
శ్రీరామచంద్రుడుకి వశిష్ట విశ్వామిత్రులు దారి ఇచ్చినట్టు కాళిదాసు రాగానే వ్యాసవాల్మీకులు పక్కకి జరిగారు అన్నట్టుగా విశ్వనాథ ఒకచోట రాసినట్టు గుర్తు. ఆ మాటలో అసత్యమేమీ లేదు. సంస్కృత కావ్యసాహిత్యమనే ఆకాశాన్ని కాళిదాసు ప్రభావం ఆక్రమించుకున్నట్టుగా మరే కవీ ఆక్రమించుకోలేకపోయాడు. ఆషాఢమేఘాన్నే తీసుకోండి. వెంటనే కాళిదాసు గుర్తొస్తాడు. మేఘదూతకావ్యం గుర్తొస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాల్మీకి, సంగం కవులు, ప్రాకృత కవులూ- ఎవరూ మనకి గుర్తు రారు.
ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, సంస్కృత, ప్రాకృత, తమిళ కావ్యసంప్రదాయాల్ని కాళిదాసు అద్భుతంగా మేళవించుకున్నాడు. మన కాలంలో శ్రీశ్రీని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆయన మహాప్రస్థానంలో ప్రాచీన ఆధునిక సంప్రదాయాల్ని ప్రతిభావంతంగా మేళవించుకోవడం మనకు తెలుసు. తనకాలంలో కాళిదాసు ఆ పనే చేసాడు. ఒక విధంగా చెప్పాలంటే, ఆయన ఉత్తరదక్షిణ భారతదేశాల మధ్య ఒక రససేతువు నిర్మించాడు. అది ఆనాటి అవసరం. మన కాలంలో ప్రాక్పశ్చిమాల మధ్య టాగోర్ అలాంటి రససేతువు నిర్మించాడు. అందుకనే ఆయన తనని కాళిదాసుతో పోల్చుకోవడంలో ఆశ్చర్యం లేదు.
ఈ కారణం వరకూ అందరికీ తెలిసిందే. కాని ప్రాకృత, సంగం సాహిత్యాల్ని మరిపించేంతగా సంస్కృత సాహిత్యం, కాళిదాసు ప్రభావం విస్తరించడానికి మరో కారణం కూడా ఉంది. అదేమంటే, ఈ దేశంలో మొన్నమొన్నటిదాకా గురుకులాల్లోగాని లేదా ఇంటిదగ్గరగానీ, విద్యాభ్యాసం మొదలుపెట్టినప్పుడు, తండ్రినో, గురువునో విద్యార్థితో మేఘసందేశ పఠనం మొదలుపెట్టించేవారు. ఆ కావ్యం మొత్తంగాని లేదా ఏదో ఒక సర్గగాని స్వయంగా అన్వయక్రమం, ప్రతిపదార్థ తాత్పర్యంతో పాటు భావార్థం, విశేషార్థాలు కూడా బోధించేవారు. ఎనిమిది తొమ్మిదేళ్ళ లేతవయసులో ఆ విద్యార్థికి నూరిపోసిన ఆ కావ్యపాఠం అతడి రక్తమాంసాల్లోకీ, ఆత్మలోకీ ఇంకి జీవితకాలం అతణ్ణి వెన్నంటే ఉండేది. ఇక తర్వాత కాలంలో అతడు ఒక చెట్టుని చూసినా, కొండని చూసినా, పూలని చూసినా, పక్షిని చూసినా, మబ్బుని చూసినా, మెరుపుని చూసినా, తాను చిన్నప్పుడు వల్లెవేసిన ఆ శ్లోకాలే అతడి మనోవీథిలో ప్రత్యక్షమయ్యేవి. ఒక విధంగా చెప్పాలంటే అతడు తన తదనంతర జీవితమంతా ఆ కావ్యసులోచనాలతోటే చూసేవాడంటే అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు ప్రాచీనా చీనాలో కూడా ఇటువంటి సంప్రదాయముండేది. ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలకు నిర్వహించే రాతపరీక్షలకు పూర్వకవుల కావ్యాలే పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. కాబట్టి ప్రభుత్వోద్యోగం కోరుకునే ప్రతి ఒక్క యువకుడూ ఆ కావ్యాల్ని హృదయదఘ్నంగా అధ్యయనం చేసేవాడు. ఆ తర్వాత అతడికి ఉద్యోగం లభించాక ఎక్కడో దూరప్రాంతాల్లో పనిచేయవలసి వచ్చేది. తన కుటుంబానికీ, తన గ్రమానికీ, తనవాళ్లకీ దూరంగా ఉద్యోగబాధ్యతల మీద దూరప్రాంతంలో నివసించవలసి వచ్చినప్పుడు అతడికి తాను చదువుకున్న పూర్వకవుల కవిత్వమే తోడుగా ఉండేది. తన ఒంటరి సమయాల్లో, ఇంటిమీద బెంగవల్ల దిగులు కమ్మినవేళల్లో పూర్వకవులే అతణ్ణి ఓదార్చేవారు. కాబట్టి తన గుండె బరువు దించుకోడానికి అతడు కూడా కవిత్వం రాసేవాడు. మరొకవైపు ఆ పోటీపరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా పోయిన యువకులకి కూడా ఆ పూర్వకవులే ఓదార్పుగా ఉండేవారు. వ్యవస్థ పట్ల, తన విధివిలాసం పట్ల ఆ యువకులు తమ అసంతృప్తిని ప్రకటించడానికి కూడా మళ్ళా కవిత్వాన్నే ఆశ్రయించేవారు. ఇలా తరతరాలుగా విద్యావంతులైన యువతీయువకులు తమ జీవితాన్నీ, తాము జీవితాన్ని అనుభవించే పద్ధతినీ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే పద్ధతినీ కవిత్వాన్ని బట్టే తీర్చిదిద్దుకునేవారు.
దాదాపుగా ఈస్టిండియా కంపెనీ వచ్చినదాకా కూడా భారతదేశంలో విద్యావంతుల భావనాసరళిని, మనోమయప్రపంచాన్ని కాళిదాసు ఈ విధంగానే ప్రభావితం చేసాడు. ఇటువంటి అవకాశం ప్రాకృత కవులకి లభించలేదు. అందులో ఉన్న కవిత్వమంతా మోటు శృంగారమనే విధంగా వ్యాఖ్యాతలు రాస్తూ వచ్చినందువల్ల ఆ కవిత్వాన్ని స్త్రీలకీ, పిల్లలకీ అందుబాటులో లేకుండా చేసారు. కాని ముఖ్యంగా గాథాసప్తశతి కవిత్వం ‘స్వభావరమణీయమ’ని గుర్తుపెట్టుకోకపోవడం వల్ల వచ్చిన దుర్దశ ఇది. ఒకవేళ వేమనశతకంలాగా, సుమతీశతకంలాగా, గాథాసప్తశతిలోని స్వభావరమణీయ గాథల్ని ఎవరేనా ఒక నూరింటిని ఎంపికచేసి ఒక బాలరామాయణంలాగా, ఒక మేఘసందేశంలాగా పిల్లల్తో చదివించి ఉంటే, మన కావ్యసంప్రదాయం మరోవిధంగా ఉండి ఉండేది. ముఖ్యంగా, తెలుగు కవిత్వం రాజరంజకంగా ఉండటానికి బదులు ప్రజారంజకంగా ఉండి ఉండేది.
పోనీ తమిళదేశంలోనైనా సంగం కవిత్వం ఇలా పాఠ్యాంశంగా మారిందా అంటే అక్కడి పరిస్థితిలో కూడా ఏమీ తేడా లేదు. నిజానికి గత శతాబ్దపు తొలిరోజుల్లో స్వామినాథ్ అయ్యర్ తాళపత్రాల్లోంచి ఆ కవిత్వాన్ని తీసుకొచ్చి ప్రచురించేదాకా అటువంటి కవిత్వమంటూ ఒకటుండేదని అత్యధికసంఖ్యాకులైన తమిళులకే తెలియదు. స్వామినాథ అయ్యర్ ఆత్మకథలోనే ఈ విషయం ఎంతో విశదంగా రాసారు. ఆయన ఒక గురుకులంలో చదువుకున్నాడు. ఆ గురువు ఆయనకు తమిళకవిత్వంలో ముఖ్యప్రక్రియలన్నింటినీ బోధించి తనకి తెలిసిన తమిళ కవిత్వం మొత్తం చెప్పానని చెప్పాడు. తీరా అయ్యర్ని ఒక పెద్దమనిషి జీవకచింతామణి గురించి ప్రశ్నించినప్పుడు ఆ పుస్తకం పేరే తాని విని ఉండలేదని అయ్యర్ చెప్తాడు. అంటే తమిళనాడులోని తిరువావుడురై ఆధీనంలాంటి అత్యున్నత గురుకులం లో కూడా సంగం కవిత్వానికి చోటులేకపోయిందని దాని అర్థం.
ఇక నూటయాభై ఏళ్ల కిందట దేశమంతటా ఆధునిక విద్య మొదలైనప్పుడు ఆయా దేశభాషల్లో ప్రాచీన కవిత్వం నుంచి కొన్ని పద్యాలో, కొంత వచనమో మాత్రమే పాఠ్యగ్రంథాల్లో చేర్చేవారు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇక ఇప్పుడు ఇంగ్లిషు మీడియం విద్య వ్యాపించడం మొదలయ్యాక పిల్లలకి నర్సరీ రైమ్స్ తప్ప మరే కవిత్వంతోనూ పరిచయం ఉండటం లేదు. ఆ పిల్లలు పెరిగిపెద్దవుతున్నప్పుడు వారి సాహిత్య అవసరాలను తీర్చే ఏకైక సాహిత్యం సినిమాపాటలు మాత్రమే కావడంలో ఆశ్చర్యం లేదు.
అందరికన్నా ముందు ఈ దురదృష్టంలో నేనున్నాను. చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది, నా తండ్రి నాకు చిన్నప్పుడే ఎవరేనా గురువుని చూపించి సంస్కృతం నేర్పించి ఉంటే ఎంత బాగుండేది అని. ఆ చిన్నతనంలోనే కాళిదాసుని చదువుకుని ఉంటే, లేదా కబీర్ దోహాలు వల్లెవేయించి ఉంటే, నా జీవితం ఇన్నాళ్ళూ జీవించినదానికన్నా మరింత సౌందర్యరసమయంగా, మరింత నిర్మలంగా ఉండి ఉండేది కదా అనిపిస్తుంది.
సామాజిక అన్యాయాలతోనూ, ఆర్థిక అసమానతలతోనూ కూడుకుని ఉన్న ఈ ప్రపంచంలో కాళిదాసుని చదివి ఏం ప్రయోజనం అనే ప్రశ్న ఉండనే ఉంటుంది. కన్యాశుల్కం నాటకంలో కరటకశాస్త్రి శిష్యుడు కాళిదాసు కవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ గిరీశం దగ్గరికి పోయి నాలుగు ఇంగ్లిషు ముక్కలు నేర్పమని అడుగుదామనుకుంటాడు. (ఆ నాటకంలో కాళిదాసుని ఆ విధంగా ఎద్దేవా చేసినందుకు మా మాష్టారు తన జీవితకాలం పాటు గురజాడని క్షమించలేదు!)
సామాజిక న్యాయం కోసం పోరాడేవారికి కూడా రసహృదయం తప్పని సరి. ఇంకాచెప్పాలంటే వారికే మరింత అవసరం. తోటిమనిషి జీవించే హక్కుకోసం పోరాడేవాళ్ళకన్నా, వారికి న్యాయం జరగడంకోసం అవసరమైతే తాము జైలుకు వెళ్ళడానికి సిద్ధపడేవారికన్నా రసహృదయులెవరుంటారు? అటువంటి వాళ్లకి కాళిదాసు కవిత్వం గొప్ప సాంత్వననిస్తుందే తప్ప ఏ విధంగానూ వారి దారికి అడ్డురాదు. తాంగ్ కాలపు ప్రాచీన చీనా కవి దు-ఫునే ఇందుకు ఉదాహరణ. అతడు తన జీవితమంతా యుద్ధాల్లోనే గడిపాడు. కాని ప్రాచీన చీనా కవిత్వం ఇచ్చిన స్ఫూర్తివల్లనే తాను బతగ్గలుగుతున్నానని పదేపదే చెప్పుకుంటాడు. ప్రాచీన కవిత్వం చదువుకోవడం మనకు మనం ఇచ్చుకోగల రసశిక్షణ. దానివల్ల మనకి ఈ ప్రపంచం ఒక అలవాటుగా, taken for granted గా మారిపోకుండా చూసుకోగలుగుతాం. ఈ ప్రపంచంలో మనం నిర్వహించాలనుకుంటున్న సామాజిక పాత్ర ఏదైనా ఉంటే దాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం.
విద్యలు రెండు రకాలు. ఒకటి బతుకు తెరువుకోసం చదువుకునే చదువు. రెండోది వివేకానందులు చెప్పినట్లుగా man-making education. మనిషిని మనిషిగా రూపొందించే విద్యలో aesthetic education చాలా ముఖ్యమైన విద్య. సౌందర్యదర్శన విద్య అందాం దాన్ని. పిల్లవాడికి ఆ సౌందర్యదర్శనం చేయించడంలో కవిత్వం నిర్వహించే పాత్ర అనన్యసామాన్యం. ఏ భాషలోగాని, ఏ సంస్కృతిలో గాని కవిత్వాన్ని అధ్యయనం చేసిన వ్యక్తుల మూర్తిమత్వమే ప్రత్యేకంగా ఉంటుంది.
మళ్లా కాళిదాసు దగ్గరకి వద్దాం. ఒకప్పుడు ఈ దేశంలో విద్యాభ్యాసం కాళిదాసుతో మొదలుకావడంలోని సంస్కృతి మాటల్లో చెప్పలేనిది. అంతే శ్రద్ధగా ప్రాకృత, సంగం కవిత్వాల్ని కూడా బోధించి ఉండవలసింది, అది వేరే సంగతి. కాని కాళిదాసుని బోధించడంతో ఒకరకంగా, వాల్మీకినీ, గాథాసప్తశతినీ, సంగం కవిత్వాన్నీ కూడా విద్యార్థులకు బోధించినట్టే అయింది. ఎందుకంటే, తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తమ ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.
మేఘసందేశం మహాకావ్యం కాదు. మహాకావ్యమనే మాట రఘువంశం, కుమారసంభవం, బుద్ధచరిత్ర, కిరాతార్జునీయం, శిశుపాల వధ వంటి రచనలకు వర్తించే మాట. కాని ఆ మహాకావ్యాలేవీ కూడా ఈ జాతి భావనాశక్తిని మేఘసందేశంలాగా ప్రభావితం చేయలేకపోయాయి. అందుకు కారణం మేఘసందేశంలోని ఈ సమన్వయశీలలక్షణం. ఒక భావుకుడికి తాను నివసిస్తున్న భౌగోళికప్రదేశానికీ, అతడి ఆంతరంగ భావనాప్రదేశానికీ మధ్య సంగం కవులు సాధించిన సమన్వయంలాంటిదే కాళిదాసు మేఘదూతంలో సాధించగలిగాడు. ప్రపంచాన్ని ఏదో సామాజిక-రాజకీయ ఉద్దేశాల్తో కాకుండా, ఉన్నదున్నట్టుగా, స్వభావరమణీయంగా చూడగలిగే శక్తిని అతడు ప్రాకృత కవిత్వం నుంచి స్వీకరించాడు. కావ్యభాష ప్రాయికంగా లౌకికభాషనే అయినప్పటికీ, సామాన్యభాషను అతిలోకోత్తర భాషగా మార్చగలిగే రసవిద్యను ఆయన వాల్మీకి దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి మేఘసందేశం చదవడమంటే, సంగం అకం కవిత్వాన్ని సంస్కృతంలో చదవడం, గాథాసప్తశతి గ్రామసీమల్ని సంస్కృతంలో చూడటం, రామాయణంలో ఉత్తరం నుంచి దక్షిణానికి నడిచిన దారిలో వాల్మీకి వదిలిపెట్టిన ప్రాంతాల్లో తిరిగి దక్షిణం నుంచి ఉత్తరంవైపు నడవడం.
మేఘసందేశాన్ని నేను ఏ గురువు దగ్గరా చిన్ననాటే అభ్యసించనందువల్ల ఆ పుస్తకం ఎప్పుడు తెరిచినా నాకు కొత్తగా అధ్యయనం చెయ్యదగ్గ పుస్తకం గానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నన్ను నేనొక విద్వాంసుడిగా భావించుకుని ఆ పుస్తకాన్ని పరిచయం చెయ్యలేను. ఒక నిరంతర విద్యార్థిగా ఆ కావ్యం నాలో రేకెత్తించే కొన్ని స్పందనల్ని మాత్రం మీతో పంచుకోగలను.
5-7-2023
కాళిదాసు మేఘసందేశం వెరగున మీ రసరమ్య సందేశం మనసును అలరించేదిగా ఉంది. జీవితాన్ని సౌందర్యదృష్టితో చూడగలిగే విద్య స్ఫూర్తిమంతంగా ఉంటుంది. పిల్లలకు పాఠశాలలు అందించలేని , శాస్త్రీయ సంగీతం, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక శ్రద్ధతో నేర్పించినట్లు మన విలువైన సాహిత్యం కూడా నేర్పిస్తే మనం బాధపడినట్లుగా వాఒళ్లు బాధపడే పని ఉండక పోవచ్చు. మీరు దీనికై ఒక ప్రణాళిక ప్రకారం కొంత సాహిత్యం సంకలనంగా అందించడానికి ఆలోచించండి.
అవును సార్.
ఒకసారి కాళిదాసు వంటి సంస్కృత కవుల పరిచయం అయ్యాక – అందులోనూ మీ వంటి రసజ్ఞుల వలన.. అటువంటి కావ్యాలు.. ఆ సాహిత్యంలోని స్వభావ రమణీయతను, ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న తరువాత.. సంస్కృతం రాక, ఆ కావ్యాలను చదవలేక, ఏదో కోల్పోయామని భావన కలగడం.. దాంతో ప్రతివారు మీలాగానే.. చిన్నప్పుడే నాకు మా నాన్న సంస్కృతం నేర్పించి ఉంటే బాగుంటుందేమో అన్న భావనలోకి రావడం సహజం అనుకుంటాను.
ఏ ఆషాడ మేఘం మీ మనసును కదిలించిందో.. వివిధ భాషలలో పురుడు పోసుకున్న భారతీయ ప్రాచీన భారతీయ సాహిత్య సంగతులను అద్భుతంగా ఆధునీకతతో మేళవించి అందిస్తున్నారు..
వేల వేల నమస్సులు..
ధన్యవాదాలు మేడం
“అందరికన్నా ముందు ఈ దురదృష్టం లో నేనున్నాను”
నేనుకూడా ఉన్నాను.
సంస్కృత భాష అధ్యయనం ఒక సుకృతం.
ఆ సుకృతానికి నోచుకోక పోవడం ఒక దురదృష్టం.
జీవితం లో నేర్చుకున్న దానికన్నా నేర్చుకోవలసింది ఎంతో మిస్ అయ్యామని అనిపిస్తుంది.అది నిజం కూడా.
“స్వాధ్యాయ ” ఎంత మంచిదైనప్పటికీ గురు ముఖతః నేచుకున్నదానికి సాటి రాదు.
ధర్మ సూక్ష్మాలు ఎన్నో విప్పి చెప్పి (వింగడించే) సద్గురువులు లభించడం ఎంత అదృష్టం.
శుభోదయ వందనాలు sir.🙏🙏🙏🙏🙏
అవును మాష్టారూ
తదనంతర జీవితమంతా ఆ కావ్యసులోచనాలతోనే….సాహిత్యప్రభావం
గురించి చక్కగా చెప్పారు సర్.🙏
ధన్యవాదాలు మేడం