
శోకాగ్ని చల్లారిన తర్వాత మరింత తేటపడ్డ కళ్ళతో చూసాడా అన్నట్టుగా రాముడు వర్షర్తువైభవాన్ని మరింత ఉజ్జ్వలంగా వర్ణిస్తాడు. అప్పటికే ఆయన వర్షం చేస్తున్న నృత్యాన్ని చూడకపోలేదు. ఈ శ్లోకం చూడండి:
వహంతి వర్షంతి నదంతి భాంతి
ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి
సద్యో ఘనా మత్తగజాః వనాంతాః
ప్రియావిహీనాః శిఖినః ప్లవంగాః (28-27)
(వర్షాలు పడుతున్నప్పుడు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మేఘాలు వర్షిస్తున్నాయి. మత్తగజాలు ఘీంకరిస్తున్నాయి. అడవుల్లో లోతట్టు ప్రాంతాల్లో వెలుగు పరుచుకుంది. ఎడబాటుకు లోనైనవారు తలపుల్లో కూరుకుపోయారు, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. వానరాలు కదలకుండా కూచున్నాయి.)
అంటే ఒకవైపు వర్షనృత్యం చూస్తున్నప్పటికీ ‘ప్రియావిహీనులు’ ఆయన స్మృతిలోంచి పోలేదు. అలాగే ఈ శ్లోకం కూడా:
ధారానిపాతైరభిహన్యమానాః
కదంబశాఖాసు విలంబమానాః
క్షణార్జితం పుష్పరసావగాఢం
శనైర్మదం షట్చరణాస్త్యజంతి (28-29)
(ఆగకుండా కురుస్తున్న వర్షధారలకి దెబ్బతిన్న కడిమిచెట్లమీద వాలుతున్న తుమ్మెదలకి అప్పటిదాకా పూలతేనెలో మునిగితేలిన మత్తంతా నెమ్మదిగా దిగిపోతున్నది)
ఇదొక ఆశ్చర్యకరమైన దృశ్యం. ఆదికవి ఇటువంటి తావుల్లోనే నన్ను అపారంగా నివ్వెరపరుస్తుంటాడు. మొత్తం వనం వనమంతా నృత్యం చేస్తున్న ఆ మహావర్షం మధ్యలో మత్తుదిగిపోతున్న తుమ్మెదల్ని కూడా చూడగలగడం. ఏకకాలంలో విస్తృతమైన కాన్వాసు మీద బొమ్మగీస్తో, మరొక పక్క మీనియేచర్ చిత్రం కూడా గీస్తున్న చిత్రకారుడిలాగా కనిపిస్తాడు ఇటువంటి చోట్ల.
ఇదంతా కూడా ‘అంగారచూర్ణం’ అనే మాట స్ఫురించకముందు వర్ణన. అంటే అప్పటికింకా ఆయనలో ఊగిసలాట ఉంది. ఒకవైపు వాన అందాన్ని చూస్తున్నా మరొకవైపు మనోవ్యాకులత కూడా అంతే బలంగా ఉంది. కాని 30 వ శ్లోకం తర్వాత చూసిన వర్షం వేరు. ఈ శ్లోకాలు చూడండి:
క్వచిత్ ప్రగీతా ఇవ షట్పదౌఘైః
క్వచిత్ ప్రవృత్తా ఇవ నీలకంఠైః
క్వచిత్ ప్రమత్తా ఇవ వారణేంద్రైః
విభాంత్యనేకాశ్రయిణో వనాంతాః ( 28-33)
(అడవిలోపల వాన పడుతున్నప్పుడు కొన్ని చోట్ల తుమ్మెదల ఝుంకారంలాగా ఉంది. కొన్నిచోట్ల నెమళ్ళు నాట్యం చేస్తున్నట్టు ఉంది. కొన్నిచోట్ల మదపుటేనుగలు సంచరిస్తున్నట్టుంది. ఇలా అనేక విధాలుగా అడవిలోతట్టు ప్రాంతాలు శోభిస్తూ ఉన్నాయి)
కదంబ సర్జార్జున కందలాఢ్యా
వనాంతభూమిర్నవవారిపూర్ణా
మయూరమత్తాభిరుత ప్రనృత్తైః
ఆపానభూమి ప్రతిమా విభాతి (28-34)
(కడిమి, మద్ది, కందళ, సర్జ వృక్షాలతో, కొత్తగా కురుస్తున్న వాననీళ్ళతో, మత్తెక్కిన నెమళ్ల నృత్యాలతో, కలరవాలతో ఆ అడవి మధ్యభాగం మొత్తం ఒక పానభూమిలాగా గోచరిస్తున్నది)
పానభూమి! వేసవిమొత్తం దప్పిపడి వానపడుతున్నప్పుడు నేలపొందే సంతోషంలోని మత్తుకి ఇంతకన్నా గొప్ప పదం మనం ఊహించలేం.
ఇక ఆ తర్వాత రెండు శ్లోకాలూ వర్షవర్ణనలో మకుటాయమానాలు. చూడండి:
షట్పాద తంత్రీ మధురాభిదానం
ప్లవంగమోదీరిత కంఠతాళం
ఆవిష్కృతం మేఘమృదంగనాదైః
వనేషు సంగీతమివ ప్రవృత్తం ( 28-36)
(తుమ్మెదలు ఝుంకారాలు తంత్రీవాద్యాలుగా, కప్పలబెకబెకలే తాళాలుగా, మేఘగర్జనలే మృదంగధ్వనులుగా, చూడబోతే, అడవిలో ఏదో సంగీతసమారోహం సాగుతున్నట్టుంది)
క్వచిత్ ప్రనృత్తైః క్వచిదున్నదద్భిః
క్వచిచ్చవృక్షాగ్రనిషణ్ణకాయైః
వ్యాలంబ బర్హాభరణైర్మయూరైః
వనేషు సంగీతమివ ప్రమృత్తమ్ ( 28-37)
(ఆ సంగీతానికి అనుగుణంగా కొన్ని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. కొన్ని గొంతెత్తి పాడుతున్నాయి. కొన్ని చెట్లకొమ్మల మీద కూచుని తలలూపుతున్నాయి. కొన్ని పింఛాలు విప్పి రంగాలంకరణ చేస్తున్నాయి. ఇదంతా చూడబోతే వనమంతా ఒక సంగీత సమారోహం నడుస్తున్నట్టుంది)
ఒక కావ్యంలోగాని, ఇతిహాసంలోగాని, పురాణంలోగాని వర్ణన కోసమే వర్ణన చేసేవాడు సాధారణ కవి. కాని మహాకవి ఆ వర్ణనని కథలో పొదుగుతాడు. కథాప్రయోజనానికి ఆ వర్ణనని కూడా ఒక ఆలంబనం చేసుకుంటాడు. కిష్కింధా కాండలోని ఈ వర్షర్తు వర్ణన ప్రయోజనం కేవలం నాయకుడి విరహాన్ని చెప్పడం కోసమే అయి ఉంటే ఇది భావుకుల్ని ఇంతగా ఆకర్షించి ఉండేది కాదు.
అసలు మనిషి ప్రకృతిని ఎందుకు ప్రేమించాలి? ప్రకృతి ఆరాధన మనిషిని సాత్త్వికీకరిస్తుంది. తనలోని ప్రకృతిని గుర్తుపట్టి దానిలోని భీకరత్వాన్ని అణచుకోడానికి దారిచూపిస్తుంది.
రాముడు స్వతహాగా గిరివనప్రియుడు. సీతతో చిత్రకూటంలో గడిపిన రోజుల్లో అడవికీ, కొండలకీ ఎంతో దగ్గరయ్యాడు. కాని సీతదూరమయ్యాక ఆ అడవీ, ఆ కొండలూ అతడికి దుస్సహంగా ఉన్నాయి. కథ నడవడానికి ఈ మాత్రం చెప్తే సరిపోతుంది. కాని ఇది రాముడి కథ. ఏ అడవీ, కొండలూ అతడికి సీతని గుర్తుకుతెస్తున్నాయో, అవే ఆయన్ని సాంత్వనపరచాలి కూడా. మామూలుగా అయితే అడవినీ, కొండల్నీ చూస్తే ఆయన ఆహ్లాదపడిఉండేవాడు. కాని అసలే వియోగం, ఆపైన వానాకాలం. ఆ వాన ఆయనలోని విరహాగ్నిని మరింత ప్రజ్వరిల్లపరిచింది. కాని ఆ మానవుడు భావుకమానవుడు కాబట్టి అడవిలో పడుతున్న ఆ వానలోనే ఆయన తిరిగి తన మానసిక ప్రశాంతిని పోగుచేసుకోగలిగాడని చెప్పడం ఈ వర్షర్తు వర్ణన ముఖ్యప్రయోజనం.ఆ ప్రస్రవణగిరి దగ్గర వర్షాకాలం రాకముందు, దగ్గరలోనే ఉన్న కిష్కింధలో, వానరసమూహమంతా గానంతో, నాట్యంతో సంరంభంగా ఉండటం రాముడి చెవుల్ని పడిందని మనం ముందే చెప్పుకున్నాం. ఆ శ్లోకాన్ని మరొకసారి గుర్తుచెయ్యనివ్వండి:
గీత వాదిత్ర నిర్ఘోషః శ్రూయతే జయతాం వర
నర్దతాం వానారాణాం చ మృదంగాడంబరైః సహ ( 26-27)
(శ్రేష్టుడా! అక్కడ వానరులంతా సంతోషంతో నృత్యం చేస్తున్నారల్లే ఉంది. తంత్రీవాద్యాలతో, మృదంగాలతో పెద్ద ఎత్తున గీతాలు వినబడుతున్నాయి)
ఆ తర్వాత రాముడు నిత్యశోకపరాయణుడిగా మారిపోయాడనీ, ఆయన్ని లక్ష్మణుడు ఓదార్చేడనీ చదువుకున్నాం. ప్రకృతి వర్ణన చేసే కవులు ముందు ఇటువంటి exterior landscape ని చూపిస్తారు. అది ఆయా పాత్రల interior landscape లో ఒక సంచలనాన్ని కలిగిస్తుంది. తిరిగి తమ మనోభూమిలో మార్పు వచ్చినప్పుడు ఆ బాహ్యభూమి వారికి కొత్తగా కనిపించాలి. లేదా బాహ్యప్రకృతిలో మార్పు వచ్చినప్పుడు అది తమ అంతరంగ ప్రకృతిలో మార్పు తీసుకురావాలి. ఇక్కడ రాముడికి కిష్కింధలో పెద్ద ఎత్తున పాటలూ, నాట్యాలూ సాగుతుండటం వినబడింది. అది సుగ్రీవుడికీ రాజ్యమూ, భార్యా లభించినందువల్ల కలిగిన సంతోషం. తానున్నచోట కూడా అటువంటి సంతోషం రేకెత్తాలంటే తాను కూడా భార్యనీ, రాజ్యాన్నీ తిరిగి పొందాలి. కాని అప్పుడది మామూలు మనిషి కథ అవుతుంది. కాని అక్కడ ప్రస్రవణ గిరి దగ్గర అడవుల్లో వానపడుతున్న దృశ్యాన్ని చూసినప్పుడు రాముడి చుట్టూ ఒక నృత్య, సంగీత సమారోహం జరుతున్నట్టుగా అనిపించిందని కవి చెప్తున్నాడు. అంటే ఆయనున్నచోటకే వాన అటువంటి ఆనందాన్ని తీసుకొచ్చిందన్నమాట. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి భార్యా, రాజ్యమూ సత్వరమే తిరిగి దక్కినంత సంతోషం అక్కడ వెల్లివిరిసిందన్నమాట.
ప్రకృతిని వర్ణించడమంటే ఇది. అంటే నీలోని భావుకమానవుణ్ణి ఆవాహన చెయ్యడం. ప్రాపంచిక సంయోగవియోగాలతోనూ, సుఖదుఃఖాలతోనూ నిమిత్తం లేకుండా నువ్వు ఎక్కడుండే అక్కడ ఆ ఆహ్లాదమనః స్థితికి లోనుకాగలగడం అన్నమాట.
ఆ వర్షాకాలంలో ఆ అడవుల్లో కురుస్తున్న మహావర్షాలను చూసినప్పుడు రాముడికి సంభవించింది అదే అని కవి చెప్తున్నాడు. ఇక అప్పుడు ఆ కథానాయకుడికి తన చుట్టూ అపారమైన ప్రశాంతి గోచరించడంలో ఆశ్చర్యమేముంది!
ఈ శ్లోకాలు చూడండి:
మత్తా గజేంద్రా ముదితా గవేంద్రా
వనేషు విశ్రాంతతర మృగేంద్రాః
రమ్యా నగేంద్రా నిభృతా నరేంద్రాః
ప్రక్రీడితో వారిధరైః సురేంద్రః (28-43)
(ఏనుగులు మత్తెకి ఉన్నవి. వృషభాలు సంతోషంతో రంకెలు వేస్తున్నవి. అడవుల్లో మృగరాజులు విశ్రాంతిగా ఉన్నవి. పర్వతాలు అందంగా ఉన్నవి. రాజులు జైత్రయాత్రలనుండి మనసుని వెనక్కి మళ్ళించుకున్నారు. మేఘాలతో దేవేంద్రుడు క్రీడిస్తున్నాడు)
గొప్ప కవులు ప్రకృతిని వర్ణించేటప్పుడు తమ అంతరంగ ప్రశాంతిని ప్రకృతిమీద ఆరోపిస్తారని ప్రాచీన చీనా కవుల్నీ, సంగం కవుల్నీ, జెన్ హైకూ కవుల్నీ, హోమర్ నీ, షేక్ స్పియర్ నీ, అలాగే ఆంటోనియో మచాడో లాంటి ఆధునిక కవుల్నీ చదివితే అర్థమవుతుంది. ఇక్కడ రాముడిలోని రెండు ప్రకృతులు- మానవప్రకృతి, అంటే తన సుఖదుఃఖాలకు చింతాక్రాంతుడయ్యే మామూలు మనిషి ప్రవృత్తి ఒకపక్కా, దైవ ప్రకృతి-అంటే తనని పక్కకునెట్టుకుని లోకంతాలూకు సుఖదుఃఖాలతో తాదాత్మ్యం చెందే ప్రవృత్తి- ఈ రెండింటి మధ్యా ఇక్కడ గొప్ప నాటకం నడిచింది. చివరకు దైవ ప్రకృతి మానుష ప్రకృతిమీద విజయం సాధించింది. భావుకమానవుడికి పట్టాభిషేకం జరిగింది. ఈ శ్లోకం చూడండి:
నరైర్నరేంద్రా ఇవ పర్వతేంద్రాః
సురేంద్రదత్తైః పవనోపనీతైః
ఘనాంబుకుంభైరభిషిచ్యమానా
రూపం శ్రియం స్వామిం దర్శయంతి (28-46)
(మనుషులు మహారాజుల్ని అభిషేకించినట్టు ఇంద్రుడిపంపువల్ల వాయువులు తోడై తీసుకువచ్చిన మేఘాలు తమ జలకుంభాలతో అభిషేకిస్తున్నట్టుగా కొండలు తమ స్వామిత్వాన్ని, వైభవాన్ని లోకానికి ప్రదర్శిస్తున్నాయి)
అలా మహాపర్వతాలు అభిషిక్తాలవుతున్నప్పుడు ఆ వానధారలు ఆ ఆ చక్రవర్తుల వక్షస్థలాల మీద ఊగాడుతున్న ముత్యాల హారాల్లాగా ఉన్నాయట. చూడండి ఈ శ్లోకం:
మహాంతి కూటాని మహీధరాణాం
ధారాభిధౌతాన్యధికం విభాంతి
మహాప్రమాణైర్విపులైః ప్రపాతైః
ముక్తాకలాపైరివ లంబమానైః (28-48)
కాబట్టి ఇది వట్టి వర్ణన కాదు, ఒక కథనం కూడా. ప్రకృతి రంగస్థలం మీద సాగిన ఒక రూపకం కూడా. ఒక వర్ణనగానో, లేదా రూపకాలంకారాలకోసమో, శ్రావ్యమైన సంస్కృతభాషాసునాదంకోసమో దీన్ని తొందరతొందరగా చదువుకుంటూ పోతే చాలదు. ఇందులోని సూక్ష్మమైన నెరేటివ్ ని మనం పట్టుకోగలిగే, ఇంత సార్థకమైన వర్షర్తువర్ణన మరే కవి కూడా ఇప్పటిదాకా చేయలేకపోయాడని మనకు తెలుస్తుంది.
22-6-2023
వర్ష ఋతు… వర్ణన భలే విశ్లేషణ… చాలా నచ్చింది సర్
ధన్యవాదాలు మేడం
శ్రీ భాష్యం అప్పలాచార్యలగారి ప్రవచనాల లో వో చోట అన్నారు. రామాయణం చదువండి.. సంస్కృతం రాకపోయినా సులువు గానే అర్థం అవుతుంది అని. గోరఖ్పూర్ ఎడిషన్స్ కొనుక్కుని చదువుకున్నా. ఇలాగే మీరన్నట్టు, ఒక్కో శ్లోకం ముందుకి.. వెనక్కి మళ్ళీ మళ్ళీ చదువుతూ, ఎంత పరవశం కలిగిందో.. !
మళ్లీ ఇప్పుడు మీరు ఉటంకించిన శ్లోకాలను, విశ్లేషణ కలిపి చదువుతుంటే .. రాత్రంతా కురిసిన వాన మనసులోనూ కురిసింది. ధన్యవాదాలండీ🙏
శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి పేరు ఇక్కడ ప్రస్తావించడంతో నేను ధన్యుడనయ్యాను.
Beautiful Sir! Love it
Thank you Vijay!
అరణ్యాన్ని ఆస్వాదించిన ఆదికవి,గిరిజన కవి ,గిరివనప్రియుడైన రాముని విరహ విశ్రామ దర్శనాలను వర్షాలంబనగా చూపటం , మీరు వింగడిస్తుంటే మీలోని వాల్మీక ప్రియ హృదయం మాకు వాన దృశ్యాలను, హావభావాలను కన్నులకు కట్టినట్లుగా ఉంది. మీ లోని చిత్రకళా ప్రియుడు ఆ దృశ్యాలనును గీయటానికి రూపొందించుకున్న ప్రణాళికా చిత్రాలు
చూపినట్లుగా ఉంది. అసలు రామాయణాన్ని ఈ కోణంలో ప్రాకృతిక సౌందర్య భాసిత చలన చిత్రంగా రూపొందించే దర్శకుడు పుట్టాలని కోరుకుంటున్నాను.
అవును సార్. ఇప్పటివరకు రామాయణాలు తీసిన ఏ దర్శకుడికీ రాముడి హృదయం అర్థం కానేలేదు.
ఈ ఋతు వర్ణనలు, ఈ మేఘాలు, వాన పడిన మధ్యాహ్నాల్లోని అడవుల సొబగులు, ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఈ వ్యాసాలు కవిత్వ పాఠాలు కూడా మాకు. మొదటి వ్యాసాలు చదివి, కృష్ణశాస్త్రిని నేను ఇంతే చదివానా అని దిగులు కమ్ముకుంది. కొత్త కళ్ళజోళ్లు ఇచ్చి మూడు గంటలు వేరే ప్రపంచంలో తిప్పి తీసుకు వస్తాయి కొన్ని సినిమాలు. ఈ వ్యాసాలతో అటువంటి అనుభవం…ముసురు పట్టిన ఆకాశం కింద నిలబడి, వాన పడుతుండగా చూడటం, తడవడం…మీ ఈ మాటలు చదవడం ❤️
Thoroughly enjoying this series.
మీవంటి భావుకుల్ని చేరడం కన్నా ఈ వ్యాసాలకు ధన్యత మరేముంటుంది!
రాముడి హృదయాన్ని ఆవిష్కరించారు