
కవిత్వం ఎందుకు? చాలా పెద్ద ప్రశ్న గాని, చాలా ఏళ్ళ పాటు కవిత్వంతో కలిసినడిచాక నేను తెలుసుకున్న సమాధానాలు చాలా సరళమైనవి. కవిత్వం ఎందుకంటే- అది ఈ ప్రపంచం మనకి అలవాటుగా మారకుండా కాపాడుతుంది. మనం ప్రపంచాన్నీ, మనుషుల్నీ, చరాచరాల్నీ చూడటంలో ఎప్పటికప్పుడు అలవాటుపడిపోతూ వస్తున్న మూసధోరణినుంచి మనల్ని విడిపిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేట్టు చేస్తుంది.
ఇందుకు గాను కవిత్వం రెండు సాధనాల మీద ఆధారపడుతుంది. ఒకటి మనం మాట్లాడే పద్ధతిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. శబ్దాల్ని వాడగా వాడగా అవి మన వాడుకలో బండబారిపోతాయి. మన హృదయంలో కలిగే సున్నితమైన స్పందనల్ని అంతే సున్నితంగా వ్యక్తీకరించగలిగే శక్తి పోగొట్టుకుని మోటుగా మారిపోతుంటాయి. కవిత్వం ఆ మోటుతనాన్ని ఎప్పటికప్పుడు చెక్కేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ‘నేనెంత రంపపుకోత అనుభవిస్తున్నానో నీకేం తెలుసు?’ అన్నాననుకోండి. నేనామాట అనగానే ఒక శ్రోతగా మీకు అర్థమయ్యేది నేను ఏదో గొప్ప బాధపడుతున్నానని మాత్రమే. కాని ఆ రంపంకోత అనే మాట దగ్గర ఒకసారి ఆగిచూడండి. పదునైన ఇనపపళ్ళ రంపాన్ని అటొకరూ, ఇటొకరూ పట్టుకుని నన్ను అడ్డంగా నరుకుతుంటే నేనెట్లాంటి బాధపడతానో, అదీ రంపంకోత అంటే. ఒక మనిషి పడగల బాధకి అంతకన్నా శక్తిమంతమైన పోలిక మరొకటి ఊహించలేం. కాని ఏమయింది? యుగాలుగా వాడుతూ వస్తున్నందువల్ల ఆ పదం తన స్ఫూర్తిని పోగొట్టుకుని బాధకి పర్యాయపదంగా మిగిలిపోయింది. అదే తిలక్ కవితా వాక్యం చూడండి: ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతూ ఉంటుంది’ అన్న మాట చూడండి. ఇందులో ‘రంపం కోత’ అనే మాటలో ఉన్నంత బాధలేకపోయినా, రంపపుకోత అనే మాట చెప్పగలిగినదానికన్నా ఎక్కువగా ఈ మాట కవి బాధని మనకి తెలియచేస్తోంది. కాబట్టి కవిత్వమంటే మన అనుభూతినీ, అభిప్రాయాల్నీ శక్తిమంతంగా వ్యక్తీకరించడానికి ఎప్పటికప్పుడు మన భాషని మనకి శుభ్రపరిచి ఇస్తుండే ఒక సాధనం. అలంకారికులు చెప్పే అన్ని రకాల శబ్దాలంకారాలూ, వక్రోక్తి, ఉక్తి వైచిత్రి మొదలైవన్నీ ఈ విభాగం కిందకొస్తాయి. దీన్ని స్థూలంగా పాశ్చాత్య ఆలంకారికులు చెప్పే metonymy గా కూడా లెక్కేయొచ్చు.
ఇక రెండవది, మనం లోకాన్ని చూసే పద్ధతి. అంటే మన ఇంద్రియసంవేదనలు మనకి ప్రపంచం గురించి ఇస్తున్న పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా పోల్చుకోడానికి కవిత్వం మన భావనా ప్రపంచం మీద పదేపదే పడే మసకలు చెరిపేస్తూ వస్తుంది. అంటే మనకి కొత్త కళ్ళూ, కొత్త చెవులూ, కొత్త ఆస్వాదననీ ఇస్తుందన్నమాట. సాధారణంగా కవులు వాడే ఉపమ, రూపకం లాంటి భావాలంకారాల ప్రయోజనం ఇదే. అవి మన ఆనుభవిక ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు దాని పరిమితులనుంచి బయటపడేస్తూ, మన ఇంద్రియచైతన్యాన్ని మరింత నిశితపరుస్తూ వస్తాయి. అలంకారికులు చెప్పే అన్ని రకాల అర్థాలంకారాలూ ఈ విభాగం కిందకొస్తాయి. పాశ్చాత్య సాహిత్యచర్చలో metaphor అనే పదం ద్వారా సంకేతిస్తున్నది వీటినే.
ఒకవైపు భాషని శుభ్రపరచడం ద్వారా, మరొకవైపు మన భావనని ఎప్పటికప్పుడు తేటపరచడం ద్వారా కవిత్వం మన ప్రపంచాన్ని నవీనపరుస్తో, ఆధునీకరిస్తో ఉంటుంది. అందుకని ఎవరినైనా కవి అని ఎప్పుడంటామంటే అతడి భాష, భావన- రెండింటిలోనూ ఈ కొత్తదనం మనకి కనిపించినప్పుడు. ఎవరు తన తర్వాతి తరాల భాషనీ, భావననీ గాఢంగా ప్రభావితం చేస్తారో వాళ్ళనే మహాకవులంటాం.
అయితే భాషాబలం మీద ఆధారపడ్డ కవి తన భాషా వక్తల్ని మాత్రమే ప్రభావితం చెయ్యగలుగుతాడు. కాని భావనలో కొత్త చైతన్యం తేగలిగిన కవి తన భాషమాట్లాడేవాళ్ళని కూడా దాటి ప్రపంచమంతా ప్రవహించగలుగుతాడు. కాబట్టే, ఆధునిక, సమకాలిక కవులు, ప్రపంచంలో చాలామంది, సరికొత్త అర్థాలంకారాలతో కవిత్వం చెప్పడం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అర్థాలంకారాలన్నిటినీ metaphor అనే ఒక్క పదంతో సూచిస్తున్నారు కాబట్టి, ఒక్క మాటలో చెప్పాలంటే, మంచి కవిత్వం మంచి మెటఫర్లని దర్శిస్తుంది, సృష్టిస్తుంది. సాధారణంగా ఒకప్పుడు గొప్పగా అనిపించిన మెటఫర్లు కాలక్రమంలో కవిసమయాలుగా, రానురాను పడికట్టుపదాలుగా మారిపోతుంటాయి. అంటే భాష మొద్దుబారిపోయినట్టే భావవ్యక్తీకరణ కూడా మొద్దుబారిపోతూ ఉంటుందన్నమాట. అందుకని గొప్ప కవి ఎప్పటికప్పుడు కొత్త మెటఫర్లకోసం వెతుక్కుంటూ ఉంటాడు. అంటే తాను లోనవుతున్న అనుభవాన్ని పోల్చుకోడానికి సరికొత్త పోలికకోసం వెతుక్కుంటూ ఉంటాడు. సాధారణంగా కంటికి కనిపించేదాన్ని మరొక గోచరవస్తువుతో పోల్చడం కూడా మామూలుగానే అనిపించినప్పుడు, గోచరవస్తువుని, అగోచరానుభూతితో పోల్చడానికి ప్రయత్నిస్తాడు. అగోచరానుభూతిని గోచరవస్తువుతో పోల్చడం పడికట్టుపదంగా మారిపోయినప్పుడు అగోచరానుభూతిని మరొక అగోచరానుభూతితో పోల్చగలమా అని చూస్తాడు. తనకి సన్నిహితంగా ఉన్న ప్రదేశానికీ, కాలానికీ చెందిన పోలికల్లో జవసత్త్వాలు లేవనిపించినప్పుడు, సుదూర ప్రాంతాలకీ, సుదూర కాలాలకీ చెందిన పోలికల్ని అన్వేషిస్తాడు.
అందుకనే, ఇరవయ్యవశతాబ్ది మహాకవుల్లో ఒకరైన స్వీడిష్ కవి తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ గురించి రాస్తూ రాబర్ట్ బ్లై ఇలా రాస్తున్నాడు:
‘ఒక పదచిత్రాన్ని పట్టుకోవడంలో తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ ది చిత్రమైన ప్రతిభ. అతనికి పదచిత్రాలు అలవోకగా స్ఫురిస్తాయా అనిపిస్తుంది. అతడి కవితల్లో మనకి కనిపించే అపారమైన వైశాల్యానికి కారణం అతడు తన పద చిత్రాల్ని తన మనోలోకంలో ఒకదాన్నుంచి మరొకటి సుదూరంగా విస్తరించి ఉన్న స్ఫురణలనుంచి ఏరితెచ్చుకోవడమే అనుకుంటాను. బహుసుదూరంగా ఉండే భిన్న ప్రాంతాలనుంచి వచ్చే రైళ్ళు కొంతసేపు పక్కపక్కనే ఆగి ఉండే రైల్వే స్టేషన్ లాంటివి ఆయన కవితలని చెప్పవచ్చు. వాటిల్లో ఒక రైలు చక్రాలకి రష్యన్ మంచుపెళ్ళలు అంటుకుని ఉంటే, మరొక రైల్లో మధ్యధరా సముద్రతీరం నుంచి తెస్తున్న తాజాపుష్పాలు కనిపిస్తాయి, మరొక రైలు మీద జర్మన్ బొగ్గుగనుల మసి రాలి ఉంటుంది.’
పదిపదిహేనేళ్ళుగా ట్రాన్స్ ట్రోమర్ ని చదువుతూ ఉన్నాను. చాలా చిన్న కవితలు. సంఖ్యలో కూడా మరీ ఎక్కువేమీ కాదు. కాని ఎప్పటికప్పుడు ఆ కవితలు నన్ను నివ్వెరపరుస్తూనే ఉన్నాయి. అందుకు కారణం కూడా బ్లై ఇలా చెప్తున్నాడు:
‘ఆ కవితల్లోని రహస్య శక్తికి కారణం ఆ పదచిత్రాలు అక్కడికి చేరడానికి ముందు చాలాదూరమే ప్రయాణించి ఉండటం. మల్లార్మే ఒకప్పుడు కవిత్వంలో మార్మిక శక్తి ఉండితీరాలని చెప్తూ, కవులు ఆ మార్మికతను సాధించడంకోసం అవసరమైతే ఆ కవితకీ, తక్కిన ప్రపంచానికీ ఉన్న లంకెలు తీసేయవచ్చని చెప్పాడు. కాని ట్రాన్స్ ట్రోమర్ తన కవిత్వంలో కవితలకీ, ప్రపంచానికీ ఉన్న ఆ లంకెని కావాలని పదిలంగా అట్టేపెడతాడు. అయినా కూడా ఎన్ని సార్లు చదివినా, ఆ కవితల్లోని రహస్యశక్తీ, అవి మనలో కలిగించే నివ్వెరపాటూ ఎప్పటికీ పాతపడవు.’
ట్రాన్స్ ట్రోమర్ (1931-2015) కవిత్వం 2011 లో నోబెల్ పురస్కారాన్ని అందుకుంది. రాబర్ట్ బ్లై (1926-2021) అమెరికన్ కవి, అనువాదకుడు. ప్రపంచ కవిత్వంతో అతడి పరిచయం, అవగాహన అద్వితీయాలు. నెరుడా నుంచి వల్లేజోదాకా, కబీర్ నుంచి మీరాబాయిదాకా, మచాడో నుంచి హఫీజ్ దాకా అతడు ప్రపంచమహాకవుల్ని ఎందరినో ఇంగ్లిషులోకి అనువదించాడు. కాబట్టి, ట్రాన్స్ ట్రోమర్ గురించి రాబర్ట్ బ్లై రాస్తున్న మాటలు మన సమకాలిక ప్రపంచంలో ఒక రసజ్ఞుడు ఒక మహాకవిగురించి రాసిన మాటలుగానే కాక, కవిత్వాన్ని ఎప్పటికీ పాతపడకుండా ఉంచే లక్షణాలేవో మన సమకాలికుడు చెప్తున్న మాటలుగా కూడా మనం గమనించాలి.
బ్లై ఇంతగా ప్రస్తుతిస్తున్న ట్రాన్స్ ట్రోమర్ కవిత ఒకటి ఇక్కడ చూద్దాం:
తుపాను
సాయంకాలం నడకలో అతడికి
పెద్ద ఓక్ చెట్టు కనిపించింది.
శిలగా మారిపోయిన కణుజులాగా ఉందది
పొడుగ్గా పరుచుకున్న దాని కొమ్ములు
హేమంతకాల సముద్రదుర్గపు
ముదురాకుపచ్చగోడని గోరాడుతున్నాయి.
ఉత్తరదిక్కునుంచి తరుముకొస్తున్న తుపాను.
కమలాఫలాలు పక్వానికొచ్చే తరుణం.
ఆ ఓక్ చెట్టు పైన ఎక్కడో సుదూరంగా
కొట్టంలో తొక్కిసలాడుతున్న
నక్షత్రమండలాల ఘోషనే
ఆ రాత్రంతా అతడి చెవుల్లో.
ఈ కవితలో నాలుగు మెటఫర్లు ఉన్నాయి. ఒకటి, శిలలాగా మారిపోయిన కణుజులాగా కనిపిస్తున్న ఓక్ చెట్టు. రెండవది హేమంతకాలపు సముద్రం ఏదో పాతదుర్గం తాలూకు నాచుపట్టిన గోడలాగా ఉండటం. మూడవది ఓక్ చెట్టు పైన ఆకాశం పశువుల కొట్టంలాగా లేదా గుర్రం సాల లాగా ఉండటం. ఇక నాలుగవది, తుపాను వస్తున్న చప్పుడు ఆ కొట్టంలో అసహనంతో కాళ్ళు తాటిస్తున్న నక్షత్రమండలాల ఘోషలాగా ఉందనడం. ఈ నాలుగు పోలికల్లోనూ, బ్లై చెప్పినట్టుగా, ఉపమాన, ఉపమేయాల మధ్య చెప్పలేనంత దూరం ఉంది. ఇవి మనం మామూలుగా ఊహించగలిగినవి కావు. కానీ తీరా ఇక్కడ చదవగానే, ఇవి మనలో రేకెత్తించే స్పందనలు మామూలు స్పందనలు కావు. గతంలో నేను ట్రాన్స్ ట్రోమర్ గురించి రాస్తూ దీన్ని రూపకప్రజ్ఞ అన్నాను. ఇటువంటి రూపక ప్రజ్ఞ నాకు ఏ కవిలో కనిపించినా అతడికి తక్షణమే ఆరాధకుడిగా మారిపోకుండా ఎలా ఉండగలను?
మరి ఇప్పుడు ఈ కవిత చూడండి.
పగిలిన నత్తగుల్ల పెంకులోంచి
బయటికొస్తున్న నల్లికిల్లపాముతోకలాగా-
మాగినమామిడిపండు టెంకలోంచి
లేతమొలక పొడుచుకొస్తున్నది.
చదవగానే ఈ కవితలో మనల్ని చప్పున పట్టుకునేది ఆ పోలిక. చెత్త కుప్పమీద పారేసిన మామిడిటెంక పాతబడి నల్లబడింది. దానిలోంచి ఒక లేతమొలక బయటికి పొడుచుకొస్తున్న దృశ్యం పగిలిన నత్తగుల్ల పెంకులో నల్లికిళ్ళపాము తోక బయటికొస్తున్నట్టు కనిపిస్తున్నదట. ఈ కవిత దగ్గర మనం ఒక క్షణం ఆగి చూద్దాం. మొదటిది, ఈ రెండు పోలికలమధ్యా ఉన్న దూరం. ఇవి రెండూ మనం పనికిరావని భావించిన ప్రపంచానికి చెందినవే అయినా, ఒకదాన్ని చూడగానే మరొకటి స్ఫురించేటంత దగ్గర పోలికలు కావు. రాబర్ట్ బ్లై చెప్పినట్లుగా, ఈ పోలికలు రెండు సుదూరప్రపంచాలనుంచి ప్రయాణిస్తో, క్షణకాలం పాటు కవి మనస్సులో ఆగాయి. రెండవది, పగిలిన చిప్ప లోంచి బయటికొస్తున్న నలికిరిపాము తోక, మామూలుగా చూస్తే, సుందరవస్తువు కాదు. నిజానికి దాన్ని మనం చూడటానికి కూడా ఇష్టపడం. అది మనలో తెలీకుండానే ఒక జుగుప్స రేకెత్తిస్తుంది. కాని కవి ఇక్కడ లేత మామిడి మొలకతో పోల్చడం ద్వారా దాన్ని ఒక్కసారిగా సుందరదర్శనీయ వస్తువుగా మార్చేసాడు. అంతేనా? రెండింటిలోనూ ఒక మెరుపు, ఒక నిగనిగ, ఒక లావణ్యం మనం వద్దనుకున్నా కూడా కనిపించకుండా ఉండవు.
ఏ విధంగా చూసినా ఈ మెటఫర్ లో కనిపిస్తున్న రూపకప్రజ్ఞ అత్యున్నతమైందని ఇప్పుడు మీరు అంగీకరిస్తారనే అనుకుంటున్నాను. ఆ పోలిక మిమ్మల్ని నివ్వెరపరిచిందికదా, అంతకన్నా నివ్వెరపరిచే మరొక విషయం చెప్తాను. ఇది ఇప్పటికి రెండువేల ఏళ్ళకిందట, బమ్మరాజు అనే ప్రాకృత కవి చెప్పిన కవిత. దీన్ని చూసి ముచ్చటపడి హాలుడు తన గాథాసప్తశతిలో (1:62) చేర్చుకోకుండా ఉండలేకపోయాడు.
తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ కవిత్వం ఇంతాచేసి ఒక శతాబ్దకాలం కూడా పూర్తిచేసుకోలేదు. కాని ఇరవై శతాబ్దాల కిందటి, ఈ కవితలోని మెటఫర్ లోని mystery, surprise ఇన్ని యుగాల తరువాత కూడా పాతబడలేదంటే ఏమనాలి!
గొప్ప కవిత్వం మన భాషనీ, భావననీ ఎప్పటికప్పుడు తేటపరుస్తూ, ఈ ప్రపంచం మనకొక అలవాటుగా మారిపోకుండా కాపాడుతూ వస్తుందని చెప్పాను. కవిత్వం కోరుకునే ప్రయోజనం అంతవరకే. అంతకుమించిన ప్రయోజనాలు కవిత్వ అభివ్యక్తికి ఉండవు. నిజమైన కవిత్వానికి ఎజెండా ఉండదు. బుచ్చిబాబు చెప్పినట్టుగా అది నీకు జీవితాన్ని జీవించదగ్గదిగా మారుస్తుంది అంతే. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు నీ ముందు సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. కాని ఆ శక్తి అనన్యసామాన్యమైన శక్తి. అందుకనే పూర్వకాలంలో మతాలూ, ఇప్పటికాలంలో రాజకీయాలూ కవుల్నీ, కవిత్వాల్నీ తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే చూస్తూ వచ్చాయి.
కాని ప్రాచీన సంగం కవిత్వం, గాథాసప్తశతి ల్లో కనవచ్చే కవిత్వం మతంతోనూ, రాజకీయాల్తోనూ సంబంధం లేనిది. అందులోనూ గాథాసప్తశతి కవిత్వానికి రాజ్యం, ధర్మం, దైవం- వేటిపట్లా పట్టింపు లేదు. తర్వాత రోజుల్లో సంస్కృత అలంకారికులు, వ్యాఖ్యాతలు గాథాసప్తశతిలోని చాలా గాథల వెనక ఏదో ఒక్క ఉద్దేశ్యాన్ని, చాలా సార్లు, తక్కువ స్థాయి శృంగారరసాన్ని అంటగట్టడానికి ప్రయత్నించి, ఆ కవితల్లోని స్వారస్యాన్ని చెరుస్తూ వచ్చారు. కాని ఆ వ్యాఖ్యలతో నిమిత్తంలేకుండా ఆ కవితలు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా తమని సమీపించినపాఠకుడి కళ్ళముందు సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోనే ఉన్నాయి.
ఈ కవిత (1:63) చూద్దాం:
చూడు, కాళ్ళమధ్య దారాన్ని తొక్కిపట్టి
చూరుమీంచి కిందకు జారుతున్న సాలీడు-
కనిపించని దారానికి కట్టిన
బొగడపువ్వులాగా కనిపిస్తున్నది.
ఇది సామాన్యమైన మెటఫర్ కాదు. ఎన్ని సార్లు చదివినా ఈ కవిత నన్ను నిశ్చేష్టుణ్ణి చేస్తూనే ఉంది. ఎందుకంటే, ఈ కవిత ద్వారా కవి చూపిస్తున్న దృశ్యానికి మరే అదనపు ప్రయోజనమూ లేదు. వ్యాఖ్యాతలు దీనికి కూడా గూఢార్థాలూ, నర్మార్థాలూ వెతికి ఉండవచ్చుగాక. కానీ ఈ కవిత ప్రయోజనం రెండు సుదూర విరుద్ధాంశాల్ని ఒకదానితో ఒకటిపోల్చడం ద్వారా మనదృష్టికొక నవ్యతను తీసుకురావడం. ఇందులో ఏదైనా ప్రయోజనం ఉందంటే అది సౌందర్యప్రయోజనం తప్ప మరేమీ కాదు. ఒక సాలీడుని చూడటంలో మనకేమీ సంతోషం ఉండదు. కాని ఒక బొగడపువ్వు, ఎండినా కూడా మనలో ఎంతో కొంత రసస్పర్శ కలిగించకుండా మానదు. సాలీడు దూరంగా పెట్టవలసిందనీ, బొగడపువ్వు దగ్గరగా తీసుకోవలసిందనీ మనలో మనకు తెలీకుండానే ఒక తారతమ్య విచక్షణ ఉంటుంది. కానీ కవికి ఆ రెండు సమానమే. అతడికి వాటిలో ఏ ఒక్కదానిపట్లా హేయోపాదేయ దృష్టిలేదు. అతడు చూసింది వట్టి సాలీడుని కాదు, ఆ చిన్ని కీటకాన్ని ఎంత active posture లో చూసాడతడు! పాదాలమధ్య దారం నిగడదన్ని చూరుమీంచి కిందకు జారుగా వేలాడుతున్న సాలీడుని చూసాడు, చూపిస్తున్నాడు. ఒక కీటకాన్ని ఇంత తదేకంగా చూడగలిగిన కవి నాకు ప్రపంచ సాహిత్యంలో హైకూ కవి ఇస్సా మాత్రమే కనబడుతున్నాడు! ఒక సాలీడుని బొగడపువ్వుతో పోల్చడం. రసైక దృష్టి అంటే ఇది. ఇటువంటి కవిత చదివిన తర్వాత మన నేత్రాలు విచ్చుకోకుండా ఎలా ఉంటాయి? ఇటువంటి కవిత చదివాక ప్రపంచంలో మనం దేన్నైనా అనాకారి అని గాని, అందమైంది అనిగాని ఎలా వింగడించగలుగుతాం? ‘కాదేదీ కవితకనర్హం’ అని మన మహాకవి మనకి చెప్పడానికి రెండువేల ఏళ్ళముందు చెప్పిన కవిత ఇది అంటే వళ్ళు గగుర్పాటుపొందకుండా ఎలా ఉండగలదు?
ఈ కవిత సాధించిన ప్రయోజనం ఏమిటి? – అది మన చైతన్యమనే నిప్పు ఆరిపోకుండా ఒక్కసారి దాన్ని ఉప్ఫని ఊదడం. మన ఇంద్రియాల మీద అప్పటిదాకా కమ్ముకున్న నివురు ఆ క్షణం ఎగిరిపోయి మన ఇంద్రియాలు మళ్లా తేటపడటం. గాథాసప్తశతి చదువుతున్నంత సేపూ మన ఇంద్రియచైతన్యం ఇలా కణకణలాడుతూనే ఉంటుంది.
30-6-2023
కవిత్వ ప్రయోజనం మొదలుకొని చివరి గాథా సప్తశతి ఉదాహరణల వరకు చదువుతుంటే ఒక రసోద్వేగం, మాటలకందని భావం మనసును రంజింపజేసింది. శుభోదయం.
ధన్యవాదాలు సార్
ఇది చదివిన తరువాత..
ఆకాశం నుండి వేగంగా దూకిన గంగ..
శివుని జటాజూటంలో పడి..
సుడులు తిరుగుతూ..
బయట పడే మార్గం తెలియక..
అక్కడే పరవళ్ళు తొక్కుతూ..
ఉండిపోయినట్లు..
నా మనసుకు కలిగిన ఆనందానుభూతిని..
వర్ణించడానికి.. నా భాష సహకరించడం లేదు..
నమస్సుమాంజలులు.
ధన్యవాదాలు మేడం
నేను ఊహించనట్లే మీరు ఈ సారి గాథా సప్తశతి గురించి ప్రస్తావించడం సంతోషం
కలిగించింది.
తమిళులకి సంగం సాహిత్యం మీద వున్న మక్కువ, మన గాథా సప్తశతి కి పై మనవారికి లేదు అని అనిపిస్తుంది. సంగం పోయెట్రి గురించి ఏ సగటు తమిళుడిని అడిగినా చెప్పగలరు. బహుశా వాళ్ళ కి పాఠ్యాంశాలు గా ఉండేవనుకుంటాను. గాథా సప్తశతి గురించి మరింత తెలుసుకోవాలని నా ఆశ మీద్వారా నెరవేరబోతోంది అనుకుంటున్నాను.
అసలు కవిత్వం ఏ రూపంలో వున్నా మనసుని, మస్తిష్కాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదయమే మీ కుటీరానికి రావడం కాసిని పద్యాలను చదవడం .. ఈ వ్యాపకం తో రోజంతా తాజాగా వుంటుంది.
ధన్యవాదాలు సర్.
ధన్యవాదాలు మేడం
మళ్లీ కవిత్వం రాయాలని అనిపించేంత బాగుంది sir
ధన్యవాదాలు సుధా!
అబ్బ…అన్నపదం ఇంకా నిత్యనూతనంగానే
వుందేమో మనల్ని చైతన్యపరుస్తూ.
అందుకే మీ ఈ విశ్లేషణ చదువుతుంటే ఈ పదం అప్రయత్నంగా స్ఫురించింది.
మరో మాట కూడా…అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అన్న పోలికకి అక్షరరూపం ఇచ్చినట్టూ….ఇన్ని చక్కటి విషయాలు వివరిస్తున్న మీకు హృదయపూర్వక నమస్సులు సర్🙏🙏🙏
ధన్యవాదాలు మేడం
“కవిత్వం ఎందుకు…? ”
ఎవ్వరైనా, ఎక్కడైనా ఇలా చెప్పారా?
ఇన్నాళ్లకు గానీ … మోక్షం!
ధన్యవాదాలు సర్.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
నమస్తే సర్
చాలా విలువైన వ్యాసం ఇది… పాఠకులలూ రచయితలూ తప్పక చదవాలి. రచన ఉబుసుపోక రాసేది కాదు.. భావపు ఉక్కపోత పోతలోంచి రాసేది…ఆ భావాల విలువ మీరిప్పుడు చెప్పారు … ధన్యోస్మి..
ధన్యవాదాలు మేడం
Thank you, sir.