ఆషాఢమేఘం-11

సంగం సాహిత్యంలో ఎట్టుతొగై గా ప్రసిద్ధి చెందిన ఎనిమిది సంకలనాల తర్వాత చెప్పవలసినవి పత్తుప్పాట్టుగా ప్రసిద్ధి చెందిన పది దీర్ఘకవితలు. అవి సంగం సాహిత్యంలోని మలిదశను చూపించే ఆధునిక కవితలు. తర్వాత కాలంలో కవులు తమ భావాల్నీ, అనుభూతినీ కావ్యాలుగా, దీర్ఘకావ్యాలుగా నిర్మించడానికి కావలసిన శిల్పరహస్యాలను ఈ పది దీర్ఘకవితలనుండే గ్రహించారని చెప్పవచ్చు.

ఈ పది దీర్ఘకవితలూ వేటికవే అమూల్యమైన కావ్యాలైనప్పటికీ వాటిలో ‘నెడునల్ వాడై’,’కురింజిప్పాట్టు’, ‘ముల్లైప్పాట్టు’ చెప్పదగ్గవి. తమిళసాహిత్య చరిత్రకారుడు ము.వరదరాజన్ మాటల్లో చెప్పాలంటే పత్తుప్పాట్టు సంకలనంలోని ప్రేమకవితల్లో ముల్లైప్పాట్టు, కురింజిప్పాట్టు అద్వితీయాలు. ఆ కవితల్లో ఎవరో ఒక రాజునిగానీ, దాతనుగానీ ప్రశంసించాలన్న ఉద్దేశ్యం లేదు. లేదా అందులో ఏదో ఒక గ్రామసీమ, నగరం కూడా చిత్రణకి రాలేదు. ఆ కవితల ముఖ్య ఉద్దేశ్యం అకం కవితల మూలలక్షణమైన మానవప్రేమానుభవాన్ని హృద్యంగా వర్ణించడమే.

ఆ పది దీర్ఘకవితల్లోనూ ‘ముల్లైప్పాట్టు’ అతి చిన్న కవిత. మొత్తం 103 పంక్తులు మాత్రమే. కాని మహాకావ్యాల్లో కూడా కానరాని ఏకసూత్రత, బిగువు, అనుభూతి తీవ్రతలతో ఆ కవిత ప్రాచీన భారతీయ సాహిత్యం ప్రపంచానికిచ్చిన మేలిమి కానుకగా కాలం తాకిడికి తట్టుకుంటూ నిలబడింది. ఆషాఢమేఘం విరహప్రణయాల్ని ఒక్కసారిగా జాగృతం చేస్తుందని కదా మనం చెప్పుకుంటున్నాం. రెండు విరుద్ధ భావాలు ఒక్కసారిగా హృదిలో తలెత్తినప్పుడు కలిగే ఆటుపోట్లను వాల్మీకి మొదలుకుని జయదేవుడిదాకా సంస్కృత కవులు ఎంతో అద్భుతంగా వర్ణించారు. కాని అత్యధికభాగం సంస్కృత కవిత్వంలో బిగింపు తక్కువ. విస్తృతి ఎక్కువ. దాదాపుగా ఆ పలచదనం తక్కిన భారతీయ సాహిత్యాల్లో కూడా కనవస్తుంది. ఒక్క ప్రాకృత కవితలు ఇందుకు మినహాయింపు. కాని ముల్లైప్పాట్టు ఒక ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని ప్రేమానుభూతిని వర్ణించడానికే ప్రయత్నించినప్పటికీ ఆ కవితలో బిగింపు ఎక్కడా సడలిపోలేదు. ఆ గాఢనిర్మాణబంధం ఎన్నో వందల ఏళ్ళ తరువాత ఈ నాడు ఆ కవిత చదువుతున్న నా వంటి సుదూరపాఠకుణ్ణి కూడా తీవ్రమైన ఆశ్చర్యానికీ, అసూయకీ లోనుచేస్తున్నది. అయితే కొందరు సంగం సాహిత్యప్రేమికులు ఇంత బిగింపు కలిగిన కవితలో కూడా కొన్ని అనవసర చిత్రణలు చోటుచేసుకున్నాయనే ఆరోపణ చేయకపోలేదు. మరికొందరు సంగం సాహిత్యాభిమానులు ఆ ఆరోపణను ఏదో ఒక రీతిన ఖండించకుండా ఉండలేదు కూడా. ఈ కవితను ఇంగ్లిషులోకి అనువదించిన ఎన్.రఘునాథన్ ఈ కవితలో చిత్రించబడ్డ సవివరమైన చిత్రణలు దృశ్యప్రపంచం పట్ల కవికి కలుగుతున్న భావోద్వేగం వల్ల చోటుచేసుకున్నవిగా చెప్పటానికి ప్రయత్నించాడు.

కాని నా వరకు నాకు ఈ కవితలో అనవసరమైన చిత్రణ అంటూ ఏదీ కనిపించలేదు. సాధారణంగా కథా రచయిత ఏదైనా సన్నివేశాన్ని వర్ణించేటప్పుడు, కొన్ని వివరాల్ని మనకు అందిస్తున్నప్పుడు, ఆ వివరాల్లో ప్రతి ఒక్కటీ ఆ కథాసారాంశం వైపు మనల్ని నడిపించుకుపోయే సంకేతాలుగానే ఉంటాయి. ఉదాహరణకి టాల్ స్టాయి అన్నాకెరినినా నవలలో కనబడనిదేదీ రష్యన్ జీవితంలో కూడా మనకు కనబడదని డాస్టవస్కి అన్నాడు. అలాగని టాల్ స్టాయి రచన కేటలాగు కాదు. గొప్ప సాహిత్యకారుడు వివరాలను అందిస్తూనే వాటిని నేర్పుగా మన అనుభూతిలో మిళితం చేస్తుంటాడు. నిజానికి ముల్లైప్పాట్టులో వర్ణించిన దృశ్యాలూ, ఆ దృశ్యాలలో అతడు అందించిన సున్నితమైన వివరణలూ ఆ సన్నివేశ కల్పన పట్ల మనకొక విశ్వసనీయతను పెంపొదించేవిగానే ఉంటాయి.

వాల్మీకి చేసిన వర్షర్తు వర్ణన అడవిలో ప్రవాసిగా ఉన్న ఒక నాగరిక మానవుడి వైపు నుండి చేసిన వర్ణనకాగా, ముల్లైప్పాట్టులో వర్షఋతు వర్ణన నగర మధ్యంలో విరహిణిగా ఉన్న నాగరిక స్త్రీ వైపు నుంచి చేసిన వర్ణన. అయితే ముల్లై ప్రాకృతిక భూమిక అడవులూ, అడవుల్ని ఆనుకుని ఉన్న సస్యక్షేత్రాలూ కాబట్టి, ఈ కవిత కూడా దాదాపుగా అడవిని ఆనుకుని ఉన్న చిన్న రాజ్యం నేపథ్యంగా సాగింది.

ఆ రాజ్యంలో రాజు యుద్ధానికి వెళ్ళాడు. వానాకాలం వచ్చేటప్పటికి అతడు యుద్ధక్షేత్రం నుంచి తన నగరానికి తిరిగి వచ్చెయ్యాలి. రాజులు వానాకాలంలో కూడా యుద్ధంలోనే కూరుకుపోతే అది పంటల్నీ, ఆ రాజ్యసంక్షేమాన్నీ భగ్నం చేస్తుంది. అందుకని ఎంత దూరం యుద్ధానికి వెళ్ళినా వానాకాలం రాగానే రాజు తన రాజ్యానికి చేరుకోవాలి. అలా రావడంలో రెండు సంకేతాలున్నాయి. ఒకటి, వానాకాలంలో దేశసౌభాగ్యాన్ని పదిలపర్చుకోవడమనేది. రెండవది, వానాకాలం నాగరిక మానవుల మధ్య ప్రణయానికి సానుకూలమైన కాలం కావటం అనేది. అందువల్ల యుద్ధానికి వెళ్ళిన రాజుకోసం అతని స్త్రీ నగరంలో ఓపిగ్గా ప్రతీక్షిస్తూ ఉండడంలో స్త్రీపురుష ప్రణయంతో పాటు రాజ్యసౌభాగ్యం కూడా ఇమిడి ఉంది. ఈ భావన మనకు బోధపడేటప్పటికి ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!

103 పంక్తుల ముల్లైప్పాట్టు కవితను మూడు భాగాలుగా చూడవచ్చు. మొదటి 24 పంక్తులు నాయిక విరహాన్నీ, పరిత్యక్తస్థితినీ చిత్రిస్తాయి. అక్కడ సన్నివేశం నగరమధ్యంలో అంతఃపురంలో, శయ్యాగారంలో సంభవిస్తుంది. 25 నుండి 84 వ పంక్తిదాకా 64 పంక్తులు సుదీర్ఘమైన యుద్ధభూమి చిత్రణ. అక్కడ నాయకుడు యుద్ధరంగంలో, తన శిబిరంలో నిద్రలేని రాత్రిని గడుపుతూ, మర్నాటి యుద్ధంలో విజయం సాధించడమెట్లానా అని ఆలోచిస్తూ ఉంటాడు. మాతృభూమికోసం మరణించిన పూర్వయోధులనూ, శత్రువును ఎదిరించి గాయపడ్డ తన చతురంగ బలాలనూ తలచుకుంటూ ఉంటాడు. ఆ దృశ్యమంతా దుస్సహమైన ఉక్క, వేడిమి, ఆందోళనలతో నిండిపోయి ఉంటుంది.

85 వ పంక్తినుంచి 103 దాకా కవిత మళ్ళా నాయిక చుట్టూ పరిభ్రమిస్తుంది. అంతవరకూ దుస్సహంగా, ఉక్కపోతగా ఉన్న ప్రపంచం పైన చల్లని వానచినుకు రాలిపడటంతో, నాయిక, రాజ్యం, భూమి ఒక్కసారిగా పులకించడంతో కవిత ముగుస్తుంది. విరహం నుండి వేసటమీదుగా ప్రణయానికి పరిణమించడంతో గ్రీష్మాకాశం మీద ఆషాఢమేఘం అవతరించిన సంతోషం మన హృదయాన్ని కూడా అల్లుకుంటుంది.

ముల్లైప్పాట్టు కవిత రాసిన నప్పూతనార్ కావేరీపట్టణంలో ఉండేవాడనీ, వర్తక కుటుంబానికి చెందినవాడనీ తప్ప మరే వివరాలూ మనకి లభ్యం కావడం లేదు. (నేను పూంపుహారు వెళ్ళినప్పుడు నా దృష్టి శిలప్పదికారం పైన ఉండింది కానీ ముల్లైపాట్టు కవి అక్కడే పుట్టి పెరిగాడు అన్నది నాకు స్మరణకు రాలేదు.) ఆ కవి తన జీవితకాలంలో ఎన్నో కొన్ని యుద్ధ శిబిరాల్లో గడిపి ఉండాలి. భావుకులైన అందరి మానవులవలె అతడు కూడా విరహాగ్నిలో దగ్ధమై ఉండాలి. చల్లని వానచినుకులాంటి ప్రణయసంకేతం కల్గించే మహామధుర సాంత్వన ఎటువంటిదో అతడికి అనుభవంలోకి వచ్చి ఉండాలి. ప్రసిద్ధ పాశ్చాత్య చిత్రకారుడు రూబెన్స్ చిత్రించిన ముఖాల్లో పాలుగారే సజీవత్వాన్ని చూసి ఒక కళాభిమాని ‘రూబెన్స్ తన రంగుల్లో బహుశా కొంత రక్తం కూడా కలిపి ఆ ముఖచిత్రాలు చిత్రించాడేమో’ అని అన్నాడట. ముల్లైప్పాట్టు కవిత చదివినప్పుడు ఆ కవి తమిళభాషలో బహుశా తన కన్నీటిని కూడా కొంత కలిపి ఉంటాడా అని అనిపించకుండా ఉండదు.

శిల్పపరంగా కేవలం నిర్మాణ విశిష్టత మాత్రమే కాదు, మరెన్నో మెలకువలు కూడా ఈ కవితలో ఉన్నాయి. ఉదాహరణకి 103 పంక్తుల దీర్ఘకవితలో ఒకే ఒక సమాపక క్రియ ఉందనీ, తక్కినవన్నీ అసమాపక క్రియలేననీ వ్యాఖ్యాతలు చెప్తున్నారు. సుదీర్ఘమైన నిరీక్షణనూ, సంతోష ప్రతీక్షనూ వివరించే కవితలో సమాపక క్రియలు లేకపోవటం సమంజసమే కదా.

ముల్లైప్పాట్టు మొత్తం కవితను తెలుగులోకి అనువదించి చూపాలని ఉంది. కాని మూడు సన్నివేశాలనుంచీ, మచ్చుకి కొన్ని పంక్తులు.


శుభశకునం కోసం ఎదురుచూస్తున్నారు

1

తప్తసంధ్యావేళ
కొండకొమ్ముల్ని వేలాడుతున్న మేఘం
సముద్రాన్నంతటినీ తాగి
క్రూరవేగంతో భూమ్మీద వర్షించింది.
అడవి అంచుల్లో ఆ ప్రాచీన నగరమ్మీద
పూర్వస్వర్ణయుగాల అప్సరసలెవ్వరో
కుంచాలకొద్దీ జాజిపూలు విరజిమ్మారు.
మృదువుగా విచ్చుకుంటున్న జాజిమొగ్గలచెంతకి
తేనెటీగలు సంగీతవాద్యాలతో చేరుకున్నాయి.
సంతోషంగా పూజముగించి దేవకన్యలు
శుభశకునం కోసం ఎదురుచూస్తున్నారు.

2

రాటలు కట్టి, తాళ్ళు లాగి నిలబెట్టిన యుద్ధశిబిరం
పరాజయమంటే తెలియని ధనుర్బాణాలు
దండకమండలాలపైన సన్న్యాసి కాషాయవస్త్రంలాగా
అమ్ముల పొదులు.
కత్తుల పిడిమీదా, కవచాలమీదా పూలబొమ్మలు
విల్లమ్ములే కంచుకోటగా నిలబడ్డ భటాళి.
వాళ్ళు మాట్లాడే నానాభాషలు.
రాజు శిబిరంలో వేలాడుతున్న రంగుల తెరలు.
ముంజేతికంకణాలతో,
అందమైన మెడవంపుపైన పారాడే కేశరాశితో
బిగించికట్టిన స్తనవల్కలాల సుందరులు
రాత్రిని పగలుగా మారుస్తున్న కత్తుల తళతళ.
శిల్పకన్యల హస్తాల్లో కొడిగట్టుతున్న దీపాల్లో
వత్తుల్ని ముందుకు జరుపుతున్న వనితలు.
ఇది అర్థరాత్రి.
అడవి అంతా కమ్ముకున్న జాజిపూలగాలిలో
చిన్నిచిన్ని పూల పొదల సుగంధం మణిగిపోయినట్టు
పెద్ద పెద్ద గంటల చప్పుడు అణిగిపోయింది.

3

మేనంతా వీనుగా
ఆమె శయ్యపై వాలి ఉండగానే
ఎక్కడో సుదూరంలో వినవస్తున్న డెక్కలచప్పుడు
శత్రుభూమిని కొల్లగొట్టి తిరిగివస్తున్న సైన్య సంరంభం
సారవంతమైన అడవిదారుల గుండా
ఎర్రమట్టినేలల బాటవెంబడి
విజయపతాకపు రెపరెపలు.
శంఖతూర్యధ్వని.
ఇసుకనేలల్లో కాటుకపూసినట్టున్న అల్లిపూలు.
బంగారం కురిపిస్తున్న రేలచెట్లు
అరచేతులు చాచినట్టుగా వికసిస్తున్న తెల్ల గోరింటపూలు
రక్తవర్ణ పుష్పాలు
దారిపొడుగునా గాలికి తలూపుతున్న రాగిచేలమధ్య
ఒకదాన్నొకటి పెనవైచుకుంటున్న హరిణమిథునం
వర్షవాగ్దానం మోసుకొస్తున్న మబ్బుల మధ్య
చిలగడదుంపల పొలాలు దాటుకుంటూ
ఆషాడమాసపు ప్రథమదివసాన, అతడు
తన విజయరథాశ్వాల్ని పరుగుపెట్టిస్తున్నాడు.


ముల్లైప్పాట్టు కవిత మొత్తం ఇంగ్లిషు అనువాదంలో చదవాలనుకుంటే ఈ లంకె చూడండి:

27-6-2023

2 Replies to “ఆషాఢమేఘం-11”

  1. నమస్తే సర్

    దృశ్యమానమైన నాటి కథ..

Leave a Reply

%d bloggers like this: