ఆషాఢమేఘం-14

గాథాసప్తశతి ప్రాకృత భాషలో రాసిన కవితల సంకలనం. ఇప్పుడు ఆ ప్రాకృతాన్ని మహారాష్ట్రీ ప్రాకృతం అని అంటున్నారుగాని, మహారాష్ట్ర ప్రాకృతం అనే పదమే అయిదవశతాబ్ది తర్వాత వాడుకలోకి వచ్చిన పదం. గాథాసప్తశతిలో భాష మహారాష్ట్ర ప్రాకృతం ఎందుకు కాదో కోడూరు ప్రభాకరరెడ్డిగారి గాథాచతుశ్శతి (2016) కి రాసిన ముందుమాటలో ఇప్పగుంట సాయిబాబాగారు వివరంగా రాసారు. నన్నడిగితే దాన్ని శాతవాహన ప్రాకృతం అనిగానీ, లేదా నర్మదా-గోదావరీ ప్రాకృతం అనిగానీ అనాలంటాను. ఆ కవిత్వం నర్మద ఒడ్డున వికసించిందన్న ఉద్దేశంతోనే Andrew Schelling అనే అనువాదకుడు తన అనువాద సంకలనానికి The Cane Groves of Narmada River (1998) అని పేరుపెట్టాడు. కాని నన్నడిగితే The Seductive Banks of River Godavari అని పెట్టమంటాను. ఎందుకంటే ఆ కవితల్లో నర్మద ప్రస్తావన ఉన్నప్పటికీ, గోదావరి గురించిన ప్రస్తావనలు మరింత passionate గా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా, ఈ గాథ (4:55), సంస్కృతఛాయలో :

మా బ్రజ పుష్పలవనశీలా దేవా ఉదకాంజలిభిస్తుష్యంతి
గోదావర్యాః పుత్రక! శీలోన్మూలాని కూలాని

( పిల్లవాడా! పూలు కొయ్యడానికి గోదావరి ఒడ్డుకి పోతున్నావు. దేవతలకి పూలే అవసరం లేదు. ఇంత తోయమిచ్చినా కూడా సంతోషిస్తారు. గోదావరి ఒడ్డున శీలం నిలబడదంటారు, చూసుకో)

ఇక్కడ శీలం అనే మాటని అన్ని రకాల career ambitions కీ ప్రతీకగా తీసుకుంటే, నా అనుభవమే ఈ కవితకు ఒక నిరూపణ. గోదావరి ఒడ్డు నీలో సౌందర్యారాధనని తప్ప మరే అభిలాషనీ మిగల్చదు. ‘శీలోన్మూలాని కూలాని’- గాథాకవులు గోదావరిని ఎంత ప్రేమించారో తెలుసుకోడానికి ఈ నిందాస్తుతి వాక్యం ఒక్కటి చాలు.

సంగం కవిత్వం దక్షిణభారతదేశపు కవిత్వం కాగా, గాథాసప్తశతి మధ్యభారతదేశపుదిగువ ప్రాంతాల కవిత్వం. కాళిదాసు మధ్యభారతదేశపు ఎగువప్రాంతాల కవి. సంగం కవిత్వంలోని ప్రాకృతిక ప్రదేశాల్లో ఒక సముద్రం మాత్రమే గాథాసప్తశతిలో కనిపించదు. కాని తొలిసంగం కవితాసంకలనాల్లో ప్రస్ఫుటంగా కనిపించని నదులు ఈ కవిత్వంలో కనిపిస్తాయి. ఇక సంగం కావ్యసీమలానే గాథాసప్తశతి సీమలో కూడా అడవులు, కొండలు, గ్రామాలు కనిపిస్తాయి. కాని అంతగా కనిపించనవి నగరాలు, అస్సలు కనిపించనిది యుద్ధం.

ప్రతిష్ఠానపురం రాజధానిగా గోదావరీ పరీవాహక ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజుల్లో ఒకడైన హాల శాతవాహనుడు సంకలనం చేసిన గాథాసప్తశతి లో 700 కవితలు ఉన్నాయి. వెబెర్ అనే పండితుడు మొదటిసారిగా వివిధ తాళపత్రాలు సరిపోల్చి చూసినప్పుడు 964 కవితలదాకా కనిపించాయి. వాటిలో అన్ని ప్రతుల్లోనూ 430 కవితలు సమానంగా కనిపిస్తున్నాయి. పురాణాల లెక్క ప్రకారం 30 మంది శాతవాహన రాజుల్లో హాలుడు 17 వ వాడు. బాణభట్టు హర్షచరిత్రలోనూ, ఉద్యోతనసూరి కువలయమాలలోనూ కూడా హాలప్రశంస ఉంది. ఒక ప్రాచీన తాళపత్రం ప్రకారం హాలుడు కుంతల జనపదానికి ప్రభువు. మరొక ఆధారం ప్రకారం ఆయన అస్సక జనపదాన్ని పాలించినవాడు. బహుశా గోదావరి ఒడ్డున ఉన్న కోటిలింగాలనుంచి హాలుడు పరిపాలన సాగించి ఉంటాడని కూడా చెప్పవచ్చు. కాని రాజుగా అతడి ప్రశస్తి గురించి మనకేమీ తెలియదుగానీ, ఈ సంకలనం ద్వారా మాత్రం కవిరాజుగానూ, ఒక కవితాసంకలనానికి సంపాదకుడిగా వ్యవహరించిన తొలిరాజుగానూ చరిత్రలో మిగిలిపోయాడు.

ఈ సంపుటంలో హాలుడి పేరు మీద 44 కవితలు ఉన్నాయి. మొత్తం కవుల సంఖ్య వ్యాఖ్యానానికీ, వ్యాఖ్యానానికీ మధ్య మారుతూ ఉంది. హాలుడు కాక, స్థూలంగా, మరొక 261 మంది కవులున్నారు. భువనపాలుడి గాహాకోశ ప్రకారం 384 మంది కవులున్నారు. ఒక లెక్క ప్రకారం ఆరేడుగురు కవయిత్రులుండగా మరొక లెక్క ప్రకారం సుమారు ఇరవై మందిదాకా కవయిత్రులున్నారు.

గాథ అంటే ఒక ఛందస్సు. సంస్కృతంలో దీన్ని ఆర్యా వృత్తంతో పోలుస్తారు. ప్రతి ఒక్క గాథలోనూ రెండు పంక్తులుంటాయి. మొదటి పంక్తిలో మొత్తం 30 మాత్రలుంటాయి. రెండవ పంక్తిలో 27 మాత్రలుంటాయి. ఈ ఛందస్సు తాలూకు మర్యాదలు, నియమాల్ని బట్టి ఇది సంస్కృత ఛందస్సులకన్న తమిళ సంగం ఛందస్సులకే దగ్గరగా ఉందని చెప్తారు. కాని దానర్థం గాథాసప్తశతిమీద సంగం సాహిత్యం ప్రభావం ఉందనికాదు. గాథాసప్తశతి సంగం సాహిత్యాన్ని ప్రభావితం చేసిందనీ కాదు. ఈ రెండు సంప్రదాయాలూ ఒకదానికొకటి సమాంతరంగా వర్ధిల్లాయని మాత్రం చెప్పగలం. సంగం కవిత్వానికి నిర్దిష్టమైన, విస్పష్టమైన అలంకారశాస్త్రం ఉన్నందువల్ల దాన్ని గాథాసప్తశతికన్నా పూర్వపు సాహిత్యం అని అనుకోవచ్చు, లేదా సరిగ్గా ఆ కారణం చేతనే, అది గాథాసప్తశతి కన్నా తర్వాతదని కూడా అనుకోవచ్చు. ఏ సంగతీ స్పష్టంగా చెప్పలేం.

గాథాసప్తశతి కవిత్వం వికసించేనాటికి లక్షణ గ్రంథాలేవీ సంస్కృతంలోనూ, ప్రాకృతంలోనూ కూడా కనిపించవు. తర్వాతరోజుల్లో సంస్కృత అలంకారికులు కావ్యలక్షణాల్ని వివరించడానికి పూనుకున్నప్పుడు వాళ్ళకి గాథాసప్తశతి మేలిమి ఉదాహరణగా కనిపించింది. మమ్మటుడు, కుంతకుడు, ముఖ్యంగా ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు కావ్యవాక్కుకి అత్యున్నత ఉదాహరణలుగా ఈ గాథల్ని పేర్కొంటూ వచ్చారు. కావ్యానికి ధ్వని ప్రాణం అని ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం అనే అలంకారిక గ్రంథం రాసినప్పుడు ఆయనకి కావ్యధ్వనికి గాథాసప్తశతిలోని ఎన్నో కవితలు ఉదాహరణలుగా కనబడ్డాయి.

అయితే ధ్వనిసిద్ధాంతం కన్నా కనీసం ఏడెనిమిది శతాబ్దాల కన్నా ముందు ఈ కవిత్వం వికసించింది. కాబట్టి ధ్వనిసిద్ధాంతకారులు గాథాసప్తశతి కావ్యసౌందర్యాన్ని తమ సిద్ధాంత చట్రంలో చూడటానికి ప్రయత్నించినందువల్ల చాలాసార్లు ఆ సౌందర్యాన్ని పూర్తిగా గ్రహించలేకపోయారనిపిస్తుంది. (గాథాసప్తశతికి నరాల రామారెడ్డిగారి అనువాదానికి నేను రాసిన పరిచయ వ్యాసంలో ఈ అంశాన్ని మరింత వివరంగా చర్చించాను.చూ: సాహిత్యసంస్కారం, పే.46-61)

గాథాసప్తశతిని అర్థం చేసుకోడానికి బుద్ధుడు చెప్పిన ‘పతిభాన కవిత్వం’ అనే మాట బాగా సరిపోతుంది. చాలాసార్లు హైకూలకీ, గాథలకి మధ్య పోలిక కనిపించడం కూడా ఇందుకే. నేను ఇంతకు ముందు ఒక గాథని పరిచయం చేస్తూ చెప్పిన మాటనే ఇక్కడ మరో సారి గుర్తుచేస్తున్నాను. గాథాసప్తశతి కవులు మన ఇంద్రియచైతన్యం మీద ఎప్పటికప్పుడు పేరుకుంటూ ఉండే నివురు’ని ఉప్ఫని ఊదేసే కవులు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన ఇంద్రియాలు స్పష్టంగా చూడటానికి వీలుగా వారు మన చైతన్యాన్ని సునిశితం చేస్తారు. మామూలుగా కవులకి ఈ పనిచేయడానికి ఒక ఖండకావ్యమో లేదా కావ్యమో అవసరమవుతుంది, కానీ ఈ ప్రాకృత కవులు ఒక్క పద్యంతోనే ఈ పని చెయ్యగలగడంలోనే వారి ప్రతిభ కనిపిస్తుంది. ఇలా ఒక్క పద్యంగా మాత్రమే ఉండే కవితని ముక్తకం అంటారు. మామూలుగా కావ్యంలో రసోత్పత్తి జరగడానికి కథాబలం చాలా తోడ్పడుతుంది. కాని ఎటువంటి కథాబలం లేకుండానే ముక్తకం కూడా అంత రసస్పందనను శ్రోతలో రేకెత్తిస్తుంది.

ఒక దృశ్యం పట్లగాని లేదా ఒక అనుభవం పట్ల గాని ఒక కవిత మన ఇంద్రియాల్ని జాగృతం చేసిన తర్వాత మన మనసు మెత్తబడుతుంది. కొంతసేపు అక్కడే విహరించడానికి ఇష్టపడుతుంది. దీన్నే మన అలంకారికులు రసం అన్నారు. మనలో రసోద్దీప్తి కలిగించడానికి కొన్ని అలంబనాలు ఉంటాయి. ఆ సామగ్రిని విభావ, అనుభావ, సంచారీ భావాలు అని వివరించారు. ఆ పారిభాషిక పదాల్లోకీ లేదా ఆ లాక్షణిక చర్చల్లోకీ పోనక్కర్లేకుండా స్థూలంగా ఇలా చెప్పుకోవచ్చు. మనం ఏదైనా అనుభవానికి లోనయినప్పుడు ఆ వేళలు, ఆ ఋతువులు, అక్కడి పూలు, పండ్లు, పక్షులు మొదలైనవన్నీ ఆ అనుభవానికి associations గా మారతాయి. మళ్ళా మనమెప్పుడేనా ఆ associations ని తలచుకున్నా, లేదా అవి మనకి ఎదురైనా, ఒకప్పుడు వాటి సన్నిధిలో మనం లోనైన అనుభవం మనకు మళ్ళా స్మరణకు వస్తుంది. కాబట్టి మళ్ళా మరోసారి ఆ అనుభవానికి లోనవకపోయినా కూడా చాలాసార్లు ఆ associations నేరుగా మనలో ఆ రసోద్దీప్తికి కారణాలవుతాయి.

ఉదాహరణకి తొలకరిమబ్బుల్నే తీసుకుందాం. ఒకప్పుడు వానాకాలం మొదలవగానే భర్త ప్రవాసం నుంచి ఇంటికి వచ్చే సమయం లేదా వానాకాలం పనులు మొదలవుతాయి కాబట్టి ఇంటినుంచి పనికి వెళ్ళే సమయం కూడా. కాబట్టి తొలకరిమబ్బులు వియోగస్ఫురణకి ఒక ఆనవాలు. కారుమబ్బులకీ, వియోగస్ఫురణకీ ఉన్న సంబంధం ఎంత బలమైందంటే, ఒక కవి, ‘వియోగం’ అనే మాట చెప్పనక్కర్లేకుండానే, ‘మబ్బులు’ అని అంటే చాలు, శ్రోతలో విప్రలంభ మనఃస్థితి వెంటనే జాగరితమైపోగలదు. అలాగే ‘ప్రవాసం’ అన్నా కూడా చాలు. లేదా తొలకరిమబ్బుల్తో ముడివడి ఉన్న మరే విశేషమైనా సరే, అది కడిమిపూలు కావచ్చు, లేదా నెమళ్ళు ఫించం విప్పుకోవడం కావచ్చు, లేదా పొలం పనులు మొదలయ్యే సూచన కావచ్చు, లేదా బురద, నదిలో పోటెత్తిన వరద- ఏదైనా సరే, ఒక్క మాట, చిన్న సూచన, ఒక్క సంజ్ఞ చాలు, శ్రోత మనసు మెత్తబడి, అతడిలో లేదా ఆమెలో వియోగశృంగార భావనలు ఉద్దీప్తం కావడానికి.

ఇటువంటి మనఃస్థితి, రసస్థితి సాధించిన శ్రోతలున్నప్పుడు ఆ కవులు దీర్ఘకావ్యాలు రాయవలసిన పని ఉండదు. సున్నితమైన పదాల్తో, రసస్ఫూర్తికలిగించగల ఒక సన్నివేశాన్నో, దృశ్యాన్నో లేదా సంభాషణనో చెప్పి వదిలిపెడితే చాలు శ్రోత హృదయాన్ని రసోన్మన్మత్తమైపోతుంది.

కాబట్టి గాథాసప్తశతిలోనూ, ఎట్టుతొగైలోనూ కనిపించే కవిత్వం కేవలం కవుల వల్ల మాత్రమే సాధ్యమైన కవిత్వం కాదు. అటువంటి కవిత్వం వికసించడానికి సుశిక్షితమైన రసశిక్షణ పొందిన ఒక రసజ్ఞ సమాజం కూడా ఉండి ఉండాలి. ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!

సంగం కవిత్వంలోలాగే గాథాసప్తశతిలో కూడా వానాకాలం విరహకాలం. అయితే అక్కడ ముల్లై, విరజాజిపువ్వు ప్రధానమైన సంకేతం కాగా, ఇక్కడ మేఘాలు, మబ్బులు, తొలకరి మబ్బులు, ప్రవాసం ప్రధాన సంకేతాలు. వానలు మొదలైనా కూడా ప్రియుడు లేదా పతి ఇంకా ఇల్లు చేరకపోవడమో లేదా మరొక ప్రయాణానికి బయలుదేరడమో చాలా కవితలకి సందర్భం. ఆ సన్నివేశాల్ని ప్రతిసారీ వివరంగా చెప్పడు కవి, చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఒక చిన్న సూచన, లేదా ఒక సంకేతం, లేదా ఒక పదం- అది చాలు, శ్రోతలో రసవర్షం మొదలుకాడానికి.

ఏడువందల కవితల్లో, వానాకాలం చుట్టూ అల్లుకున్న కొన్ని కవితల్నిక్కడ వరసగా మీకు అందించబోతున్నాను. మొదటగా 1-200 మధ్యనుంచి పది కవితలు.


1

ఒక్క కృష్ణజింక ఎదురుపడితే
ప్రయాణం మానుకుంటారు-
ఇప్పుడు రెండులేడికళ్ళల్లో కన్నీరు
ఇక ప్రయాణమెట్లా? (1-25)

(కవి: కాలసారుడు)

2

చూడు! కొండవాగులో కొట్టుకుపోతున్న
కడిమిచెట్టు, సుడికి తెగిపోతున్న
పూలకేసరాలు. అయినా వాటితోపాటే
తేలుతూ మునుగుతూ తేనెటీగలు. (1-37)

(అద్భుతమైన కవిత. వరదలో పడి కొట్టుకుపోతున్న చెట్టుమీది పూలకేసరాలు తునిగిపోయినా కూడా తేనెటీగలు వాటిని వదలకుండా పడుతూ లేస్తోపోతున్నాయి. మనం కూడా ఆ తేనెటీగలవెంట పడిపోతున్నట్టుగా ఉంటుందీ కవిత చదువుతున్నప్పుడు. ఇటువంటి దృశ్యాన్ని పట్టుకున్నందుకు ఈ కవికి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం!)

(కవి: అవటంగుడు)

3

అతడు దగ్గరలేనప్పుడు,
అతడితో గడిపిన రోజులే గుర్తొస్తున్నప్పుడు
తొలికారు మేఘగర్జన
చావుబాజాలాగా భయపెడుతున్నది. (1-29)

(కవి: కల్యాణుడు)

4

ఓ బందీ, అది అకాలంగా వినిపిస్తున్న
ఉరుము చప్పుడు-
నువ్వేమో నీ భర్తవింటినారిచప్పుడనుకుని
మురిసిపోతున్నావు. (1-57)

(కవి: మకరందుడు)

5

ఓ ప్రోషితపతికా! వింధ్యశిఖరాలు
నల్లబడ్డది వేసవి కార్చిచ్చుకి.
ఊరడిల్లు- అవి తొలకరి
కారుమబ్బులు కావులే. (1-70)

(కవి: బద్ధవాహుడు)

6
ఒకదాన్నొకటి అల్లుకుని దిక్కులన్నీ
పరచుకుని మళ్లా విప్పుకుంటున్న
మేఘమండలం మధ్యలో వింధ్యశిఖరం
వలువలు విడుస్తున్నట్టుంది. (2-15)

(ఈ పద్యం ఒకపట్టాన అనువాదానికి లొంగని కవిత. ఇక్కడ ‘ఛల్లీమివ’ అన్నాడు కవి. ఛల్లీ అంటే చర్మం, బెరడు అని అర్థాలు. కాబట్టి కొందరు అనువాదకులు మేఘాలు విప్పుకుంటూ ఉంటే వింధ్యపర్వతం కుబుసం విడిచినట్టుంది అని అర్థం చెప్పారు. ఒక ఇంగ్లిషు అనువాదకుడు The Vindhya Range seems to shed its skin అని అనువదించాడు. ఇక్కడ కవి ఉద్దేశ్యం వింధ్యపర్వతం పూర్తి నగ్నంగా కాక, మేఘాల పారదర్శకతలోంచి నగ్నంగా కనిపిస్తోందని చెప్పడం అని అనుకుంటున్నాను)

(కవి: కమలుడు)

7

ధనుర్బాణాలు ధరించిన పుళిందులు
కొండకొమ్ములమీంచి చూస్తున్నది
కరిమందల్లాగా కారుమబ్బులు
కమ్ముకుంటున్న వింధ్యశిఖరాల్ని. (2-16)

(కవి: హలియుడు)

8

సఖీ, ఈ కడిమిపూలు పెట్టినట్టుగా
మరే పూలూ నన్ను బాధపెట్టవు
చూడబోతే ఇప్పుడిక్కడ కాముడు
ఉండవిల్లు పట్టుకు తిరుగుతున్నట్టుంది (2-77)

(కడిమిపూలు చిన్న చిన్న ఉండల్లాగా, చిన్న చిన్నబంతుల్లాగా ఉంటాయి. కాబట్టి ఆ ఉండల్తోనే మన్మథుడు తనహృదయానికి గురిపెడుతున్నాడని ఆమె భావం. చెర్రీపూలు జపనీయ కవిత్వంలో వసంతానికి ఎంత గాఢమైన కవిసమయమో కడిమిపూలు భారతీయ వర్షకవిత్వానికి అంత ప్రగాఢకవిసమయం)

(కవయిత్రి: అనులక్ష్మి)

9

గాలివానకి పైకప్పు చెదిరి
ధారాపాతంగా కురుస్తున్న ఇంట్లో
గోడమీద రాసుకున్న రోజుల్లెక్క
తడవకుండా చేతులడ్డుపెట్టుకుంటోంది (2-70)

(దూరదేశానికి వెళ్ళిన తన భర్త తిరిగి ఇంటికి ఎప్పుడొస్తాడో ఆమె రోజుల్లెక్కలు గీతలు గీసుకుంది. ఇప్పుడు వానకి ఆ గీతలు తడిసిపోకుండా చేతులు అడ్డుపెట్టుకుంటోంది.)

(కవి: జయసేనుడు)

10

అతడిలా వెళ్ళాడో లేదో
అప్పుడే వీథులు శూన్యమయ్యాయి
గుడులు, కూడళ్ళూ శూన్యమయ్యాయి
నా గుండె కూడా శూన్యమయ్యింది. (2-90)

(కవి: అమృతుడు)

1-7-2023

18 Replies to “ఆషాఢమేఘం-14”

 1. అద్భుతం.. నదీ తీరం .. చెరుకు తోటలు అక్కడ వికసించిన కవిత్వం మధురంగా వున్నాయి. అదొక “రసజ్ఞ సమాజం!” నేటికీ..తీర ప్రాంతంలో మాటలు ..కవిత్వం లాగే ఉంటాయి.

 2. గాథాసప్తశతి కి సరిఅయిన తెలుగులో అనువాదాలని చేసిన పుస్తకాలు తెలపండి.
  మీ వ్యాసంలు చదువుతుంటే వెంటనే ఆ పుస్తకం కొనుకోవాలి అనిపిస్తోంది.

  1. దీవి సుబ్బారావు గారు చేసిన అనువాదం మార్కెట్లో లభ్యమవుతోంది. ఆయన తేట వచనంలోకి అనువదించారు. డా. కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు గాథా త్రిశతి, గాధాచతుశ్శతి అని రెండు పుస్తకాలు వెలువరించారు. అందులో ప్రాకృతం, సంస్కృత ఛాయ, తెలుగు ఇంగ్లీష్ అనువాదాలు కూడా ఉన్నాయి.

 3. కోడూరి వారిదెప్పుడో కొన్నాను.మళ్లీ ఇటీవల వార పుస్తకాలు ఇరవై దాకా పంపించారు. అందులో ఇది కూడా ఉంది. వ్యాసం ఆద్యంతం పులకరింత కలిగించింది.
  విశ్లేషణ
  కవిత్వానికి
  వజ్రానికి సానబెట్టినట్లుగా

 4. కోడూరి వారి పుస్తకం వున్నది

  మొదలు పెట్టాలి

 5. నమస్తే సర్
  ఇలా రసోత్తర వివరణ, కవిత్వం చదవడం చాలా గొప్పగా ఉంది. మీ కృషికి ధన్యవాదాలు..

 6. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి వచ్చా.ఎంత తాజాగా వినిపిస్తున్నాయి సర్ ఈ గాథలు. సమూహ జీవనవిధానాన్ని వదిలి కుటుంబ వ్యవస్థ లోకి అడుగు పెట్టిన తర్వాత కలిగే భావనలు ప్రేమ ,విరహం ,ఋతువులు. ఇవే బేసిక్ అనిపిస్తాయి.

 7. 1,2,3,9 అద్భుత ఊహలు..అనువాదం గొప్పగా వుంది సార్

Leave a Reply

%d bloggers like this: