
సంగం సాహిత్యంలో అకం విభాగం కింద రాసిన కవితల సంకలనాల్లో మొదటిది నట్రినై. అంటే చక్కటి తిణైల సంకలనం అని అర్థం. అది కూడా నాలుగువందల కవితల సంకలనమే గాని, అందులో ముల్లై తిణైకి చెందిన కవితలు ముప్ఫై మాత్రమే ఉన్నాయి. ‘అకనానూరు’, ‘నట్రినై’, ‘కురుంతొగై’ లలో అన్ని తిణైలకి సమానప్రాధాన్యత ఉండి ఉంటే ముల్లై కవితలు ఒక్కొక్కదానిలో కనీసం ఎనభై నుంచి వందదాకా ఉండి ఉండాలి. కాని ఏ కారణం చాతనో కురింజి కవిత్వం సంకలితమైనంత విస్తారంగా ముల్లై కవిత్వం మనకి ఆ సంకలనాల్లో కనిపించదు. కురుంతొగైలో 44, నెడుంతొగైలో 40, అకనానూరులో 40 మాత్రమే ముల్లై కవితలు కనిపిస్తున్నాయి.
కాని అయిదు తిణైలకి సమానప్రాధాన్యాన్నిస్తూ, ఒక్కొక్క తిణై మీద వంద కవితల చొప్పున అయిదు తిణైలమీదా మొత్తం అయిదు వందల కవితలు రాయించి సంకలనం చేస్తే బాగుంటుందని చేరదేశపు రాజుకి ఒకాయనకి అనిపించింది. ‘యానైక్కాట్చై’ మాందరన్ చేరల్ ఇరుంపొరై అనే రాజు అటువంటి సంకలనం ఒకటి రూపొందించాలనుకున్నాడు. ఆయన కోరికమేరకు పులత్తురై ముట్రియ కూడలూర్ కీళార్ అనే ఆయన, అయిదుగురు కవులు ఒక్కొక్కరూ ఒక్కొక్క తిణై మీద రాసిన నూరేసి కవితలతో, మొత్తం అయిదువందల కవితల సంకలనాన్ని రూపొందించాడు. అయిదువందల కవితల సంకలనం కాబట్టి దాన్ని ‘ఐంగురునూరు’ అని అన్నారు.
చాలామంది కవులు రాసిన కవితల్లోంచి మరీ బాగున్నవాటిని ఎంపికచేసి వెలువరించిన ‘అకనానూరు’, ‘కురుంతొగై’ లాంటి సంకలనాలకీ, ఐంగురునూరుకీ మధ్య భేదం ఉంది. ఈ సంకలనంలో కవుల్ని ముందే ఎంపికచేసారు. ఓరంపోకియార్, అమ్మూవనార్, కపిలార్, ఓదలాందయార్, పేయనార్ అనే అయిదుగురుకవుల్ని బహుశా ఆ చేరరాజు తన ఆస్థానానికి ఆహ్వానించి వారికి సదుపాయాలు కల్పించి ఒక్కొక్క తిణై మీదా కవితలు రాయమని అడిగి ఉంటాడని భావించవచ్చు. ఆ కవితల్ని సంకలనం చేసిన కీళార్ ఇప్పటిభాషలో కేవలం సంపాదక బాధ్యతలు మాత్రమే చూసి ఉంటాడని అనుకోవచ్చు.
సంగం కావ్యసంకలనాల్లో ‘ఐంగురునూరు’ అన్నిటికన్నా తర్వాతది అని నమ్మడం కష్టమేమీ కాదు. ఎందుకంటే అప్పటికే కావ్యలక్షణ శాస్త్రం సుస్థిరమై ఉండకపోతే, ఏయే భావోద్వేగాలకు ఏ కవులు పేరెన్నికగన్నారో స్పష్టంగా తెలిసి ఉండకపోతే అటువంటి సంకలనం రూపొందడం సాధ్యం కాదు. కావ్యంలోని అంతర్గత సాక్ష్యాన్ని బట్టి ‘ఐంగురునూరు’ సా.శ రెండు-మూడు శతాబ్దాల మధ్య సంకలనమై ఉంటుందని భావిస్తున్నారు.
సంగం సాహిత్యంలో అగ్రశ్రేణి కవులైన కపిలార్, అవ్వైయ్యార్, నక్కీరర్ లాంటివాళ్ళు ముల్లై తిణై మీద విస్తారంగా రాయకపోవడం ఒక ఆశ్చర్యంకాగా ఈ సంకలనంలో ముల్లై తిణై మీద కవితలు చెప్పే బాధ్యత పేయనార్ అనే కవికి అప్పగించడం మరొక ఆశ్చర్యం. ఇందులో వంద కవితలు కాక, ఆయన పేరు మీద మరొక నాలుగు కవితలు మాత్రమే సంగం సంకలనాల్లో కనిపిస్తున్నాయి. ఆ నాలుగింటిలో రెండు ముల్లై తిణై మీద చెప్పినవే. ఆ రెండు కవితలు ఆధారంగానే ముల్లై తిణై మీద వంద కవితలు చెప్పే అవకాశం ఆయనకి దక్కడం ఆశ్చర్యమనిపిస్తుంది.
పేయనార్ అంటే దెయ్యంలాంటివాడని అర్థం. పేయనార్ పేరు వినగానే ఎన్నో శతాబ్దాల తర్వాత తిరుక్కోవిలూర్ లో నివసించిన పేయాళ్వారు గుర్తుకు రాకుండా ఉండడు. ఆయనకి ఒక వానాకాలపు సాయంకాలమే విష్ణుదర్శనమైందని కూడా గుర్తురాకుండా ఉండదు. ముల్లైకి అధిదేవత మేయోన్, అంటే, విష్ణువు కాబట్టి పేయనార్, పేయాళ్వార్ లు ఇద్దరు దర్శించినదానిలోనూ ఏదో సారూప్యత లేకపోలేదనిపిస్తుంది.
ఐంగురునూరులో ముల్లై తిణై మీద పేయనార్ చెప్పిన వంద కవితలూ పది పది చొప్పున పది సందర్భాల్ని అల్లుకుంటూ చెప్పినవి. ప్రతి ఒక్కటీ నాలుగైదు పంక్తులనుంచి పది పన్నెండు పంక్తులమధ్యలో చెప్పిన కవితలు. అప్పటికే ముల్లై తిణైని బట్టి ఎంతో కవిత్వం వచ్చింది కాబట్టి, పేయనార్ తన కవితల్లో విస్తారమైన వర్ణనకి పూనుకోడు. రూపకాలంకారాల్లో కూడా కొత్తదనం కోసం చూడడు. కవిసమయాలు అప్పటికే నిర్ధారితమైపోయి ఉన్నాయి కాబట్టి వాటిని దాటి కూడా వెళ్ళడు. కాని ఆ చట్రం మధ్యనే క్లుప్తతనీ, గాఢతనీ సాధించడం ద్వారానూ, ఉక్తి వైచిత్రిద్వారానూ ఆయన రసోత్పత్తి సాధిస్తాడు.
ఒక్కొక్క పదికానికి ఒక్కొక్క వక్త. ఒకదానిలో నాయకుడు, ఒకదానిలో నాయిక, ఒకదానిలో సవతితల్లి, ఒకదానిలో చెలికత్తె. కాని ఒక పదికానికి కవి వక్త. తాను నాయిక విరహం గురించి ఎంత చెప్పినా నాయకుడు స్పందించడం లేదని అలిగి చివరికి కవి అతణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ చెప్పిన కవిత కూడా అందులో ఉంది!
కాని ఈ నూరుకవితలూ విరహంతో ఆగిపోకుండా నాయకుడు ఇంటికి తిరిగివచ్చి తన నాయికను కలుసుకుని, వాళ్ళిద్దరూ తమ బిడ్డతోనో, పిల్లవాడితోనో సంతోషంగా గడుపుతున్నారని చెప్తాయి. ఐంగురునూరు ‘మరుదం’ తిణై తో మొదలవుతుంది. మరుదం అంటే పల్లెపట్టుల్లో నడిచే ప్రణయగాథ. అక్కడ ప్రేమికుల మధ్య మరొక స్త్రీ రావడం, అసూయ, ప్రణయకలహం మొదలైనవన్నీ నడుస్తాయి. అటువంటి తిణైతో కావ్యం మొదలుపెట్టి పొరపొచ్చాల్లేని గృహస్థ జీవితంతో ముగించడంలో ఐంగురునూరు సంకలనకర్త కావ్యాన్ని మంగళాంతం చేయగలిగాడు.
పది పదికాల్లో, ఒక్కొక్కదాన్నుంచీ ఒక్కొక్క కవితను ఎంపికచేసి ఇక్కడ మీకు అందిస్తున్నాను.
నీ కురుల్లో కొత్త అందం
1
ఆమె తన బిడ్డను లాలిస్తున్నది.
అతడామె వీపుని ఆనుకుని
జారగిలడం చూస్తుంటే
గాయకుడు తంత్రీవాద్యం
మీటుతున్న దృశ్యంలాగా ఉంది.
రెండుచోట్లా ఒకటే మాధుర్యం (402)
2
లలనా, నేను తపించింది ఈ వేళకోసమే
కలలుగన్నది ఈ అడవికోసమే.
ప్రేమికులు కలుసుకున్నప్పుడు కదా
యవ్వనం మధురంగా తోచేది! (415)
3
ఆమె ఊరిచుట్టూ అడవులు.
అక్కడ కొండమీద
చిన్నచిన్న కొమ్మల రేలచెట్టు మీంచి
రాలుతున్న బంగారురేకులు.
యువతీ! కన్నీళ్ళు మాను
నా ప్రయాణం పక్కనపెట్టేసాను. (420)
4
నీ ప్రేమికుడు వెళ్ళిన దారి
నిజంగా గొప్పది.
అక్కడ వజ్రాల్లాగా మెరిసే కొండలమీద
నీలమణుల్లాగా నెమళ్ళు. (431)
5
రాగిరంగు చిన్నదానా
భీకరమైన ఈ యుద్ధం ముగిసేక
నేను మన దేశానికి చేరుకున్నాక
నీ కురుల్లో
కొత్త అందం, పూలతావీ
పొంగిపొర్లుతాయి. (446)
6
గర్జిస్తున్న కోపోద్రిక్త మేఘం
రాజు వైరాన్ని చల్లబరిచింది.
యుద్ధభేరీలు సద్దుమణిగాయి.
వానాకాలం మొదలయ్యింది.
నా బాహువుల్ని చూస్తే జాలేస్తున్నది
చిక్కిశల్యమయ్యాయి
కళతప్పాయి, గాజులు
ముందుకు జారుతున్నాయి. (455)
7
బోదురుకప్పల బెకబెక
చిరుకప్పల చప్పుడు
వానలు మొదలయ్యాయి.
నీ విశాలబాహువుల్నీ
చక్కని ముంజేతుల్నీ
అతిథిగా పలకరించడానికి
గంటలుమోగుతున్న రథంలో
చూడు, నీ ప్రియుడిప్పుడే
ఇంటికి చేరనున్నాడు (468)
8
దయలేని కవీ
ఒక మాట అడుగుతాను చెప్పు.
నన్ను వదిలిపెట్టి
అతడు వెళ్ళిన దేశంలో
కమ్ముకుంటున్న మబ్బులు
వానని స్వాగతించేచోట
పసులకాపరుల పూలదండల్లో
విరజాజి వానకబుర్లు
వినిపిస్తున్నచోట కూడా
సాయంకాలాలు
ప్రేమలేనివేనా? (476)
9
ఒకరికొకరు ఎడబాటైనవారు
దిగుల్లో కూరుకుపోయే
సమయమిది.
నడిపించు సారథీ, తొందరగా రథం-
ఆమె గాజులగలగల
నన్ను తొందరపెడుతున్నది.
10
ఉరుములు వర్షించే వేళ
ఇన్నాళ్ళూ తపించి,
తపించినందుకు మరింత తపించి,
తప్తహృదయంతో
తిరిగొచ్చేసాను, తన్వీ,
నీ అందాన్ని నీకు తిరిగివ్వడానికి. (491)
26-6-2023
ప్రేమికులు కలుసుకున్నప్పుడుకదా యవ్వనం మధురంగా తోచేది .ఆహా ఆలోచనామృతం అంటే ఇలాంటి కవిత్వం వాక్యం వెనుక ఒక భావసముద్రమే కనిపిస్తుంది.
ధన్యవాదాలు సార్