ఆషాఢ మేఘం -16

నలభయ్యేళ్ళ కిందట రాజమండ్రిలో మొదటిసారి హైకూల గురించి విన్నాను, మిత్రుడు మహేష్ ఇచ్చిన పుస్తకాల ద్వారా కొన్ని హైకూలు చదవగలిగాను. ముప్ఫై ఏళ్ళ కిందట మొదటిసారిగా చైనా కవిత్వం గురించి తెలుసుకోగలిగాను. దాదాపు ఇరవయ్యేళ్ళకిందట ఎ.కె.రామానుజన్ పుస్తకాల ద్వారా సంగం సాహిత్యం గురించి తెలుసుకోగలిగాను. హైకూ కవులు, ప్రాచీన చీనాకవులు, సంగం కవులు పరిచయమైనప్పుడు ప్రతిసారీ నేనొ కొత్త ప్రపంచాన్ని కనుగొన్నట్టుగా తేలిపోయాను. అప్పటిదాకా అధునిక తెలుగు సాహిత్యవిమర్శకులు సృష్టించిన ఆత్మాశ్రయ, వస్త్వాశ్రయ కవిత్వాలనే కృత్రిమ పదాల మధ్య, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం అనే రసహీనమైన విభజనవల్ల, నాకు కలుగుతున్న అనుభూతిని నేను కవితగా కాగితం మీద పెట్టినప్పుడు అది కవిత్వమవుతుందా లేదా అనే సందేహం నన్ను పీడిస్తూనే ఉండేది. కాని తాంగ్ కాలం నాటి చీనాకవుల్ని, ఎట్టుతొగై సంకలనాల్లోని సంగం కవుల్ని చదివినప్పుడు, నాకు గొప్ప ఆత్మవిశ్వాసం కలిగింది. అయితే అప్పటికి కూడా, కవిత్వం గాఢంగా ఉంటూనే క్లుప్తంగా చెప్పడమెలానో తెలిసేది కాదు. ఆ విద్యనేర్పడానికా అన్నట్టు ఆ కవిగురుపరంపరలో అందరికన్నా తర్వాత మెట్టుమీద గాథాసప్తశతి కవులు కనబడ్డారు.

ఒక కవి తన కవితను దర్శిస్తున్నప్పటికీ దాన్ని చేరుకోకుండా అడ్డుపడేవి రెండు: ఒకటి, పడికట్టుపదం, రెండోది, ప్రసంగం. ఇప్పటికే నేను చాలాసార్లు రాస్తూ వచ్చినప్పటికీ మరోసారి రాయకుండా ఉండలేకపోతున్న వాక్యం, కవిత్వానికీ, వక్తృత్వానికీ మధ్య తేడా గురించి జాన్ స్టువర్ట్ మిల్ చెప్పిన మాట. we should say that eloquence is heard; poetry is overheard అని అన్నాడు ఆయన. ఆయనింకా ఇలా అన్నాడు: Eloquence supposes an audience. The peculiarity of poetry appears to us to lie in the poet’s utter unconsciousness of a listener.

గాథాసప్తశతిలో కవులు ప్రసంగించరు. మొదటిపంక్తిలో 12+18, రెండో పంక్తిలో 12+15 అంటే మొత్తం 57 మాత్రల్లో నువ్వు చెప్పదలచుకున్నదంతా చెప్పాలి. ఈ కింద పొందుపరిచిన కవితలు చూడండి. ఆ 57 మాత్రల్లోనే భూమ్యాకాశాలున్నాయి, మేఘాలూ, మెరుపులూ ఉన్నాయి, వానకి చివికిపోతున్న ఇళ్ళున్నాయి, తన కన్నీళ్ళతో తన బిడ్డను తడుపుకుంటున్న తల్లులున్నారు, పని వదిలిపెట్టి తొందరతొందరగా ఇంటికొచ్చేసిన మనిషిని చూసి విరగబడి నవ్వుతున్న పువ్వులున్నాయి. ఒక కవితను ఎంత చిక్కగా, ఎంత క్లుప్తంగా చెప్పవచ్చో, ఈ కవులనుంచి నేర్చుకోవాలి. అందుకనే గాథాసప్తశతికి తన ఇంగ్లిషు అనువాదానికి రాసుకున్న ముందుమాటలో రాధాగోవింద్ బసక్, ఒక్క కవులే కాదు, నవలలూ, నాటకాలూ రాసేవాళ్ళు కూడా గాథాకవులనుంచి చాలా నేర్చుకోవచ్చన్నాడు.

గాథాసప్తశతి కవితల్ని ధ్వనికి అత్యుత్తమ ఉదాహరణలుగా అలంకారికులు చెప్పారని రాసాను. కాని సంస్కృత ఆలంకారికులు గాథాసప్తశతికన్నా ఎన్నో శతాబ్దాల తర్వాతి వాళ్ళు. సంగం కవులకి తొల్కాప్పియం ఉన్నట్టుగా గాథాసప్తశతి కవుల ముందు అలంకార గ్రంథం ఏదీ లేదు. ఆ మాటకొస్తే, సంగం కవిత్వం ముందుపుట్టి తొల్కాప్పియం తర్వాత వచ్చిందని కూడా మనం మర్చిపోకూడదు. కాని సంగం కవులు ముందే రాసిపెట్టుకోకపోయినా, వారి మనసుల్లో ఒక నిర్దిష్ట కావ్యాలంకార వ్యాకరణం ఉందని విస్మరించలేం. కాని హాలుడు తన ముందున్న కోటి కవితల్లోంచి ఏడువందల కవితలు ఎంపిక చేస్తున్నప్పుడు, ప్రధానమైన ప్రాతిపదికగా పెట్టుకున్నది వాటి స్వభావ రామణీయకతను (4-100) మాత్రమే అని చెప్పవలసి ఉంటుంది.

గాథాసప్తశతి కవితల్లో స్వభావోక్తిది పెద్దపీట. అంటే ఒక దృశ్యాన్ని, అనుభవాన్ని, అనుభూతిని ఉన్నదున్నట్టుగా చూడటం, చూసినదాన్ని చూసినట్టుగా చెప్పడం. తర్వాత రోజుల్లో హైకూ కవులు దీన్నే ‘తథత’ అన్నారు. అంటే suchness. అక్కడ అసలు ఏదుందో అది. దాని మీద మరేదైనా ఆరోపించడానికి వారికి ఇష్టంలేదని మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే స్టువర్ట్ మిల్ ఈ మాట కూడా అంటున్నాడు: Eloquence is feeling pouring itself out to other minds, courting their sympathy, or endeavoring to influence their belief, or move them to passion or to action.

ఆధునిక కవిత్వం ‘కదిలేదీ, కదిలించేదీ’ గా ఉండాలని అనుకున్నప్పుడు తెలుగు కవికి కదిలించడం మీద ఉన్న దృష్టి కదలడం మీద లేదు. ఒక కవి లేదా కవిత ముందు తాను కదలకుండా మరొకరిని కదిలించగలడం అసాధ్యం. ఇక్కడ పొందుపరిచిన కవితల్లో 13, 14 కవితలు చూడండి. కవితలు ముందు తాము కదిలితే ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. అటువంటి కవితలు ఆ తర్వాత పాఠకుణ్ణి కదిలించకుండా ఉండటం అసాధ్యం.

గాథాసప్తశతి తెలుగువాళ్ళ ఆస్తి. ప్రతి ఒక్క తెలుగు కవీ నేర్చుకోడానికి ఇష్టం చూపించాలేగాని, కవిత్వశిల్ప రహస్యాలు చెప్పడానికి గాథాసప్తశతి కవులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.


చిత్రమైంది ప్రణయాగ్ని

1

కుండపోతగా వాన పడుతున్న ఆ రాత్రి
నీ కోసం నేను తొక్కుకుంటూ వచ్చిన
ఊరి బురద ఇంకా ఆరనే లేదు-
సిగ్గులేదు నీకు! కృతఘ్నుడా! ( 5-45)

(అంటే, ఆ బురద ఆరేలోపలే ఆమె పట్ల అతడి ప్రేమ సన్నగిల్లిపోయిందని అర్థం)

(కవి: కైశోరుడు)

2

అవిరళంగా కురుస్తున్న నవజలధారలనే
తాళ్ళతో కట్టి ఈ భూమిని ప్రయత్నించీ
పైకెత్తలేకపోతూ ఎలా ఉరుముతున్నదో
చూడు మేఘం! (5-36)

(కవి: కహిలుడు)

3

మామూలు నిప్పు కన్నా
చిత్రమైంది ప్రణయాగ్ని
తేమలోనిచోట ఆరిపోతుంది
సరసహృదయాల్లో జ్వలిస్తుంది (5-30)

(కవి: రామదేవుడు)

4

సఖీ, తెలీక అడుగుతున్నాను-
తమ ప్రియులు ప్రవాసంలో ఉన్న
స్త్రీలందరికీ చేతిగాజులు
వాటికవే పెద్దవవుతాయా? ( 5-53)

(కవి: కర్ణరాజు)

5

అప్పటి యువజనం, ఆ గ్రామసంపద
అప్పటి మా యవ్వనం, ఆ తారుణ్యం-
లోకం కథలుగా చెప్పుకుంటూ ఉంటే
మేం కూడా కొత్తగా వింటున్నాం (6-17)

(కవి: శాలివాహనుడు)

6

అత్తా! ముఖ్యమైన పని వదిలిపెట్టి
వానాకాలం ఇంటిదారిపట్టిన
బాటసారిని చూసి నవ్వుతున్నట్టు
కొండమల్లెలు విరగబూసాయి (6-37)

(కవి: పేరు తెలియదు)


7

పైన కమ్ముకుంటున్న మేఘాల్ని చూసి
పథికపత్ని జీవితాశవదులుకున్నది
కన్నీరునిండిన కళ్లతో కన్నబిడ్డను
చూస్తూ మరింత రోదిస్తున్నది (6-38)

(కవి: పేరు తెలియదు)

8

పథికుడా! దిక్కులు చూస్తున్నావు,
నిట్టూరుస్తున్నావు, ఆవులిస్తూ, ఏడుస్తో,
కూనిరాగం తీస్తో, తొట్రుపడుతున్నావు-
నీకీ ప్రయాణం నిజంగా అవసరమా? (6-46)

(కవి: పేరు తెలియదు)

9

విప్పారిన కడిమిపూల సుగంధానికి
కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావు-
యువపథికుడా! నీ గృహిణి వదనం
చూడాలి కదా! ఊరడిల్లు. (6-65)

(కవి: ప్రవరసేనుడు)

10

ఒకదానితో ఒకటి చేయికలిపి
కారుమబ్బులు పెనవైచుకున్నా
గగనమమెందుకని బొట్లుబొట్లుగా
కారిపోతున్నదో అంతుపట్టకున్నది (6-80)

(కవి: పేరు తెలియదు)

11

కొండకొమ్ముమీంచి పెనుగాలి
కిందకు నెట్టేస్తే తునకలైపోయిన
మేఘంలాగా మెరుపు
తుకతుకమని మినుకుతున్నది (6-83)

(కవి: జీవదేవుడు)

12

ప్రియసఖీ, ఇవాళ ఒక్కరోజూ
నా శోకాన్ని ఆపకు, ఏడ్వనీ.
తీరా అతడు వెళ్ళిపోయాక
రేపు బతికుంటే ఏడుపు మానేస్తాను(6-2)

(కవి: సర్వసేనుడు)

13

చిల్లులుపడ్డ పూరిపాకలోంచి
కురుస్తున్నవానకి తడవకుండా
మిగిలిన చోటంటూ ఉంటే అది
ఆమె కన్నీళ్ళకు తడిసిపోతున్నది. (6-40)

(గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో అనే శ్రీశ్రీ వాక్యం గుర్తుకు రావడం లేదూ!)

(కవి: స్పందనుడు)

14

ఇంటికప్పులోంచి కురుస్తున్న వానకి
బిడ్డ తడవకుండా తాను అడ్డునిలిచింది
కాని చూసుకోవడంలేదు, తన కన్నీళ్ళతో
తానా పిల్లవాణ్ణి తడిపేస్తున్నదని. ( 7-21)

(మొత్తం గాథాసప్తశతి అంతా లుప్తమైపోయినా, హాలుడి గురించి మరే సమాచారం లభ్యంగా లేకపోయినా, ఈ ఒక్క కవితచాలు, ఆయన భారతీయ సాహిత్యంలో చిరస్మరణీయుడిగా ఉండిపోగలడు.)

(కవి: హాలుడు)

15

అతడు దూరదేశం బయలుదేరినప్పుడు
నా చూపుల్నైతే పక్కకు తిప్పుకున్నాను
కాని ఏం చెయ్యను, హృదయం మాత్రం
నేడు అతడి వెంబడే పడిపోతున్నది (6-58)

(కవి: పేరు తెలియదు)

16

రాబోయే రోజుల్లో మిట్టపల్లాలు ఏకమైపోతాయి
ప్రయాణపథాల గుర్తులు చెరిగిపోయి,
రానురాను మనుష్యసంచారం సన్నగిల్లాక
మనోరథాలు కూడా ముందుకు పోలేవు. (7-73)

(కవి: పేరు తెలియదు)

3-7-2023

23 Replies to “ఆషాఢ మేఘం -16”

  1. 1999 లో డా.సి.నారాయణ రెడ్డిగారి ఆధ్వర్యంలో పక్షం రోజులు వచనకవితా శిక్షణా శిబిరంలో పాల్గొన్నప్పుడు నలభై మంది విషయపారీణుులు వివిధ అంశాలపై మాట్లాడారు కాని ఎవరూ గాథాసప్తతి ప్రస్తావన తేలేదే అని ఇప్పుడనిపిస్తున్నది. క్లుప్తత, రమ్యత, తో పాటు భావ సాంద్రత కలిగిన గాథలను కనీసం యం.ఏ స్థాయి సిలబస్ లో నైనా పెట్టలేదెందుకో.ధ్వనిలో అంతర్లీనంగా శృంగారం ఉన్నది గనుక అని కాబోలు. కానీ అదిలేని మిగతా రసాష్టకం ఎందుకు? నిజంగా 13, 14 గాథలు రసరమ్యాలు. నిన్న దేనికోసమో వెతుకుతుంటే సంస్కృతంలోకి అనువదించిన గాథ ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే ఆగలేక ఇలా తెలుగు మాత్రాలయలోకి మార్చుకున్నాను
    కాకి కావుమంటేనే
    వణకిపోవు పగటి పూట
    మొసళ్ల నర్మద తరించు
    తెలిసి పడతి రాత్రిపూట -గాథాసప్తశతి
    నాకైతే ఇప్పుడు నిజమైన ఎం. ఏ చేస్తున్నట్లుంది.

    నా మొదటి మువ్వ రాసినప్పపడు నాకు కలిగిన ఆనందం ఇప్పటికీ మరువలేను
    బస్సు
    మోసుకెళ్తోంది
    సుఖాల్నీ దుఃఖాల్నీ
    🙏

    1. తెలుగు వాళ్ళు పోగొట్టుకున్నారు. మహారాష్ట్రులు పైకెత్తుకున్నారు. మీ సహృదయ స్పందనకు నమః.

  2. మామూలు నిప్పు కన్నా
    చిత్రమైంది ప్రణయాగ్ని
    తేమలోనిచోట ఆరిపోతుంది
    సరసహృదయాల్లో జ్వలిస్తుంది
    .
    .
    అద్భుతం. పద్దెనిమిదేళ్ళ క్రితం రాసిన “ఆమెకళ్ళలో” కవితలోని వాక్యాలు గుర్తొచ్చాయి.
    .
    .
    ఆకాశంలో మెరుపు మెరిసాక వాన కురిస్తే
    ఆమె కళ్ళల్లో వాన వెలిసాక మెరుపు మెరుస్తుంది
    ఏ గుండెలోని చీకటిని
    నిలువుగా చీల్చడానికో!

    1. ఐతిహ్యాలు, కథా కావ్యాల్లో అక్కడక్కడ చమక్కుమంటూ ప్రబంధాల్లో కొంచెం ఎక్కువగా కనబడుతూ వచ్చిన కవిత్వం కవిత్వ ప్రేమికులకు కొన్ని రత్నాలను మాత్రమే అందిస్తే గాథలు హైకూలు పూర్తి రత్న మాణిక్యాలను అందించాయి. మీరు వాటిల్లో నుంచి కోహినూర్ లనే అందిస్తున్నారు.
      పిబిడివి ప్రసాద్

  3. “నా చూపుల్నైతే పక్కకు తిప్పుకున్నాను
    కాని ఏం చెయ్యను, హృదయం మాత్రం
    నేడు అతడి వెంబడే పడిపోతున్నది”
    అద్భుతమైన కవితలను అందింస్తున్నారు.
    ధన్యవాదాలు

  4. Sir, మీరు అందిస్తున్న ఈ గాథాసప్తశతి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది. ఆమెస్కో లో చూసా లేదు,
    దయచేసి తెలపండి. 🙏🙏

  5. ప్రేమ,ప్రణయం గురించి 3వ కవిత ఎంత గొప్ప గా చెప్పిందో!

    “తేమ లేని చోట ఆరిపోతుంది
    సరసహృదయుల లోన జ్వలిస్తుంది ”

    తడిఉన్న చోటే ప్రేమకు తావు
    పుత్తడి యది ఎంతవుంటే నేమి

    మంచి కవితలు పంచారు.
    ధన్యవాదాలతో..🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  6. “తెలుగు కవికి కదిలించడం మీద ఉన్న దృష్టి కదలడం మీద లేదు”

  7. చిల్లులుపడ్డ పూరిపాకలోంచి
    కురుస్తున్నవానకి తడవకుండా
    మిగిలిన చోటంటూ ఉంటే అది
    ఆమె కన్నీళ్ళకు తడిసిపోతున్నది.

  8. ఏమి వ్యాసాలు! గుండెను కదిలించే గాథలు.

    ముందుగా పాఠకుడిగా, పరిచయకర్తగా ఆలోచింపజేసే నాలుగు మాటలు చెప్పేసాక, కవిత్వానుభూతిని అందించే ఈ వ్యూహం చాలా బావున్నది.

    అన్నట్లు రామానుజన్ సంగకాలపు కవులను పరిచయం చేసిన పుస్తకం పేరేమిటి?

  9. ఎంత అద్భుతమైన కవితలండీ !ఇవి ఈనాడు రాసినవి అన్నా నమ్మేలా వున్నాయి. ఏదో ఒక్క కవిత బాగుంది అనలేమే!

Leave a Reply

%d bloggers like this: