ఆషాఢమేఘం-7

వర్ష ఋతువు మీద ఒక కవితనో లేదా ఒక సర్గ పొడవు వర్ణన మాత్రమే చేసి ఊరుకోకుండా ఒక ఇతివృత్తందా దాని చుట్టూ కొన్ని వందల ఏళ్ళ పాటు కవిత్వం చెప్పిన వాళ్ళు తమిళ సంగం కవులు.  ఒకప్పుడు ప్రాచీన తమిళదేశంలో మధురై కేంద్రంగా ఒక సాహిత్య సంఘం ఉండేదనీ, వారు ప్రతి ఏటా గ్రామాలనుంచి కవిత్వాన్ని సేకరించి దానిలో ఉత్తమ కవిత్వాన్ని సంకలనాలుగా రూపొందించారనీ చెప్తారు. అలా రూపొందించిన సంకలనాల్లో ‘ఎట్టుత్తొగై’ అనే ఎనిమిది కవితాసంకలనాలూ, ‘పత్తుప్పాట్టు’ అనే పది దీర్ఘకవితలూ ప్రధానమైనవి.

సాధారణంగా సంగం కవిత్వం క్రీం.పూ మూడవ శతాబ్దం నుంచి సా.శ మూడో శతాబ్దం మధ్యకాలంలో వికసించింది లెక్కగట్టడం పరిపాటి. కాని ఇటీవలికాలంలో ఈ అంచనాల్ని సవరిస్తో వచ్చారు. హెర్మన్ టీకన్ అనే డచ్చి పండితుడు సంగం కవిత్వం చాలావరకూ పల్లవరాజుల కాలంలో ఆరేడు శతాబ్ధాల కాలంలో రాసిందనీ, గాథాసప్తశతి వంటి ప్రాకృత కవిత్వసంకలనాల తర్వాత ఆ ధోరణిలో సంగం కవిత్వాన్ని రాసారనీ వాదించాడు.  సంగం కవిత్వాన్ని సంకలనాలుగా కూర్చడం బహుశా పల్లవకాలంలో జరిగి ఉండవచ్చుగాని ఆ కవిత్వం అప్పటికే అయిదారు శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్నదేనని మరికొందరు పండితులు వాదిస్తున్నారు. రెండు వైపుల వాదాలూ విన్నతరువాత,  సంగం కవిత్వంలోని తొలి కవిత్వం గాథాసప్తశతికన్నా ప్రాచీనమైందనే నేను నమ్ముతున్నాను. అందుకని, ప్రాచీన భారతీయ కవిత్వంలో వర్షర్తువర్ణన గురించి తలుచుకోడానికి వాల్మీకి తర్వాత సంగం కవులదగ్గరకే వెళ్తున్నాను.

గత శతాబ్ది మొదటిరోజుల్లో, యు.వి.స్వామినాథ అయ్యర్ అనే తమిళ పండితుడు, అప్పటిదాకా తాళపత్రాలకే పరిమితమైన, సంగం కావ్యాల్ని వెలికి తీసి పరిష్కరించి, ప్రచురింపచేసి, రాత్రికి రాత్రి తమిళభాషను ప్రపంచ సర్వశ్రేష్ట కావ్యభాషల్లో ఒకదానిగా మార్చేసాడు. ఆ తర్వాత రోజుల్లో ఎ.కె.రామానుజన్ సంగం కవిత్వం గురించీ, ఆ కవిత్వాన్ని తీర్చిదిద్దిన ప్రాచీన తమిళ రసజ్ఞ దృష్టి గురించీ పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసాక, ఎక్కడెక్కడి తుమ్మెదలూ వచ్చి ఆ తమిళపుష్పం మీద వాలడం మొదలుపెట్టాయి. ఇప్పుడు సంగం కవిత్వం ఎంత బృహత్ మధుకోశమో, ఆ కవిత్వం మీద ప్రతి ఏటా వెలువడుతున్న అనువాదాలూ, అనుశీలనలూ, చర్చలతో అంతకన్నా పెద్ద మధుభాండం తయారవుతూ ఉంది.

డెబ్భై ఏళ్ళకిందటిదాకా పరిపాలనాపరంగా తమిళదేశంలో భాగంగా ఉన్నప్పటికీ, తెలుగులో పుస్తక ప్రచురణ, ఆధునిక విద్య చెన్నై కేంద్రంగానే మొదలైనప్పటికీ, దాదాపుగా ఆ కాలంలోనే సంగం సాహిత్యం మళ్లా వెలుగు చూస్తున్నప్పటికీ, ఆ కావ్యాల గురించి గాని, ఆ చర్చల గురించి గాని మనకు ఇంగ్లిషు ద్వారానే తెలియవలసి రావడం ఒక విషాదం. ఈ మాట నాయన్మారుల తేవారానికీ, నాలాయిర దివ్యప్రబంధానికీ కూడా వర్తిస్తుంది.

తమిళ సంగం కవిత్వం ప్రధానంగా రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకదాన్ని అకం అన్నారు. అది మనిషి మనోమయ, భావనామయ, సంవేదనామయ ప్రపంచం. ప్రణయం దాని ప్రధాన ఇతివృత్తం. కాని అది వట్టి ప్రేమకవిత్వం కాదు. ప్రేమచుట్టూ అల్లిన ప్రకృతి ప్రేమకవిత్వం. నువ్వు జీవిస్తున్న దేశం, కాలం, ఋతుపరిభ్రమణం, పశుపక్ష్యాదులు, పూలు, చెట్లు- సమస్తం అందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అది మొత్తం తమిళసీమను (తమిళ అని అంటున్నప్పుడు అది కేవలం తమిళనాడుకి మాత్రమే పరిమితమైన భూగోళం కాదు. దానిలో ఇప్పటి కేరళ, కొంగునాడుని ఆనుకుని ఉన్న కర్ణాటకప్రాంతం, వేంగడంగా పిలిచే ఇప్పటి తిరుపతి ప్రాతం, శ్రీలంక ఉత్తర ప్రాంతం కూడా ఉన్నాయని చెప్పవచ్చు) ఒక కావ్యసీమగా మార్చిన రసవిద్య.

ప్రాచీన తమిళ అలంకారికుల దృష్టిలో ప్రేమావస్థలు ఏడు. అందులో రెండు అవస్థలు తీవ్రావస్థలు. అవి కావ్యవస్తువుగా స్వీకరించడానికి పనికి రావు. మిగిలిన అయిదు అవస్థలూ- తొలికలయిక, ఎదురుచూపు, ప్రణయకోపం, విరహదుఃఖం, ఎదబాటు- కావ్యవస్త్వులుగా స్వీకరించదగ్గవి. వీటిని ప్రణయభూమికలు అని కూడా అనవచ్చు. సంగం కవులు వీటిని ‘తిణై’ అన్నారు.  ఈ అయిదు తిణైలకీ ప్రతి ఒక్కదానికీ ఒక్కొక్క ప్రాకృతిక సంకేత స్థలం ఉంది, ఋతువు ఉంది, పువ్వు ఉంది, పక్షి ఉంది, సమయం ఉంది. సందర్భం ఉంది. ఆ తిణైచుట్టూ అల్లిన ప్రతి కవితలోనూ ఈ సంకేతాలు కొన్ని సార్లు వాచ్యంగానూ, కొన్ని సార్లు సూక్ష్మంగానూ ఉంటాయి. అంటే ఆ కాలాన్ని సూటిగా చెప్పకుండా ఆ కాలాన్ని సంకేతించే పువ్వునో, పక్షినో మాత్రమే ప్రస్తావించి ఊరుకుంటారు. సంస్కృత ఆలంకారికులు తర్వాత రోజుల్లో కవిత్వానికి ప్రాణంగానూ, అత్యుత్తమ కవిత్వానికి ప్రమాణంగానూ భావించిన ‘ధ్వని’ సంగం కవిత్వానికి ఆత్మ అని చెప్పవచ్చు. పైకి వర్ణనలాగా ఉండే ఒక కవితలో ఆ తిణై ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వని సహృదయుణ్ణి చేరినప్పుడు అతడు పొందే కావ్యానందం వెలకట్టలేనిది.

సంగం కవిత్వంలోని మరొక విభాగం పురం కవిత్వం. అకం మనోమయ ప్రపంచానికి చెందిన ప్రణయకవిత్వం కాగా, పురం వాస్తవిక ప్రపంచానికి చెందిన సాంఘిక కవిత్వం. అందులో రాజులు, రాజ్యం యుద్ధం, సైన్యం, క్షామం, దానం లాంటి సాంఘిక ఇతివృత్తాలుంటాయి. అకం కవిత్వంలో నాయికా నాయకులకు పేర్లు ఉండవు. సార్వత్రికమైన ప్రేమానుభూతితో కవిత్వ శ్రోత తాదాత్మ్యం చెందడానికి పేర్లతో పనిలేదు కదా. కాని పురం కవిత్వంలో పేర్లు ఉంటాయి, ప్రశస్తి ఉంటుంది. అది రాజులచుట్టూ, దాతలచుట్టూ నడిచే కవిత్వం కాబట్టి అందులో పేర్లు ఉండటకతప్పదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

అకం కవిత్వంలోని అయిదు తిణైల్లో ‘ముల్లై’ అనే తిణై వర్షాకాలానికి సంబంధించింది. Jasminum auriculatum అంటే తెలుగులో విరజాజి. భౌగోళికపరంగా ముల్లై తిణై అడవికి సంబంధించింది కాబట్టి అడవిమల్లె అని కూడా కొందరు చెప్తుంటారు. విరజాజి ఒకప్పుడు అడవితీగ కూడా అయి ఉండవచ్చు. కాబట్టి నేను ముల్లైని విరజాజి అనే వ్యవహరిస్తున్నాను. వానాకాలం మొదలవగానే వికసించే విరజాజి చుట్టూ తమిళ వర్షర్తు కవిత్వం వికసించిదని తెలియడంలోనే గొప్ప రసస్ఫూర్తి ఉంది.

ఇప్పుడు ఆషాఢ మేఘం శీర్షిక కింద నేను అకం కవిత్వంలో ముల్లై తిణైకి చెందిన కొన్ని కవితల్ని వరసగా పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. వాటిలో మొదట ‘ఎట్టుత్తొగై’ అంటే ఎనిమిది కవిత్వసంకలనాలనుంచి మూడు సంకలనాలు -‘కురుంతొగై’, ‘అహనానూరు’, ‘ఐంగురునూరు’ అనే సంకలనాలనుంచి ముల్లై తిణై చుట్టూ అల్లిన కొన్ని కవితల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మొదటగా ‘కురుంతొగై’. అంటే చిన్న కవితల సంకలనం అని అర్థం. ఇందులో రెండు కవితలు తప్ప మొత్తం కవితలు నాలుగునుంచి ఎనిమిది పాదాలు మించని చిన్న కవితలు. మొత్తం 400 లేదా 402 కవితలు. వీటిలో ముల్లై తిణైకి చెందిన కవితలు మొత్తం 44 ఉన్నాయి. ఈ 44 కవితలూ మొత్తం 37 మంది కవులు రాసారు. వీరిలో ఒకరు అజ్ఞాత కవి. ఇద్దరు కవులు మూడేసి కవితలు, ముగ్గురు రెండేసి కవితలూ రాయగా, తక్కినవన్నీ ఒక్కొక్కటీ ఒక్కొక్క కవి చొప్పున 32 మంది రాసినవి.

ముల్లై వర్షర్తువుకి చెందిన కవిత్వమే అయినప్పటికీ ప్రధానంగా శ్రావణభాద్రపదాల కవిత్వం. నైరుతి ఋతుపవనాలు తమిళప్రాంతాన్ని పూర్తిగా తడపవుకాబట్టి అక్కడ ఆషాఢమేఘాన్ని ఆశ్రయించి వర్షర్తు వర్ణనలు నడవలేదు. కాని వర్షాకాల ప్రధానంగా ఉండే ముల్లై తిణైకి భౌగోళికంగా అడవిని సంకేతపరిచారు కాబట్టి, ఆ అడవులు కూడా ప్రాచీన తమిళదేశానికి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఒకరకంగా ముల్లై కవిత్వం ఆషాఢమాసపు చివరిరోజులనుంచీ మొదలవుతుందనుకోవచ్చు. విరజాజి విరబుయ్యడం కూడా ఆషాఢమాసంలోనే మొదలవుతుంది కదా.

ప్రతి తిణైకీ ఒక వేళ కూడా ఉంటుంది. ముల్లైది సాయంకాలవేళ. అధిదేవత మేయోన్, అంటే విష్ణువు. అంటే ముల్లై కవిత్వం వర్షాకాల సాయంకాలాల్లో విచ్చుకునే విరజాజిపూల స్ఫురణలో తన భర్తకోసం ఎదురుచూసే ఒక విరహిణి చుట్టూ అల్లిన కవిత్వం. లేదా వానాకాలం మొదలవగానే యుద్ధంనుంచో, ప్రవాసం నుంచో తిరిగి ఇంటిబాట పట్టి, తన ఇంట్లో తనకోసం ఎదురుచూసే భార్యని తలచుకునే విరహి చుట్టూ అల్లిన కవిత్వం.

నేను పరిచయం చేయబోతున్న మూడు సంకలనాల్లోనూ ‘కురుంతొగై’ విరహిణి వైపు నుంచి చెప్పిన కవిత్వంకాగా, ‘అగనానూరు’ ప్రవాసి అయిన పురుషుడివైపు నుంచి చెప్పిన కవిత్వం. ఇక ‘ఐంగురునూరు’ ఇద్దరి వైపు నుంచీ కవిత్వం చెప్తూ, చివరికి ఇద్దరూ చేరువయ్యే మంగళప్రద గృహజీవితం చుట్టూ అల్లిన కవిత్వం.

ఈ మూడు సంకలనాల్లోని ముల్లై కవితల అందం దేనికదే అయినప్పటికీ  ‘కురుంతొగై’లోనూ, ‘ఐంగూరునూరు’లోనూ కవితలు చిన్నవి కావడంవల్ల వాటిలో గొప్ప సొగసు కనిపిస్తుంది. అయితే ఐంగురునూరు నాటికి సంగం కవిత్వం పూర్తిగా వికసించి ఆ శైలికొక స్పష్టత సిద్ధించింది కాబట్టి ఆ కవితల్లో శిల్పం వెనక పూర్వకవుల ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. కాని కురుంతొగై సంగం తొలికాలపు కవిత్వం కాబట్టి, సంగం తిణైల స్వరూపస్వభావాలింకా స్థిరపడుతున్న కాలానికి చెందిన కవిత్వం కాబట్టి, అందులో తొలికవిత్వాల్లో ఉండే మౌలికతతో పాటు గొప్ప తాజాదనం కూడా కనిపిస్తుంది. అప్పుడప్పుడే విప్పారుతున్న విరజాజిపూలలాంటి కవితలవి.

ఒక స్త్రీ యుద్ధానికో, ప్రవాసానికో వెళ్ళిన తన భర్త వానాకాలం మొదలవుతూనే తిరిగి తప్పకుండా ఇంటికొస్తాడని ఆ వానాకాలపు సాయంకాలాల్లో ఎదురుచూడటం ఆ కవితలకి సందర్భం. దాదాపుగా ప్రతి ఒక్క కవితకీ అదే సందర్భం. అంటే కవితాసామగ్రి చాలా పరిమితం. కాని పరిమిత కవితాసామాగ్రితోటే ఎప్పటికప్పుడు కొత్త కవితలు చెప్పిన పారశీక, ఉర్దూ గజల్ కవుల్లాగా, కురుంతొగై ముల్లై కవులు కవితలు చెప్పడం మనల్ని చకితుల్ని చేస్తుంది. కురుంతొగై లో ప్రతి కవితలోనూ, వర్ణనతో పాటు ఆధునిక వచనకవితల్లో కనిపించే ఒక epiphany కూడా కనిపిస్తుంది. ఆ అనుభూతి చర్వితచర్వణంగా వినిపించకుండా కొత్తగా ఉండటం వల్ల ఆ కవితలు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా తాజాగా వినిపిస్తున్నాయి.

ఆ సౌందర్యాన్ని ఎంతోకొంత తెలుగులోకి తీసుకురాడానికి ప్రయత్నిస్తూ ఇలా మీతో పంచుకుంటున్నాను.

ఈ చిన్న కవితల్ని ఏమాత్రం వ్యాఖ్యానించినా ఆ విరాజాజిపూలు నలిగిపోతాయి. ప్రతి ఒక్క కవితా చదివేక ఒక నిమిషమేనా ఆగాలి. అప్పుడే ఆ సూక్ష్మసుగంధం మీ మనసుని పట్టుకుంటుంది.


విరజాజి పూలగాలి

1

(నాయిక తన చెలికత్తెతో చెప్పిన మాట)

అడవిలో విరబూసిన రేలచెట్లు
గుత్తులుగుత్తులుగా వేలాడుతున్న పూలు
బంగారు నగలు ధరించిన సుందరాంగి
ముంగురుల్లాగా
పూలమీద మూగుతున్న తేనెటీగలు
వానాకాలం వచ్చేసిందంటున్నాయి.

నేను నమ్మను,
నా మనిషి అబద్ధమాడడు.

(ఓదలాందయార్, కురుంతొగై, 21)

2

(నాయిక తన చెలికత్తెతో చెప్పిన మాట)

వానలకి నల్లబడుతున్న వేపచెట్లు
విరబూసిన రేలపూలు
అతడొచ్చేలోపే రాలిపోతాయా?

అతడు వెళ్ళినప్పటినుంచీ
ఊళ్ళోవాళ్ళమాటలు నన్ను పీడిస్తున్నాయి.

ఏటిపక్కన తెల్లటిచెట్టుమీద పండి
రాలిపడ్డ ఒకేఒక్క అత్తి పండులాంటిదాన్ని,
పీతలు నన్ను పీక్కుతింటున్నాయి.

(పరనార్, కురుంతొగై, 24)

3

(నాయిక తన చెలికత్తెతో చెప్పిన మాట)

నెచ్చెలీ, ఒక్కటే అనిపిస్తోంది-
మా తోటలో అల్లుకున్న
నాలుగు బీరతీగెలు తెంపి
ఆ పూలు పట్టుకుపోయి చూపించగలరా
వాడికి?

చెప్పగలరా నాలుగు మాటలు?

చూడు నీ ఆడమనిషి ముఖం కూడా
ఇప్పుడు వీటిలాగే తయారైందని!

(గోకులముద్రనార్, కురుంతొగై, 98)

4

(నాయిక తనచెలికత్తెతో చెప్పిన మాట)

ఈ చల్లనిగాలిలో రేలచెట్లతో
కలిసి ఊగుతున్న నారింజచెట్లు

సంపన్న శిశువుల చిన్నారికాళ్ళకు
చుట్టిన బంగారు అందెలకి వేలాడే

చిరుగంటల్లో నాలుకల్లాగా
నోరుతెరుచుకున్న కప్పల్లాగా
చూడు, నారింజమొగ్గలు.

అయినా ఇది వానాకాలం కాదంటావా
అయితే నువ్వింకా కలల్లోనే ఉన్నావంటాను.

(ఇళన్ గిరందయార్, కురుంతొగై, 148)

5

(నాయిక తన చెలికత్తెతో చెప్పిన మాటలు)

చిన్నచిన్న మూతల కల్లుముంతల్లాంటి
ఆ ఊరి కాలవల్లో
కప్పలు నోరుతెరుచుకుని
డప్పుల్లాగాగా చప్పుడు చేస్తుంటాయి.

అతడు నన్ను దగ్గరగా లాక్కుని
నా భుజాలు అదుముకున్నది
కిందటి వెన్నెలరాత్రి.

అయినా వదల్లేదింకా ఆ భుజాల్ని
విరజాజిపూలతావి.

(అరిసిల్ కీయార్, కురుతొగై, 193)

6

(నాయిక తన చెలికత్తెతో చెప్పిన మాట)

విరజాజి విప్పారింది కానీ
నా వాడింకా తిరిగి రాలేదు

ఆ గొర్రెలకాపరి
తాటాకుగొడుగుకప్పుకుని
పాలుపట్టుకెళ్ళాడు
రాత్రికి అన్నం తెచ్చుకుని
మందని చేరుకున్నాడు

అతని నెత్తిమీద
చిన్న చిన్న జాజిపూలు.

(ఉరయూర్ ముదుకొట్రనార్, కురుంతొగై, 221)

7

(నాయకుడు తన రథసారథితో చెప్పిన మాటలు)

వాళ్ళ నాన్న పండితులకి
దానధర్మాలు చేస్తాడు
నలుగురికీ ఆకలితీరేట్టు
అన్నం పెడతాడు

గాజుల్తో గలగల్లాడే ముంజేతుల్తో
ఇప్పుడామె ఆ కొండపల్లెలో
ఎదురుచూస్తుంటుంది.

ఆ ఊళ్ళో కర్రపెండలం కోసం
తవ్విన గుంతలనిండా
రేలపూల కొమ్మలు.
వాటిని చూడబోతే
ఇన్నాళ్ళూ పాతిపెట్టి
ఇప్పుడు బైటికి తెరిచిన
బంగారప్పెట్టెల్లాగా ఉన్నాయి.

(పేయనార్, కురుంతొగై, 233)

8

(నాయకుడు తన సారథితో చెప్పిన మాటలు)

నిజంగా బతికిన రోజులంటే అవి:
ఆమె బుజాలు తలగడగా
నిదురించిన రోజులు

గాయకులు తంత్రీవాద్యాలు మీటినట్టు
నినదించే ఆకాశం.
కుంభవృష్టికురిసిపోయాక
విప్పారే విరజాజిపూల గాలి
ఆమె జుత్తునిండా అల్లుకున్న రోజులు.

తక్కిన రోజులగురించి చెప్పడానికేముంది?
అవన్నీ ఒట్టి ఊక.

(పదడి వైగలార్, కురుంతొగై, 323)

9

(ఆమె తన చెలికత్తెతో చెప్పినమాట)

నెచ్చెలీ, ఎలానో ఒకలాగా
ఈ రోజంతా ఈదులాడినా
ఏం ప్రయోజనం?

సూర్యతాపం సద్దుమణిగాక
విరజాజి మొగ్గతొడుగుతుంది.
అప్పుడింకేమీ చెయ్యలేను.

వరదలాగా ముంచెత్తే రాత్రి
సముద్రంకన్నా పెద్దది.

(కంగుళ్ వెళ్ళత్తార్, కురుంతొగై, 387)

10

(నాయకుడు తన సారథితో చెప్పిన మాటలు)

సారథీ, నీ చాకచక్యం ఏమని పొగడను?

ఎప్పుడూ వచ్చే ఆ పాతదారిలో
ప్రయాణం ఆలస్యమవుతుందని తెలుసు నీకు.
అందుకే కదా, కొత్తదారి తొక్కావు,
కొండలకి అడ్డం పడి నడిపావు.

నువ్వు చేసిన సాయం ఒక్క రథం నడపడమేనా?
కాదు, ఒక స్త్రీ ప్రాణాలు కాపాడేవు.

(పేయనార్, కురుంతొగై, 400)

10 Replies to “ఆషాఢమేఘం-7”

  1. అద్భుత రసరాజకవితలు. సుకుమారమైన గుండె మీద పూవు స్పర్శలాగా గగుర్పాటు కలిగించే కవితలు. ఇంత నర్మగర్భంగా కవిత్వం చెప్పటం కోసం ఎంత సాధన చెయ్యాలో.

  2. కావ్యసీమ గా మార్చిన రసవిద్య!
    Spell Bound, Sir.

  3. ఊహించానండీ..
    ఈ వర్షరుతువు వెంట వెళుతూ, సంగం సాహిత్యాన్ని తీసుకొస్తారని.
    మొదటి సారి సిక్కిల్ గురుచరణ్ పాడిన ‘యాయుం..యాయుం’ పాట యూట్యూబ్ లో వినేదాకా సంగం సాహిత్యం గురించి అసలు తెలియదు.. ఒక తమిళ ఫ్రండ్ ద్వారా తెలిసింది ఈ సాహిత్యం యొక్క అందం, గొప్ప దనం.
    గాథాసప్తశతి కాలం, సగం కాలం తరువాత అని ఇప్పుడు తెలిసింది.
    మీ అనుసృజన ఆహ్లాదకరంగా వుంది. మీరు అన్నట్టు రేలపూలంత సున్నితం!

  4. ఏ పుణ్య కార్యం చేశానో.. ఇవి చదివే భాగ్యం కలగడానికి. పాఠకునిగా మీ ఋణం తీర్చుకోలేనిది.

  5. తమిళ సంగం కవితల గురించి చాలా వివరంగా చెప్పారు మరియు వాటిని చక్కని తెలుగు అనువాదం చేసి ఆస్వాదించినట్లు చేసారు.ధన్యవాదములు.అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: