆకుల గుబుర్లని కదిలిస్తో ఉంటాయి. పండిన నేరేడుపళ్ళవల్ల నల్లబడ్డ వనాలు అందంగా కనిపిస్తాయి. అక్కడ కొన్నిదినాలే ఉండబోయే హంసల్ని కూడా నువ్వు చూడబోతావు)

ముసురుపట్టినవేళల్లో మన గ్రామాలు ఎలా కనిపిస్తాయో ఇంతకన్నా లలితమైన నీటిరంగుల చిత్రం నేనిప్పటిదాకా చూడలేదు. నింగీనేలా ఏకమైనట్టు ఉండే ఆ రోజుల్లో ఊరిచివర మొగలిపొదలమీద తెల్లటిమసకవెలుగు ఆవరించి ఉంటుంది. పొలాలమీదా, తోటలమీదా కూడా ఒక పేల వెలుగు (‘పాండుచ్ఛాయ’) కమ్ముకుని ఉంటుంది. పాండుకాంతి కాదు, పాండుచ్ఛాయ అట! పాలిపోయిన నీడ అనవచ్చేమో. ఊరిమధ్య రచ్చబండలు, ఆ రచ్చబండలమధ్యలో రావిచెట్లు, వేపచెట్లు. ఆ చెట్ల గుబుర్లలో గూళ్ళు కట్టుకున్న కాకులు. తొలకరి గాలికి ఆ ఆకులూ, కొమ్మలూ కదుల్తుంటాయి. ఇక అన్నిటికన్నా ప్రత్యేకం, నేరేడువనాల నల్లటివెలుగు. ‘పరిణతఫలశ్యామ జంబూ వనాంతాలు’. ఈ పరిణత జంబూవనాల్ని మొదట ఏ ఆదివాసీ గాయకుడు చూసి కవిత్వంలోకి తెచ్చాడోగాని, అక్కణ్ణుంచి వాల్మీకి తెచ్చుకున్నాడు. ఆయన్నుంచి కాళిదాసు. ఆ తర్వాత శతాధిక భారతీయ భావుకులు, టాగోర్ దాకా.

మేఘదూతం మీద వ్యాసం రాయడానికి కూచున్నప్పుడు టాగోర్ కి మొదట గుర్తొచ్చింది ఈ శ్లోకమే. ఆయనిలా రాస్తున్నాడు: ‘రామగిరినుంచి హిమాలయాలదాకా భారతదేశమనే ఒకే ఖండం మధ్యనుంచి మందాక్రాంత ఛందస్సులో జీవనస్రోతస్సు ప్రవహించిపోయిందో, అక్కడనుంచి మనం కేవలం వర్షాకాలంలోనే కాదు, శాశ్వతంగా ప్రవాసితులమైపోయాం. ఏ ఉపవనాలకి మొగలిపూల పొదలు కంచెలుగా ఉండేవో, వర్షాకాలంలో గ్రామాల్లో ఏ రచ్చబండలదగ్గర కాకులు గూళ్ళు కట్టుకునే పనిలో మునిగిఉండేవో, గ్రామాల పొలిమేరల్లో ఉండే ఏ నేరేడుతోపుల్లో పండ్లు పండి మేఘంలాగా నలుపెక్కి ఉండేవో, ఆ దశార్ణం ఇప్పుడెక్కడికి పోయింది?..’ (కావ్యజగత్తు, పే.22)

మనం జపనీయ కవిత్వం చెర్రీపూల చుట్టూ అల్లుకుందని చెప్పుకుంటాం. కాని భారతీయ కవిత్వం కూడా కడిమిపూల చుట్టూ, నేరేడువనాల చుట్టూ అల్లుకుందని మర్చిపోతాం. కడిమి కూడా చెర్రీలాంటిదే. పూసి ఎక్కువకాలం నిలబడదు. తొందరలోనే వాడిపోతుంది, రాలిపోతుంది. కడిమిపూల అందం తెలిసేది మనకి తొలికారువాన పడే రోజుల్లోనే. అలానే వానాకాలపు నేరేడు చెట్లు కూడా. నా బాల్యమంతా అక్కడే గూడుకట్టుకుని ఉందనిపిస్తుంది నాకు. ఆ మహాకవుల స్ఫూర్తితో ‘పునర్యానం’ లో నేను కూడా ఒక కవిత (4:1) ఇలా రాయకుండా ఉండలేకపోయాను:

వేసి ఉంటారప్పటికే కొన్ని దారులెవరో.
వెచ్చని కన్నీటి చెంపలకు చేతులాన్చుకుని
కిటీకీ చెంత కూచొన్న బాలల కోసం
కొన్ని కొత్త మైదానాలను చేరువగా తీసుకువస్తారు,
నీ కోసం అప్పటికే అన్వేషించి ఉంటారెవరో కొన్ని తోవల్ని.
పండిన నేరేడు పండ్లు నేల రాలుతున్న సుగంధాల తోవ ఒకటి-

నడిచారెందరో ఆ దారిన. ఆ కాన పొడుగునా వాళ్ల అడుగుజాడలు
నడి వర్షాకాలాలు తెల్లని వానదుప్పటి కప్పుకుని నువ్వు కూడా తిరిగావక్కడ
ఆ గుబుర్ల మధ్యకి ఏ దారిన పోవాలో, ఏ దారిన బయటకు రావాలో
నీ కోసం అప్పటికే ఎవరో వెతికి చూసారు.
ఉధృతంగా ముంచుకొస్తున్న వానవరదల ఎర్రనీళ్లలో
పండి రాలిన ఊదారంగు మరకలు ఆనవాలుగా
వెతుక్కున్నావు ఆ హోరులో నీ అన్నలు నడిచిన దారిని.
ఆకాశానికీ, అవనికీ మధ్య
తాళ్ల నిచ్చెనలెక్కి పయనమయ్యావు నువ్వు కూడా.

ఆ దారులప్పటికే వేసి ఉన్నా అందరూ నడిచే తోవ కాదది,
ఆ పచ్చికను వానకాలవలు కప్పేసాయి, ఎవరో హోరెత్తిస్తున్నారు
ఏ మాటా విననివ్వక
నీళ్ల కొమ్మల ఛత్రం కింద మెరుపు లాంతర్లతో ఆ దారిన పొయ్యేది నువ్వూ
నీముందూ, వెనకా బహుశా మరొకరో ఇద్దరో.

ఏం విన్నావు ఆ వర్షసంగీతం మధ్య, ఏం చూసావేం చూసావు?
వెతుక్కున్నావా మళ్లా ఎప్పుడేనా, ఏ దారుల్లోనేనా, ఆ ఆర్తితో, ఆ తపనతో?
నువ్వు మర్చిపోయినా ఆ నాడు నిన్ను చూసిన మేఘం మాత్రం
మరువదు ఆ క్షణాలు
ప్రతి వర్షాకాలంలోనూ ఎవరూ చూడకుండా నీ చెంపని
మృదువుగా స్పృశించిపోతుందది.

ఆ శ్లోకంలో ఆ చిట్టచివరి మాట ‘కతిపయ దినస్థాయి హంసా దశార్ణాః’ అనే మాట ఒక అతిలోకరమణీయత ఉట్టిపడే మాట. మా మాష్టారిని ఆయన చివరి సంవత్సరాల్లో ఒకసారి కలిసినప్పుడు కాళిదాసు శ్లోకమేదైనా వినిపించండి అని అడిగిగే, ఈ పద్యం వినిపించారు. ‘నా చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను ఈ కవిత. కాని అక్కడ హంసలు ఉండేది కొన్నాళ్ళే అనే మాటకి అర్థం ఇప్పుడే తెలిసిందయ్యా’ అన్నారు. వళ్ళు జలదరించే మాట అది. సౌందర్య దిదృక్ష కలిగినవారంతా గుర్తుపెట్టుకోవలసిన మాట. ఈ అందమైన లోకంలో నువ్వుండేది కతిపయదినాలే అని గుర్తుంటే, నువ్వు జీవించే ఈ చిన్న జీవితాన్ని మరింత భక్తిశ్రద్ధలతో, మరింత సమరసపూర్వకంగా జీవిస్తావు. ఇదంతా ఇంతకు ముందు ఒక వ్యాసంలో రాసాను. తెలుగు సాహిత్యం మీద నేను రాసిన కొన్ని వ్యాసాల్ని పుస్తక రూపంగా తీసుకువస్తూ, మా మాష్టారి మాటల స్ఫూర్తితోనే, దానికి ‘దశార్ణదేశపు హంసలు‘ (2019) అని పేరుపెట్టాను. దాన్ని దశార్ణదేశపు మరొక హంస సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారికి కానుక చేసాను.

మేఘదూతంలోని ఈ శ్లోకంలో కనిపిస్తున్న దశార్ణం ఒక విధంగా lost paradise అనిపిస్తుంది. కానీ ఈ నగరకోలాహలం నుంచి, విద్వేషాలు వెదజల్లే ఈ మీడియా నీడనుంచి బయటపడి, ఒక ఆషాఢ మాసంలో ఈ దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ దశార్ణం కనిపిస్తూనే ఉంటుంది.

దశార్ణదేశపు హంసలు అక్కడుండేది కొన్నిరోజులే అయినప్పటికీ, ఆ దృశ్యం మాత్రం భారతీయ సాహిత్యంలో శాశ్వతంగా నిలబడిపోయిందనే నాకు నేను చెప్పుకుంటాను.

విదిశ

విదిశ దశార్ణజనపదానికి రాజధాని. భావుక హృదయాల్ని ఏదో మార్మిక స్ఫురణల్తో వెంటాడే పదాల్లో విదిశ ఒకటి. జీవనానంద దాస్ వనలతాసేన్ ని వర్ణిస్తూ ‘విదిశలో అర్థరాత్రి కమ్ముకునే కేశపాశం’ ఆమెది అని అంటాడు, గుర్తుంది కదూ! సాంచి వెళ్ళినవాళ్ళకి విదిశ, సాంచి, ఉదయగిరి ప్రాంతాల్లో తిరిగినప్పుడు మేఘదూతంలో వర్ణించిన లాండ్ స్కేప్ ఇంకా చెక్కుచెదరలేదనే అనిపిస్తుంది. విదిశ గురించి యక్షుడు మేఘంతో ఒక్కటే మాట చెప్తాడు: ‘నీకు కోరికలున్నందుకు పూర్ణఫలం లభిస్తుంది విదిశకు వెళ్తే’ అని. అప్పటికి ఆ శ్లోకంలో సగం పాదం (1-25) పూర్తయింది. ఇక ఆ తర్వాత విదిశ గురించి చెప్పడానికి మరేమీ లేదనిపించింది కవికి.

వేత్రవతి

విదిశ గురించి చెప్పిన శ్లోకంలో రెండవసగం వేత్రవతి నదిగురించి చెప్తాడు. తన అధరాలు నీకు అందిస్తున్నప్పుడు కనుబొమ ముడిపడినట్టుగా ఉండే ఆ నదీ అధరాలని సంతోషంతో చప్పుడు చేస్తో పానం చెయ్యి అని కూడా చెప్తాడు.

నీచైర్గిరి

విదిశకి వెళ్ళినప్పుడు విశ్రమించడానికి తగిన చోటు ఒకటుందని చెప్తూ అది నీచై అనే పేరుగల కొండ అని చెప్తాడు. దాన్నిప్పుడు ఉదయగిరి కొండగా గుర్తుపడుతున్నారు. ‘ఆ నీచైర్గిరి నిండా బాగా పూసిన కడిమిచెట్లు ఉంటాయి అక్కడ నువ్వున్న కొద్ది సేపూ అక్కడ పూలుకోసుకునే స్త్రీలకి ఎండతగలకుండా నీడపరిచి పెట్టు. అది నీకూ, వాళ్ళకీ మధ్య ఒక సంతోషభరితమైన క్షణపరిచయాన్ని కలగచేస్తుంది’ అని కూడా అంటాడు. చాలా సుకుమారమైన శ్లోకం. చూడండి:

విశ్రాంతః సన్వ్రజ వననదీ తీరజాతాని సించ
న్నుద్యానానాం నవజలకణైర్యూథికా జాలకాని
గణ్డస్వేదాపనయన రుజాక్లాంత కర్ణోత్పలానాం
ఛాయాదానాతత్క్షణపరిచితః పుష్పలావీముఖానాం (1-27)

(మేఘుడా! ఆ కొండదగ్గర నువ్వు సేదతీరి, ఆ కొండవాగుల ఒడ్డున మొలిచిన అడవిమల్లెల్ని నీ నీటితుంపరతో తడిపిపెట్టు. అక్కడ పూలు కోసుకునే స్త్రీలు ధరించిన నల్లకలువలు ఆ ఎండకి ఇంత కమిలి ఉంటాయి, వాళ్ళ కపోలాల మీద చిరుచెమట పడుతూ ఉంటుంది. ఆ ఎండబాధనుంచి తప్పించడానికి వాళ్ళ వదనాలకు నువ్వింత నీడని దానం చేసావనుకో, మీమధ్య ఆ క్షణపరిచయం సంతోషకరంగా మారుతుంది. అప్పుడు ముందుకు వెళ్ళు.)

8-7-2023

Leave a Reply

%d bloggers like this: