ఆషాఢమేఘం-12

ఇప్పుడు మనం తమిళసీమ దాటి వింధ్య-గోదావరీ ప్రాంతంలోకి ప్రవేశిద్దాం. సంగకాల సాహిత్యం నుంచి ప్రాకృత సాహిత్యంలోకి అడుగుపెడదాం. ప్రాకృత కవిత్వంలో అత్యుత్తమ కవితాసంకలనం అని చెప్పదగ్గ గాథాసప్తశతి గురించి మాట్లాడుకోబోయేముందు నిజానికి సంగకాలానికి చెందిన మరొక రెండు కావ్యాల గురించి కూడా చెప్పుకోవలసి ఉంది. ఒకటి సంగం సాహిత్యంలోని పదిపాటల్లోనూ సర్వోత్తమమైందిగా చెప్పదగ్గ ‘నెడునల్ వాడై’ గీతం. మధురై కేంద్రంగా పనిచేసిన మూడవ సంఘానికి అధ్యక్షుడూ, సంగకాలకవుల్లో అత్యంతప్రతిభావంతుడూ అయిన నక్కీరర్ రాసిన కావ్యం అది. మరొకటి సంగసాహిత్యంలోని ఎనిమిది సంకలనాల్లో చివరిదైన ‘పరిపాడల్’ లో వైగై నది గురించిన కొన్ని గీతాలు. కాని ఈ రెండు గీతాల్లోనూ కనవచ్చేది తొలివానాకాలం కాదు, నడివానాకాలం, కుంభవృష్టి కురిసి వైగైలో వరదలు ముంచెత్తేకాలం పరిపాడల్ కవిత్వానిదైతే, నడివానాకాలం ముగిసి, శీతాకాలం మొదలయ్యేకాలం నెడునల్ వాడై గీతానిది. అందుకని ఈ రెండు కవిత్వాల పరిచయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తూ నేరుగా ప్రాకృత సాహిత్యంలోకి మిమ్మల్ని తీసుకుపోతున్నాను.

సా.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన శాతవాహన చక్రవర్తి, కవి వత్సలుడు అయిన హాలుడు సంకలనం చేసిన 700 పద్యాల గాథాసప్తశతి లాంటి కవిత్వ సంకలనం ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ కవిత్వం నర్మద, తపతీ నదీపరీవాహకప్రాంతాల్లోనూ, వింధ్యపర్వతాల్లోనూ కొంతా, అత్యధికభాగం ప్రస్తుత తెలంగాణా ప్రాంతంలోని గోదావరీ పరీవాహకప్రాంతంలోనూ వికసించింది. ఆ విధంగా అది మన తెలుగువాళ్ళ తొలి కవిత్వం కూడా.

గాథాసప్తశతిలో ఆషాఢమేఘాల్ని పోల్చుకునేముందు, అసలు ప్రాకృత కవిత్వం గురించే కొన్ని మాటలు చెప్పుకోవాలి.

ఆధునిక తెలుగు సాహిత్యంలో గతశతాబ్దిలో కళ్ళు తెరిచిన నాబోటి పిపాసులందరి పరిస్థితీ దాదాపుగా ఒకటే. మాకు ప్రాచీన తెలుగు కవిత్వం కన్నా ముందు ఇంగ్లిషు కవిత్వమూ, భారతీయ భాషా కవిత్వాల కన్నా ముందు పాశ్చాత్య కవిత్వాలూ పరిచయమయ్యాయి. ఈ సమస్య ముందునుంచీ ఉంది. పంతొమ్మిదో శతాబ్ది చివరలో కొత్తగా నెలకొల్పిన విశ్వవిద్యాలయాల్లో తలెత్తిన కొత్త విద్యాధిక తరానికి కాళిదాసుకన్నా ముందు కీట్స్ పరిచయమయ్యాడు. భవభూతికన్నా ముందు షేక్స్పియర్ పరిచయమయ్యాడు.

ఇరవయ్యవశతాబ్ది ప్రారంభంలో గురజాడ, కవికొండల, దీక్షితులు, గరిమెళ్ళ సత్యనారాయణ వంటి కవులు దేశిపద్ధతిలో కావ్యగానం చేసినప్పటికీ, భావకవులకు స్ఫూర్తినిచ్చింది వర్డ్స్ వర్త్, కాలరిడ్జి, కీట్స్, షెల్లీ, బైరన్ లే. అయితే కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటి కవులకున్న గాఢ సంస్కృతసాహిత్య నేపథ్యం వారిని కవులుగా నిలబెట్టడానికి ఉపకరించిందే తప్ప, వారి పాఠకులు తిరిగి సంస్కృత సాహిత్యాన్ని అంతే గాఢంగా ప్రేమించేటట్లు చేయలేకపోయింది, అందుకు ఉదాహరణ శ్రీ శ్రీనే.

కృష్ణశాస్త్రి, విశ్వనాథ కవిత్వాల స్ఫూర్తిలో ‘ప్రభవ’ పద్యాలు రచించిన శ్రీ శ్రీ, ఆ తరువాత గురజాడ తనని మేల్కొల్పాడని చెప్పుకున్నప్పటికీ, మహాప్రస్థాన కాలంలో అతడిని ఆవహించిన కవులు స్విన్ బర్న్, ఎడ్గార్ ఎలన్ పో వంటి ఆంగ్ల-అమెరికన్ కవులు మాత్రమే. అభ్యుదయ ఉద్యమం వికసించేనాటికి శ్రీ శ్రీ పాశ్చాత్య సాహిత్యంలో అసమ్మతి వాదులైన కవుల్ని ఒక పక్కా, వివిధ రకాల చిత్ర, విచిత్ర సాహిత్య శిల్ప ఉద్యమాలకు నాంది పలికిన కవులను మరొకపక్కా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ‘ఖడ్గసృష్టి’లో ఆయన చేసిన అనువాదాలు ఒకవైపు పాల్ ఎలార్డ్, గిలాం అపోలినార్ వంటి ఫ్రెంచి కవులవీ, మరొకవైపు వ్లదిమీర్ మయకోవస్కీ లాంటి ఫూచరిస్టు కవులవీ. ఆ తర్వాత విప్లవ సాహిత్యోద్యమం పోటెత్తిన కాలంలో శ్రీ శ్రీ ఉత్తరార్థగోళంలోని పాశ్చాత్యకవుల్ని వదిలిపెట్టి, దక్షిణార్థగోళంలో, అణగారిన జాతులకూ, దేశాలకూ గొంతునిస్తున్న పాబ్లోనెరూడా, అగస్టినో నెటో వంటి కవులనుంచి స్ఫూర్తిపొందుతూ ఉన్నాడు.

కాని దాదాపు అరవయ్యేళ్ళకు పైగా కొనసాగిన తన సాహిత్య ప్రయాణంలో ఆయన ఎక్కడా ఒక తమిళకవినిగాని, హిందీ, మరాఠీ, పంజాబీ కవిని గాని అనువదించిన సూచనలు లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఎక్కడా ఎప్పుడూ ఏ ఒక్క ప్రాకృత కవి గురించిగాని, ప్రాకృత కవిత్వం గురించి గాని మాట్లాడలేదు. పైగా కవిత్వం ఎలా రాయకూడదో తెలియాలంటే, ప్రాచీన కవిత్వం చదవాలని చాలాసార్లు అన్నాడు. అదొక గమ్మత్తైన వాక్యం. ఆ వాక్యం మొదటిసారి చదివినప్పుడు, ఎవరికైనా సరే, ప్రాచీన కవిత్వం కవిత్వం కానే కాదు అనే అర్థం స్ఫురిస్తుంది. కానీ శ్రీ శ్రీ చెప్తున్నది, కవిత్వం ఎలా రాయకూడదో, ఆ మెలకువలు, అంటే కవిత్వ రచనలో దోషాలు పరిహరించుకోవడమెలానో ప్రాచీన కవిత్వం చెప్తుందని కూడా అని అనుకోవచ్చు. కావాలని, తెలిసే, శ్రీ శ్రీ ఆ వాక్యంలో ఆ ambiguity ని అట్టేపెట్టాడనిపిస్తుంది.

శ్రీ శ్రీ గురించి ఇంత విస్తృతంగా ఎందుకు రాసానంటే, గత శతాబ్దంలో తెలుగులో సాహిత్య కృషి సాగించినవాళ్ళల్లో గురజాడ తరువాత ప్రపంచ కవితారీతుల పట్ల ప్రశంసనీయ జాగృతి కలిగినవాడు శ్రీ శ్రీనే కాబట్టి. కాని అంత జాగృతి చూపించినవాడు కూడా ప్రాచీన, సమకాలిక భారతీయ కవిత్వాలకు వచ్చేటప్పటికి మౌనం వహించడం నా వరకూ నన్ను చాలాకాలం పాటు కలవరపరుస్తూనే ఉంది. శ్రీశ్రీ తర్వాత అంత స్థాయిలో ప్రపంచ కవిత్వాల గురించి ఎరుక చూపించిన కవులు బైరాగి, ఇస్మాయిల్ వంటి వారు కూడా శ్రీశ్రీ కన్నా మరికొంత మాత్రమే ముందుకు వెళ్ళగలిగారు. ఆధునిక భారతీయ కవులు, హిందీ, మరాఠీ, బెంగాలీ కవులు, మర్దేకర్, జీవనానంద దాస్, ముక్తిబోధ్ వంటివారిని బైరాగి అనువదించగా, చీనా, జపాన్ కవుల్ని ఇస్మాయిల్ అనువదించాడు. ఆ మేరకు వారు అంతదాకా తెరిచి ఉన్న పడమటివేపు కిటికీలతో పాటు, తూర్పు వైపు కిటికీల్ని కూడా కొన్ని తెరిచినట్టయ్యింది. కాని ఒక కవితా ప్రక్రియగా హైకూ, సెనెర్యూ వంటి వాటి గురించి ఎంతో సాధికారికంగా మాట్లాడిన ఇస్మాయిల్ ప్రాచీన భారతీయ కవిత్వం విషయానికి వచ్చేటప్పటికి నిశ్శబ్దం వహించడం ఎంతో నిరాశపరుస్తుంది.

ఇందుకు చాలా కారణాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం, ఆధునిక తెలుగు సాహిత్యవేత్తలు, రచయితలు తాము సాహిత్యం చదివే పద్ధతులూ, సాహిత్యాస్వాదన మెలకువలూ ప్రధానంగా ఆధునిక పాశ్చాత్యసంప్రదాయాల్ని బట్టే అలవర్చుకున్నారు. ఆధునిక పాశ్చాత్య సాహిత్యధోరణుల్లో, ముఖ్యంగా ఐరోపీయ సాహిత్యాస్వాదనా పద్ధతులతో మనం ఒక్క సంస్కృత శ్లోకాన్ని కూడా అర్థం చేసుకోలేం, ఆస్వాదించలేం. ఆధునిక పాశ్చాత్యపద్ధతిలో సాహిత్యం చదవడం అలవాటుచేసుకున్నవాళ్ళకి ఆ పద్ధతిలోనే సాహిత్యసృజన కూడా అలవాటాయ్యింది. తిరిగి తమ రచనలు చదవడానికి తమ పాఠకులను కూడా వారు ఆ పద్ధతుల్లోనే తర్ఫీదు చేసుకున్నారు.

అలాకాక, ప్రాచీన సంస్కృత సాహిత్య సంప్రదాయంలో రచనలు చేసిన కవులు దాదాపుగా పద్యరచననే కొనసాగించినప్పటికీ, వారికి కూడా పాఠకుల సమస్య ఎదురయ్యింది. వారి పాఠకులంతా వారిలాగా సంస్కృత సాహిత్యంతో గాఢమైన పరిచయం ఉన్నవారు కారు. ఆ పాఠకులు కొంత సంస్కృతం చదివారు, కొంత కొత్త చదువులు చదివారు. వారి కొత్త చదువులు వారికి సాహిత్యావసరాన్ని కలిగించాయి గాని, సంస్కృత సాహిత్యంతోనూ, ప్రాచీన తెలుగు సాహిత్యంతోనూ గాడ పరిచయం లేనందువల్ల వారికి ఆ కవిత్వం ఎలా ఉండాలో తెలియలేదు. తగిన సాహిత్య రసాస్వాదన శిక్షణలేకపోవడం వల్ల వాళ్లు ఆ కవిత్వం సాధారణపాఠకుణ్ణి ఆకట్టుకునేదిగా ఉంటే చాలని అనుకున్నారు. అంటే ఆ పాఠకుడికి ఎటువంటి కనీస శిక్షణా లేకపోయినా కూడా ఆ పద్యాలు ఆ పాఠకుడికి అర్థమయ్యేవిగా ఉండాలని అనుకున్నారు.

ఇందుకు చక్కటి ఉదాహరణ విశ్వనాథ కవిత్వం. విశ్వనాథ సాహిత్యాధికారం ప్రశ్నించలేనిది. కాని ఆయన పాఠకుల సాహిత్యాధికారం మాత్రం సందేహించదగ్గది. కాబట్టి విశ్వనాథ చాలాసార్లు తనకు ఉత్తమ కవిత్వం అనిపించినదానికన్నా తన పాఠకులకు ఉత్తమ కవిత్వంగా కనిపించాలని రాసిందే ఎక్కువ. పాఠకులు తమకు అర్థమైనదానికే విలువకట్టడానికి ప్రయత్నిస్తారు. యుగధర్మం పట్టునుండి విశ్వనాథ తప్పించుకోగలిగినప్పటికీ, విశ్వనాథ పాఠకులు మాత్రం ఆధునిక జీవిత ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. అందువల్ల విశ్వనాథ కవిత్వంలో అధికభాగం శ్రేష్ఠకవిత్వంగా కబడుతుందే తప్ప, నిజంగా అత్యున్నత స్థాయి కవిత్వం కాదు. ఇలా సాహిత్యరసాస్వాదనలో తగినంత శిక్షణ లేని పాఠకుల వల్ల, శ్రీశ్రీ , విశ్వనాథ ఇద్దరూ కూడా భారతీయ సాహిత్యంలో అత్యుత్తమ అంశాలను తమ పాఠకులకు పరిచయం చెయ్యలేకపోయారు.

ఆధునిక సాహిత్య విమర్శకులు, ముఖ్యంగా వామపక్ష భావజాలంలో పుట్టిపెరిగినవాళ్ళు, ప్రాచీన భారతీయ సాహిత్యాస్వాదన పద్ధతులు ప్రాచీన సమాజాలకు మాత్రమే పనికొస్తాయనీ, ఆధునిక జీవితాన్నీ, ఆధునిక సాహిత్యాన్నీ అర్థం చేసుకోడానికి వాటికి శక్తిలేదనీ గత యాభై అరవయ్యేళ్ళకు పైగా తెలుగు పాఠకులను నమ్మిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఎనభైల చివరిదాకా ఆ మాటలు నేను కూడా నమ్మాను. కాని నేడు నాకు బోధపడినదేమంటే, ప్రాచీన సాహిత్యాలను అర్థం చేసుకునే శక్తి ఆ విమర్శకులకే లేదని. తమ అశక్తతను వారు ప్రాచీన సాహిత్య అశక్తతగా మభ్యపెడుతూ వచ్చారని. నేడు యూరప్ లో, అమెరికాలో ఏ విశ్వవిద్యాలయంలోనైనా సాహిత్యవిమర్శకోసం రూపొందించిన పాఠ్యపుస్తకాలు చూడండి: దాదాపుగా అవన్నీ అరిస్టాటిల్ ‘పొయెటిక్స్’ తో, ప్లేటోతో, లాంగినస్ ‘థీరీ ఆఫ్ సబ్లైమ్’ తో మొదలవుతాయి. తెలుగుసాహిత్య విమర్శలో ఒక్క పాఠ్యపుస్తకమైనా, ఒక్క సంకలనమైనా అగ్నిపురాణంతో, విష్ణుధర్మోత్తర పురాణంతో, నాట్యశాస్త్రంతో, తొల్కాప్పియంతో మొదలవుతుందా? ఇరవయ్యవశతాబ్ది తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన సాహిత్యవేత్తలకు వాటి గురించి తెలియవలసినంతగా తెలియకపోవటమే అందుకు కారణం అనుకుంటున్నాను.

‘నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వంలాగా’ 21 వ శతాబ్దంలో ప్రాచీన సాహిత్య లక్షణ గ్రంథాల ప్రసక్తి ఎందుకని ఎవరన్నా అడగవచ్చు. కాని అలా అడుగుతున్నవారు అసలు ఆ ప్రశ్నలన్నిటికి బదులు, అసలు సాహిత్యం మాత్రం ఇప్పుడెందుకని అడిగితే ఇంకా మంచిది. సాహిత్యానికీ, జీవితానికీ; సౌందర్యానికీ, వాస్తవానికీ మధ్య సరిహద్దులు తెలిసినవాళ్ళకి సాహిత్యం ఒక శాశ్వత మానవావసరం అని బోధపడుతుంది. సాహిత్యం జర్నలిజంకన్నా ప్రత్యేకమైనదని గుర్తించగలిగితే, ఒక వార్తాకథనం నుంచి ఒక కథను లేదా కవితను వేరుచేసే విశిష్టత ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. ముఖ్యంగా భారతీయ ఆకాశం కింద భారతీయ సాహిత్యవిలువల గురించిన అన్వేషణను ఫలవంతం చేయాలంటే ప్రాచీన భారతీయ కవిత్వాలతో, ప్రాచీన భారతీయ లక్షణ గ్రంథాలతో పరిచయం తప్పనిసరి. అరిస్టాటిల్ పొయెటిక్స్ చదివి మనం గ్రీకు ట్రాజెడీలను అర్థం చేసుకోగలుగుతాం. కాని భవభూతి ఉత్తరరామచరితను అర్థం చేసుకోడానికి ఆ వెలుతురు సరిపోదు. ఇలియట్ విమర్శ చదివి ఇలియట్ కవిత్వాన్ని సమీపించగలుగుతాం. కాని ఇలియట్ కు సమకాలికుడిగా తెలుగులో కవిత్వం రాసిన కవికొండల వెంకటరావును అర్థం చేసుకోడానికి ఇలియట్ విమర్శ మనకేవిధంగానూ ఉపకరించదు. అందుకు మన సాహిత్యసంప్రదాయాల పరిచయం కావాలి. ఆ సంప్రదాయాల గురించి తెలిసినవాళ్ళూ, మాట్లాడేవాళ్ళూ, బోధపరిచేవాళ్ళూ అరుదైపోతున్న కాలంలో అందుకు తగ్గ మూల్యం కూడా మనం చెల్లించవలసి వచ్చింది. కాబట్టే కవిత్వం రానురాను కవిత్వంగా నిలబడటం మానేసి ఒక నినాదంగా, ఒక ప్రకటనగా, ఒక అరుపుగా, ఒక నిందగా, ఒక నిట్టూర్పుగా మాత్రమే వినబడుతున్నది.

ఇటువంటి పరిస్థితిలో ప్రాచీన ప్రాకృత కవిత్వం నాకు సాక్షాత్కరించినప్పుడు వానాకాలంలో నేరేడుచెట్ల అడవి కనబడ్డంత సంతోషం కలిగింది. నా చిన్నప్పుడు మా ఊరి పొలిమేరల్లో ఉండే నేరేడు చెట్ల అడవి నన్నెప్పుడూ ఊరిస్తూ ఉండేది. ఎడతెరిపిలేని ముసురు మా ఊరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు మా అన్నయ్య వెంటబడి నేను కూడా ఆ అడవిదారుల్లో పరుగెడుతుండేవాణ్ణి. ఏ కొమ్మ చూసినా నిండుగా విరగపండిన నేరేడుపండ్లే. చెట్లమీద అలానే పండి అలానే నేలకు రాలుతున్న ఆ పండ్లు ఆ వానాకాలపు ఎర్రనీళ్లతో కలిసి ముదురు ఎరుపు, ఊదారంగు కలగలిసిన గీతలతో, చారలతో ప్రవహిస్తుండే ఆ దృశ్యం నేనెప్పటికీ మరవగలిగింది కాదు. ఆ రోజులు మళ్ళా రమ్మన్నా వచ్చేవి కావు. కాని ప్రాచీన ప్రాకృత కవిత్వం చేతుల్లోకి రాగానే ఆ వానాకాలపు నేరేడు చెట్ల అడివి నా కిటికీ దగ్గరకు వచ్చినట్టనిపించింది. అంతదాకా నా జీవితంలో చదువుకుంటూ వచ్చిన ఆధునిక విమర్శ ఆ రసరమ్య ప్రాచీన ప్రపంచాన్ని నాకు తెలియకుండా దాచి ఉంచిందనీ, అప్పటికే నేనెంతో పోగొట్టుకున్నాననీ అనిపించింది.

ప్రాకృత కవిత్వమే కాదు, ఆ కవిత్వాన్ని అస్వాదించి, వ్యాఖ్యానించి, దాన్ని, భగవద్గీతతోనూ, వాల్మీకితోనూ సమానంగా నిలబెట్టి, దాన్ని పైకెత్తి చూపించిన ప్రాచీన సంస్కృత ఆలంకారికులకు కూడా నా పునః పునః ప్రణామాలు. కవిత్వమంటే ఏమిటో, నిజమైన కవిత్వాన్ని ఎలా గుర్తించాలో, సాధారణ పదాలు కవిత్వంగా ఎప్పుడు ఎలా మారతాయో ఎంతో విజ్ఞతతో, విశ్లేషణతో వివేచించిన ఆ లాక్షణికుల రచనలు చదువుతుంటే, ఆ పఠనంలో గడిపిన క్షణాలే నిజంగా బతికిన క్షణాలనిపిస్తాయి.

క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి సా. శ ఎనిమిదవ శతాబ్దందాకా దాదాపు వెయ్యేళ్ళకు పైగా గోదావరీ, నర్మదా తీరాల్లో వికసించిన ప్రాకృతకవిత్వం ఈ ఇరవయ్యేళ్ళుగా ప్రపంచానికి మరింత బాగా వెల్లడవుతున్నది. ఆ కవులకి తమ కవిత్వం పట్లా, ముఖ్యంగా ప్రాకృతం పట్ల ఎంత ప్రేమ! ఎనిమిదో శతాబ్దిలో సంకలనమైన ‘వజ్జాలగ్గం’ ఇలా అంటున్నది:

అమృతం ప్రాకృత కవిత్వం:
ఆ కవిత్వంతో పరిచయంలేనివాళ్ళూ
ఆ కవిత్వం ఇప్పటిదాకా చదవనివాళ్ళూ
ఎలా చెప్పుకుంటారు?
తాము కూడా జీవితాన్ని ప్రేమిస్తున్నామని!

అందుకని ఇప్పుడు గాథాసప్తశతిలో ఆషాఢ మేఘాల్ని మనం కలిసి పరికిద్దాం.

29-6-2023

12 Replies to “ఆషాఢమేఘం-12”

  1. ఇటువంటి పరిస్థితిలో ప్రాచీన ప్రాకృత కవిత్వం నాకు సాక్షాత్కరించినప్పుడు వానాకాలంలో నేరేడుచెట్ల అడవి కనబడ్డంత సంతోషం కలిగింది.
    ఇవాళ్లటి పోస్ట్ రోజటి కంటే మరింత ఉద్వేగ భరితంగా సాగింది. మన కవుల రచనా నేపథ్యం చాలా చక్కగా వివరించారు. అందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. భారతీయ కవిత్వ తత్వ విచారము
    మీరు మళ్లీ రాయాలి. ఇటీవల చాలా మంది పుస్తక సమీక్షలు చేస్తూ ఆంగ్ల కవుల కోట్స్ ను ఉపయోగిం చటం చూసి నిరాశపడటం జరిగింది. అది ఎక్కడిదాకా పోయిందంటే మన భారతీయ లక్షణకారుల్ని, కవుల్ని ఎవరైనా ముందుకు తెస్తే వాళ్లు ఆధునికులు కారన్నంతగా.
    పురాణమిత్యేవ నసాధు సర్వం అయినా ప్రపంచ కవులతో భారతీయ కవులు ఎప్పుడూ సమాంతరంగానే నడిచే వారనీ కొండొకచో ఒక అడుగు ముందుకు వేసిన వారు కూడా ఉన్నారని మీ సంగం కవుల కవిత్వాన్ని చూస్తుంటే అర్థం అవుతున్నది. మన విద్యా విధానం మీద ఎప్పుడో చాలా పెద్ద దెబ్బపడి అదే నడుం విరిగిన పరిస్థితిలో కొన సాగటం దురదృష్టం. సర్ మీ పరిశోధనా లక్ష్యానికి , సంయమన విశ్లేషణాతత్త్వానికి నాహృదయపూర్వక అభినందనలు.

    1. నమస్తే సర్

      కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అన్న మాట విన్నప్పుడల్లా ఎంత ఆవేదన కలిగేదో..
      ఆషాఢ మేఘం లోని ఈ భాగాన్ని పాఠం గా చేయాల్సిన అవసరముంది..

  2. వ్యాసాలతో పాటు మీరు పెడుతున్న వర్షాకాలానుగుణ్యమైన జలవర్ణ చిత్రాలు చాలా బాగుంటున్నాయి. అభినందనలు

  3. మీ విశ్లేషణలు ప్రాచీన సాహిత్య దృశ్యాన్ని ఒక కొత్త కళ్ళద్దాల నుంచి నవనవోన్మేమషంగా సాక్షాత్కరింప చేస్తున్నాయి.

    ప్రాచీన భారతీయ సాహిత్య ఔన్నత్యాన్ని అర్ధం చేసుకోవడాన్ని, ఆస్వాదించడాన్ని పక్కనబెడితే.. కనీసం తెలుసుకోడానికి నోచుకున్నది ముందు తరం.. కనీసం దానికి కూడా నోచుకోని దురదృష్ట తరం మాది.

    మీ లాంటి మహానుభావుల వల్ల కనీసం తెలుసుకునే అవకాశం కలిగింది. ధన్యవాదాలు.

  4. నిన్నటి పోస్ట్ మిస్ అయ్యాను అయితే..
    మీరన్నట్టు ప్రాకృత సాహిత్యం గురించి ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. చదువుకునే రోజుల్లో కూడా..
    పూర్వం ఆంధ్రప్రభ లో తిరుమల రామచంద్ర గారు అనువదించిన కొన్ని గాథా సప్తశతి పద్యాలను చదివిన గుర్తు. ఈ మధ్య రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి అనువాదం పిడిఎఫ్ దొరికింది.ఇప్పుడు వెతికితే పరిశోధన గ్రంథాలు వున్నాయి అని తెలిసింది. మీరు ఈ పద్యాలను పరిచయం చేయడం వలన తెలుగు వారికి మేలు చేసినవారు అవుతారు.

  5. Thank you in advance Sir.
    కొన్ని ఆకళ్లు తీరవు..ఇష్టమైన వాటి విషయంలో మరీను.🙏

Leave a Reply

%d bloggers like this: