ఆషాఢ మేఘం-8

అకనానూరు అంటే అకం పద్ధతికి చెందిన నాలుగువందల కవితల సంకలనం అని అర్థం. పురం పద్ధతికి చెందిన నాలుగువందల కవితల సంకలనం కూడా ఉంది. దాన్ని పురనానూరు అంటారు. అకనానూరుని నెడుంతొగై అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో కవితలు పెద్ద కవితలు. కొన్ని కవితలు దాదాపు ముప్ఫై పంక్తులదాకా ఉంటాయి. క్రీ.పూ. ఒకటవ శతాబ్దినుంచి సా.శ అయిదవ శతాబ్దిదాకా ఈ కవితల రచనాకాలం అయి వుండవచ్చునని అంచనా. కాని సంగం సాహిత్యంలోని ప్రాచీన సంకలనాల్లో ఇది కూడా ఒకటని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.

అకనానూరులోని 400 కవితల్లో ముల్లై తిణైకి చెందిన కవితలు 40 మాత్రమే ఉన్నాయి. వాటిని అమర్చడంలో కూడా సంకలనకర్తలు ఒక పద్ధతి పాటించారు. మొత్తం సంకలనంలో నాలుగు, పధ్నాలుగు, ఇరవైనాలుగు-ఇలా చివర నాలుగుతో ముగిసే సంఖ్యగల కవితల్ని ముల్లై తిణైకి చెందిన కవితలుగా సంకలనం చేసారు.

ఈ నలభై కవితలూ మొత్తం 28 మంది కవులు రాసినవి. అందులో ఒకరు అజ్ఞాతకవి. ఒకరివి నాలుగు కవితలు, ఒకరివి మూడు కవితలు, ముగ్గురివి రెండేసి చొప్పున ఇక మిగిలిన 22 కవితలు 22 మంది కవులు రాసినవి.

కురుంతొగైలోని ముల్లై కవితలు స్త్రీవిరహం వైపు నుంచి చెప్పినవి కాగా ఇవి పురుషుడివైపునుంచి చెప్పిన కవితలు. దాదాపుగా ప్రతి కవితలోనూ పురుషుడు యుద్ధభూమినుండి త్వరత్వరగా తన ఇంటికి చేరుకోవాలనే ఆత్రుతలో తన రథసారథితో చెప్పుకున్న మాటలే. నాయకుడికీ, పాత్రలకీ పేర్లుండవు కాబట్టి, దాదాపుగా, ప్రతి కవితలోనూ సందర్భం ఊహాజనితమనే అనుకోవచ్చు. కాని యుద్ధాలు జరగడం అయితే నిజం కాబట్టి, చాలా సార్లు కవులు ఏదో ఒక రూపంలో తమకు తెలిసో, తెలియకుండానో నిజంగా జరిగిన యుద్ధాల తాలూకు గుర్తులు ఆ కవితల్లో వదిలిపెట్టారని కూడా పండితులు చెప్తుంటారు.

కవిత నేపథ్యం దాదాపుగా మూసబోసినట్టు ఉండి, భావోద్వేగం కూడా ఒక చట్రానికే కట్టుబడి ఉండకతప్పని ఇటువంటి కవితలు మామూలుగా అయితే నీరసంగానూ, చర్వితచర్వణాలుగానూ ఉండాలి. కాని ప్రతి ఒక్క కవితనీ ఒక రసరమ్య వర్ణచిత్రంగా మార్చడం సంగం కవుల విశిష్టత అని ఒప్పుకోకతప్పదు. అకనానూరుని  The Four Hundred Songs of Love (2015) పేరిట ఇంగ్లిషులోకి అనువదించిన ప్రసిద్ధ సంగం వాజ్ఞ్మయ పండితుడు George L Hart తన ముందుమాటలో ఈ కవితల్ని మీనియేచర్ చిత్రలేఖనాల్తో పోలుస్తూ, ప్రతి కవితా ఒక రసరమ్య ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని చెప్తూ, ఇలా అంటున్నాడు:

‘భారతీయ సంప్రదాయ సంస్కృతిలో ప్రతి ఒక్కదాన్నీ కలుపుకుపోవాలనే ధోరణి కనిపిస్తుంది. ప్రతి ఒక్కదాన్నీ తక్కినవాటన్నిటితోనూ సమన్వయపరుచుకుంటూ మొత్తమంతా ఒక సమతౌల్యతలోకి కలుపుకునే ధోరణి అది. ఒక గోథిక్ కేతడ్రల్ ని చూడండి. దాన్ని ఎవరో ఎక్కణ్ణుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న భౌగోళిక స్వరూపాన్ని గుర్తుపట్టలేనట్టుగా మార్చగల మానవసామర్థ్యానికి నిరూపణనా అన్నట్టుగా ఆ నిర్మాణం ఆ నేలమీద ఒక చొరబాటులాగా గోచరిస్తుంది. కాని అదే, ఒక హిందూ దేవాలయం చూడండి. అది సహజసిద్ధంగా భూమిలో వికసించినట్టుగా, దానిచుట్టూ ఉన్న చెట్టుచేమల్లో అది కూడా ఒక భాగమన్నట్టుగా కనిపిస్తుంది. సామాన్యశకానికి మూడు శతాబ్దాల ముందు రాసిన అకనానూరు కవితల్ని కూడా మనం ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. అవి ఏ సాంస్కృతిక జీవనవాతావరణంలో వికసించాయో- ఆ సంస్కృతి, కుటుంబవ్యవస్థ, పశుపక్ష్యాదులు, పక్షులు, పూలు, సాంఘిక నిర్మాణం, చరిత్ర- వాటన్నిటిలో భాగంగా చూడాలి. ఎందుకంటే ఆ కవులు తమ కవితల్లో తమ జీవితాలకూ, తమ సమాజానికీ, తమ పరిసరాలకూ చెందిన ప్రతి ఒక్కదాన్నీ కవితల్లో ఆవాహన చేసే ప్రయత్నం చేసారు. ఆ కవితల్లో ఒక ప్రధానమైన ఇతివృత్తం ఉండవచ్చుగాక, కాని, ఆ భావాన్ని ఉన్మీలన చేసే క్రమంలో వారు ఆ సంస్కృతికీ, ఆ ప్రాదేశిక సౌందర్యానికీ సంబంధించిన వివిధ అంశాల్ని స్పృశిస్తో, అవన్నీ ఆ ఇతివృత్తం చుట్టూ ఎలా అల్లుకుని ఉంటాయో సూచిస్తో వచ్చేరు.’

ఈ పండితుడు మీనియేచర్ అనే పదాన్ని వాడటం చాలా సముచితంగా ఉంది. ఎందుకంటే, మొఘల్, రాజస్తానీ మీనియేచర్ చిత్రకారులు చిత్రించిన మీనియేచర్లు యూరోపియన్ పెర్ స్పెక్టివ్ కన్నా భిన్నమైన దృక్కోణంలో తాము చిత్రిస్తున్న ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. విరహిణి అయిన ఒక స్త్రీని చిత్రించవలసి వస్తే ఆ చిత్రకారులు ఆమెని మాత్రమే చిత్రించి ఊరుకోరు. ఆమె వేచి ఉన్న ప్రాసాదం, ఆ భవంతిచుట్టూ తోట, తోటలో పూలమొక్కలు, ఆ చెట్ల మధ్య ఫించం విప్పుకున్న నెమలి, ఆకాశంలో అల్లుకున్న నల్లమబ్బులు, ఆ మబ్బులకి హారం వేసినట్టుగా ఎగిరే కొంగలబారులు- ఆ ప్రదేశం, ఆ సమయం, ఆ సందర్భం మొత్తమంతా ఆ చిత్రలేఖనంలో వారు పొదిగిపెడతారు. అకనానూరులోని ప్రతి ఒక్క కవిత చేసేది కూడా ఇదే.

అయితే దాదాపుగా ఒక సందర్భం మొత్తం ఏకంగా ఒక కవిసమయంగా మారిపోయినప్పుడు ఆ కవితలో నవ్యత ఏమిటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. మరీ ముఖ్యంగా తమిళం తెలియని పాఠకులకి, ఆ సంగకాల తమిళభాషా సునాదమెలా ఉంటుందో తెలియని నాబోటివాళ్ళకి ఆ కవితల్లోని సౌందర్యాన్ని ఎక్కడ గమనించాలన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కాని మీనియేచర్ చిత్రలేఖనాలు కూడా స్థిరీకరణ చెందిన కవిసమయాల్లాంటివే. ప్రతి మీనియేచర్ చిత్రలేఖనంలోనూ కనవచ్చే ఆ రంగులు, ఆ రేఖలు, ఆ లలితసుందరమైన భావోద్వేగమూ చూడగానే మనల్ని సమ్మోహపరచడం మనకి అనుభవమే కదా. అలాగే అకనానూరు కవితల్లో కూడా  ఆ రంగులు, ఆ రేఖలు కలిసి సున్నితంగా చిత్రించే రసరమ్యలోకం అనువాదాల్ని కూడా దాటి ప్రయాణించగలిగింది అని మనం గ్రహిస్తాం.

కొన్ని కవితలు చూద్దాం.


విచ్చుకుంటున్న విరజాజి

1

(నాయకుడు తన సారథితో చెప్పిన మాటలు)

వానలు తప్పిపోలేదు. అడవి కొత్త అందం
తొడుక్కుంది. కారుమబ్బులు వానాకాలాన్ని
మోసుకొచ్చాయి.

నీలిరంగు శంఖుపూలమధ్య, జాజిపూల మధ్య
పాకుతున్న పట్టులాగా ఆరుద్రపురుగులు.
చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించినట్టు
ఎర్రనేల ఎటు చూడు.

సారథీ, కొరడా పక్కనపెట్టు, అదిలించకు గుర్రాల్ని
నెమ్మదిగా సాగనివ్వు, గెంతనివ్వకు
గుర్రాల డెక్కల చప్పుడు చెవినపడితే
ఆ లేడి తన దుప్పిని చేరడమెట్లాగు?

పండ్లు పండేక అరటిపూల రేకుల్లాగా
మెలికలు పడ్డ కొమ్ముల్తో ఆ హరిణం
తన మిథునాన్ని
ఈ రాత్రివేళ పెనవేచుకోవడమెట్లాగు?

(శీతలై శాత్తనార్, అకనానూరు, 134)

2

(నాయకుడు తన సారథితో చెప్పిన మాటలు)

పచ్చగా పరుచుకున్న పచ్చికబయలు మీద
మెరుస్తున్న వానబొట్లు
పడెలు కట్టిన ప్రతి తావులోనూ
చిన్ని చిన్ని సంగీతవాద్యాలు మీటుతున్నట్టు
కప్పల బెకబెక.

పొట్టిపొదల్లో, పొడవైన కాడపూలతో
ఎర్రమట్టినేలలపొడుగునా వింతసొగసు.
కోపంతో పడగలెత్తిన పాముల్లాగా
మొగ్గలు విప్పుకుంటున్న అడవినాభి, చల్లనిగాలి.
ఒకదానికొకటి మెలికలు పడ్డ కొమ్ముల్తో
ఏటిఒడ్డున నీళ్లు తాగుతున్న దుప్పి, దాని లేడి,
అడవుల్లో నిద్రలేచిన అందం
చల్లని దారి.

విశాలపథం మీద రథం నడిపించు సారథీ
గుర్రాల డెక్కల మీద చిరుగంటలు మోగనీ.
నా కోసం ఎదురుచూస్తున్న, నన్నే నమ్ముకున్న
ఆ సుందరి చెంతకు నన్ను సత్వరమే చేరనీ.

(పొదుంపిల్ పుల్లాంగణ్ణియార్, అకనానూరు, 154)

3

(నాయకుడు తన సారథితో చెప్పిన మాటలు)

వానాకాలపు అర్థరాత్రి. గర్జిస్తున్న మేఘాలు.
కుంభవృష్టితో కంపిస్తున్న గగనం. పరుగెడుతున్న పాములు.
వానకి తడిసిన తలలు విదిలిచించుకుంటున్న గొర్రెల మధ్య
కాపరి వెచ్చదనానికి రగిలిస్తున్న చెకుముకి.
కర్రకి కట్టుకున్న కావడి, చంకన చాపచుట్ట,
తడిపేస్తున్న వానజల్లు, నెమ్మదిగా అడుగులు
మధ్యమధ్యలో ఈలల్తో అదిలింపు.
పొదలమధ్య పొంచి మందమీదదూకబోతూ
ఈలవింటూనే  పరుగెడుతున్న గుంటనక్క.

అక్కడ, ఆ చల్లని ఊళ్ళో,
పరిమళాలు వెదజల్లే పచ్చికబయళ్ళమధ్య
తీపిగాలివెదజల్లే విరజాజిపూలమధ్య
నా కోసం ఎదురుచూస్తో నా గృహిణి.

(ఇడైక్కాడనార్, అకనానూరు, 274)

4

(అతడు ఇంటికి రాబోతున్నాడని తెలిసి ఇరుగుపొరుగు చెప్పుకుంటున్న మాటలు)

ఈ రోజు అతని భార్యకి పండగే.
లేతవెదురులాగా మెత్తగా గుండ్రంగా ఉండే ఆమె చేతులు, గాజులు,
అమాయికమైన సంతోషం.

అక్కడ పొలాలమీద కురుస్తున్న వానలో
తల్లినీడన పెరిగే చిలుక రెక్కల్లాంటి పచ్చిక.
పడెలు కట్టినప్రతిచోటా బాజాలాగా తెల్లటి నీటిపొర
వానపడుతున్న తావుల్లో గుటగుటలాడుతూ
ఇంతలో పుట్టి ఇంతలో కనుమరుగయ్యే నీటిబుడగలు.

కొమ్మలమీంచి పూలూ, తేనే రాలిపడ్డ చోట
లకుముకిపిట్ట రెక్కల్లాగా నల్లని ఇసుక.
రాలిపడ్డ పూలల్లో తచ్చాడుతున్న తేనెటీగలు
పూలని తొక్కుకుంటూ పరుగెడుతున్న రథచక్రాలకు
పరుగెత్తుతున్న పాముల్లాగా చిందుతున్న నీళ్ళధారలు.

రథం నగరద్వారం దగ్గరకు చేరుకుంటున్నది
సంజెవేళ విరజాజి విచ్చుకుంటున్నది.

(ఒక్కూరు మాసాత్తియారు, అకనానూరు, 324)

5

(తన పనులు ముగించుకుని నాయకుడు ఇంటికి చేరుకోడం చూసి ఇరుగుపొరుగు చెప్పుకుంటున్న మాటలు)

అతనేమంటున్నాడో విన్నావా?

‘నాకు ఈ పెద్ద రథం ఎక్కడమే గుర్తుంది.
ఎంత తొందరగా ఇంటికిచేరుకుంటానా అనే నా ధ్యాసంతా.
రాజు అప్పగించిన కఠినబాధ్యత పూర్తి చేసాను
ఇంతలోనే ఇక్కడికెలా చేరుకున్నానో అర్థంకావట్లేదు.
ఊరి పొలిమేరల్లో వాలుతున్న కంకుల్తో జొన్నచేలు
అడవిపూల పచ్చికబయళ్ళలో తుళ్ళింతలాడుతున్న కుందేళ్ళు

ఇంతలోనే బండి తీసుకొచ్చి ఆమె ఇంటిముందు ఆపేవు
‘అయ్యా, ఇంటికొచ్చాం, దిగండి’ అని నువ్వగానే
నాకు ఆశ్చర్యం వేసింది.
నువ్వు గాలికి రథాన్ని పూన్చి ఆకాశంలో గాని నడిపేవా?
లేకపోతే నీ మనసునే గుర్రంగా బండికి కట్టి నడిపించేవా?’

ఆ పెద్దమనిషి ఆ సారథిని కావలించుకున్నాడు
చేయి పట్టుకుని తన ఇంట్లోకి తీసుకువెళ్ళాడు
అలంకరణతో వెలుగుతున్న అతని భార్య ముఖం
అతిథిని చూసిన సంతోషానికి మరింత మెరిసింది.

(ఒక్కూరు మాసాత్తియారు, అకనానూరు, 384)

25-6-2023

5 Replies to “ఆషాఢ మేఘం-8”

  1. చిక్కని కవిత్వంలో చిక్కనిది కూడా కొంత ఉంది. కానీ కవితల్లో వర్షదృశ్యాలు అద్భుతంగా సహజ సుందరంగా ఉన్నాయి. ప్రకృతి లోని పరిణామాలకు హృదయోద్వేగాలకు పొంతన కూర్చడంలోనే కవి ప్రతిభ కనబడుతుంది.

  2. ఆ సంగమ తమిళం.. ఆ ఇంగ్లీషు అనువాదం ఏమో గానీ మీ తెలుగు అనువాదం మాత్రం అమోఘం. లేత వెదురు లాంటి ఆమె చేతులు.. నీటి గుంటలు చేసే గుట గుట శబ్దాలు వహ్వా.. వహ్వా..

Leave a Reply

%d bloggers like this: