ఆషాఢ మేఘం-19

మేఘసందేశం రెండు సర్గల కావ్యం. ప్రక్షిప్తాలని చెప్పే శ్లోకాలతో కలిసి మొత్తం 124, కొన్ని లెక్కల్లో 126 శ్లోకాలున్నాయి. అందులో పూర్వమేఘంలో 67, ఉత్తరమేఘంలో 57 ఉన్నాయి. ఆ శ్లోకాలు మందాక్రాంత అనే ఛందస్సులో రాయబడ్డవి. మందాక్రాంత అంటే నెమ్మదిగా ఆవరించేది అని అర్థం. ఒక మేఘంతో చేస్తున్న సంభాషణ కాబట్టి, ఆ మేఘం ఆగీ, ఆగీ ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి ఆ ఛందస్సులో కావ్యం రాయడంలోని ఔచిత్యాన్ని యుగాలుగా రసజ్ఞులు కొనియాడుతూనే ఉన్నారు.

కావ్యంలో కథ చాలా సరళం. ఉత్తరాన హిమాలయాల్లో ఉన్న అలకాపురి కుబేరుడి రాజధాని. ఆయన పరివారంలో ఒక యక్షుడు పనిలో అలసత్వం చూపించినందుకు కుబేరుడు అతడికి ఏడాదిపాటు ప్రవాసం శిక్షగా విధించాడు. ఆ యక్షుడు వింధ్యపర్వతాల వరసలో ఉన్న రామగిరి అనే కొండమీద ప్రవాసిగా కాలం గడుపుతో ఉన్నాడు. ఈలోపు ఆషాఢ ప్రథమ దివసం నాడు అతడికి మేఘం కనబడింది. ఆ ఋతుపవన మేఘం హిమాలయాల దాకా ప్రయాణిస్తుందని అతడికి తెలుసు. అందుకని ఆ మేఘం ద్వారా తన భార్యకు ప్రేమసందేశం పంపాలనుకున్నాడు. ఒక ప్రవాసిగా తానిక్కడ ఆమెనే తలుచుకుంటూ ఉన్నానని ఆమెకి చెప్పమని కోరుకున్నాడు. తన శాపం తీరడానికి మరొక నాలుగు నెలలు మాత్రమే వ్యవధి ఉందనీ, వర్షాకాలం గడిచి శరత్కాలం మొదలవగానే తాను తిరిగి అలకాపురికి చేరుకుంటాననీ, అప్పుడు ఆ వెన్నెలరాత్రుల్లో తామిద్దరూ తిరిగి సంతోషంగా గడపగలరని తన భార్యకు తన సందేశంగా చెప్పమని ఆ మేఘాన్ని అభ్యర్థించాడు.

కథ ఇంతే కాబట్టి, ఈ మొత్తం కావ్యం అయిదారు శ్లోకాల్లో పూర్తిచేయవచ్చు. నిజానికి యక్షుడు తన భార్యకి చెప్పాలనుకున్నదంతా రెండవసర్గలో పన్నెండు శ్లోకాల్లో ( 41-53)సరిపోయింది. ఆ సంగతి మేఘం ఆమెకి చెప్పాడన్నది ఒక శ్లోకం, కుబేరుడికి ఆ సంగతి తెలిసి శాపవిముక్తి అనుగ్రహించాడన్నది మరో శ్లోకం, మొత్తం 14 శ్లోకాల్లో కథ పూర్తయిపోయింది. కాని 120 శ్లోకాలు రాయవలసిన పనేమిటి? అదీకాక, టాగోర్ అన్నట్టుగా, తన విరహవార్త చెప్పడానికే అయితే, వానాకాల మేఘం కన్నా వసంత పవనం మరెక్కువ సహకారిగా ఉండేది. తన విరహవ్యథ నాలుగు నెలలముందే తన భార్యకి నివేదించు కోగలిగిఉండేవాడు. ప్రేమవార్తలు మోసుకుపోవడం వసంతపవనానికి కొత్త కూడా కాదు.

కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు. వేసవికి దహించుకుపోయిన భారతీయ ఆకాశం మీద మేఘసందర్శనం ఎటువంటి శుభవార్తనో ఈ ఏడాది మనమంతా ప్రత్యక్షంగా అనుభవించాం. మేఘం రావడం రెండువారాలు ఆలస్యమయ్యేటప్పటికి దేశం దేశమంతా భౌతికంగానూ, మానసికంగానూ కూడా ఎటువంటి ఉక్కపోత అనుభవించిందో మనం కళ్లారా చూసాం. కాబట్టి మేఘాగమనంలో ఒక లోకకల్యాణ శుభవార్త ఉంది. వ్యక్తి వ్యథని లోకం కథతో మేళవించడంలోనే మేఘసందేశం సంపూర్ణంగా సఫలమయింది.

బయటిప్రపంచంలోనూ, ఊహల్లోనూ కూడా మేఘం తేగల సంతోషం మామూలుది కాదు. అందుకనే ‘సంతప్తానాం త్వమహి శరణమ్’ (దహించుకుపోతున్నవాళ్ళకి నువ్వే దిక్కు) (1-7) అన్నాడు. సంగం కవిత్వంలోనూ, గాథాసప్తశతిలోనూ, చివరికి రామాయణం లోనూ కూడా మేఘసందర్శనం కలిగిస్తున్న సంతోషవిచారాలు పూర్తిగా వ్యక్తిగతాలు. అందులో జాతిసంతోషానికి చోటులేదు. ‘ముల్లైప్పాట్టు’లో వర్షాకాలం రాగానే యుద్ధం విరమిస్తారనే సూచన ఉందిగాని, అది పరోక్షం. ఒక విధంగా ఋణాత్మక సూచన కూడా. అలాకాక మేఘంకోసం సమస్త పృథ్వి దప్పి పడి ఉందనీ, పశుపక్ష్యాదులు, అడవులు, కొండలు, నదులు, స్త్రీపురుషులు దేశమంతా ఎదురుచూస్తున్నారనీ చెప్పడంవల్లనే మేఘసందేశం ఆ కావ్యాలకన్నా ఎన్నో అడుగులు ముందుకు వేసింది. సరిగ్గా ఆ కారణంవల్లనే జాతికి ఒక పునఃపునః పఠనీయ కావ్యంగా నిలబడింది.

అయితే ఆయా మూల కవులనుంచీ, మూల సంప్రదాయాలనుంచీ కాళిదాసు సంగ్రహించింది తక్కువేమీ కాదు. మేఘమెలా అయితే సముద్రజలాల్ని పీల్చుకుని మరొకచోట వర్షిస్తుందో అలాగే కాళిదాసు కూడా రామాయణం, ప్రాకృత, సంగం కవిత్వాలనే సముద్రాలనుంచి కొల్లగొట్టుకోవలసినంత కొల్లగొట్టుకున్నాడు. మొదటిది, రామాయణంలో కిష్కింధాకాండలోని వర్షర్తు వర్ణనలో ‘సముద్వహంతం, సలిలాతిభారం, బలాకినో వారిధరా నదన్తః’ అనే శ్లోకం మేఘసందేశానికి స్ఫూర్తి అన్న విషయం ఇంతకు ముందే చెప్పాను. ‘విశ్రమ్య, విశ్రమ్య పునః ప్రయాన్తి’ అనే మాటలోంచే కాళిదాసుకి కావ్యవస్తువు దొరికింది. ఆగీఅగి వెళ్ళే మేఘాన్ని ఆయన నేరుగా వెళ్లనివ్వకుండా అడవుల్లోంచి తిప్పి, తన దారికి కొద్దిగా పక్కగా ఉన్నా కూడా ఉజ్జయిని మీంచి నడిపించాడు. పైగా ఇలా (1-13) అంటున్నాడు:

మార్గం తావచ్ఛృణు కథయస్త్వత్ప్రయాణానురూపం
సందేశం మే తదను జలదశ్రోష్యసి శ్రోత్రపేయం
ఖిన్నః ఖిన్నః శిఖరిషు పదం న్యస్య గన్తాసి యత్ర
క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చోపభుజ్య

తాను చెప్పే దారిలో వెళ్ళడం వల్ల మామూలు ప్రయాణం కన్నా కొద్దిగా ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుందనీ, అందుకనీ, అక్కడక్కడ చిన్నపాటినదుల్లోంచి మళ్లా నీళ్ళు భుజించి తన ప్రయాణానికి ఇంధనం సమకూర్చుకొమ్మన్నాడు. ఇది వాల్మీకికి కొనసాగింపు. అలాగే తన శాపమికా నాలుగునెలలు ఉందని చెప్పడం, శరత్కాలం రాగానే తామిద్దరూ తిరిగి ఒక్కటికాగలరని యక్షుడు ఊహించడం కూడా రాముణ్ణి గుర్తుకు తెచ్చే అంశాలు. ఇక మేఘంతో తన సహచరికి సందేశం పంపడమనే ఊహ వెనక హనుమంతుడితో సీతకు సందేశం పంపడం స్ఫూర్తి అని కాళిదాసు కూడా దాచలేదు. సీతాదేవి హనుమంతుణ్ణి చూసి గౌరవించినట్లుగా నా భార్య నీ సందేశాన్ని గౌరవిస్తుందని యక్షుడితో (2-39) చెప్పిస్తాడు కూడా.

నాయికా నాయకులకు పేర్లు పెట్టకుండానే ఒక కావ్యం రాయడమనే ఊహ చాలా కొత్తది. కాని దీని వెనక అకం సంప్రదాయం లేదని ఎలా అనగలం? అకం సంప్రదాయంలో నాయికా నాయకులకు పేర్లు ఉండవని మనం చెప్పుకున్నాం. కాళిదాసుకి సంగం కవిత్వం గురించీ, సంగం సంప్రదాయాలగురించీ ఎంతో కొంత తెలిసి ఉండవచ్చుననే ఇటీవలి పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఒక్క మేఘసందేశంలోనే కాదు, కుమారసంభవంలోనూ, రఘువంశంలోనూ కుమారస్వామి ఇతివృత్తానికి కాళిదాసు ఇచ్చిన ప్రాధాన్యత, కుమారస్వామి జన్మవృత్తాంతాన్ని కాళిదాసు చెప్పిన పద్ధతి ఆయనకి తమిళ మురుగన్ సంప్రదాయాలతో ఘనిష్టమైన పరిచయం ఉన్నట్లుగా తెలియచేస్తాయని మరీ ఇటీవలి విమర్శకులు చెప్తున్నారు. మరింత వివరంగా చూడాలనుకుంటే, పి.మరుదనాయగం రాసిన Murukan:From Paripatal to Kalidasa’s Kumarasambhavam (Paripadal, Central Institute of Classical Tamil, 2022) అనే వ్యాసం చూడవచ్చు.

ఇక కాళిదాసు మేఘసందేశంలో గాథాసప్తశతి ప్రభావం మీద తిరుమల రామచంద్రగారు రాసిన అద్భుతమైన వ్యాసం ఎలానూ ఉండనే ఉంది. ఆయన 1975 లో రాసిన ఆ వ్యాసాన్ని ఆసక్తి ఉన్నవాళ్ళు ‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ (ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ శాఖ ప్రచురణ, 1983) లో చూడవచ్చు. అందులో రామచంద్రగారు ‘ఆశాబంధం’, ‘బలాకపంక్తి’, ‘దీపశిఖ’, ‘ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః’ వంటివాటిని దాదాపు పాతిక పదబంధాలదాకా కాళిదాసు గాథాసప్తశతినుండి నేరుగా సంగ్రహించాడని వివరంగా నిరూపించారు.

ఇవి కాక, వానాకాలపు విరహాన్ని కావ్యవస్తువుగా స్వీకరించాలనుకున్నప్పుడు అది భార్యాభర్తల మధ్య విరహమే అయి ఉండాలన్న సంప్రదాయాన్ని వాల్మీకి, సంగం కవులు, ప్రాకృత కవులూ పాటించినట్టే కాళిదాసు కూడా పాటించాడు. కాని ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య విరహానికి యుద్ధమో, ప్రవాసమో, లేదా పనిపాటలో కారణమై ఉండాలని చెప్పుకున్నాం. ఈ కారణాలేవీ కాకుండా యక్షుడు శాపగ్రస్తుడు కావడం వల్ల అతడికి తన సహచరితో వియోగం కలిగిందని చెప్తాడు. మామూలు లౌకిక కారణాలు కాకుండా కవి ఇక్కడ ఒక శాపాన్ని ఎందుకు కారణంగా తీసుకున్నాడు? అంటే అందుకు కాళిదాసు తక్కిన రచనలు కూడా చూడాలి. విక్రమోర్వశీయంలో ప్రణయం మూడు సార్లు శాపానికి గురయ్యింది. శాకుంతలంలో శాపం నిర్వహించిన పాత్ర మనకు తెలిసిందే. కాళిదాసు రచనల్లో శాపం ఎందుకు ముఖ్యపాత్ర వహించదన్నది దానికదే ప్రత్యేకంగా అధ్యయనం చెయ్యవలసిన విషయం.

మేఘసందేశం నిర్మాణం చూద్దాం. అందులో మొదటి సర్గ అంతా మేఘప్రయాణం. మేఘం అలకాపురిచేరుకున్నాక, ఆ అలకాపురి వర్ణన, అక్కడ తనకోసం బెంగపెట్టుకున్న తన భార్య వర్ణన, తాను ఆమెకి చెప్పాలనుకున్న సందేశం, మంగళప్రదమైన ముగింపులు రెండో సర్గలో ఉన్నాయి. మొదటి సర్గ భువి, రెండవ సర్గ దివి. మొదటిసర్గలో ఋతువులున్నాయి, ఋతువును బట్టి మారే సుఖదుఃఖాలున్నాయి, ఆయావేళల్లో పూచే పువ్వులున్నాయి, పాడే పక్షులున్నాయి. రెండవ సర్గలో కనిపించేది ఋతువులకు అతీతమైన కాలం, దేశం. అక్కడ ఎప్పుడూ వెన్నెల కాస్తుంది అంటాడు (2-3) కవి.

యత్రోన్మత్త భ్రమరముఖరాః పాదపా నిత్యపుష్పా
హంసశ్రేణి రచితరశనా నిత్యపద్మా నళిన్యః
కేకోత్కంఠా భవనశిఖినో నిత్యభాస్వత్కలాపా
నిత్యజ్యోత్స్నాః ప్రతిహతతమోవృత్తి రమ్యాః ప్రదోషాః

(అక్కడ చెట్లు నిత్యపుష్పాలతో వికసించి ఉంటాయి. ఉన్మత్త భ్రమరాలు ఆ పూలచుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. సరసుల్లో ఎప్పుడూ తామరలు పూచి ఉంటాయి, హంసలు తేలియాడుతూ ఉంటాయి. ఇళ్ళల్లో నెమళ్ళు క్రేంకారాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ చీకటి ఉండదు, ఎప్పుడూ వెన్నెల కురుస్తూంటుంది కాబట్టి ఆ రాత్రులు రమ్యంగా ఉంటాయి)

మొదటిసర్గ మొత్తం స్వభావోక్తి ప్రధానం. రెండవసర్గ ఉత్ప్రేక్ష. మొదటి సర్గ మనుషులు నడిచే దారి. రెండవ సర్గ అనిమిషులు మాత్రమే చేరగల తావు. మొదటిది ప్రాకృతకవులు చూసినదేశం. రెండవది సంస్కృతకవులు ఊహించగలిగిన లోకం. అయినప్పటికీ మేఘసందేశ లోకప్రియత్వం మొదటిసర్గమీదనే ఎక్కువ ఆధారపడి ఉందనేది కాదనలేని సత్యం. ఎందుకంటే, రెండవసర్గలోని ఊహలు మరేకవికైనా తట్టగలవు, అటువంటి శ్లోకాలు మరే సంస్కృత కవికైనా సాధ్యమయ్యేవే.

మేఘసందేశం రాయకముందు కాళిదాసు వర్షర్తువర్ణన చేయకపోలేదు. ఆయన తొలికావ్యంగా చెప్పే ఋతుసంహారంలో రెండవ సర్గ వసంతఋతు వర్ణన. అందులో 28 శ్లోకాల్లో ఆయన వర్షాన్ని వర్ణించాడు. కాని ఆ వర్ణన చదువుతుంటే వాల్మీకి ప్రభావం నుంచి ఇంకా బయటపడలేని యువకవినే కనిపిస్తాడు. కాని ఎక్కడో తన సొంతగొంతు కూడా పీలగా వినిపిస్తుండటం మనం గుర్తుపట్టకపోము. ఈ శ్లోకాలు చూడండి:

విపాణ్డురం, కీట, రజస్తృణాన్వితం
భుజంగవద్వక్రగతిప్రసర్పితం
ససాధ్యసైర్భేకకులైర్నిరీక్షితం
ప్రయాతి నిమ్నాభిముఖం నవోదకం (2-13)

(పాలిపోయిన రంగుగల పురుగులు, దుమ్మూ, గడ్డీ నిండి, పాములాగా వంకర నడక నడుస్తూ, కప్పలు చూస్తుండగా, కొత్త నీరు పల్లానికి ప్రవహిస్తూ ఉంది)

కదంబ సర్జార్జున కేతకీ వనం
వికంపయం స్తత్కుసుమాధివాసితః
సశీకరాంభోధర సంగశీతలః
సమీరణః కం న కరోతి సోత్సుకమ్ (2-17)

(కడిమిచెట్లు, మద్దిచెట్లు, తెల్లమద్దిచెట్లు, మొగలిపొదల్ని రాసుకుంటూ ఆ పూలసుగంధాన్ని తనలో నింపుకుంటూ, వర్షాకాలపు నీటితుంపరలతో చల్లనైన గాలికి ఉత్కంఠభరితులు కానివారు ఎవరుంటారు?)

సరిగ్గా ఇక్కడే మేఘసందేశం మొదలవుతుందని చెప్పవచ్చు. ఈ శ్లోకం (మేఘ. 1-3) చూడండి:

తస్యస్థిత్వా కథమపి పురః కౌతుకాధానహేతో
రంతర్బాష్పశ్చిరమనుచరో రాజరాజస్య దద్ధ్యౌ
మేఘాలోకే భవతి సుఖినోప్యన్యథావృత్తిచేతః
కంఠాశ్లేష ప్రణయిని జనే కిం పునర్దూరసంస్థే

(తన ప్రియురాలి కౌగిలిని గుర్తుకు తెస్తున్న ఆ మేఘం ఎదట ఆ యక్షుడు తన కన్నీళ్ళను గుడ్లలో కుక్కుకుంటూ అక్కడే నిలబడి ఉన్నాడు. ఎందుకంటే, మామూలుగానే మేఘాన్ని చూడటంలో మనసుకు సంతోషం కలుగుతుంది. ఇక తాను ఏ ప్రియురాలి కౌగిలిని కోరుకుంటున్నాడో ఆమె దగ్గరలేనప్పుడు చెప్పగలిగేదేముంది?)

6-7-2023

5 Replies to “ఆషాఢ మేఘం-19”

  1. కంఠాశ్లేష ప్రణయినీ జనే…. ఈ ఇంపార్టెంట్ అయిన కాంటెస్ట్ నేను రాసిన చాలా పరీక్షల్లో ఎదురయింది. బట్టి పట్టిన రెండు పేజీల వ్యాఖ్యానం రాసేసేవాడిని.
    కానీ ఇప్పుడు మాత్రమే
    సుఖినో మమ చేతః

  2. మేఘాన్ని చూడటంలో మనసుకు కలుగు సంతోషం

  3. సర్ నమస్కారం ;; వీలుంటే ఇది వినండి, మేఘసందేశం ,,మ్యూజిక్ టుడే వాళ్ళు1996 లో హరిహరన్, కవితా కృష్ణమూర్తి ల చేత పాడించేరు .. అర్ధం కాకపోయినా పాతికేళ్లుగా వింటున్నాను ,, https://youtu.be/LdAOFaOPFGo

Leave a Reply

%d bloggers like this: