ఆషాఢమేఘం-15

ఆల్బర్ట్ వెబర్ అనే జర్మన్ పండితుడు 1881 లో గాథాసప్తశతిని పాశ్చాత్యప్రపంచానికి పరిచయం చేసాడు. అప్పణ్ణుంచీ ఇంగ్లిషులో ఎప్పటికప్పుడు కొత్త అనువాదాలు వెలువడుతూనే ఉన్నాఇ. వాటిలో చెప్పుకోదగ్గది రాధాగోవింద బసక్ (1885-1982) అనే ఆయన  ఆషియాటిక్ సొసైటీ తరఫున 1971 లో వెలువరించిన ఇంగ్లిషు అనువాదం. అది కాక, వెబెర్ సేకరించిన 964 కవితలు ఆధారంగా పీటర్ ఖొరొచె, హెర్మన్ టీకన్ అనే వారు Hala’s Sattasai, Poems of Life and Love in Ancient India (2014) అనే అనువాదం వెలువరించారు. ఈ అనువాదంలో వారు కవితల అనువాదాల్ని ఇతివృత్తాలవారీగా పొందుపరిచారు.

తెలుగులో శ్రీనాథుడు ‘శాలివాహన సప్తశతి’ ని రాసానని చెప్పుకున్నాడుగాని ఆ రచన మనకి దొరకలేదు. ఆయన మిత్రుడు పెదకోమటి వేమారెడ్డి సప్తశతిలోంచి వంద కవితలు ఎంచుకుని వాటికి సప్తశతిసారటీక రాసాడు. ఆధునిక కాలంలో తెలుగులో చాలా అనువాదాలు వచ్చాయి. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మమొదలుకుని దీవి సుబ్బారావు, డా.కోడూరి ప్రభాకరరెడ్డి దాకా దాదాపు ఇరవైకి పైగా అనువాదాలు వచ్చాయి. రవీంద్రుడి గీతాంజలిలాగా సప్తశతికూడా తన పాఠకుణ్ణి మరోసారి అతడి భాషలోకి అనువదించమని కోరుకునే రచన.

గాథాసప్తశతిలో కనిపించే స్త్రీపురుషప్రేమకీ తర్వాత రోజుల్లో కావ్యప్రపంచాన్ని పరిపాలించిన ప్రేమకీ మధ్య చాలా తేడా ఉంది. ప్రాకృత కవిత్వంలో కనిపించే ప్రేమ స్త్రీపురుషుల మధ్య సహజంగా వికసించే అత్యంత లౌకిక ప్రేమ, గ్రామీణ ప్రేమ. దేహాలనూ, మనసులనూ కలిపే ప్రేమ. అందులో దివ్యత్వలక్షణాలేవీ కనిపించవు. చివరికి అక్కడక్కడా మూడు గాథల్లో కనిపించే రాధాకృష్ణప్రేమ కూడా ఎంతో లౌకిక, మానుష ప్రేమగానే మనకు కనబడుతుంది.

ఆ ప్రేమ అడవికీ, నగరానికీ మధ్య గ్రామాల్లో వికసించే ప్రేమ. గ్రామసమాజాల్లో తొలకరి పొలం పనుల్ని గుర్తుచేస్తుంది. ప్రేమబంధం నుండి విడివడి స్త్రీపురుషులు పనిలో పాలుపంచుకోవలసి ఉంటుంది. ఒకవేళ వారు అడవికి చెందిన కుటుంబాలైతే తొలకరి రాగానే వాళ్ళు పనికోసం గ్రామాల బాటపట్టవలసి ఉంటుంది. వాళ్లొక వేళ గ్రామవాసులైతే ఆ గ్రామాలు ఇంకా వ్యావసాయిక సమాజాలుగా స్థిరపడవలసిన దారిలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు పనికోసం అంతకన్నా పెద్ద గ్రామాలకు పోవలసి ఉంటుంది. ఎలా చూసినా తొలకరి ప్రేమకు అనువైన ఋతువు కాదు. కాబట్టి చాలా కవితలు వానాకాలం తెచ్చే ఎడబాటు గురించిన కవితలు.  ఈ ఎడబాటు తెచ్చే సమస్య విరహవేదనతో ఆగేది కాదు. ఎడబాటులో ఉన్న స్త్రీ మరొక పురుషుణ్ణి చూసి అతడిపట్ల మోజుపడితేనో, అతడితో ఏదైనా సంకేతస్థలంలో కలవాలనుకుంటేనో, అప్పుడు పుట్టే కవితలు మరింత ఘాటుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆ స్త్రీపురుషులు అపరిచితులే కానక్కరలేదు. దగ్గర బంధువులే కావచ్చు. కాని గ్రామసమాజాల్లో కట్టుబాట్లు స్థిరపడే రోజులు కాబట్టి వాళ్ళ మధ్య ప్రణయం రహస్యంగానే వికసించవలసి ఉంటుంది. ఇదేమీ కాదు, ఆ స్త్రీపురుషులు భార్యాభర్తలే అనుకుందాం, అయినా కూడా, పనికీ, ప్రేమకీ లంకె కుదరదు. అప్పుడు కూడా ఆ ప్రేమ నిషిద్ధప్రేమ కావడం తప్పని సరి. కాబట్టి ఏ విధంగా చూసినా ఒక అప్రాప్యమోహనసుఖం ఈ వానకవితలన్నిటా పరుచుకుని ఉంటుంది.

ఆ మనఃస్థితిని ప్రతిబింబించే మరో పది కవితలు, 300-400 మధ్యలోంచి, ఎంపికచేసి ఇక్కడ పంచుకుంటున్నాను.


ఆ గోదావరి వరదకి తెలుసు

1

ఇవాళే వెళ్లాడు, ఇవాళే వెళ్ళాడు
అతడు ఈరోజే వెళ్ళాడనుకుంటో
ఆమె మొదటిరోజే
గోడంతా గీతల్తో నింపేసింది. (3-8)

(కవి: ప్రవరసేనుడు)

2

అతడు తిరిగొచ్చే రోజేదో
నమ్మకం కుదరక
చెలులు ఆమె గోడమీద గీసుకున్న గీతలు
రెండు మూడు రహస్యంగా చెరిపేసారు (3-6)

(కవి: పుణ్యభోజకుడు)

3

పిలగాడా! నువ్వు వడివడిగా వెళ్ళిపోతుంటే
ఆమె పంజరంలో పక్షిలాగా
తడికసందుల్లో
ప్రతి కంతలోంచీ నిన్నే చూస్తోంది.(3-20)

(కవి: అరికేసరి)

4

దీపం వెలిగించి తెస్తూ ఆమె-
ప్రియుడిప్రవాసపు తలపులవల్ల
కన్నీరు చిందుతుందనే భయంతో
తల వోరగా పక్కకు తిప్పుకుంది. (3-22)

(కవి: బ్రహ్మచారి)

5

ప్రియప్రవాసానికి కుంగిపోయినామె
నిట్టూరుస్తో పక్కకి ఒత్తిగిల్లినప్పుడు,
అప్పుడు తెలిసింది, ఆ గాజులచప్పుడుకి,
ఆమె ఇంకా బతికే ఉందని. (3-83)

(కవి: అలంకారుడు)

6

అతడి సౌభాగ్యగుణం ఎటువంటిదో
స్త్రీలకి సహజంకాని నా సాహసం ఎటువంటిదో
ఆ రాత్రి కురిసిన కుంభవృష్టికి తెలుసు
ఆ గోదావరి వరదకి తెలుసు. (3-31)

(కవి: మకరధ్వజుడు)

7

భర్త ప్రవాసి, ఇంకా తిరిగిరాలేదు,
గాలివానకు రేగిపోయిన ఇంటికప్పు-
నేలనపడిరోదిస్తున్న ప్రోషితపతికను
మేఘానికి చూపిస్తున్నది మెరుపు ( 4-15)

(కవి: రాయహత్తి)

8

బురదలో ఇరుకున్న నాగలిని లాగిలాగి
ఇంటికొచ్చి అలసినిద్రిస్తున్న భర్త.
అప్రాప్తమోహనసుఖాన్ని తలుచుకుని
వానాకాలాన్ని నిందిస్తున్నది రైతువనిత (4-24)

(కవి:చుల్లోహుడు)

9

కాళ్ళవేళ్ళూ, చేతివేళ్ళూ
అన్నీ కలిపి రోజులు లెక్కపెట్టాను
ఇంక వేటితో లెక్కపెట్టేదని
రోదిస్తున్నది ముగ్ధ (4-7)

(కవి: పాలితుడు)

10

ఈమెకేమీ దయ్యం పట్టలేదు-
అకస్మాత్తుగా మేఘగర్జన
చెవిన పడగానే ఈ ప్రోషితపతిక
గుండెచెదిరింది, అంతే. (4-86)

(కవి: దుర్ధరుడు)

2-7-2023

13 Replies to “ఆషాఢమేఘం-15”

 1. ఆహా ఒకదాన్ని మించి ఒకటి ఉన్మాయి 8 వది మరీ బాగుంది.

  1. “ప్రియప్రవాసానికి కుంగిపోయినామె
   నిట్టూరుస్తో పక్కకి ఒత్తిగిల్లినప్పుడు,
   అప్పుడు తెలిసింది, ఆ గాజులచప్పుడుకి,
   ఆమె ఇంకా బతికే ఉందని. (3-83)

   (కవి: అలంకారుడు)”

   I have a lot to catch up.

 2. అడవికీ, నగరానికీ మధ్య గ్రామాల్లో వికసించే…

  ఊహకు జోహారు.

 3. ఎంత అద్భుతమైన వ్యక్తీకరణ🙏

Leave a Reply

%d bloggers like this: