ఆషాఢమేఘం-10

సంగం సాహిత్యంలో ఎనిమిది కవితాసంకలనాల్లో అకం విభాగం కింద వచ్చే సంకలనాలు అకనానూరు, కురుంతొగై, ఐంగురునూరు, కల్లిత్తొగై. పరిపాడల్ అనే సంకలనం కూడా అకం తరహా కవిత్వమే గాని, ఇలా స్పష్టంగా తిణైలకింద రాసిన కవితల సంపుటి కాదు. ఇక పురం విభాగం కింద పురనానూరు సుప్రసిద్ధమైన సంకలనం. అది కాక, పతిర్రుప్పాట్టు అనే పది కవితల సంకలనం కూడా ఉంది. ఇక ఎనిమిది సంకలనాల్లోనూ (ఎట్టుతొగై) మొదటిదిగా చెప్తుంటే నట్రినై లో అకం,పురం రెండు విభాగాల కవితలూ ఉన్నాయి.

ఈ ఎనిమిది సంకలనాల్లో అకం కవిత్వంలోని ఆరు సంకలనాల్లో మూడింటిని మీకు పరిచయం చేసాను. పరిచయం అంటే వాటి పూర్తి పరిచయం కాదు. అందులో వర్షఋతువుచుట్టూ ముల్లై తిణైని బట్టి అల్లిన కవితల్ని మాత్రమే పరిచయం చేసాను. కాని ఇప్పుడు నట్రినై సంకలనం గురించి కూడా చిన్న పరిచయం, రెండు అనువాదాలు మీతో పంచుకుంటే, ఎనిమిది సంకలనాల్లోని వర్షర్తు కవిత్వం గురించి దాదాపుగా ముచ్చటించుకున్నట్టే అవుతుంది.

నట్రినై అంటే చక్కటి తిణైలతో కూడుకున్నది అని అర్థం. అందులో 400 కవితలు ఉన్నాయి. క్రీ.పూ. ఒకటవ శతాబ్దినుంచి సా.శ. 3 వ శతాబ్ది మధ్యకాలంలో ఈ కవితలు వికసించాయని లెక్కగడుతున్నారు. కాని ఏ విధంగా చూసినా సంగం కవిత్వంలోని అత్యంత ప్రాచీనమైన కవిత్వం ఇందులో ఉందన్నది నిర్వివాదాంశం. తర్వాతి రోజుల్లోని సంగం కావ్యాలు శిలప్పదికారం, మణిమేఖలై లలో మాత్రమే కాక తిరుక్కురళ్ లో కూడా కా సంకలనంలోని పద్యపంక్తుల్ని ఉల్లేఖించాయంటారు. ఒక పాండ్యరాజు ఈ సంకలనానికి కారకుడని చెప్తారు, కాని సంకలనకర్త పేరు మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయింది.

నట్రినైలో ముల్లై తిణై కవితలు ముప్ఫై మాత్రమే ఉన్నాయి. ఒక తిణై ఒక కవిసమయంగా స్థిరపడే తొలిరోజుల కవిత్వం అది అని మనం గుర్తుపట్టవచ్చు. ఆ కవితల్లో కురుంతొగైలోని గాఢత, అకనానూరులోని చిత్రణ, ఐంగురునూరులోని క్లుప్తత కనిపించవు. కాని ఎండాకాలం చల్లబడి మబ్బులు కమ్ముకునేముందు అల్లుకునే చల్లటిగాలిలాంటి భావోద్వేగం నట్రినైలోని ముల్లై కవితల్లో కనిపిస్తుంది.

వాటిల్లోంచి రెండు కవితలు మీతో పంచుకునేముందు సంగం కవిత్వం గురించి ఒక మాట చెప్పాలి. సాధారణంగా ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైన అన్ని ప్రాంతాలూ భౌగోళికంగా ఒక్కలాగా ఉండవు. అడవి, కొండ, నది, సముద్రం, ఎడారి- భారతదేశం కూడా ఈ అయిదు ప్రాకృతికప్రదేశాలతోనూ రూపొందిందే. ఏ ప్రాంతానికి చెందిన జీవనశైలి, సుఖదుఃఖాలు ఆ ప్రాంతానికి ఉంటాయి. తీరప్రాంతంలో మనుషుల జీవితాన్ని కొండప్రాంతంలో మనుషుల జీవితంతో పోల్చలేం. అలాగే నదీతీరాల్లోని జీవితాన్ని ఊషరక్షేత్రాల్లోని మనుగడతో పోల్చలేం. భౌగోళిక తారతమ్యాలు సహజంగానే సామాజిక తారతమ్యాలుగా పరిణమిస్తాయి. అటువంటప్పుడు వివిధ భౌగోళిక ప్రాంతాలకు చెందిన మనుషులమధ్య తామంతా ఒకటే కుటుంబం అనే భావనని ప్రోత్సహించడమెలాగు? రాజకీయ కారణాలవల్ల వివిధ ప్రాంతాలకు చెందిన మనుషులు ఒక రాజ్యంగా ఏర్పడ్డా కూడా ఒకప్రాంతానికి చెందినవారే తక్కిన అన్ని ప్రాంతాలమీదా ఆర్థిక-రాజకీయ ప్రాబల్యాన్ని నెరపడం మనకి తెలుసు. నేడు ప్రపంచమంతా కనవచ్చే రాజకీయ అశాంతికి ప్రధానమైన కారణం ఈ ప్రాంతీయ వైషమ్యాలే.

కాని ప్రాచీన తమిళ కవులు, భావుకులు ఈ సమస్యకి రాజకీయంగా కాక, సాంస్కృతికంగా పరిష్కారం వెతకడానికి ప్రయత్నించారు. ఒక్కొక్క భౌగోళిక ప్రాంతానికీ ఒక్కొక్క భావోద్వేగాన్ని చిహ్నంగా తీసుకుని, అక్కడుండే చెట్లు, చేమలు, పూలు, పిట్టలు, పశువులు ప్రతి ఒక్కదాన్నీ కవితాసామగ్రిలో భాగం చేసి ఆ ప్రాంతానికే చెందిన ఒక కావ్యసంభారాన్ని రూపొందించారు. నీళ్ళుపారే పంటపొలాలు (మరుదం), సముద్రతీరం (నెయిదల్), అడవి (ముల్లై), కొండ (కురింజి), ఊషరక్షేత్రం (పాలై) అన్నీ కలిస్తేనే ఒక సాంస్కృతిక దేశం రూపొందుతుందని భావించారు. ఆ ప్రాకృతిక ప్రదేశాలన్నీ కలిసి భావుకహృదయాల్లో రేకెత్తించే సంవేదనల్ని ఒకే కవిత్వదేహంగా ప్రతిపాదించారు. తమిళదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చెయ్యడంలో సంగం కవులు, భావుకులు చూపించిన ఈ వివేకం, ఈ ప్రజ్ఞ ఎంత బలమైనవంటే, తర్వాత రోజుల్లో నాయనార్లకీ, ఆళ్వార్లకీ ఈ రసజ్ఞతనే పాదుగా నిలబడింది. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా తమిళుల్ని ప్రాంతీయ భేదాలకు అతీతంగా దగ్గరగా నిలబెడుతున్న జీవజలాలు సంగం సాహిత్యం నుండి ఊటలూరినవే.


నీ ఘోష నాకు నచ్చలేదు

1

(నాయిక తన చెలికత్తెతో చెప్పినమాటలు)

దగ్గరలో ఒక కోయిల మధురంగా కూస్తున్నప్పుడు
ఆ బాధ ఎలాంటిదంటే
అప్పటికే గాయపడి పచ్చిగా ఉన్న గుండెలో
మరొకసారి బాకు దిగినట్టుంటుంది.

అంతకన్నా దుస్సహం
నిర్మలమైన నీళ్ళతో ప్రవహిస్తున్న
కొండవాగుని చూడటం.

ఆ రెండింటికన్నా
హృదయాన్ని నిలవనివ్వని మరో దృశ్యముంది.

తేనెటీగలు మూగుతున్న బుట్టలో
జాజులూ, మాలతులూ
అమ్ముకుంటూ తిరిగే
ఆ పిల్ల కనబడటం.

(మారన్ వయుది, నట్రినై, 97)

2

(నాయిక వర్షమేఘంతో చెప్తున్న మాటలు)

ఓ వర్షామేఘమా! ఎండిపోయిన అడవిలో
చిన్నచిన్న పూలమాలలు ధరించిన స్త్రీలగుంపులాగా
వికసిస్తున్నవి బొండుమల్లెలు
సంజెవేళ తేనెటీగలు వాటి మధువు సేవిస్తున్నప్పుడు
నీ ఉరుములూ, గర్జనలూ
నన్నెంత తల్లడిల్లచేస్తున్నాయని!

అతడి గురించిచెప్పడానికైతే
నువ్విలా రావడం
తెలివైనవాళ్ళు చేసే పనికాదు.
నీ చప్పుళ్ళకి పాములు బెదిరిపోతాయిగాని
అతగాడి రాతిగుండె కరగదు.

ఎంతచెప్పు, నీ ఘోష నాకు నచ్చలేదు.

(కందరథనార్, నట్రినై, 238)


నేను పరిచయం చేసిన సంగం సాహిత్య సంకలనాలు ఇంగ్లిషు అనువాదంలో చదవాలనుకుంటే:

The Narrinai Four Hundred, Tr. A.Dakshinamurty, Exotic India Art, R.390/-

The Four Hundred Songs of Love, Anthology of poems from classical Tamil, the Akananuru, tr. and annotated by George L. Hart, Rs.1000/-

Kuruntokai: An Anthology of Classical Tamil Love Poetry, Tr.Dr.M.Shamugam Pillai and David E Ludden, Exotic India Art, Rs.375/-

Aimkurunuru, Tamil Love Poetry: The Five Hundred Short Poems of the Ainkurunuru, Martha Ann Selby

Paripatal – Text, Transliteration And Translations In English Verse And Prose, Tr. Nirmal Selvamony and KG Seshadri, Exotic India Art, Rs.870/-

ఇవి కాక, ఆన్ లైన్లో చదవాలనుకుంటే ముఖ్యమైన సంగం కవిత్వం తమిళ మూలం, ప్రతిపదార్థం, ఇంగ్లిషు అనువాదాలతో ఇక్కడ చూడవచ్చు.

https://sangamtranslationsbyvaidehi.com/

27-6-2023

2 Replies to “ఆషాఢమేఘం-10”

  1. నిత్యనూతన సాహిత్య సల్లాపం మనసును ఎంత తేలిక పరుస్తుందో. కవితలలోని మార్మిక ధ్వని మనసును తట్టినపుడు లేదా మనసుకు తట్టినపుడు కలిగే ఆనందం మధుమధుపన్యాయమనవచ్చునేమో.

Leave a Reply

%d bloggers like this: