ఆషాఢ మేఘం-17

ఆషాఢమాసం ప్రవేశించి ఇప్పటికే రెండువారాలు గడిచిపోయాయి. దక్కన్ పీఠభూమిని దాటి మాళవపీఠభూమికి వెళ్ళాలి. శాపగ్రస్తుడై, రామగిరి కొండలమీద ప్రవాసిగా జీవిస్తున్న యక్షుణ్ణి కలుసుకోవాలి. కాని గాథాసప్తశతిలో కవయిత్రులు నన్నాపేస్తున్నారు. దాదాపు రెండువేల ఏళ్ళ కిందట కవిత్వం చెప్పిన ముగ్ధలూ, ప్రౌఢలూనూ. మమ్మల్ని నీ మిత్రులకి పరిచయం చెయ్యవా అని అడుగుతున్నారు. వాళ్ళ కవితలన్నీ ఆషాడమేఘం మీదనే చెప్పినవి కావు. కాని వారి వినీలకుంతలాలు కారుమబ్బుల్లాగా ఉన్నాయి కాబట్టి నేనింకా అక్కడే తచ్చాడుతో ఉన్నాను. వాళ్ళ గురించి మాట్లాడుకోడం కన్నా ఈ ప్రభాతాన మరేదీ ముఖ్యం కాదు.

గాథాసప్తశతిలో కవితలు ఏడువందలు అని అంటున్నప్పటికీ దాదాపు వెయ్యి కవితలదాకా లభ్యమయ్యాయని రాసాను కదా. కాని అన్ని కవితలకీ ఆ కవుల పేర్లు దొరకలేదు. అది కూడా ప్రాచీన వ్యాఖ్యాగ్రంథాల్ని బట్టి మాత్రమే కవుల పేర్లు మనకి లభ్యమవుతూ ఉన్నాయి. ఆ సంఖ్య కూడా వ్యాఖ్యానానికీ వ్యాఖ్యానానికీ మారిపోతూ ఉంది. రాధాగోవింద బసక్, ఆయన శిష్యబృందం కూర్చిన లెక్క ప్రకారం 292 మంది కవులున్నారు. వాళ్ళల్లో ఆరుగురు మాత్రమే కవయిత్రులు.

ఆ ఆరుగురిలోనూ అనులక్ష్మి అనే ఆమె పేరుమీద ఆరు కవితలు దొరుకుతున్నాయి. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం అనులక్ష్మికాక, అసులబ్ధి (అశ్రులబ్ధి?)అనే ఆమె కూడా ఉంది. అప్పుడు కవయిత్రులు ఏడుగురు అవుతారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు తన సప్తశతీసారం లో ఇద్దరినీ విడివిడిగా లెక్కేసారు. కాని నేను రాధాగోవింద్ బసక్ నే అనుసరిస్తూ అనులక్ష్మి ఒక్కరే అని అనుకుంటూ ఉన్నాను.

అనులక్ష్మి అందమైన పేరు. వేదాల్లో ఆ పేరుగల ఒక ఋషి ఉందని కూడా ఎక్కడో చదివాను. అంటే లక్ష్మికి తగింది అని అర్థం. ఒక కవయిత్రి హృదయాన్ని అర్థం చేసుకోడానికి ఎన్ని కవితలు కావాలి? ఒక్క ‘బందిపోట్లు’ కవిత చాలాదా సావిత్రి గారిని అర్థం చేసుకోడానికి? ‘అనురాగదగ్ధ సమాధి’ కవిత ఒక్కటి చాలదా రేవతీదేవి హృదయం తెలియడానికి? అనులక్ష్మి మనకు చాలా సన్నిహితంగా తెలిసిన మనిషినే అని అనుకోడానికి ఈ ఆరు కవితలూ సరిపోతాయనుకుంటాను.

వీటిల్లో 1,3,6 కవితలు ఆమె passion ని పట్టిస్తున్నాయి. అందులోనూ ఆరో కవిత మామూలు కవిత కాదు. అంత passionate కవిత శాఫో కూడా రాయలేదు. కాని ఆమె కేవలం మోహాసక్త మాత్రమే అనుకోడానికి లేదని 5 వ కవిత హెచ్చరిస్తోంది. మోహం ఎంత ముఖ్యమో సద్భావం అంతకన్నా ముఖ్యమని ఆమెకి తెలుసు. కాబట్టే మరొక స్త్రీ ప్రేమక్లేశాన్ని చూస్తూ ఉండలేక ఆమె ఎవరి మీద మనసుపడిందో వాడి దగ్గరికి పోయి మరీ ఆ వార్త చెప్పింది, తాను రాయబారిని కాదనీ, మంచితనంతో ఉండబట్టలేక ఆ మాటలు చెప్తున్నానని కూడా చెప్పింది. అటువంటి ఒక స్నేహితురాలు తారసపడితే అంతకన్నా కోరుకోవలసింది ఏముంటుంది? ఇక ఆమె కవయిత్రి కూడా అయితే! ఇక నాలుగవ కవిత పూర్తిగా స్వభావరమణీయం. ఆ మర్రిచెట్టుమీద చిలకలు వాలి వున్నాయి. వాటి రెక్కలు ఆకుపచ్చగానూ, ముక్కులు ఎర్రగానూ ఉండటంతో బాటసారులు నీడకోసం ఆ చెట్టుకింద చేరారు. చేరినవాళ్ళు ఊరికే కూచోకుండా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మాట్లాడుతుంటే చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయాయట. ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఎటువంటి భావన! ఇస్మాయిల్ గారు చిలకలు వాలిన చెట్టుని చూసారు. కాని ఈ ప్రాకృత కవయిత్రి చిలకలు వాలినచెట్టుతో పాటు చిలకలు ఎగిరిపోయిన చెట్టుని కూడా చూసింది.

అనులక్ష్మి తర్వాత ఎక్కువ కవితలు దొరుకున్నది రేవా అనే కవయిత్రివి. ఎక్కువ అంటే మరీ ఎక్కువేమీ కాదు, రెండే కవితలు. కానీ చూడండి, ఆ రెండూ చాలవా? ఆమె మనకి జీవితాంతం గుర్తుండిపోడానికి. అందులోనూ రెండో కవిత చదవగానే నాకు చలంగారి మైదానం గుర్తొచ్చింది. అందులో అమీర్ మొదటిసారి తమ ఇంటికి వచ్చినప్పుడు రాజేశ్వరికి అతడి చూపులు వీపున గుచ్చుకున్నట్టుగా అనిపించిందని రాస్తాడు ఆయన. అన్నట్టు రేవా అంటే నర్మదా నది. నర్మదా నది ఒక కవయిత్రిగా మారి చెప్పిన కవితలేమో ఇవి.

ఇక మిగిలిన కవయిత్రులు మాధవి, ప్రహత, శశిప్రభ, వద్ధవాహి- నలుగురివీ ఒక్కొక్క కవిత చొప్పున నాలుగు కవితలు మాత్రమే దొరికాయి. కాని ఒకటవ శతాబ్ది దక్కన్ స్త్రీ హృదయాలెలా ఉండేవో తెలుసుకోడానికి ఆ నాలుగు కవితలూ చాలు.

తర్వాతరోజుల్లో శీలాభట్టారికా, విజ్జిక, వికటనితంబిక, విద్య లాంటి కవయిత్రులు సంస్కృతంలో అద్భుతమైన కవిత్వం చెప్పడానికి ఈ కవయిత్రులే దారి చూపించారని మనం నమ్మవచ్చు.

భావనలో చిక్కదనం, అభివ్యక్తిలో సూటిదనం, ఆత్మలో తేటదనం- ఏ కవికైనా, కవయిత్రికైనా ఇంతకన్నా కోరదగినవి మరేముంటాయి?


ఏ తప్పులు క్షమించమంటావు?


అనులక్ష్మి

1

సఖీ, తక్కిన పూలు నన్నంత బాధపెట్టవు
కాని కడిమిపూలు పెట్టే హింస చెప్పలేనిది
చూడబోతే ఈ రోజులంతటా కాముడు
ఉండవిల్లు పట్టుకు తిరుగుతున్నట్టుంది (2-77)

2

నేను దూతనీకాను, నువ్వామె ప్రియుడివీ కావు
ఇందులో మనం చెయ్యగలిగేదీ ఏమీలేదు.
కాని ఆమె మరణిస్తే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది
చూస్తూ ఉండలేక ఈ మాట చెప్పిపోదామనివచ్చాను. (2-78)

3

మిత్రుడా! నీ భార్యపతివ్రతగా ఉండటానికీ
మేము ఉండకపోడానికీ మరే కారణం లేదు
ఆమెకి నీలాంటి మనిషి దొరికాడు
మాకెక్కడా దొరకలేదు. (3-28)

4

ఎండిపోయిన మర్రిచెట్టుకిందకి బాటసారులు
నవ్వుకుంటూ చప్పట్లు చరుచుకుంటూ చేరగానే
అంతదాకా ఆకుల్లాగా, పండ్లలాగా అల్లుకున్న
చిలకలగుంపు ఒక్కసారిగా ఎగిరిపోయింది (3-63)

5

ఎక్కడైనా గానీ, ఎలాగైనా గానీ
చతురులైన అరసికులు కాదు,
మనుషుల హృదయాల్ని గెలుచుకునేది
సద్భావమూ, స్నేహమూ మాత్రమే (3-74)

6

ఎక్కడో వేర్లు తన్నుకున్నట్టు కావిలించుకున్న
నా చేతుల్నెట్లానో అతడు విడిపించుకున్నాడు.
అతడి హృదయంలో నాటుకున్న వక్షోజాల్ని
నేనూ అతికష్టమ్మీద ఊడబెరుక్కున్నాను (3-76)

రేవా

1

ఓ మానినీ, కోపం వచ్చిందో, తెచ్చుకున్నావోగాని
నువ్వు నీ ముఖం అటువైపు తిప్పుకున్నావా
నీ వీపు మీద పులకరింతలు చూస్తుంటే
నీ హృదయం మటుకు ఇటువైపు తిరిగినట్టుంది (1-87)

2

ప్రేమికా! చెప్పు, నీవి ఏ తప్పులు
క్షమించమంటావు? ఇప్పటికే చేసినవా?
చేస్తూ ఉన్నావా లేకపోతే సిగ్గులేకుండా
రేపెలానూ మళ్ళా చెయ్యబోయేవా? (1-90)

మాధవి

1

తమ పెత్తనాన్ని అణచుకుని
ఎవరు బానిసల్లాగా సేవచేస్తారో
వాళ్ళనే ప్రేమిస్తారు ఆడవాళ్ళు-
తక్కినవాళ్ళు యజమానులంతే. (1-90)

ప్రహత

1

కోపంతో వాణ్ణొక దెబ్బవేసానా
నా అరచెయ్యినొప్పెట్టిందేమోనని
ఊదడం మొదలుపెట్టాడు- నవ్వుతో
రెండోచేత్తో దగ్గరగా లాక్కున్నాను. (1-86)

శశిప్రభ

1

నా ప్రేమ చంచలం అందుకనే
అతడెలా పాడితే అలా ఆడుతున్నాను
పూలతీగ తనంతతాను నిలబడలేక కదా
వృక్షం చుట్టూ పెనవైచుకుంటుంది (4-4)

వద్ధవాహి

1

ఓ ప్రోషితపతికా, వింధ్యశిఖరాలు
నల్లబడ్డది దావాగ్నిశిఖల మసికి
ఆషాఢమేఘాలు ఆవరించినందుకు
కాదు, ఊరడిల్లు. (1-70)

4-7-2023

18 Replies to “ఆషాఢ మేఘం-17”

 1. అద్భుతమైన అలనాటి మగువల కవితలు.
  కవితలు కావు పూలకత్తులు
  కోయకుండానే గాయం చేయగల మహత్తులు
  మనో వీధిలో మరుడు సంచరించే శరత్తులు

 2. చాలా బావున్నాయి. ఇవి ఎక్కడ భద్రపరచి ఉన్నాయి?

  1. గాథా సప్తశతి లో ఉన్నాయి. ఆ పుస్తకానికి తెలుగు చాలా వచ్చాయి అందులో కోడూరి ప్రభాకర రెడ్డి గారు చేసిన రెండు అనువాదాలు, గాథాత్రిశతి, గాథాచతుశ్శతి, దీవి సుబ్బారావు గారి అనువాదం మీరు చూడవచ్చు.

 3. అన్ని కవితలూ అద్భుతంలానే ఉన్నాయి సర్.

 4. మామూలు కవితలు కాదు.. ఒకటవ శతాబ్ది దక్కన్ స్త్రీ హృదయాలు.

 5. ఆలింగనం ,అందులో గాఢాలింగనం.
  ఒకరి పట్ల మరొకరికున్న ప్రేమానుభూతిని
  తెలియపరచడానికున్న అవకాశం.
  అనులక్ష్మి గారి 6వ కవితలో ఆ ప్రేయసీప్రియుల ప్రేమానుభూతి కేవలం శారీరకమే కాదు హృదయగతం అని ధ్వనిస్తున్నది.

  మోడీ గారు వచ్చాక ఇప్పుడు దౌత్యం అంతా ఆలింగనాలతో మొదలౌతున్నది.
  శ్రీ రాముడు పట్టాభిషేకానంతరం అందరికీ అన్ని కానుకలు ఇచ్చి ఆంజనేయుడిని గాఢాలింగనం తో అక్కున చేర్చుకుంటాడు.
  చెరగిపోని ఆత్మీయతానురాగాలకు ప్రతీక ఆలింగనం.

  కవితలు అన్నీ బాగున్నాయి. 🙏🙏🙏

 6. ఎంత నిజాయితీగా వున్నాయి కదా ఈ కవితలు!ఒక్కో మారు నాగరికత మన సహజమైన స్పందనలను పైకి రాకుండా ఆపేసిందనిపిస్తుంది .

Leave a Reply

%d bloggers like this: