ఆషాఢ మేఘం-20

మేఘసందేశంలో రెండు భాగాలున్నాయి. అవి పూర్వమేఘం, ఉత్తరమేఘం అని చెప్పాను. మేఘంద్వారా తన భార్యకి పంపాలనుకున్న సందేశం యక్షుడు రెండవభాగం చివరలో పన్నెండు శ్లోకాల్లో పొందుపరిచాడని కూడా చెప్పాను. మరి మొదటిభాగం అంతా ఏమిటి? అది మేఘం ఏ దారిన ప్రయాణించవలసి ఉందో ఆ దారి గురించి చెప్పడం. మేఘం కనిపించినతరువాత (1:2) మేఘాన్ని కుశలప్రశ్నలు అడగడం, తన సమస్య చెప్పుకోవడం మొదలైందంతా పూర్తయ్యాక (1:3-7) మేఘం ఏ దారిన ప్రయాణించాలో చెప్పడం మొదలుపెడతాడు. పూర్వమేఘంలో మిగిలిన 62 శ్లోకాలూ మేఘప్రయాణదర్శినిగా చెప్పవచ్చు.

అందులో మళ్లా రెండు భాగాలున్నయి. 8 వ శ్లోకం నుంచి 51 వ శ్లోకందాకా 44 శ్లోకాలు మేఘం సాక్షాత్కరించిన రామగిరి నుంచి దశరూప దాకా మేఘం సాగవలసిన దారి. అది కాళిదాసుకి బాగా తెలిసిన ప్రపంచం. ఆయన పుట్టిపెరిగిన దేశం. ఆయన సంతోషాలూ, ప్రత్యక్ష అనుభవాలు అల్లుకున్న లోకం అది. ఆ తర్వాత 51 నుంచి 67 దాకా పదహారు శ్లోకాల్లో దశపురందాటి బ్రహ్మావర్తం, కురుక్షేత్రం, హిమాలయాలు, కైలాసం, అలకాపురి పురాణలోకం. అది పూర్వకవిత్వాలనుంచీ, పురాణగాథలనుంచీ తెలుసుకున్న ప్రపంచం. అందుకనే ఆ దారుల వర్ణనని ఆయన పదహారుశ్లోకాల్లో ముగించేసాడు.

కాబట్టి మేఘసందేశంలోని మహత్వమంతా 1-50 శ్లోకాల్లోనే ఉందని చెప్పాలి. అందులోనూ 8-51 శ్లోకాల్లో ఆయన ఏ తావుల్లో మేఘాన్ని సాగమని చెప్పాడో ఆ దారుల వర్ణనమీదనే మేఘసందేశకావ్య విశిష్టత ఉందని చెప్పాలి. తదనంతర భారతీయ కావ్యప్రపంచాన్ని, కవుల్నీ, భావుకుల్నీ గాఢంగా ప్రభావితంచేసింది ఆ శ్లోకాలే. ఇంతాచేసి నలభయ్యో, యాభయ్యో పద్యాలు ఒక జాతిని యుగయుగాలుగా ప్రభావితం చెయ్యగలవంటావా అని మీరు అడగవచ్చు. అదేమంత ఆశ్చర్యమైన విషయం కాదు. గ్రీకులో క్రీ.పూ. ఏడవశతాబ్దానికి చెందిన హెసియోద్ అనే కవి Work and Days అనే ఒక కావ్యం రాసాడు. దాదాపు ఎనిమిది వందల పంక్తుల ఆ కావ్యం ఇప్పటికీ పాశ్చాత్యకవిత్వాన్ని ప్రభావితం చేస్తోనే ఉంది. లాటిన్ మహాకవి వర్జిల్ రాసిన Eclogues పది గీతాలు మాత్రమే. కాని ఇప్పటికీ యూరోప్ లో గ్రామీణ జీవితాన్ని వర్ణించాలనుకుంటే, రైతు జీవితాన్ని కవిత్వంగా మార్చాలనుకుంటే ఆ గీతాలే స్ఫూర్తిగా ఉంటున్నాయి. ప్రాచీన చీనాలో సా.శ రెండవశతాబ్దిలో రాసారని చెప్పే పందొమ్మిది హాన్ పద్యాలు తదనంతర చీనా కవిత్వం రూపురేఖల్ని మార్చేసాయి.

పూర్వమేఘంలోని ఈ నలభై-యాభై పద్యాల్లో కాళిదాసు సంస్కృతకవిత్వాన్ని మొదటిసారిగా పొలాలమ్మట తిప్పాడు, అడవుల్లో, కొండల్లో విహరింపచేసాడు. గ్రామాల్లో రైతుల్ని, పథికవనితల్నీ పరిచయం చేసాడు. ఆ పద్యాల్లో తొలివానల తాలూకు చల్లగాలి మన మనసుని తాకుతుంది. అప్పుడప్పుడే నాగళ్ళతో దున్నుతున్న చేలు కనిపిస్తాయి. కారుమబ్బులకు అడ్డంగా హారం వేసినట్టు ఎగిరే కొంగలబారులు పలకరిస్తాయి. ఆ మంద్రాక్రాంతశ్లోకాల్లో ఆయన చెప్పిన దారుల్లో మేఘంతో పాటే మనమూ ప్రయాణిస్తాం. పూర్వమేఘం పూర్తయ్యేసరికి మనం కూడా హిమాలయాలెక్కినట్టుగా అనుభూతి చెందుతాం.

కాళిదాసు పూర్వమేఘంలో 8-51 దాకా వర్ణించిన దారిని ఇప్పుడు పరిశోధకులు పటం మీద గుర్తించగలిగారు. అది పూర్తిగా మధ్యభారతదేశం. సంగం కవిత్వం ఏ అంచులదాకా వచ్చి ఆగిపోయిందో, అక్కడ ప్రాకృత కవిత్వం మొదలయ్యింది. గాథాసప్తశతి కవులు ఏ వింధ్యపర్వతశ్రేణులదాకా సంచరించారో, మేఘసందేశం అక్కడ మొదలవుతుంది. పూర్వమేఘం పూర్తయ్యేటప్పటికీ మనం హిమాలయాల దాకా ప్రయాణిస్తాం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది రామాయణంలో రాముడు గంగానదిని దాటి దక్షిణ మార్గంలో ప్రయాణించాడు ఇప్పుడు తిరిగి కాళిదాసు దక్షిణం వైపు నుంచి మేఘాన్ని ఉత్తరం వైపు నడిపిస్తున్నాడు. కనఖల పర్వతం దగ్గర మేఘం గంగానదిని దాటడంతో వాల్మీకి మొదలుపెట్టిన ప్రయాణ వలయాన్ని కాళిదాసు పూర్తిచేసాడనిపిస్తుంది.

రామగిరి

మేఘాన్ని యక్షుడు రామగిరిలో చూసాడు. ఆ ఊరుని ఇప్పుడు మహారాష్ట్రలోని రామ్ టెక్ గా గుర్తిస్తున్నారు. అక్కడ కొండతో గోరాడుతున్న ఏనుగులాగా (1:2) మేఘం యక్షుడికి కనిపించింది. ప్రయాణం మొదలుపెట్టమని అతడు ఆ మేఘానికి చెప్పినప్పుడు, ఆ దారి ఎంత శుభప్రదంగా ఉంటుందో ఇలా చెప్తున్నాడు:

మందం మందం నుదతి పవనాశ్చానుకూలో యథా త్వామ్
వామశ్చాయాం నదతి మధురం చాతకస్తే సగంధః
గర్భాధానక్షణ పరిచయాన్నూనమాబద్ధమాలాః
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః (1:9)

(మేఘుడా! గాలి నెమ్మది, నెమ్మదిగా నీకు అనుకూలంగా వీస్తున్నది. బంధువులాగా చాతకపక్షి నీకు ఎడమవైపు మధురంగా ఆలపిస్తున్నది. తాము జతకూడే క్షణం ఆసన్నమైందనే సంతోషంతో కొక్కెరలు ఆకాశంలో హారంలాగా పయనిస్తో కన్నులపండుగగా ఉన్న నిన్ను సంతోషంగా అనుసరించబోతున్నాయి)

నిజానికి పదమూడో శ్లోకం నుంచి దారి చెప్పడం మొదలవుతున్నది. పధ్నాలుగవ శ్లోకం మేఘప్రయాణానికి take off అనవచ్చు. చూడండి:

అద్రేః శృంగం హరతి పవనః కిం స్విదిత్యున్ముఖీ
ర్దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధసిద్ధాంగనాభిః
స్థానాదస్మాత్సరసనిచులాదుత్పతోదజ్ఞ్ముఖః ఖం
దిజ్ఞ్నాగానాం పథి పరిహరన్ స్థూలహస్తావలేపాన్ (1:14)

(నువ్వు ఎగరడానికి సిద్ధపడ్డప్పుడు దారిలో సిద్ధవనితలు నిన్ను చూసి గాలికి ఏదైనా కొండ కొట్టుకొస్తోందా అని ఆశ్చర్యంతో చూస్తారు. ఆ బెదురుచూపులు చూసి నీకు ముచ్చటనిపిస్తుంది. పచ్చటి ఈ అడవులమీంచి నువ్వు ఉత్తరదిక్కుగా ప్రయాణమైనప్పుడు దిగ్గజాలు తొండాలతో నిన్ను అడ్డుకుంటాయేమో, వాటిని పక్కకు నెట్టుకుంటూ ఎగిరిపో)

పూర్వమేఘంలోని శ్లోకాలన్నీ ఎత్తిరాయదగ్గవే. శతాబ్దాలుగా భావుకులు ఆ శ్లోకాలు పునఃపునః పఠిస్తో అప్రమేయమైన ఆనందానికి లోనవుతూనే ఉన్నారు. అసలు అన్నిటికన్నా ముందు ఆ సంస్కృతం, ఆ సునాదమాధుర్యం- వాటికోసమేనా ఆ శ్లోకాలు పదే పదే చదువుకోదగ్గవి. ఇక్కడ మళ్లా అన్నీ ఉదాహరించలేనుగాని, కొన్ని ఉదాహరించకుండా ఉండటం కూడా కష్టమే. అందులో ఈ శ్లోకం కూడా ఒకటి.

రత్నచ్ఛాయావ్యతికర ఇవ ప్రేక్ష్యమేతత్పురస్తా
ద్వల్మీకాగ్రాత్ప్రభవతి ధనుఃఖండమాఖండలస్య
యేన శ్యామం వపురతితరాం కాన్తిమాపత్స్యతే తే
బర్హేణేవ స్ఫురితరచనా గోపవేషస్య విష్ణోః (1:15)

(ఎదురుగుండా పుట్టలోంచి పద్మరాగమణికాంతులు కుప్పపోసినట్టు ఇంద్రధనుస్సు పుడుతున్నది. ఆ రంగురంగుల ఇంద్రచాపంతో నిన్ను కలిపి చూసినప్పుడు గోపబాలకుడైన కృష్ణుడి శ్యామదేహం పైన మెరిసే నెమలిఫించంలాగా కనిపిస్తున్నది)

పుట్టలోంచి ప్రభవిస్తున్నట్టు కనిపిస్తున్న ఈ ఇంద్రధనుస్సుకి మోహపడనివాళ్లెవ్వరు? చివరికి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆముక్తమాల్యదలో (4:89) ‘పుట్టవెడలి నభోభిత్తిబట్టు శక్రకార్ముకం’ మీద ఒక పద్యం రాయకుండా ఉండలేకపోయాడు.

మాలాక్షేత్రం

రామగిరినుంచి ప్రయాణం మొదలుపెట్టాక మొదటి మజిలీగా మాలాదేశాన్ని చెప్తున్నాడు. మాలాప్రాంతం అంటే కొండ ప్రాంతమని మల్లినాథ సూరివ్యాఖ్యానం. ఆయన ఆ మాట చెప్పకపోయినా ఆ శ్లోకం చదవగానే నాకు మా ఊరే గుర్తొస్తుంది. ఇక్కణ్ణుంచి మేఘం కాళిదాసు స్వదేశంలో అడుగుపెట్టబోతున్నది. మేఘం కనబడగానే పల్లెల్లో, పొలాల్లో పనిచేసుకుంటున్న ఆడపడుచులు తలపైకెత్తి చూడటం సహజం. ఆ దృశ్యమే వర్ణిస్తున్నాడు ఇక్కడ. చూడండి:

త్వయ్యాయత్తం కృషిఫలమితి భ్రూవికారానభిజ్ఞైః
ప్రీతిస్నిగ్ధైర్జనపద వధూలోచనైః పీయమానః
సద్యః సీరోత్కషణసురభి క్షేత్రమారుహ్యమాలం
కించిత్పశ్చాద్వ్రజ లఘుగతి ర్భూయ ఏవోత్తరేణ (1: 16)

(పైర్లు పండటం, వ్యవసాయం నీ వల్లనే కాబట్టి ఆ పల్లెల్లో ఉండే స్త్రీలు, కల్మషం తెలియనివాళ్ళు, ప్రీతితోటీ, సంతోషంతోటీ నిన్ను తిలకిస్తారు. అప్పుడప్పుడే నాగళ్ళు దుక్కిదున్నుతుండే ఆ చేలల్లో మట్టివాసన పరిమళించేట్టుగా నువ్వు అక్కడ వర్షించి, ఆ తర్వాత, కొద్దిగా పడమటి దిక్కు తిరిగి మళ్ళా వేగంగా ఉత్తరానికి ప్రయాణించు)

కవిత్వం భావనకన్నా కూడా ముందు భాష. ఆ ప్రీతిస్నిగ్ధ జనపద వధూలోచనాలు అనే మాటలో ఉన్న తీపిదనాన్ని మనం ముందు ఆస్వాదించగలగాలి, ఆ దృశ్యాన్ని visualise చేసుకోడం ఆ తర్వాత.

ఆమ్రకూటం

ఆ తర్వాత మూడు శ్లోకాలు ఆమ్రకూటం గురించిన వర్ణన. ఆమ్రకూటమంటే మామిడి చెట్ల కొండ. వింధ్య, సాత్పురా పర్వతాలు కలిసేచోట అమరకంఠకం నర్మదా నది పుట్టిన చోటు. ఆ అడవుల మీంచీ, ఆ కొండల మీంచి ప్రయాణించమని యక్షుడు మేఘాన్ని కోరుకుంటున్నాడు. నిజానికి మేఘం తొందరగా ప్రయాణించాలంటే రామగిరి నుంచి నేరుగా ఉజ్జయిని వెళ్లిపోవచ్చు. కానీ అప్పటికే ఎనిమిది నెలలుగా విరహవ్యథలో మగ్గిపోతున్న యక్షుడు మేఘాన్ని మామూలుదారి కన్నా మరింత చుట్టుదారిలో, మరింత దూరం ప్రయాణించమని ఎందుకు అడుగుతున్నట్టు?

7-7-2023

4 Replies to “ఆషాఢ మేఘం-20”

  1. మేఘంతో పాటే తేలుతూ, మీ మాటల్లో తడుస్తూ… ధన్యవాదాలు. చిన్నప్పుడు మా పెదనాన్న గారి దగ్గర చదువుకున్న మేఘ కావ్యం. మళ్ళీ మీ ద్వారా ఆస్వాదిస్తూ…

  2. మూడు నాలుగు రోజులుగా మీరు రాస్తున్న మేఘసందేశ వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నవి. పరిశీలనాత్మకంగా విమర్శనాత్మకంగా ఆత్మీయంగా ఉన్న మీ వాక్యాలు ఆషాడ మేఘం కురిపిస్తున్న వానకు తడుస్తున్న మధుర అనుభూతికి లోను చేస్తున్నవి.

Leave a Reply

%d bloggers like this: